Monday, 11 July 2022

హరి అవతారమితాడు అన్నమయ్య వ్యాసం

 

హరి అవతారమితడు అన్నమయ్య..

 

ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించిన తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఈ పదకవితాపితామహుడు క్రీ.శ. 1408 లో జన్మించి 1503 లో స్రీనివాసుని సన్నిధికి చేరినట్లు తెలుస్తూంది. కడప మండలం తాళ్ళపాక గ్రామంలో నారయణసూరి లక్కమాంబలకు జన్మించాడు. బాల్యం లోనే ఒక భజన బృందంతో కలసి తిరుమల చేరి అక్కడే స్థిరనివాసమేర్పరుచుకుని, శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తితో, అనురక్తితో 32,000 సంకీర్తనలను రచించి, ఆడి, పాడి తరించిన మహనీయుడు.

 

అన్నమయ్య రచించిన పదసంకీర్తనలలో 12,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. తాళపత్రాలలో రచింపబడిన ఈ కీర్తనలకు శాశ్వతత్త్వం కలిగించాలని అతని మనుమడు చిన తిరుమలాచార్యుడు రాగిరేకులలో తిరగ రాయించాడు. అయితే రాగి విలువే కాని రాగం విలువ తెలియని పామరులు రాగిరేకులను కరగించి పాత్రలను చేసి వాడుకున్నారు. అలా పోయినవి పోగా మనకు దక్కినవి పన్నెండువేల పద కీర్తనలు మాత్రమే

 

తెలుగులో పదకవితకు ఏమాత్రం స్థానం లేని ఆ రోజుల్లో పదకవితకు ప్రత్యేకతనూ, విశిష్ఠతనూ ఏర్పరిచిన ఆద్యుడు అన్నమయ్య. తదనంతరం ఎందరో కవులు పదకవితను సుసంపన్నం చేసిన మాట వాస్తవమే అయినా అన్నమయ్య పదకవితా మార్గానికి వేసిన రాచబాటలు వారందరి సుఖప్రయాణానికి మార్గదర్శకములయ్యాయి.

 

పద కవులలో అన్నమయ్యకు ఒక ప్రత్యేక స్థానముంది. పద్యకవితతో సమాన గౌరవం పదకవితకు ఆపాదించాడు. సరసహృదయులను అలరించడానికి, రసజ్ఞుల మెప్పు పొందడానికి, భక్తి శ్రింగార, వైరాగ్య, ఆధ్యాత్మిక సంకీర్త్నలను ఎన్నో పద్యసాహిత్యంతోనే రచించి అందరినీ అలరించాడు. ఆయన పదకవిత్వం ఇతర కవుల పద్యకవిత్వానికి ఏమాత్రం తీసిపోవు.‘వాక్యం రసాత్మక కావ్యం’ అన్న లోకోక్తికి చక్కటి నిదర్శనం అన్నమయ్య ప్రతి పదమూ.. ఏ సంకీర్తన పరిశీలించినా అన్నమయ్య భావనా మాథుర్యం, ప్రతిభా, సాహిత్య పరిజ్ఞానం గోచరిస్తాయి.  ఈ రచనావ్యాసాంగం కోసం ఆయన ఎక్కడా కష్టపడినట్లు కనిపించదు. అవి వాటికవే అన్నమయ్య పద కవితలలో అలవోకగా వచ్చి చేరినట్లు స్పష్టమౌతూంది.

 

అన్నమయ్య స్వామిని కమ్మరిగా, కుమ్మరిగా, సాలెవానిగా, జూదమాడేవానిగా ఇలా ఎన్నో వ్బిభిన్న రూపాలలొ దర్శించుకున్నాడు. ఒక కీర్తనలో భూతంగా కూడ అభివర్ణిస్తాడు. జానపదుల వాడుక భాషకు కూడా సాహిత్య గౌరవం కలిగించాడు. సామెతలు, జాతీయాలు, నానుడులు, నూతన పద బంధాలు మొదలయినవాటిని తన కీర్తనలలో

ప్రవేశపెట్టాడు. అన్నమయ్య భావనా సౌందర్యానికి, ప్రతిభా సంపన్నతకూ  ఆయన రచించిన పదాలన్నీ ఉదాహరణలే.. అన్నమయ్య ఆంధ్రసాహిత్యంలో అపూర్వమైన అనితరసాధ్యమైన కొత్తపోకడలు ప్రవేశపెట్టాడు.

 

పద్య సంప్దతో మాత్రమే పరిఢవిల్లే ఆంధ్ర సాహిత్యానికి పద సంపద కూడా సమకూర్చి తెలుగు భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేసాడు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకుందుకి అనువుగా మంగళహారతులు, లాలి పాటలు ,జోలపాటలు, దరువులు మొదలనవి ఎన్నో రచించిన ఆద్యుడు కూడా అన్నమయ్యే.. అన్నమయ్య గొప్ప సంఘ సంస్కర్త కూడా.. జాతి కుల,మత భేదాలుండ రాదని తన కీర్తనలద్వారా బోధించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. స్త్రీల వ్యక్తిత్వానికి, భావాలకీ ప్రాముఖ్యం ఇవ్వాలని ఉద్ఘాటించాడు.

 

మొత్తం మీద తన జీవితకాలంలో 32,000 సంకీర్తనలని, ద్విపద రామాయణం, శృంగార మంజరి, వేంకటాచల మహత్మ్యం, సంకీర్తనా లక్షణ గ్రంథం  ఇలా ఎన్నో రచనలు చేసిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు(1503) స్రీనివాసునిలో ఐక్యమయ్యాడు. తెలుగు వారికి  తరగని సాహితీ సంపదని అందించాడు.     ఓం నమో వేంకటేశాయ.

Saturday, 9 July 2022

గరికపాటి వారి ఉపన్యాసం.

 

శ్రీయుతులు గరికపాటి నరసింహారావుగారి ఆధ్యాత్మిక వ్యాస సంపుటిలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

రామాయణంలో యుధ్ధకాండలో రావణవధ అయిపోయాక విభీషణుడు వచ్చి తన అన్నగారి పార్ధివ దేహాన్ని అప్పగిస్తే రాక్షసుల వంశాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించుకొంటామని చెప్పి శ్రీరాముని అనుమతి కోరాడు. అప్పుడు మర్యాదాపురుషోత్తముడైన రాముని సమాధానం చూడండి.

"మరణాంతాని వైరాణి, నిర్వుత్తం నః ప్రయోజనం

క్రియతమధ్య సంస్కారః మమాప్యేష యథా తవ"

"ఓ విభీషణా! ఎంతటి శత్రుత్వమైనా చావుతో ముగిసిపోవాలి. సీతాసంరక్షణం కోసం సంధి కుదరక ఈ యుధ్ధం చేయవలసి వచ్చింది కానీ ఈ జననష్టం నా కిష్టం లేదు. మీ అన్నగారి పార్ధివ దేహానికి మీ ఆచారం ప్రకారం దహనసంస్కారాలు నడిపించు. ఇకనుండి ఈ పెద్దమనిషి నీకే కాదు, నాకూ అన్నగారే"

భార్యను ఎత్తుకుపోయినవాడి మీద ఎవరికైనా ఎంత కక్ష ఉంటుంది? అటువంటి కోపతాపాలన్నీ మరిచిపోయి ధర్మబధ్ధంగా, బాధ్యతాయుతంగా మాట్లాడటం ఆ శ్రీరామునికే చెల్లింది. అందుకే ఆయన దేవుడయ్యాడు.

ఈ దేవుడే, ఈ రాముడే ఇన్ని వేల ఏళ్ళుగా ఈ జాతికి స్ఫూర్తిమూర్తిగా నిలిచాడు. నిన్న మొన్నటి కార్గిల్ యుధ్ధంలో కూడా రామాయణంలోని ఈ ఘట్టమే మార్గదర్శనం చేసి భారతీయుల జీవనాదర్శాలు అంత మహోన్నతంగా ఉంటాయని యావత్ప్రపంచానికీ చాటి చెప్పింది.

కార్గిల్ యుధ్ధంలో మన సైనికులు పాకిస్థాన్ వారికి చిక్కితే క్రూరాతిక్రూరంగా చిత్రహింసలు పెట్టి, నీచాతి నీచంగా కళ్ళు, చెవులు, మోకాళ్ళు చెక్కేసి శవాలను మన సరిహద్దు వైపు త్రోసేసారు. అదేసమయంలో వారి సైనికులు కొందరు మనవారి చేతుల్లో మరణించారు. ఆ శవాలను పెట్టెలో పెట్టి వారికి అప్పగిస్తే ఆశ్చర్యకరంగా తీసుకొందుకు నిరాకరించారు. చనిపోయిన సైనికుల గురించి ఆ దేశ నాయకులకు చింత ఉండదన్నమాట. అప్పటి ప్రధాని వాజ్పాయ్ ని ఏం చెయ్యాలని మన సైన్యాధిపతులు సంప్రదించారు. భారతీయ సంస్కారం మూర్తీభవించిన అటల్ బిహారి వెంటనే రామయణంలో యుధ్ధకాండలోని 'మరణాంతాని వైరాని' అనే (పైనుదహరించిన) శ్లోకాన్ని చదివి ఇలా అన్నారుట. ఏ దేశం తరపున పోరాడినా సైనికుడు సైనికుడే. రాజకీయ నాయకత్వంలో అహంకారాలవల్ల యుధ్ధాలు జరుగుతుంటాయి. దానికి సైనికులను నిందించకూడదు. వీరుడి భౌతిక దేహాన్ని కూడా వీరొచితంగానే గౌరవించాలి. వారి శవాలకి ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం వారి మౌల్వీల సమక్షంలో ఖనన సంస్కారాలు జరిపించండి. అని ఆదేశించారట. అప్పట్లో వార్తాపత్రికలు ఈ విషయాన్ని ప్రచురిస్తే ప్రతి భారతీయుని కళ్లు చెమర్చి భక్తిగా రామునికి, వాజ్పాయ్ కి నమస్కరించాయి. ఇదీ రామాయణ

పక్షపాతం.

పక్షపాతం

కొందరిపై అత్యంత దయ, మరికొందరిపై అంతులేని నిర్దయ.

అడక్కుండానే వరాలు గుప్పిస్తావు కొందరికి,

ఆర్తితో, ఆవేదనతో అర్ధించినా ఆదుకోవు కొందరిని.

అబలల ఆక్రందనలని అసలు వినిపించుకోవెందుచేత?

పాపపుణ్యమెరుగని పసికందులని కాలరాచే కామాంధులని దండించవు.

నువ్వూ పురుషుడివేగా! నీ జాతి మీద అంత మమకారమా!

ఏ పాపచింతనలేని వారిని కష్టాల మడుగులో ముంచుతావు,

గతజన్మ పాపమని అనుభవించమంటావు. ఏంటయ్యా నీ లీల?

దుష్టశిక్షకుడవని బిరుదాంకితుడవు, కరకు కసాయివారిని శిక్షించలేవా?

అందరూ నీ బిడ్డలేగా మరి ఇంత పక్షపాతమా?

పిడికెడు ఆనందం లభించే తరుణంలో కడివెడు విషాదాన్నికుమ్మరిస్తావు.

జగన్నాటకసూత్రధారివి, బిడ్డల అగచాట్లు నీకు వినోద లీలలా?

జగద్రక్షకుడివి నీకే ఇంత పక్షపాతమైతే సామాన్య  మానవులం మేమెంత?

ఇన్ని బిరుదులను పొందిన నీవు మౌనం వహిస్తే ఏమనుకోవాలీ?

 

నాన్నగారి స్మృతులు పక్షపాతం

 పక్షపాతం

కొందరిపై అత్యంత దయ, మరికొందరిపై అంతులేని నిర్దయ.

అడక్కుండానే వరాలు గుప్పిస్తావు కొందరికి,

ఆర్తితో, ఆవేదనతో అర్ధించినా ఆదుకోవు కొందరిని.

అబలల ఆక్రందనలని అసలు వినిపించుకోవెందుచేత?

పాపపుణ్యమెరుగని పసికందులని కాలరాచే కామాంధులని దండించవు.

నువ్వూ పురుషుడివేగా! నీ జాతి మీద అంత మమకారమా!

ఏ పాపచింతనలేని వారిని కష్టాల మడుగులో ముంచుతావు,

గతజన్మ పాపమని అనుభవించమంటావు. ఏంటయ్యా నీ లీల?

దుష్టశిక్షకుడవని బిరుదాంకితుడవు, కరకు కసాయివారిని శిక్షించలేవా?

అందరూ నీ బిడ్డలేగా మరి ఇంత పక్షపాతమా?

పిడికెడు ఆనందం లభించే తరుణంలో కడివెడు విషాదాన్నికుమ్మరిస్తావు.

జగన్నాటకసూత్రధారివి, బిడ్డల అగచాట్లు నీకు వినోద లీలలా?

జగద్రక్షకుడివి నీకే ఇంత పక్షపాతమైతే సామాన్య  మానవులం మేమెంత?

ఇన్ని బిరుదులను పొందిన నీవు మౌనం వహిస్తే ఏమనుకోవాలీ?

 

 

స్వల్పకాలం మాత్రమే నాన్నగారితొ గడిపిన బాల్యస్మృతులు.

 

“నాన్నగారండి” అని నేను పిలిస్తే నా ఆలోచన కనిపెట్టి అదే పంథాలో

 “ఏం నాన్నగారండి ఏమి కావాలి” అని మందహాసంతో అడిగేవారు.

 

 “నాన్నగారూ మరెమో ఇవాళ ఆదివారం కదండీ. సాయంకాలం బీచ్ కి  తీసుకెల్తారా?. నా స్నేహితులంతా వస్తారుట. అని గారంగా అడిగేసరికి, అలాగేనమ్మా.. ఎండ తగ్గాకవెల్దాం నీ స్నేహితులకి కూడా చెప్పు. అని సంతోషంగా ఒప్పుకునేవారు. సాయంత్రం మమ్మల్ని బీచ్ కి తీసుకివెళ్ళి కాసేపు కెరటాలతో ఆడుకోనిచ్చి, తరువాత మంచి మంచి విషయాలు చెప్పి, పాటలు పాడించి ఇంటికి తీసుకొచ్చేవారు.

 

దసరాలకి బొమ్మలకొలువులు పెట్టుకునేవారం. రకరకాల బొమ్మలు మాతో మెట్లమీద అలంకరింపచేసి, చుట్టూ పార్క్ లు కొండలు, గుడిసెలు అట్టలతో, కాయితాలతో అన్నీ తాను అమర్చేవారు. దీపావళికి మందుగుండు సామాను విడివిడిగా తెచ్చి అవన్నీ కలగలిపి, మతాబాలు చిచ్చుబుడ్లు మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసేవారు. ఎంత సరదాగా ఉండేదో..

 

మావిడికాయల కాలంలో దగ్గర ఉన్న కొత్తవలసకి (అక్కడ సంతలో మంచి కాయలు చవకగా దొరుకుతాయి) నాన్నగారితో పాటు వెళ్ళి ఊరగాయలకి రెండుబుట్టల కాయలు, పళ్ళకోసం రెండుబుట్టల కాయలు కొనుక్కుని రైలుబండి లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.

 

పాఠశాలలు తెరిచాక కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడం, అందంగా నా పేరు వాటి మీద రాయడం అన్నీ నాన్నగారే. నాకు అన్నీ నేర్పిస్తూ మధ్య మధ్య మంచి కథలూ కబుర్లూ చెప్తూ పని పూర్తిచేసేవారు.

 

వీధి జాఫిరీ లో కూచొని కొత్త పాట పాడుకుంటూంటే విని “ ఈపాట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? చాలా బాగుంది అని మెచ్చుకునే నాన్నగారు. ఎప్పుడూ ఆయన చేత దెబ్బలు కానీ, చివాట్లు కానీ తిని ఎరగను. ఒక్క చదువు విషయంలో మాత్రం ఎప్పుడైన కోప్పడేవారు. నన్ను చెల్లినీ మా మామ్మ దగ్గిర  వదిలేసి సెకండ్ షో సినిమాకి అమ్మ నాన్నగారు వెళ్ళిపోతే మర్నాడు అలిగి కూర్చునే దాన్ని. అప్పుడు దగ్గిరకి తీసుకుని ఆ సినీమా ఏడుపు సినిమా అమ్మా! ఒక్క  మంచి పాట కూడా లేదు. నీకు పాటలంటే ఇష్టం కదా.. మంచి పాటల సినిమా మాయాబజార్ వచ్చింది. దాని నిండా పాటలే దానికి తప్పకుండా వెళ్దాము అని అనునయించేవారు. మంచి సినిమాలు చాలా చూపించారు కూడా..

 

ఇంట్లోనే కాదు అటు ఆఫీస్ లోనూ, ఇటు బంధువర్గంలో అందరిదగ్గరా మహనీయులే మా నాన్నగారు. భీముడు బాబాయ్, భీముడు మావయ్య, భీముడన్నయ్య ఇలా అందరి నోళ్ళలోనూ ఆయన పేరే.. మా అమ్మయికి 1987 లో రైల్వే DRM ఆఫిస్ వైజాగ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకి ఒక పెద్దాయన దాని సీట్ దగ్గరికి వచ్చి, “నువ్వు భీమేశ్వరరావు మనవరాలివా అమ్మా అని అడిగారు. మీ తాతగారిలాగే మంచి పేరు తెచ్చుకోమ్మా.. అంతటి నిజాయితీపరుడు, శాంతమూర్తి మీ తాతగారవడం నీ భాగ్యం తల్లీ”  అని ఆశీర్వదించి వెళ్ళారుట. ఎవరి తండ్రి వారికి గొప్పే కావొచ్చు. పురుషులందు పుణ్య పురుషుడు మా నాన్నగారు మంచి మనిషి మా నాన్నగారిని చిన్నతనంలోనే   కోల్పోవడం మా దురదృష్టం.

 

ఉన్న కొద్ది రోజులూ అన్నీ మథురస్మృతులే. అల్పాయుష్యుతో బ్లెడ్ కాన్సెర్ మహమ్మరితో నా 13వ యేట మమ్మల్ని అంధకారం లో ముంచి వెళ్ళిపోయారు.

 


నిరీక్షణ భావుక చిత్రకతావల్లరి.

ఒక చిన్న కథ. భావుక చిత్ర కథావల్లరి.

నిర్ణయం.

 

గోదావరి ఎక్ష్ప్రెస్స్ శరవేగంతో ముందుకి సాగుతూంది. కిటికీ దగ్గిర విషణ్ణ వదనంతో కూర్చున్న విశ్వనాథం దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. మాటి మాటికి నిట్టూరుస్తూ  పరసరాలని గమనించలేని స్థితిలో ఉన్నాడు.  “పాసిన పాయవు బంధములూ.. ఆశ దేహమునన్నాళ్ళు,   కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగనన్నాళ్ళు” అని ఎంత చక్కగా జీవిత సత్యాన్ని తెలియజేసాడు  ఆనాడే అన్నమయ్య.  అన్నీ తెలిసినా ఏదీ ఒదులుకోలేని దుర్బలులం. ఏ బంధాలనీ తెంచుకోలేక, ఏ మమకారాలనీ మర్చిపోలేక మథనపడే మామూలు మనుష్యులం అనుకుంటూ  తనలో తానే  గొణుక్కుంటున్నాడు.

ఉదయం కొడుకూ, కోడలి సంభాషణ చెవిలో మారుమ్రోగుతూంది.

“ఎల్లకాలం ఈ ముసిలాయన్ని మనమే చూడాలా? ఇంకో కొడుకున్నాడుగా.. మీ తమ్ముడికి కూడా బాధ్యత ఉందిగా.. అక్కడికి కొన్నాళ్ళు వెళ్ళమనండి అని కోడలు ఉష తీవ్రంగా అంటూంది.

“నీకు తెలుసుగా మా మరదలు ఉద్యోగస్తురాలు. వాళ్ళిద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు. కాలక్షేపం కూడా అవదు. అయినా నాన్నగారికి ముందునుంచీ మన దగ్గరే అలవాటు. మన పిల్లలంటే వల్లమాలిన అభిమానం.  సొంత ఇంటినీ మనవలనీ వదలి ఎక్కడికీ వెళ్ళడము ఆయనికి ఇష్టం ఉండదు”. అన్నాడు కొడుకు భాస్కర్.

“అభిమానమా.. పాడా..జరుగుబాటు సంకటం. ఇక్కడ జరిగినట్లు అక్కడ జరగదని భయం.. అందుకని శనిలా మనల్ని వదలడం లేదు “ అన్న ఉష మాటలకి భాస్కర్ చాలా ఆవేదన గా చూస్తూ “ అంత కఠినంగా మాట్లాడకు ఉషా! ఆయన మనస్సు కొంచెం అర్ధం చేసుకో.. అయినా ఆయనకి ప్రత్యేకంగా చేసేదేముంది? మనకి చేసుకున్నదే ఆయనకీను. తన పనులన్నీ తనే చేసుకుంటున్నారు. వేళకింత అన్నం పెట్టడమేగా..” అన్న భర్త మాటలకి  “మీకేం మీరలాగే చెప్తారు. మీ అబ్బాయికి కాలేజీకి వెళ్ళే ఏర్పాట్లు, ఇంకా చిన్నది అయిన మీ అమ్మాయి గారాలు, మీ ఆఫీసు వేళకి అన్నీ అమర్చలేక చస్తున్నాను. మధ్యలో మీ నాన్నగారు కాస్త టీ ఇయ్యమ్మా అనో,  పేపర్ ఎక్కడుందమ్మా అనో ఒకటే నస. అందరికీ నేనొక్కదాన్నే అన్నీ అమర్చాలి. నాకేం పది చేతులు లేవుగా… అని విసుక్కుంది ఉష.

విశ్వనాథం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ అయి కొడుకుతో కలి సి ఉంటున్నాడు. భార్య అన్నపూర్ణ అన్నివిధాలా అతనికి అనుకూలంగా ఉంటూ సంసారాన్ని గుట్టుగా నడిపించింది. ముందునించీ పెద్ద కొడుకు దగ్గిరే అలవాటు. ఉద్యోగంలో ఉండగానే ఒక ఇల్లు తమ అభిరుచులకు తగినట్లుగా చిన్నదయినా సదుపాయంగా ఉండేటట్లు  కట్టుకున్నారు. తమకోసం ఒక గది ఏర్పాటు చేసుకుని పొందిగ్గా అమర్చుకున్నారు. ఇంచుమించు ఇంటిపని అంతా అన్నపూర్ణే చూసుకునేది. కొడుకు పెళ్ళయిన కొత్తలో కొత్త కాపురం అనీ, ఆ తరువాత మనవలు చంటివాళ్ళనీ తనే చాల మటుకు చేసుకుపోయేది. కోడలు ఉష కూడా సర్దుకు పోయేది. బదిలీల మీద విశ్వనాథం మరో ఊరు వెళ్ళినా అన్నపూర్ణ మూడొంతులు కొడుకు దగ్గరే ఉండేది.

కాలం ఎప్పుడూ ఒక్కలా సాగదుగా.. రెండేళ్ళ క్రితం అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో ఒక నెల్లాళ్ళు బాధపడి పరమపదించింది.  ఒక ఏడాది ఏదోలా గడిచింది.  తరువాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించింది, ఇంటిపనంతా తనమీదే పడిపోయింది.  వయసు పైబడి మునుపటిలా అంత పని చెయ్యలేకపోయినా చాలా మటుకు కోడలికి సహకారంగా ఉండేది. ముఖ్యంగా విశ్వనాథం కి కావలసినవ్ఝన్నీ తనే చూసుకొనేది.  ఇప్పుడు పరిస్థితి మారింది.  తన భర్తకీ పిల్లలకీ అంటే తప్పదు.  మావగారు విశ్వనాథంకి చెయ్యడం కష్టంగా మారింది. . ఇప్పుడు మావగారి ఉనికి భరించలేకపోతూంది.

విశ్వనాథం చిన్న కొడుకు ప్రకాశ్, అతని భార్య ఆరతి హైదరాబాద్ లో ఏదో మంచి కంపెనీలో  ఉద్యోగం చేసుకుంటున్నారు.  అక్కడే అధునాతనమైన ఒక మంచి ఫ్లాట్ కొన్నుక్కుని, ఉన్న ఒక్క కొడుకునీ హాస్తల్ లో పెట్టి చదివించుకుంటున్నారు.  ఆరతికి ఆధునికమైన జీవనం, క్లబ్ లూ పార్టీలు, స్నేహితులూ ఇష్టం. ఉద్యోగం తరువాత వీటికే ప్రాధాన్యత ఇచ్చేది. బంధువులూ, బంధాలు, భాధ్యతలు అంటే ఆమడ దూరంలో ఉండేది.  అందువల్ల విశ్వనాథం, అన్నపూర్ణ కొడుకు మీద మమకారంతో అక్కడికి వెళ్ళినా అట్టే రోజులు ఉండలేక తిరిగి వచ్చేసేవారు.

అక్కడ తోటికోడలు స్వతంత్రంగా  హాయిగా ఉందని కూడా ఉషకి దుగ్ధగా ఉంది.  అన్నీ కలిసి మావగారి బాధ్యత తనొక్కర్తే  భరిస్తున్నందుకు తను బాధపడుతూ భర్తని సాధిస్తూంది.  ఈమధ్య ఈ ధోరణి చాలా ఎక్కువయిపోయింది.  ఇవన్నీ చూస్తున్న విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు. రోజూ సాయంత్రం వాకింగ్ కి వెళ్తున్నప్పుడు స్నేహితులతో తన గోడు వెళ్ళబోసుకునేవాడు.  చాలా రోజులు మథనపడి, స్నేహితుల సలహాతో  ఒక మంచి వృద్ధాశ్రమంలో చేరిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు.  తనకి ఫించను బాగానే వస్తుంది. ఆశ్రమానికి కొంత కట్టేసినా  మిగతాది తన మందులకీ, మిగతా ఖర్చులకీ సరిపోకపోదు. పిల్లలమీద మనసైతే అప్పుడప్పుడు వెళ్ళిరావొచ్చు.  అప్పుడు వాళ్ళకీ శ్రమ ఉండదు.  నాకూ ఇబ్బంది ఉండదు. నాతోటి వాళ్ళే అక్కడ అందరూ,  కాలక్షేపం బాగానే ఉండొచ్చు అనుకున్నాడు.  కొడుకుతో చెప్తే ఒప్పుకోడని,  ఉత్తరం రాసి పెట్టేసి ఇలా బయటపడి ప్రయాణం చేస్తున్నాడు.

 “నీ నిర్ణయం సరైనదే” అన్నట్టుగా ఇంజన్ ఓ పెద్ద కూత కూసింది.

ఎవరి ఆలోచనలతోనూ ప్రమేయం లేకుండా అందరి బరువుబాధ్యతలను మోస్తూ ఉత్సాహంగా ముందుకి సాగిపోతూంది రైలుబండి.

 

 



Saturday, 25 June 2022

తిరిగిరాని బాల్యస్మృతులు

 

తిరిగిరాని బాల్య స్మృతులు.

 

దుంపలబడిగా వ్యహరించబడే ప్రభుత్వ పాఠశాల

1వ తరగతిలో భయం భయంగా అడుగు పెట్టిన రోజులు.

నేలపై గోనెపట్టా పరుచుకుని పలకమీద  బలపంతో

అక్షరాలు దిద్దుకున్నరోజులు.

పుస్తకాలలో నెమలి ఈక ఉంచి, దానికి మేత పెట్టి,

అవి పెరుగుతాయని, దానితో పాటు మన జ్ఞానం

పెరుగుతుందని నమ్మి దాచుకున్న రోజులు

పుట్టినరోజున నాన్నగారు కుట్టింఛిన కొత్తగౌను తొడుక్కుని,

అమ్మ చేసిన మిఠాయిలు తిని సంబరపడే రోజులు

పంతులమ్మకి ఒక పువ్వో, ఒక పండో ఇస్తే, ఆమె ప్రేమగ స్వీకరిస్తే

ఎంతో గొప్పగా అనుభూతి చెందిన రోజులు.

ఒక గడుసుపిల్ల పక్కన చేరి ఏవేవో కబుర్లు చెప్పి, నీకు ఈమాత్రం

తెలియదా అని ఎద్దేవా చేస్తే చిన్నబుచ్చుకున్న రోజులు

లెక్కలు తప్పుచేస్తే మా నాన్నగారు వీపు మీద ఒక్కటి వేసి

జాగ్రత్తగా చెయ్యమని మందలించిన రోజులు.

సొంత ఊరు వెళ్ళి టూరింగ్ టాకిస్ లో నేల టికెట్ కొనుక్కుని,

సినిమా చూసి మురిసిపోయిన రోజులు.

అర్ధం తెలియకపోయినా, నోటికి వచ్చిన సినిమా పాటలు పాడుకుంటూ

హాయిగా ఆనందంగా గడిపిన ఆ బాల్యం మథురాతి మథురం.

బరువూ బాధ్యతా లేకుండా అమ్మా నాన్నల నీడలో హాయిగా గడిచిపోయిన 

మథురమైన బాల్యం..