Saturday 27 January 2018

ఇంత చాలదా నాకు ఇందరిలో రమణుఁడ - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఇంత చాలదా నాకు ఇందరిలో రమణుఁడ
సంతసాన నీకు మొక్కే సరసుడ విందుకు

చింతలన్నియు బాసె సిగ్గులన్నియును దేరె
ఇంతలోనే విభుఁడ నీవీడకు రాగ
మంతనాలు సరివచ్చె మర్మములన్నియు గొచ్చె
దొంతులయిన మాటలు నాతో నాడగాను

కపటమింతయు బాసె కాకలెల్ల చల్లనారె
ఇపుడు నా చెక్కు నొక్కి ఎనయగాను
తపమెల్ల ఫలియించె తలపులు సరిగూడె
అపురూపముగ నాతో నంది నవ్వగాను

వలపులు దైవారె వాడికెలు తుదమీరె
వెలయు నాపై చేయి వేయగాను
కలికి శ్రీవేంకటేశ కాయము లొక్కటి యాయ
సొలపు రతుల నన్ను జొక్కించగాను
భావమాధుర్యం :
అన్నమయ్య విరచితమైన ఈ సరస శృంగార కీర్తనలో అలిమేలుమంగమ్మ తన రమణునితో ఆరాధనగా ఏమంటున్నదో వినండి.
ఇందరిలో నాకిట్లా చేసేవుకదయ్యా ! ఇది చాలదా? ఓ సరసుడా ! ఇందుకు నాకు పరమానందముగా ఉన్నది. నీకు మొక్కుతానయ్యా.
నేడు నా చింతలన్నియూ తీరినవి. నా సిగ్గులన్నియు సిరివంతములైనవి. ఓ విభుడా! నువ్వు ఇక్కడకు రాగానే నిన్ను చూడగానే నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి. నా రహస్యాలన్నీ కూర్చబడ్డాయి. నీవు అదేపనిగా నాతో మాట్లాడుతుంటే నా ఆనందమేమని చెప్పను?
నీవు చెక్కిలి నొక్కి లాలించగానే నాలోని కపటాలన్నీ నశించినవి. నా కోపమంతా చల్లారింది. నీవు నాకు అధీనుడవై అపురూపముగా నవ్వితే నా తపము ఫలించినది.
నా ఆలోచనలన్నీ సక్రమమైనాయి. నీవు నాపై చేయి వేయగానే నా వలపులన్నీ అతిశయించినవి. నీకోసమే దాచిన నా యవ్వనం సార్ధకమైనది. శ్రీ వేంకటేశ్వరా ! నీవు నన్ను నీ రతి లీలలో చొక్కించగానే మన తనువులు ఏకమై తన్మయత్వము చెందితిని.
(వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుభ్రహ్మణ్య దీక్షితులు)
సేకరణ : పొన్నాడ లక్ష్మి.

Sunday 14 January 2018

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా!

ఊరుకున్న జీవునికి ఒక్కఒక్క స్వతంత్రమిచ్చి
కోరేటి   అపరాధాలు  కొన్నివేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా
దూరువేసే వింతగా దోషమెవ్వరిదయ్యా?

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి
ఘనముసేసే విందు కర్తలెవరయ్యా?

వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే
కన్న  కన్న  భ్రమతలే  కల్పించి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఏలితివి మిమ్మునిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసు నయ్య!

భావం.. స్వామీ! ఓ వెంకటేశా! నీవు సర్వాత్మకుడవు. నేను నీ శరణు కోరేవాడినై సర్వపరాధాలకు కారణభూతుడైతిని. చాలు చాలయ్యా!
ఊరకే ఉన్న జీవునికి ఎంతో స్వతంత్రమిచ్చి కొన్ని విషయాలు సృష్టించి, అవి చెయ్యకుంటే నరకము, చేస్తే స్వర్గము అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వింతగా నిందిస్తున్నావు. ఇందులో దోషమెవరిదయ్యా?
మనసుతో చూడవలసిన వచ్చినవాటికి మాయలను నీవే కప్పిపుచ్చి, మాకందరికీ ఎన్నో విషయాలు రుచి చూపించి, ఇందులో మంచిచెడ్డలు కనుగొంటే మోక్షమిచ్చి, కానుకోక వాటికి లోబడితే కర్మమునిచ్చి గొప్పగా చేసేనని చెప్తావు. ఇందుకు కర్త ఎవరయ్యా?
ప్రాణులందరూ నీ గర్భములోనే ఉన్నారు, మేమే కన్నామని మాకు భ్రమ కల్పించుతావు. జగత్తునంతా నీవే ఏలుతున్నావు. అంతా నీ చేతిలోనే ఉంది. ఇంక నన్ను నీవు, నిన్ను నేను ఎంచుకుంటే ఎలా?  నీకే తెలుసు గదయ్యా..

అపు డేమనె నేమను మనెను - తపమే విరహపుఁదాపమనె - అన్నమయ్య కీర్తన

అపు డేమనె నేమను మనెను - తపమే విరహపుఁదాపమనె  ॥

పవనజ ఏమనె పడఁతి మరేమనె - అవనిజ నిను నేమను మనేను.
రవికులేంద్ర భారము ప్రాణంబనై - జవల నెట్ల దరియించెననె.  ॥

ఇంకా ఏమనె ఇంతి మరేమనె - కొంకక ఏమని కొసరుమనె     
బొంకుల దేహము పోదిది వేగనె - చింకవేఁట యిటు చేసె ననె   ॥

నను నేమనె ప్రాణము మన కొకటనె - తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి - ఘన వెంకటగిరిఁ గంటె ననె. ॥

అన్నమయ్య చెప్పిన ఈ విలక్షణమైన మధుర కీర్తన రామాంజనేయుల సంవాదము. సీతాదేవిని దర్శించిన  హనుమను ఆత్రుతతో ప్రశ్నలేస్తున్న రామచంద్రునికి  మాటలు వేగంగా వస్తున్నాయి. దానికి హనుమంతుడు ఇచ్చిన సమాధానాలు,  అదే ఈ కీర్తనలో భావం.
ఓ హనుమా!  ఆమె అప్పుడేమన్నది?  ఏమనుమన్నది నాతో?  ప్రభూ! తాను మీకోసం పడే విరహమే తన  తపము అన్నది.
పావనీ! పడతి సీత ఏమన్నది? మరొకమారు ఏమన్నదో చెప్పు. నిన్ను నా గురించి ప్రత్యేకించి ఏమన్నా అన్నదా?  ప్రభూ! రవికులేంద్రా  తనకు ప్రాణమే భారమైనదని రోదించినది. ఇకపై ఈ తనువును ఎట్లు దాల్చెదనని అడిగిందయ్యా..
ఓ కేసరీనందనా! ఇంతి ఇంకా ఏమన్నది?మరేమన్నది?  జంకక ఇంకా ఏమన్నదో వివరించవయ్యా!   ప్రభూ! నిరుపయోగమైన తన దేహము, వేగమె ఎందుకు పోదని విలపించింది.  మూగజీవియైన లేడికి  అపకారం తలపెట్టిన తనకి తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!
కపిశ్రేష్టా! నన్నేమన్నా అన్నదా?  స్వామీ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటే ! అని చెప్పమన్నది. తనకూ నీ వలెనే ఈ విరహము తాపమన్నదయ్యా!  ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమాస్పదమైన మన కూటమి  ఘనమైన వేంకట గిరిపై కంటినయ్యా! అని అన్నది ప్రభూ!.

అట్ట నెరవాదివి నీవలమేలుమంగవు - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అట్ట నెరవాదివి నీవలమేలుమంగవు
నెట్టన నీ రమణుడు నిన్ను మెచ్చీ నిందుకు.

ఇయ్యకొంటె మాఁటలెల్లా నింపులై యుండు
నెయ్యముగలిగినట్టి   నెలఁతలకు
నొయ్యనే విచారించితే నుపమ పుట్టు
యెయ్యెడా నలుకలేని ఇంతులకు.

వున్నది నేమిసేసినా నొడఁబాటౌను
సన్నయెరిఁగినయట్టి సతులకును
విన్నకన్న సేఁతలెల్లా వేదుకై తోఁచు
నన్నిటా నోరుపుగల యతివలకు.

కందువఁ దెలిసితేఁ గరఁగు మతి
అంది వివేకముగల యాఁడువారికి
యిందరిలో శ్రీ వేంకటేశ్వరుఁడు గూడె
పొంది లిట్టివి నీవంటి పొలఁతులకును.

ఈ  కీర్తనలో  చెలికత్తెగా మారిన అన్నమయ్య అలమేలుమంగతో ఇలా అంటున్నాడు.
ఓ అలమేలుమంగా! నీవు సమర్ధురాలైన పడతివి. అందుకే నీ రమణుడు నిన్ను నీ యెదుటనే మెచ్చుకుంటున్నాడు.
అయినా ప్రపంచములో జరిగేది ఇదే కదా! ఇంతికి స్నేహంగా ఉండే మగని మాటలెల్లా ఇంపుగానే ఉంటాయి. అలుకే లేని స్త్రీలకు సరిగ్గా ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలు గోచరిస్తాయి.
మగని సంజ్ఞ తెలిసిన స్త్రీకి అంగీకారమైతే ఏమిచేసినా ఇష్టంగానే ఉంటుంది. అన్నింటిలోనూ ఓర్పు గల స్త్రీకి ఏమి కనినా, ఏమి వినినా తన మగని చేతలన్ని వేడుకగానే ఉంటాయి.
వివేకమున్న స్త్రీకి నేర్పు ఉంటే మగని మనస్సు కరిగించగలదు.   అందుకేనేమో ఇందరిలో నిన్నుమాత్రమే అనురాగముతో కలిసినాడు.  నీ వంటి స్త్రీలకు శ్రీ వేంకటేశుని పొందులు ఇటువంటివే..

అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తనః

అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు
ఇల మీ చుట్టరిక మిరవాయ సుండీ..

పులకించి కృష్ణుడు వుట్లు గొట్టీ - వేంకటాద్రిపుర వీధులను
మంకు గొల్లెతల మరి మీరు పెనఁగితే -  సుంకించి మానాలు సోకి సుండీ..

పాలు పెరుగు వారవెట్టీ గోవిందుడు - సోలిఁ గోనేటియీచుట్టులను
ఆలించి గొల్లెత లటు మీరు సొలసితే - చేలకొంగు లంటితే సిగ్గాయ సుండీ..

చేకొని వెన్నలు జుర్రీ శ్రీవేంకటేశుడు - వాకైననిధిమీఁది వాడలను
కాకరి గొల్లెతల కాఁగలించి పట్టేరు - యేకమైతిరి మీ గుట్టు లెరిఁగిసుండీ..

భావమాథుర్యం..
శ్రీవేంకటేశ్వరునిపై అన్నమయ్య వినిపిస్తున్న చక్కటి కీర్తననాశ్వాదిద్దాం..  ఇదొక భక్తి శృంగార గీతం
ఈ అలమేలుమంగ విభుడు అన్నిటా జాణ. మాబోటి వారికి మీ చుట్టరికము కన్నులపండుగ వంటిది సుమా.. దుమికి దుమికి శ్రీకృష్ణుడై వుట్లను గొట్టినాడు. నేడు తిరుమల వీధులలో ఊరేగుతున్నాడు కానీ .. వలపుకాడై గొల్లెతలు ఎంత పెనిగినా వారి మేనులను ఎగిరి ఎగిరి తాకి చిలిపిగా నవ్వుతున్నాడు సుమా!  ఈ గోవిందుడే పాలు పెరుగులను ధారలుగా పారేటట్లు చేశాడు. కోనేటి ఒడ్డున సోలిపోయియున్న గొలెతల చీరచెంగులను పట్టుకొని సిగ్గులతో ముంచెత్తాడు సుమా! నేడు శ్రీవేంకటేశుడైనా ఇంకా వెన్నలు జుర్రుతూనే ఉన్నాడు. వాటమైన నిధివలె వాడలలో తిరుగుతున్నాడు. మాయకత్తెలైన గొల్లెతలు కౌగలించి పట్టుకొంటే ఏమయ్యారు. మీ గుట్టులన్నీ వీనికి ఎరుకే సుమా..



అలుగకువమ్మ నీ వాతనితో నెన్నండును - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అలుగకువమ్మ నీ వాతనితో నెన్నండును
పలువేడుకలతోనె పాయకుండురమ్మా !!

 జలధిఁ దపము సేసె సాధించెఁ బాతాళము
నెలఁత నీ రమణుఁడు నీకుఁగానె
ఇలవెల్లా హారీంచె నెనసెఁ గొండగుహల
యెలమి నిన్నిటాను నీకితవుగానె. !!

బాలబొమ్మచారై యుండె, పగలెల్లా సాధించె
నీ  లీలలు దలఁచి   నీకుఁగానె
తాలిమి వ్రతమువట్టి ధర్మముతోఁ గూ డుండె
పాలించి నీవు చెప్పిన పనికిఁగానె !!

యెగ్గు సిగ్గుఁ జూడఁడాయె యెక్కెను శిలాతలము
నిగ్గుల నన్నిటా మించి నీకుఁగానె
అగ్గలపు శ్రీవెంకటాద్రీశుఁడై నిలిచె
వొగ్గి నిన్నురాన మోచివుండుటకుఁ గానె. !!

ఇది దశావతార వివరణ కీర్తన అని పోల్చుకోగలిగినవారు నిజంగా అన్నమయ్య కీర్తనలలో ప్రావీణ్యం ఉన్నవారేనని అంగీకరించవచ్చు. జాగ్రత్తగా పరిశీలించండి.
ఓ! దేవీ! నీకోసం స్వామి ఎన్ని పాట్లు పడ్డాడమ్మా! కావున నీవెన్నడూ అతనిపై అలగవద్దు. ఎన్నో వేడుకలతో అతన్ని ఎన్నడూ ఎడబాయక  ఉండాలి. అప్పుడే  మాబోటి వారికి ఆనందం.
నీ విభుడు జలధిని తపింపజేసాడు(మత్స్యావతారము), పాతాళమును సాధించి మంథరపర్వతాన్ని నిలిపాడు(కూర్మావతారము). భూమిని కైవశము చేసికొన్నాడు (వరహావతారము). కొండగుహలలో నిలిచాడు(నరసింహావతారము). ఇన్నింటిలోనూ నీకు హితమునే ఒనరించినాడు. నీ రమణుడు నీకుగానే సహకరించాడు.
బాలబ్రహ్మచారిగా అవతరించి బలిని రసాతలం పంపి భూమిని రక్షించాడు.(వామనావతారం). దుర్మార్గులైన క్షత్రుయులపై పగసాధించాడు (పరశురామావతారం). వీటిలోకూడా పుడమిరూపంలో ఉన్న నీ కొరకే శ్రమించాడు. ధర్మపరిరక్షణే ధ్యేయంగా, వ్రతముగాచేపట్టాడు(శ్రీ రామావతారం). నీవు చెప్పిన పని కోసమే ఆమె నీ ఆజ్ఞను పాలించింది. (శ్రీకృష్ణావతారం)
ఓ దేవీ! ఇతగాడు సిగ్గుయెగ్గులు పాటించడాయె (బుధ్ధావతారం) శిలాతలము అనగా 'రికాబు' ను ఎక్కినాడు. (కల్కి అవతారము) దుస్సహమైన శ్రీవేంకటేశ్వరుడై నిలిచినాడు. మరి ఈ అవతారం దేనికో తెలుసా తల్లీ! నిన్ను తన ఉరమున మోయుటకే సుమా!
(వ్యాఖ్యానం. అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)