Wednesday 21 February 2018

మనసు

మదిలో మెదిలిన భావం.

కన్నపిల్లల అభివృధ్ధిని చూచి ఉప్పొంగిపొయే అమ్మ మనసు
భర్త ఉచ్ఛస్థితిని, పొందిన కీర్తిప్రతిష్ఠలని చూచి గర్వించే భార్య మనసు
రాఖీకట్టి అన్నదమ్ముల బాగోగులని మనసారా కోరుకొనే సోదరి మనసు
ఆనందంలోనూ, ఆవేదనలోనూ అండగా నిలిచి చేయూతనిచ్చే స్నేహితురాలి మనసు
ఎదిగిన మనవల ఘనకార్యాలను తలచి పొంగిపోయే అమ్మమ్మ మనసు
మంచిపేరు తెచ్చుకుని ఇంటిపేరుని నిలబెట్టిన మనవలను చూచి
 మా 'వంశాంకురాలని' మురిసిపోయే నాన్నమ్మ మనసు
అత్తమామలను ఆదరించి అవసాన దశలో ప్రేమతో సేవ చేసే కోడలి మనసు.
పై ఇంటి కోడలై పుట్టెడు బాధ్యతలలో మునిగిపోతూ జన్మనిచ్చిన
అమ్మ నాన్నల కోసం తపన పడే కూతురి మనసు.
భారత స్త్రీ మానసిక సౌందర్యానికి  సరిసాటి ఉందా ఎక్కడైనా?

- పొన్నాడ లక్ష్మి

Saturday 10 February 2018

అన్నమయ్య కీర్తన.. ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన

ఈ వారం అన్నమయ్య కీర్తన..
ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన
తీలుపడనేర  నేను  తెలివేకాని. !!
నగి నగి తిట్టినాను నాతో నలిగినాను
వెగటు లేదు నాకు వేడుకే గాని
మొగిసి మాటలాడినాను మోనాన నీవుండినాను
జగడము లేదు నాకు చనవే కాని !!
కన్నులఁ గొసరినాను కాఁకల విసరినాను
చిన్నబోదు నా మోము చెలువే కాని
సన్నలనే తిట్టినాను చాయలనన్నాడినాను
యెన్న నెగ్గుగాదు నాకు నితవే కాని !!
పైకొనక మానినాను పరాకు సేసినాను
నాకెందు నెరవు లేదు నలుపేకాని
శ్రీకాంత నేను నీవు శ్రీ వేంకటేశుఁడవు
ఏకమైతి మెదురేది ఇచ్చకమే కాని. !!

భావమాథుర్యం..

అన్నమయ్య చెప్పిన ఈ సరస కీర్తనలో దేవి స్వామితో కరాఖండిగా ఏమంటున్నదంటే, మన కలయికకు ఎదురే లేదు స్వామీ! మన అనురాగమే కనిపిస్తుంది కానీ మరోటి నా దృష్టికి రాదు. నీవు నన్ను వేడుకోవటం దేనికి ప్రభూ? నీవే నేను గాన.
నేను నీ గురించి ఎన్ని పుకార్లు విన్నా దుర్బలను కాను. నాకు జ్ఞానము ఉన్నది. (స్వామి పరమాత్మ, దేవి ఆత్మ అని ఆమె గ్రహించినది). ప్రభూ! నీవు నవ్వుతూ తిట్టినా. పీడించినా నాకు వినోదమే కాని ద్వేషభావం లేదు. పూనుకొని నీవు మాట్లాడినా, లేక మౌనంగా ఉన్నా నాకు నీవంటే ఇష్టమే కాని మనమధ్య పోట్లాట రాదు, రాబోదు.
స్వామీ! నీ కన్నులలో నాపై ఆపేక్ష చూపించినా, లేక మండిపడినా నా మొగము ప్రసన్నంగా ఉంటుందే కాని, చిన్నబోదు. సన్నగా తిట్టినా చాయగా మాటలనినా నాకు హితమే కాని చెడు కాదు.
నాథా! నీవు నా పొందు కోరినా లెక, పరాకు చిత్తగించినా నాకు ఒప్పుగానే తోస్తుంది. తప్పు అనిపించదు. ఎందుకో తెలుసా ప్రభూ! నేను శ్రీకాంతను, నీవు శ్రీ వేంకటేశ్వరుడవు. అనవసర అపార్ధమే కాని మనమేకమైతే ఎదురేముంది?
వ్యాఖ్యానం.అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.     
సేకరణ .. పొన్నాడ లక్ష్మి.

Saturday 3 February 2018

ఏమిటికిఁ జింత ఇదె నీకు ప్రేమపు బెండ్లి బెరసెగా నీకు - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.. పాలకూడు.

పాలతో వండిన అన్నాన్ని క్షీరాన్నమని, పాయసమని, పరమాన్నమని - ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్నమయ్య ఈ క్షీరాన్నానికి పాలకూడు అని పేరు పెట్టాడు. 'కూడు అన్న తెలుగు పదం ఇప్పుడు మోటయిందేమో కాని, అన్నమయ్య దృష్టిలో అతి పవిత్రం.  ఈ కీర్తనలో ఆయన మనకు పంచిపెట్టిన పాలకూడు తిని పరవశిద్దాం.

ఏమిటికిఁ జింత ఇదె నీకు
ప్రేమపు బెండ్లి బెరసెగా నీకు. !!

కలికి నీ చూపుల కలువదండలు తెచ్చి
తలకకాతనిమెడ దగులవేసి
మొలక నగవుల నీ ముత్యపు సేసలు చల్లి
తొలగని పెండ్లి దొరకెగా నీకు

చనవు గూరిముల కొసరులను గరమిడి
ఘనమైన కాకల గాలుదొక్కి
పనివడి వెన్నెల పాలకూడు గుడిచి
తనివోని పెండ్లి దగిలెగా నీకు

తరుణి నీ హృదయపుదమ్మిపరపుతోడ
నిరవైన సిరులతో నిల్లు నించి
తిరువేంకటగిరి దేవునితోగూడి
సరసపు బెండ్లి జరగెగా నీకు

భావార్ధం ..

అలిమేలుమంగమ్మ ఎందుకో బాధపడుతోంది. అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి ఆమెను పరామర్శిస్తున్నాడు.

ఎందుకే అలా బాధపడుతున్నావు. మీ ఇద్దరూ చేసుకున్నది ప్రేమపెండ్లే కదా! (ప్రేమతో పెండ్లి చేసుకున్నప్పుడు విచారాలు రాకూడదని కవి హృదయం).
ఓ అమ్మడూ ! నీ చూపులనే కలువపూల దండలు తీసుకువచ్చి ఏమాత్రం చలించకుండా, భయపడకుండా (తలకక) అతగాడి మెడలో ప్రేమతో వేసావు. లేత నవ్వులనే నీ ముత్యాల తలంబ్రాలు పోసిన ఏమాత్రం పక్కకు జారని పెండ్లి నీకు దొరికింది కదా..!  (పెండ్లి చేసుకున్నప్పటికీ వధూవరులు ఇంకో పక్కకి చూపులు ప్రసరించకుండా పరస్పరం ఆనందంతో ఉన్నారని భావం)
అసలుకంటే కొసరు ముద్దు కదా..! నీ ప్రియుడికి చనవులతో కూడిన ప్రేమలు కొసరులుగా బాగా పెట్టావు. ఈ రోజు పెండ్లిలో కాకతో (తాపం) అతగాడి కాలు తొక్కావు. ఏమి కాక తల్లీ, నే చూస్తూనే ఉన్నాగా ! కావాలని ప్రయత్నపూర్వకంగా (పనివడి) పని కల్పించుకుని వెన్నెలలో పాలకూడు అతనితో పాటు తిన్నావుగా ! ఎంత సుఖపడ్డా తృప్తి ఏమాత్రం తగ్గని పెండ్లి చేసుకున్నావు కదా ! ఇంకా ఈ విచారం దేనికి?
 ఏమే .. ఎవరైనా పెండ్లి జరిగిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. నువ్వు మా వేంకటేశునితో పెళ్ళీ జరిగిన తర్వాత తామరపూల పరుపులతో కూడిన సిరులకు నిలయమైన నీ హృదయమనే ఇంట్లోకి తీసుకెళ్ళావు. (నువ్వు మా స్వామిని హృదయంలోనే పెట్టుకున్నావని భావం). శుభప్రదుడయిన మా వెంకటేశునితో కలిసి నీకు సరసాలపెండ్లి జరిగింది కదా .. ! ఇంకా నీకు ఈ దిగులేమిటే ?

పాలకూడు పదం రెండో చరణంలో వచ్చినా దాని రుచి మాత్రం మొత్తం కీర్తనలో ఉంది. అన్నమయ్యకు ఈ పాలకూడు చాలా ఇష్టమేమో. ఇలా పాలకూడులో జీడిపప్పు వంటి భావనలు అన్నమయ్య సాహిత్యంలో ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యం ఘుమఘుమలాడే వేడి వేది పరమాణ్ణం.

(సంకలనం, వ్యాఖ్య డా. తాడేపల్లి పతంజలి గారు) - సేకరణ - పొన్నాడ లక్ష్మి