Friday 4 July 2014



ఈ వారం అన్నమయ్య కీర్తన.    5.7.14.
ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు

కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు
భావం :
దేవా! ఎవ్వరెవ్వరు ఎంతెంత మాత్రముగా నిన్ను తలచుదురో వారి వారికి అంతంత మాత్రముగానే నీవు తోచుచుందువు. అంతరాంతరములు  ఎంచి చూడగా పిండి కొలది రొట్టె అన్నట్లు.
వైష్ణవులు ప్రేమతో నిన్ను విష్ణుడని కొలుచుదురు. వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని కొనియాడుదురు. శైవులు భక్తితో నిన్ను శివుడవని తలచుదురు. కాపాలికులు నిన్ను ఆదిభైరవుడవని పోగుడుదురు.
ఇక శాక్తేయులు నిన్ను శక్తి రూపుడవేయని భావింతురు. ఇట్లు తమతమ తలపులననుసరించి నిన్ను  అనేకవిధముల నుపాసించుదురు. శ్రీమంతుడవైన నిన్ను ఎవరు అల్పబుద్ధితొ  భావింతురో వారికి నీవు అల్పముగానే తోచెదవు. మహిమోపేతుడ వగు నిన్ను ఘనుదవని భావించిన ఘనబుద్దులకు నీవు ఘనుడవు గానే కన్పట్టుదువు.
నీవలన ఎటువంటి కొరత లేదు. నీరుకొలది తామెరవంటి వాడవు. గంగానది ఒడ్డున నున్న బావులలో గంగాజలమే ఊరిన యట్లు పలురీతుల నిన్ను భావించు వారి హృదయములలో వారి భావానుసారముగా నీవు తోచుచుందువు. శ్రీ వేంకటేశ్వరా! నీవే మమ్ము రక్షించు దైవమని నమ్మి నిన్ను శరణు వేడుతున్నాను. ఇదియే నాకు ముమ్మాటికి పరతత్వము.