Monday, 11 July 2022

హరి అవతారమితాడు అన్నమయ్య వ్యాసం

 

హరి అవతారమితడు అన్నమయ్య..

 

ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించిన తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఈ పదకవితాపితామహుడు క్రీ.. 1408 లో జన్మించి 1503 లో స్రీనివాసుని సన్నిధికి చేరినట్లు తెలుస్తూంది. కడప మండలం తాళ్ళపాక గ్రామంలో నారయణసూరి లక్కమాంబలకు జన్మించాడు. బాల్యం లోనే ఒక భజన బృందంతో కలసి తిరుమల చేరి అక్కడే స్థిరనివాసమేర్పరుచుకుని, శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తితో, అనురక్తితో 32,000 సంకీర్తనలను రచించి, ఆడి, పాడి తరించిన మహనీయుడు.

 

అన్నమయ్య రచించిన పదసంకీర్తనలలో 12,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. తాళపత్రాలలో రచింపబడిన ఈ కీర్తనలకు శాశ్వతత్త్వం కలిగించాలని అతని మనుమడు చిన తిరుమలాచార్యుడు రాగిరేకులలో తిరగ రాయించాడు. అయితే రాగి విలువే కాని రాగం విలువ తెలియని పామరులు రాగిరేకులను కరగించి పాత్రలను చేసి వాడుకున్నారు. అలా పోయినవి పోగా మనకు దక్కినవి పన్నెండువేల పద కీర్తనలు మాత్రమే

 

తెలుగులో పదకవితకు ఏమాత్రం స్థానం లేని ఆ రోజుల్లో పదకవితకు ప్రత్యేకతనూ, విశిష్ఠతనూ ఏర్పరిచిన ఆద్యుడు అన్నమయ్య. తదనంతరం ఎందరో కవులు పదకవితను సుసంపన్నం చేసిన మాట వాస్తవమే అయినా అన్నమయ్య పదకవితా మార్గానికి వేసిన రాచబాటలు వారందరి సుఖప్రయాణానికి మార్గదర్శకములయ్యాయి.

 

పద కవులలో అన్నమయ్యకు ఒక ప్రత్యేక స్థానముంది. పద్యకవితతో సమాన గౌరవం పదకవితకు ఆపాదించాడు. సరసహృదయులను అలరించడానికి, రసజ్ఞుల మెప్పు పొందడానికి, భక్తి శ్రింగార, వైరాగ్య, ఆధ్యాత్మిక సంకీర్త్నలను ఎన్నో పద్యసాహిత్యంతోనే రచించి అందరినీ అలరించాడు. ఆయన పదకవిత్వం ఇతర కవుల పద్యకవిత్వానికి ఏమాత్రం తీసిపోవు.‘వాక్యం రసాత్మక కావ్యంఅన్న లోకోక్తికి చక్కటి నిదర్శనం అన్నమయ్య ప్రతి పదమూ.. ఏ సంకీర్తన పరిశీలించినా అన్నమయ్య భావనా మాథుర్యం, ప్రతిభా, సాహిత్య పరిజ్ఞానం గోచరిస్తాయి.  ఈ రచనావ్యాసాంగం కోసం ఆయన ఎక్కడా కష్టపడినట్లు కనిపించదు. అవి వాటికవే అన్నమయ్య పద కవితలలో అలవోకగా వచ్చి చేరినట్లు స్పష్టమౌతూంది.

 

అన్నమయ్య స్వామిని కమ్మరిగా, కుమ్మరిగా, సాలెవానిగా, జూదమాడేవానిగా ఇలా ఎన్నో వ్బిభిన్న రూపాలలొ దర్శించుకున్నాడు. ఒక కీర్తనలో భూతంగా కూడ అభివర్ణిస్తాడు. జానపదుల వాడుక భాషకు కూడా సాహిత్య గౌరవం కలిగించాడు. సామెతలు, జాతీయాలు, నానుడులు, నూతన పద బంధాలు మొదలయినవాటిని తన కీర్తనలలో

ప్రవేశపెట్టాడు. అన్నమయ్య భావనా సౌందర్యానికి, ప్రతిభా సంపన్నతకూ  ఆయన రచించిన పదాలన్నీ ఉదాహరణలే.. అన్నమయ్య ఆంధ్రసాహిత్యంలో అపూర్వమైన అనితరసాధ్యమైన కొత్తపోకడలు ప్రవేశపెట్టాడు.

 

పద్య సంప్దతో మాత్రమే పరిఢవిల్లే ఆంధ్ర సాహిత్యానికి పద సంపద కూడా సమకూర్చి తెలుగు భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేసాడు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకుందుకి అనువుగా మంగళహారతులు, లాలి పాటలు ,జోలపాటలు, దరువులు మొదలనవి ఎన్నో రచించిన ఆద్యుడు కూడా అన్నమయ్యే.. అన్నమయ్య గొప్ప సంఘ సంస్కర్త కూడా.. జాతి కుల,మత భేదాలుండ రాదని తన కీర్తనలద్వారా బోధించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. స్త్రీల వ్యక్తిత్వానికి, భావాలకీ ప్రాముఖ్యం ఇవ్వాలని ఉద్ఘాటించాడు.

 

మొత్తం మీద తన జీవితకాలంలో 32,000 సంకీర్తనలని, ద్విపద రామాయణం, శృంగార మంజరి, వేంకటాచల మహత్మ్యం, సంకీర్తనా లక్షణ గ్రంథం  ఇలా ఎన్నో రచనలు చేసిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు(1503) స్రీనివాసునిలో ఐక్యమయ్యాడు. తెలుగు వారికి  తరగని సాహితీ సంపదని అందించాడు.     ఓం నమో వేంకటేశాయ.

No comments:

Post a Comment