Tuesday 29 August 2017

ఎంత భాగ్యవంతుడవో యీకె నీకు దేవులాయ వింతలుగా నీకుగానే వెదకి తెచ్చితిని - అన్నమయ్య కీర్తన




పల్లవి
ఎంత భాగ్యవంతుడవో యీకె నీకు దేవులాయ
వింతలుగా నీకుగానే వెదకి తెచ్చితిని
చరణం 1
అలివేణి జవరాలు అన్నిటాను జక్కనిది
చిలుకపలుకుల దీ చెలియ
కలిగె నీకు గన్నుల గలికి యీకె యొక్కతె
అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా
చరణం 2
యిందుముఖి కంబుకంఠి యిన్నిటా నందమైనది
చందనగంది యీ సకియ
పొందుగా దొరకె నీకు పువ్వుబోణి యొక్కతె
అంది యీకె నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా
చరణం 3
జక్కవ చన్నులలేమ చక్కెరబొమ్మ బిత్తరి
చొక్కపు సింగారాల దీ సుదతి
దక్కె శ్రీవేంకటేశ యీ తరుణి నీకు నొకతె
అక్కరతో నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా
భావం :
ఓ వెంకటేశా, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? గొప్ప సుగుణాలున్న ఈ అమ్మాయిని నీ కోసం అపురూపంగా వెతికి తెచ్చాము.
పొడవైన, ఒత్తయిన కురులున్న ఈ యవ్వనవతి అన్ని రకాలుగాను నీకు చక్కగా సరిపోయే సరిజోడు! ఆమె మాటలెలా ఉంటాయంటావా? అనవసరంగా వాయాడిలా మాట్లాడదు; కుదురుగా, చిలకలాగ ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది. "నీకోసమే పుట్టింది ఈ కలికి!" అన్నట్టు ఉంది. ఇంక దేని గురించీ ఆలోచించకు; ఆనందంగా పెళ్ళిచేసుకో.
చల్లని చిరునవ్వులొలికే ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. అంతేనా? ఆమె కంఠం శంఖంలా అందంగా ఉంది. (శంఖం మీదున్నట్టు కంఠంమీద మూడు చారలున్న అమ్మాయిని అదృష్టవంతురాలుగానూ, ఉన్నతమైన సంతానాన్ని కనగలిగినదిగానూ చెప్తారు శాస్త్రజ్ఞులు). చందనపు సువాసనలు వెదజల్లే అందగత్తె! పువ్వులాంటి లేత సోయగాలున్న ఈమె చేయందుకోవడం నీ ప్రాప్తంగా భావించి పెళ్ళిచేసుకో.
చక్రవాక పక్షుల్లాంటి కుచద్వయంతో, చక్కెరబొమ్మలా ఉంది. చక్కనైన పలువరుసతో, పరవశింపజేసే లేత సోయగాలతో నీకు స్వచ్ఛమైన శృంగారమొలికించగలదు! ప్రపంచంలో ఇన్ని యోగ్యమైన లక్షణాలతో మరో అమ్మాయి లేదు. ఈ యవ్వనవతి ఒక్కత్తే నీకు సరైన భాగస్వామి. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండ వచ్చి పెళ్ళిచేసుకోవయ్యా, శ్రీవేంకటేశా!
(వ్యాఖ్యానం Courtesy శ్రీ అవినేని భాస్కర్)

జన్మదిన కవిత - 'తరగలేని సిరులు, కరుణించు వరములు'



నా జన్మదిన సందర్భంగా నన్ను ఆప్యాయంగా 'అమ్మా' అని పిలిచే, అభిమానం పంచే చి. రాజేంద్ర గణపురం రాసిన కవిత. చి. రాజేంద్ర కి నా శుభాశీస్సులు.

మా అమ్మ
. పొన్నడ లక్ష్మమ్మకు
. జన్మదిన శుభాకాంక్షలు
. _/\_............._/\_
.
సీll తరగ,లేని సిరులు l కరుణించు వరములు
విరుల చలువలున్న l వేల్పు లమ్మ
ప్రీతి విడని తర్వు l ప్రేమె తన నెలవు
సుధల నిధులు యున్నl ముదము లమ్మ
మంచి ధన,తనము l మర్యాదల గుణము
కలివిడి పలుకుల l నెలవు లమ్మ
శాంత స్వభావము l స్వచ్ఛతల వనము
బిడ్జల క్షెమము l బిరుదు లమ్మ
ఆll కన్నతల్లి నాకు l పొన్నడ లక్ష్మమ్మ
యందు కొనుము మాత l వంద నములఁ
నర్సపురని వాస l నటరాజ ఘనమోక్ష
విశ్వకర్మ రక్ష l వినుర దీక్ష
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం
. 26/ 08/ 2017
.
కన్నతల్లి వలె ఎప్పుడు ప్రేమతో పలుకరించె అమ్మ మా అమ్మ "పొన్నడ లక్ష్మమ్మకు"
శతకోటి నమస్సులతో...
జన్మదిన శుభ కాంక్షలు....!!!
...చిత్రలేఖనములో హిమాలయశిఖరాగ్రాన్నిముద్దాడిన,,నాన్నగారైన "పొన్నడ మూర్తి"
గారు అమ్మచిత్రాన్న స్వహస్తాలతో
గీసి అందించారు.....!!
...

Friday 18 August 2017

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవిహారా లక్ష్మీనారసింహా! - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవిహారా లక్ష్మీనారసింహా!

ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా!
కులశైల కుంభినీ కుముదహిత రవిగగన చలననిధి నిపుణ నిశ్చల నారసింహా! ॥ఫాల॥

వివర ఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవ దివ్య పరుష లాలాఘటనయా!
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా! ॥ఫాల॥

దారుణోజ్జ్వల ధగధ్ధగిత దంష్ట్రానల వికారస్ఫులింగ సంగక్రీడయా!
వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణప్రకట వేంకట నారసింహా! ॥ఫాల॥

భావం:
నీ నుదుటన ఉన్న కంటి నుండి వెలువడే ప్రకాశవంతమైన మెరుపులతో ఆడుతూ విహరించే నరసింహమూర్తీ! నీ లలితమైన నిశ్వాసానికి (నిట్టూర్పుకి) ప్రళయకాలంలో వీచే గాలికుండే శక్తి ఉంటుంది.
భయంకరమైన కొలిమితిత్తిలో నిప్పు రాజేసే బలం ఉంటుంది. ఆ నిట్టూర్పుతో కులశైలాలు, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశం కదిలిపోతోంటే, నువ్వు మాత్రం నిశ్చలంగా ఉన్నావు.
దుర్మార్గులను చూసి వారి కాలం తీరిందని వికటాట్టహాసం చేసేందుకు ఘనమైన నీ నోటిని తెరిచావు. ప్రియమైన గుణాలకు జలధివంటి వాడివైన నీ లాలాజలం సకల జీవజాలాన్నీ నశింపజేయగలదు.
శత్రువులైన దానవుల వంశాలను భస్మం చేయడానికి నీ కోరలు (దంష్ట్ర) పటపటలాడుతుంటే, వాటిలో ఉత్పన్నమయే అగ్నికణాలు ధగధగలాడుతున్నాయి. నీవు మా వేంకటేశ్వరుడివే!
ఈ కీర్తనకి భావం రచించిన శ్రీ టి. యస్. సతీష్ గారికి కృతజ్ఞతలు.

Sunday 13 August 2017

అన్నమయ్య కీర్తన - నందగోపనందనుడే నాటిబాలుడు


శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ కీర్తన

అన్నమయ్య కీర్తన -

నందగోపనందనుడే నాటిబాలుడు
ఇందునేడె రేపల్లె నేచి పెరిగెను

పువ్వువంటి మఱ్ఱియాకు పొత్తిఁబవళించనేర్చె
యెవ్వడోకాని తొల్లె యీబాలుడు
మువ్వంక వేదములను ముద్దుమాటలాడనేర్చె
యెవ్వరూ కొంతనేర్ప నేటికే వీనికి

తప్పుటడుగు లిడగనేర్చె ధరణియందు నాకసమున
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియో
రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁజెంద్రునందు పగలు
గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేటికే

మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె
నంచితముగ శ్రీవేంకటాద్రి మీదను
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాగిలించనేర్చె
దించరానివురము మీద దివ్యకాంతను