Friday 29 July 2016

ఇన్నిటికీ నీశ్వరేచ్చ - ఇంతే కాక -- అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన. 30.7.16.

ప.         ఇన్నిటికి నీశ్వరేచ్ఛ  – ఇంతే  కాక
            తన్నుదానే హరిగాచు – దాసుఁడైతేఁ చాలు.
౧.         ప్రకృతిఁబుట్టిన దేహి – ప్రకృత (ప్రకృతి?) గుణమే కాని
            వికృతి బోధించబోతే – విషమింతే కాదా,
            ఒక విత్తు వెట్టితే వే – రొకటేల మొలుచును
            ప్రకటమైన వట్టి – ప్రయాసమే కాక.
౨.         పాపానఁ బుట్టిన మేను – పాపమే సేయించుగాక
            యేపునఁ బుణ్యముతోవ – యేల పట్టును,
            వేపచేఁదు వండితేను – వెసనేల బెల్లమవును
            పై పై బలిమి సే సే – భ్రమ ఇంతేకాక
౩.          ప్రపంచమైన పుట్టుగు – ప్రపంచమునకే కాక
            ఉపమించ మోక్షమున – కొడఁబడునా ?
            ప్రపన్నుఁ డైన వేళ – భాగ్యాన శ్రీ వేంకటేశుఁ  
            డపుడు దయఁ  జూడఁగ – నధికుడౌ  గాక !

భావము: ఏది జరుగవలెనన్నను భగవంతుని యిచ్ఛ ననుసరించి జరుగవలసినదే. ఆయనకు  దాసు డగుడొక్కటే జీవుని కర్తవ్యము. అప్పుడు దయానిధి అయిన శ్రీహరి తానే కాపాడును.
             భగవంతుని లీలవలన జీవుడు ఈ  దేహాన్ని ధరించి ప్రకృతి నుండియే శరీరముతో జన్మించినాడు. వీనికి ప్రకృతి సహజమైన గుణములుండునే గాని ఇతర  గుణములుండవు. కాదని ప్రకృతి కతీతముగా ప్రవర్తించు మని వానిని బలవంతము చేసినచో విషమమైన పరిస్థితికి దారి తీయును. ఒక చెట్టు విత్తు నాటినచో ఆ చెట్టే మొలుచును గాని వేరొక చెట్టు యెట్లు మొలుచును? ఒకవేళ అలా మొలిపించుటకు ప్రయత్నించిననూ వృధా ప్రయాసయే యగును గానీ ఫలముండదు కదా!
            ఈ శరీరము పాపకర్మముచే పుట్టినది. ఇది మనచే తనకు సహజమైన పాపకర్మమునే చేయించుగాని పుణ్యమార్గము నెందు కనుసరించును? వేపచేదు వండినచో చేదుగానే ఉండునుగాని బెల్లము వలె తియ్యగా ఎట్లుండును? అట్లే  ఈ తనువును పుణ్యపథముణ నడిపింప గలమని పూనుకొనుట ఒట్టి భ్రమయేగాని మరేమియు కాదు సుమా!
            మన జన్మము ప్రపంచ ప్రవృత్తికి సంబంధించినది. ఇది  ప్రపంచ మాయాజాలమున మనలను తగిలించుటకే

ప్రయత్నించును గాని మోక్షమున కంగీరంచునా? కావున  జీవుడు భగవంతుని యెడల ప్రపన్నుడు కావలెను. అప్పుడు భాగ్యవశమున  శ్రీ వేంకటేశుడు దయ చూడగా , అతడు ముక్తుడై అధికుడగును.

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు - అన్నమయ్య కీర్తన


కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు
1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ
2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు
3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు
తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.
1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!
2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.
3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
(ఈ కీర్తనకి తాత్పర్యం అందించిన డా. పతంజలి తాడేపల్లి గారికి ధన్యవాదాలు)

Thursday 28 July 2016

..అన్నమయ్య చెణుకులు

చమత్కారం  కోసం అన్నమయ్య పదాలలో విసిరిన విసురులు, చెణుకులు కోకొల్లలు.అందరికీ రెండు చేతులుంటే స్వామికి నాలుగు చేతులు ఎందుకని సందేహం రావడం సహజం.  దానికి సమాధానంగా అన్నమయ్య :
“ఓలి నిర్వుర సతుల నాలింగనము సేయ
లొలు డటుగాన నాలుగు చేతులాయ”
అనడం అన్నమయ్యకే చెల్లు. బండి తొక్కిన పాపం వాళ్ళ కృష్ణుడు బండిబోయడయ్యాడట. అందగాడయిv న స్వామి విరహం కారణంగా నల్లబడ్డాడట. అమ్మవారి విషయంలో కూడా అన్నమయ్య వెనుకడుగు వేయలేదు. నడుమును లేనట్టుగా వర్ణించడం, నవ్వుల్ని తెల్లగా చెప్పడంaniకురుల్ని చీకటిగా చెప్పడం కవి సమయాలయితే వాటికి కారణాలు చెప్పాడు అన్నమయ్య.
నడుమేల బడుగాయ నవ్వులేల తెలుపాయ
వెడగు నీ గుణములు విని విని పో
కురులేల చీకటాయ, గోళ్ళేల వాండ్లాయ
సొరిది నీ చేతలనే చూచి చూచి పో
‘వాక్కులొక్కటే భాషల వరుస వేరు’ అని అన్నమయ్య భావం. పరమార్ధాన్ని పామరులకు బోధించే వేళ పదిమందికి తెలిసిన అంశాలను ఉదాహరణగా చెప్పడం సహజ సుందరమౌతుంది.
‘నేను జీవుడిని, నీవు పరమాత్ముడివి. జీవుడయిన నేను దారి తప్పాను. దారి తప్పడం అజ్ఞానం వల్ల కావచ్చు. అహంకారం వల్ల కావచ్చు. కాని దారి మళ్ళించడం నీ ధర్మం’ అని చెప్పడం కోసం అన్నమయ్య,
“సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చునా
కమ్మి నీ సొమ్మును నేను, కాపాడవే హరి “
పసుర మడవి బడ్డ పసురము కలవాడు
దెసలు వెదకి కింటికి తెచ్చుకున్నట్టు
వసగా ఆసలలోన వడిబడ్డ నా మనసు
ఎసగ మళ్ళించవే” అనడంలో అందరికీ తెలిసిన ‘పసరం’ (పశువు) ఉపమానం ఎన్నుకున్నాడు. అలాగే కొన్నిటికి ప్రయత్నాలేమీ అవసరంలేదని, అవి సహజ భావాలని చెప్పిన తీరు కూడా రమణీయం.
కాంత తలుచుకొంటేనే కామోద్రేకము పుట్టు
ఇంతలో కూడినా ఏడకేడ సూత్రము
చింతకాయతొక్కు, చూచితేనే నోరూరు
ఎంతకెంత దవ్వు ఏడకేడ సూత్రము. ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్నమయ్య పద కవితలో మాధుర్యాలు, రమణీయాలు.
పొన్నాడ లక్ష్మి. సేకరణ: ఆచార్య సర్వోత్తమరావు, (తిరుపతి) గారి వ్యాసం నుంచి.

అన్నమయ్య - వేమన.

అన్నమయ్య - వేమన.

ఆంధ్రావనిలో అవతరించిన మహాకవుల్లో అగ్రగణ్యు లైన ప్రజాకవులూ, ఆధ్యాత్మిక కవియోగులు - ఒకరు తాళ్ళపాక అన్నమయ్య, ఇంకొకరు వేమన్న.
తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటపతి మీద వింత వింతలుగా ముప్పదిరెండు వేల సంకీర్తనలను రచించి, ప్రజాకవియై, భక్తిమాత్రమే కాక ఎన్నో అంశాలను స్పృశించి అన్నివర్గాల ప్రజలకి స్పూర్తి నిచ్చి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఇక వేమన యోగి. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుట పద్యాలద్వారా అఖండ శివ కేశవాభేద పరబ్రహ్మ తత్వాన్ని చాటుతూ మానవతావాదిగా నిల్చి, నిర్మొహమాటంగా జాతిలోని తెలుపు నలుపులని సున్నితంగా విమర్శించి ప్రజా హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న సాహిత్యమూర్తి.
అన్నమయ్య, వేమనలిరువురి భాషలో, భావాల్లో, పదాల్లో, పదబంధాల్లో ఎన్నో సామ్యాలు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో కొన్ని.
ఒక వెర్రివాడు తనమెడలో కట్టుకున్న శివలింగం మీద నమ్మకం లేక పర్వతానికి(శ్రీశైలం) శివుణ్ణి దర్శించడానికి వెళుతున్నాడట. అలాగే తనలోనే అంతర్యామియై యున్న పరమాత్ముడిని కానలేక ఎక్కడో దేవుణ్ణి వెదుకుతున్న అజ్ఞానిని గూర్చి అన్నమయ్య వేమన్నలు ఏమంటున్నారో తిలకించండి.
అరుత లింగము గట్టి యది నమ్మజాలక
పరువత మేగిన బత్తుడనైతి
సరుస మేకపిల్ల చంక బెట్టుక నూత
నరయు గొల్లనిరీతి అజ్ఞానినైతి. అని అన్నమయ్య ఆత్మవిమర్శ చేస్తుండగా వేమన్న ఇలా వివరించాడు.
అరుత లింగముంచి అదియును జాలక
పర్వతమున కేగు పామరుడు
ముక్తి కాననగునే మూఢాత్ముడగుగాక
విశ్వదాభిరామ! వినుర వేమ!
మనసులోని ముక్తి మరి యొక్క చోటను
వెదకబోవు వాడు వెర్రివాడు
గొర్రె చంక బెట్టి గొల్ల వెదుకు రీతి
విశ్వదాభిరామ! వినురవేమ !
మరొక చోట మానవుని చంచల మనస్సును కూర్చి ఈ అనుభవ కవియోగులిలా హెచ్చరించారు.
‘పాయదీసి కుక్కతోక బద్దలువెట్టి బిగిసె
చాయకెంత కట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమది కలకాలము చెప్పినా
పోయిన పోకలే కాక బుద్ది వినీనా’
కుక్కతోక వంకర, దాని వంకర తీర్చడం బ్రహ్మతరం కాదు. అట్లే మనస్సు చపలత్వం కూడా.. అని అన్నమయ్య వ్యాఖ్యానించగా దానినే వేమన్న ఇలా వివరించాడు.
కుక్కతోక దెచ్చి గొట్టంబు చేర్చిన
క్రోవి చెంతనుండు కొంత తడవు
ఎంత చెప్పు చెడుగు పంతంబు మానునా
విశ్వదాభి రామ! వినుర వేమ!
ఇంకా ఇలాంటి సామ్యాలు చాలా ఉన్నాయి. మరోసారి చెప్పుకుందాం.
సేకరణ: ఇక్కడా అక్కడా, -- పొన్నాడ లక్ష్మి.

Friday 15 July 2016

కానవచ్చి కానరాదు కమలాక్ష నీ మాయ - అన్నమయ్య కీర్తన.

ఈ  వారం  అన్నమయ్య కీర్తన.

ప.         కానవచ్చి  కానరాదు  కమలాక్ష నీ మాయ.
            తానె  వెంట వెంట తగిలీనిదివో..                    ||
౧.         తొల్లి నీవు గలవు తోడనే నేను గలను
            ఎల్లగ  ఈ ప్రపంచము  ఇంతా గలదు
            గొల్ల ఎద్దులప్పటివే గోనేలే కొత్తవైనట్లు
            చల్లని  నేనోకడనే జన్మములే వేరు.               ||
౨.         వేదములు నాటివే వినుకులు నాటివే
            ఆదినుండి చదివే, అదియే వేరు
            వేదతో  వెన్నబట్టి నేయి వెదకబోయినట్లు
            దాదాత నా తెలివి ఇతరుల నడిగెను.             ||
౩.          వైకుంఠము ఉన్నది, వరములు ఉన్నవి
            ఏకట శ్రీ వేంకటేశు యేలితి నన్ను
            గైకొని పువ్వు ముదిరి గ్రక్కన పిందయినట్లు
            నీకు శరణన గాను నే నీడేరితిని                    ||

భావము:               ఓ కమలాక్ష! పరమాత్మా!  నీ  మాయ కనిపించీ  కనిపించనట్లు ఉంటుంది.  నీవే మమ్మల్ని  వెంట వెంట తగులుకొని  ఉంటావు.
            ముందర  నేవే ఉంటావు.  నీ వెంటనే నేను ఉంటాను. అలాగే  ఈ  ప్రపంచమంతా ఉంటుంది. చూడగా, చూడగా ఎద్దులు ఎప్పటివే వాటిపై కప్పే గోనేలే కొత్తవి (ఆత్మలు ఎప్పటికి ఒకటే శరీరాలే వేరు) అన్నట్లు, నేనోకడినే కావచ్చు, జన్మములే వేరుగా  ఉంటాయి.
            వేదములు  ఆనాటివే, వినుకులు (విని నేర్చుకోవడం) నాటివే, ఆదినుంచి చదివే చదువులు అవే, చదివే పద్ధతులు వేరు.  వెన్నని  దగ్గిరలో ఉంచుకుని నేయికోసం వెదకినట్లు, నా తెలివి తెల్లారి మహా దాతవు నీవుండగా    ఇతరులను ఆశ్రయించి, అర్ధించేను.  

            వైకుంఠము ఉన్నది, నువ్వు మాకిచ్చే వరములూ ఉన్నవి. శ్రీ వేంకటేశ్వరా ! దయతో మమ్ము పాలిస్తున్నావు. పువ్వు ముదిరి పిందె అయినట్లు నిన్ను శరణు వేడి నేను కృతార్ధుడనైతిని.

Tuesday 5 July 2016

అద్భుతమైన ప్యాలిన్డ్రోమ్ శ్లోకం

అద్భుతమైన ప్యాలిన్డ్రోమ్ శ్లోకం !
"తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః|
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం||"
ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.
ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. అర్థభేదం మాత్రం ఉంటుంది.
👉
ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి, ఎడమనుండి చదివినప్పుడు 'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' అనే అర్థం వస్తుంది.
👉
అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు 'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' అని అర్థం వస్తుంది.
👉
ఎంత ఘనమైన కవిత. ప్యాలిన్డ్రోమ్ ల ఆంగ్ల భాషా ప్రియులేమంటారో?

Monday 4 July 2016

కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి.




కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి- సులభుడిన్నిటా నిండే సుగ్రీవ నరహరి.

౧. కంభములోన పుట్టి కనకదైత్యుని గొట్టి – అంబరపు దేవతలకు అభయమిచ్చి
పంబి సిరి తన తొడపై బెట్టుక మాటలాడి – అంబుజాక్షుడైనట్టి యాదిమ నరహరి.

౨. నానాభూషణములు ఉన్నతి తోడ నిడుకొని – పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి – ఆనందముతో నున్నాడదిగో నరహరి.

౩. మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతో అక్కజపు మహిమలను అలరుచు
తక్కక శ్రీ వెంకటాద్రి దాపుకొని – జక్కదనములకేల్లా చక్కని నరహరి.

భావం:

కోరిన వరములను సులభముగా నొసగే సుగ్రీవ నరసింహుని కొలువరో మొక్కరో!

స్థంభములో పుట్టి హిరణ్యకశిపుని సంహరించి, ఆకసాన దేవతలందరికీ అభయమునిచ్చి, లక్ష్మీదేవిని తన తొడపై నుంచుకొని మాటలాడే అంబుజాక్షుడయిన నరహరిని కొలువరో!
వివిధరకములైన ఆభరణములను ఉన్నతముగా ధరించి, ప్రేమతో ప్రహ్లాదుని అనునయించి, మానవులందరి కోర్కెలు తీర్చి ఆనందముగా నున్ననరహరిని సేవించరో!
అమిత ప్రతాపముతో మించిన కాంతులతో గొప్ప మహిమలతో అలరుచూ, చక్కగా శ్రీ వెంకటాద్రి మీద నెలకొని చక్కదనములకెల్లా చక్కనైన నరహరిని కొలువరో!

Friday 1 July 2016

కటకటా యిటుచేసె గర్మబాధ - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
పల్లవి: కటకటా యిటుచేసెఁ గర్మబాధ
యెటువంటివారికిని నెడయ దీబాధ
చ.1: దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ
తనుపోషణములు కందర్పబాధ
మనసుశాంతికి సదా మమకారములబాధ
తనివోనికోర్కులకు దైవగతిబాధ
చ.2: వెడయాసచూపులకు వేడుకలచే బాధ
కడువేడ్కలకు వియోగములబాధ
తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ
జడియుఁబరచింతలకు సంసారబాధ
చ.3: అరిది నిశ్చయమతికి ననుమానములబాధ
సరిలేని జీవులకు జన్మబాధ
తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-
వెరవుచేతనె కాని వీడ దీబాధ (రేకు: 0039-03సం: 01-239)
భావం: కటకటా! ఎటువంటి వారికైనా చేసుకున్న కర్మఫలము తొలగిపోని బాధ కదా!
ప్రతిదినము ప్రాణులకు విషయములపట్ల కుతూహలముచే బాధ. ప్రీతితో పెంచి పోషించిన తనువుకి మన్మధుని వల్ల కామ బాధ. మనసు శాంతికి ఎప్పటికీ మమకారముల బాధ. తనివితీరని ఆశలకు దైవగతి బాధ.
విచ్చలవిడి ఆశలకు ఎన్నో రకాలయిన వేడుకల బాధ. ఆ వేడుకలు తీరక వియోగముల బాధ. ఎన్నో తెలిసిన జ్ఞానులకు కొన్ని పాప బుద్ధుల బాధ. పరచింతలకు భయపడే వారికి సంసార బాధ.
ఎంత నిశ్చల మనసు గలవారికైనా అనుమానముల బాధ. జీవితం సరిగాలేనివారికి జన్మమే బాధ. ఆ తిరువేంకటాద్రీశుని మనసారా కొలిచితే కాని ఈ భాధలనుంచి విముక్తి దొరకదు అని అన్నమయ్య ఈ కీర్తనలో విశదీకరించాడు.