Sunday 29 July 2018

అదె ఎవ్వతె, తాను అలమేల్మంగను నేను పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని.- అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

అదె ఎవ్వతె,  తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని. !!

పొలఁతి నీకెవ్వతె బుధ్ధులు చెప్పినది
నలువున నా పతితో నవ్వుమంటాను
తెలుపఁగదవె  దాని దీమసమెంతో
చలములు నీతో మరి సాధించేఁగాని !!

నీ కెవ్వతె ఈ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సొలయుమని
నాకుఁ జూపవే దాని విన్నాణమెంతో
మైకొని నీతో మరి మాటలాఁడేఁగాని !!

వోడక యెవ్వతె నీకీ ఉపదేశమిచ్చినది?
యీడనా శ్రీ వేంకటేశు నెనయుమని
వాడలోనెంచవే దాని వాసి యెంతో ఈతడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని. !!

భావమాథుర్యం..
అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార సంకీర్తనలో రోషావేశపరవశురాలైన అలమేలుమంగా దేవి తన చెలికత్తెతో యెంత దురుసుగా, పరుషమైన మాటలను ప్రయోగిస్తున్నదో చూడండి. ఎంత అమ్మవారు అయినా  తనపతి మదిని మరో స్త్రీ దోచుకున్నదనితెలిసినా, లేక ఇంకో స్త్రీ తనపతిపై మనసుపడిందని తెలిసినా కట్టుకున్న ఇల్లాలి మనసు ఎలా కుతకుతలాడుతుందో అతి సహజంగా అన్నమయ్య వివరించాడు. ఎవరెన్ని వేషాలు వేసినా ఎంతగా మనసుపడినా భార్య విలువ భార్యదే అని స్పష్టంగా తెలియజేసాడు.
అది ఎవ్వరే, నేను అలమేల్మంగను. కోరిన నా స్వామి అర్ధాంగిని, హృదయవాసినిని. నీవు నా స్వామి రహస్యాలను దాచుకున్నావని నాకు ముందే తెలుసు. నీ గడుసుదనాన్ని మెచ్చుకున్నా కానీ తాను ఎవ్వరో దాచకుండా చెప్పమనవే!
ఓ పొలతీ! నీ కెవ్వతె ఈ బుధ్ధులు నూరిపోస్తున్నదే? నా పతితో నవ్వుతూ ఊసులాడమని దాని కెవరు చెప్పారే? దాని ధీమసమేమిటో అంతు చిక్కడం లేదే? నా పట్టుదలలు నీకు తెలుసుగా.. నేను అదెవ్వరో సాధించి తీరుతాను.
ఏమే! ఈ చేష్టలన్నీ నీకెవతె నేర్పుతున్నాదే? నా రమణుని బాగుగా పరవశింపజేయుమని దానికెవరు బోధిస్తున్నారే? దానిని నాకు చూపవే. దాని జాణతనమేంటో చూస్తాను. నా చెలికత్తెవైన నిన్ను లొంగదీసుకుని మాట్లాడుతున్నదే? దాని సంగతేమిటి?
ఓ చెలీ! వెనుదీయక యెవతె నీకివన్నీ ఉపదేశిస్తోంది? ఇక్కడ తిరుమలలో నా వెంకటేశ్వరుని సంగమించమని ఎవరు నూరిపోస్తున్నారు దానికి? వాడలో దానికేమి పేరు, ప్రతిష్ఠ ఉంటాయే? నీవీ గుట్లు చెప్తున్నావే గాని స్వామి అర్ధాంగినైన నన్ను కూడి పరవశింపచేసినాడే.

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద
పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. !!

పడఁతి నీ గుణాలకు పలుమారు మెచ్చి మెచ్చి
వుడివోని సంతోసాన నూలలాడీని,
కడు నీ చక్కఁదనాలు కాంతలతోఁ జెప్పి చెప్పి
వెడఁగుఁ బులకలతో విర్రవీగీని. !!

నేరుపుల మీ చేతలు నెమ్మదిఁ జూచి చూచి
కోరికలు కొనసాగ గుబ్బితిలీని,
కూరిమి తోడుత నీ కొలువులు సేసి సేసి
చేరి నీతో వేడుకలఁ జెలరేఁగీని. !!

సేసవెట్టి నీపై నిదె సెలవులు నవ్వి నవ్వి
ఆశలఁ గాఁగిట నిన్ను నప్పళించీని,
రాసికెక్కి నీవేలఁగా రతుల శ్రీ వేంకటేశ
పోసరించి ఇన్నటాను భోగించీనీ.. !!

భావమాథుర్యం...
అన్నమయ్య స్వామివారి చెలికత్తెవలె భావించుకుని  ఆయన దేవేరికి ఆయనపై గల ఆరాధన, అనురాగం వలపులను వివరిస్తున్నారు.
ప్రభూ! ఇదిగో నీపై ఎంతో ఆరాధన, భక్తి మెండుగా గల అలమేల్మంగ. నీపై ఆవరించి వలపులను కుమ్మరించినదయ్యా!
ఈ పడతి పదే పదే నీ సుగుణాలను మెచ్చి తరగని సంతోషాలలో ఓలలాడినదయ్యా! నీ చక్కదనములను చెలులతో చెప్పి చెప్పి మితిమీరిన పులకరింతలతో విర్రవీగుతున్నదయ్యా!
ప్రభూ నీ చేతల నేర్పునూ, నెమ్మదితనమునూ చూచి చూచి కోరికలు కొనసాగగా అతిశయంతో పరవశించెనయ్యా! అనురాగముతో నీకు సేవ చేసి చేసి నీతో వేడుకలు పంచుకొని చెలరేగినదయ్యా!
నీపై తలంబ్రాలు పోసి, ఆపైన మనోహరమైన చిరునవ్వులు చిలికించి ఆశలతో నీ కౌగిట పరవశించినదయ్యా! గణతకెక్కిన నీ సురతులకు గర్వించి, శ్రీ వెంకటేశ్వరా! అన్ని విధములా ఆ దేవి నిన్ను భోగించెనయ్యా!


కనులు - కవిత

picture courtesy : Sri Ponnada Murty

కనులు - కవిత


వినీలాకాశంలో ఇంద్రధనుస్సుని చూస్తూ అచ్చెరువొందిన కనులు
కొండలనడుమ ఉదయిస్తున్న బాలభాస్కరునిని దర్శించి తరించిన కనులు
ఎగసిపడే కెరటాల విన్యాసాలాకి పులకరించిన కనులు
అరవిరసిన పూబాలల వింతవింత సోయగాలకి మైమరచిన కనులు
ఆలయంలో పరమాత్ముని దివ్యమంగళ దర్శనంతో అరమోడ్పులైన కనులు
పసిపిల్లల ముగ్ధత్వానికి పరవశించిన కనులు
కొండలలో, కోనలలో, ఏరులలో సెలయేరులలో ప్రకృతికాంత
అందాలకి దివ్యానుభూతి చెందిన   కనులు ..
కంటిచూపు కరవై ఈ ఆనందానుభూతులకి దూరమైన కబోది ని చూసి
దుఃఖాశ్రువులతో  నిండెను నా కనులు ..
అప్పుడు .. అప్పుడనిపించింది నాకు .. నా కనులతో ఆ అభాగ్యుడు
ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలని!
ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాయి నా కనులు.
---- పొన్నాడ లక్ష్మి

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? !!

తొలికారు మెరుపులు తోచిపోవు గాక
నెలకొని మింటనవి నిలిచీనా?
పొలతుల వలపులు పొలసి పోవుగాక
కలకాలంబవి కడ తీరీనా? !!

ఎండమావులు చూడ నేరులై పారుగాక
అండకు పోవ దాహమణిగీనా?
నిండినట్టి మోహము నెలతలమదిచూడ
వుండినట్టే వుండుగాక ఊతయ్యీనా? !!

కలలోని సిరులెల్ల కనుకూర్పులే కాక
మెలకువ చూడనవి మెరసీనా?
అలివేణుల మేలు ఆసపాటే కాక
తలపు వేంకటపతి తగిలీనా? !!

లౌకికమైన జీవనంలో ఈ ప్రేమలూ, ఈ పరిచయాలు, ఈ ప్రమాణాలు బహుప్రియమైనవని మనం భ్రమపడుతూ ఉంటాము. కానీ లోతుగా ఆలోచిస్తీ కపటపూరితమైన ఈ కవ్వింపులు ఏవీ కాలపరీక్షకు నిలవలేవు. అదే భావనతో ఆ భక్తశిఖామణి ఈ సంకీర్తనకు శ్రీకారం చుట్టాడు.
ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఈ ప్రమాణాలు ఎంతవరకు నిజం. మనం అనుకునే మాటలన్నీ నిజాలేనా?
తొలకరిలో మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి. కానీ అవి కనీ కనిపించి మాయమౌతాయి. తరుణి ప్రేమ కూడా అటువంటిదే అంటున్నాడు అన్నమయ్య. యౌవనపు పొంగులో కనిపించేవి ఇవన్నీ..ఇలా మనుష్యుల మధ్య కలిగే బంధాలన్నీ పరిమితకాలమే అని ప్రస్ఫుటం చేస్తున్నాడు.
ఎండమావులను చూస్తే అక్కడ నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. తీరా దరికి పోతే నీరుండదు. దాహం తీరదు. నెలతల మీది మోహము కూడా మనసులో మరులు గొలుపుతుంది. మాయ చేస్తుంది.కానీ ఏమాత్రం ప్రియం కలిగించదని అన్నమయ్య చెప్తున్నాడు.
కలలో కనిపించే సిరులు, భోగాలు కల ఉన్నంతవరకు నిజమే అనిపిస్తుంది. కల చెదిరి వాస్తవంలోకి రాగానే మాయమైపోతాయి. అలివేణులపై ఆపేక్ష కూడా అంతేనని అన్నమయ్య అంటున్నాడు. ఆ భ్రమలో శ్రీ వెంకటేశుని పై ఆశ తగలీనా ? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. కాంతా కనకాలపై మోహం భగవంతుని తలపును కూడా దూరం చేస్తుంది. అని అన్నమయ్య కీర్తనలోని అర్ధం పరమార్ధం.

Monday 9 July 2018

అమ్మ





facebook లో'మిథున కవితావేదిక' (మిథున కవితావనం) వారి చిత్రకవిత శీర్షికలో శ్రీ పొన్నాడ మూర్తి గారి చిత్రానికి అహ్వానించిన వచన కవితలకి నా కవితా స్పందన.
ప్రేమానురాగాల నిర్వచనమే అమ్మ,
అమృతం కలిపి అనురాగంతో తినిపించేది అమ్మ,
నాన్నకి పిల్లలకి మధ్య వారధి అమ్మ, 
అలుపు సొలుపులకు ఆలంబన అమ్మ,
కష్టాలను నవ్వుతూ జయించి, ఆనందం మాత్రమే పంచేది అమ్మ,
నిరుపేద బతుకయినా ప్రేమతో ఆకలిదప్పులు తీర్చేది అమ్మ,
కన్నపిల్లలకే కాక వారు కన్నపిల్లలకి కూడా ప్రేమతో
ఊడిగం చేసేది అమ్మ,
తప్పులు చేసినా మందలించి అక్కున చేర్చుకునేది అమ్మ,
అమ్మ చరణ స్పర్శ పిల్లలకు క్షేమదాయకం.
సాటిలేని అమ్మకు
శతకోటి వందనాలు