Monday 1 August 2022

ఇల్లాలే ఆధారం - కధ


'ఇల్లాలే ఆధారం' నా గళంలో నేను చదివిన కధ.ఈ క్రింది facebook లింక్ క్లిక్ చేసి చదవండి.

https://www.facebook.com/memories/?source=bookmark


ధన్యవాదాలు

Monday 11 July 2022

ఆశాజ్యోతి కవిత.

 

ఆశాజ్యోతి - కవిత..

 

గూడు చెదిరిపోయింది, గువ్వ మిగిలిపోయింది

ఆశతోకట్టుకున్న ఆశాసౌధం కూలిపోయింది.

ముక్కలయిన హృదయంతో గువ్వ మిగిలిపోయింది.

కోరి వలచిన వాని వికృత హృదయం చూసి ఆవేదనతో

గువ్వ ఒంటరిగా నలిగిపోయింది.

తన ప్రేమను చూసి లోకం పరిహసిస్తుంటే మౌనంగా తలవంచింది.

తన తెలివి, తన ఓర్మి, తన కష్టం అన్నీ దోచుకోబడి

మానసిక హింసకు గురైన గువ్వ మనసు ఘోషించింది.

అన్యాయం, అక్రమం అని ఎలుగెత్తి చాటాలనుకుంది.

అంతలోనే అంతరంగం మేలుకొంది.

తలవంచకు, తలెత్తి నిలబడు. ఆత్మస్థైర్యంతో

అడుగు ముందుకేయమని ప్రభోదించింది.

నిరాశను పారద్రొలి, నిస్పృహను అణగద్రొక్కి ఆత్మవిశ్వాసంతో

అశాజ్యోతిని చేపట్టి గువ్వ అడుగు ముందుకేసింది.

-- పొన్నాడ లక్ష్మి

బాలల దినోత్సవం.

 

బాలల దినోత్సవం.

 

పితృహీనులై భవిష్యత్తును కోల్పోయిన నిర్భాగ్య బాలలు

మాతృహీనులై ఆకలికడుపుతో ఆక్రోశించే బాలలు

విద్యాహీనులై, వివేక శూన్యులై  నేరస్థులుగా మారిన బాలలు

జీర్ణవస్త్రాలతో, దీన వదనాలతో  ఆశ్రయం కోసం ఎదురుచూసే బాలలు

అంగవిహీనులై పరాన్నభుక్కులుగా మారిన బాలలు

అవమానాలను భరిస్తూ, చీత్కారాలను శిరసావహిస్తున్న బాలలు

అమ్మ నాన్నల లాలనకు దూరమై పాఠశాల వసతి గృహాలలో

                             నిశ్శబ్ధంగా రోదిస్తున్న బాలలు

పొట్టకూటికై  ఎంగిలి పళ్ళాలు, కాఫీ కప్పులు కడుక్కొనే బాలలు.

వీళ్ళా బాలల పండుగ జరుపుకొనేది? వీళ్ళేనా రేపటి భావి పౌరులు?

 

 

మనోవీచిక కవిత

 

మనోవీచిక

 

 

ఆమె  ఊసులు కలిగించును మానసోల్లాసం.

ఆమె నవ్వులు ఎదలో విరిసిన సిరిమల్లెలు

ఆమె లోని ప్రత్యేకత మొగలిరేకు పరిమళం

ఆమె ఉనికి సంపెంగల సువాసన మిళితం.

ఆమె ప్రతి పలుకులో తేనెలొలుకు తియ్యదనం.

ఆమె కళల కాణాచి,  సాటిలేని విదుషీమణి.

ఆమె ప్రతి చర్యా ప్రత్యేకం, అసమానం

ఆమె స్నేహం అద్వితీయం, అపురూపం.

ఆమె సన్నిధిలో అత్యంత ప్రశాంతత.

ఆమె తలపులు మాసిపోని మరువపు సువాసనలు.

ఆమె ఆప్యాయత వెల కట్టలెని పెన్నిధి.

ఆమె అనురాగం తొణికిస్లాడే నవజీవన సారం,

            కలిగించును  నూతనోత్సాహం.

ఆమె సాహచర్యం అత్యంత మాథురీయం.

ఆమె పలకరింపులు హృదయవీణ తంత్రులను

            పలికించే సరిగమలు.

ఆమె నా ప్రియ సఖి, నా నెచ్చెలి.

హరి అవతారమితాడు అన్నమయ్య వ్యాసం

 

హరి అవతారమితడు అన్నమయ్య..

 

ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించిన తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఈ పదకవితాపితామహుడు క్రీ.. 1408 లో జన్మించి 1503 లో స్రీనివాసుని సన్నిధికి చేరినట్లు తెలుస్తూంది. కడప మండలం తాళ్ళపాక గ్రామంలో నారయణసూరి లక్కమాంబలకు జన్మించాడు. బాల్యం లోనే ఒక భజన బృందంతో కలసి తిరుమల చేరి అక్కడే స్థిరనివాసమేర్పరుచుకుని, శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తితో, అనురక్తితో 32,000 సంకీర్తనలను రచించి, ఆడి, పాడి తరించిన మహనీయుడు.

 

అన్నమయ్య రచించిన పదసంకీర్తనలలో 12,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. తాళపత్రాలలో రచింపబడిన ఈ కీర్తనలకు శాశ్వతత్త్వం కలిగించాలని అతని మనుమడు చిన తిరుమలాచార్యుడు రాగిరేకులలో తిరగ రాయించాడు. అయితే రాగి విలువే కాని రాగం విలువ తెలియని పామరులు రాగిరేకులను కరగించి పాత్రలను చేసి వాడుకున్నారు. అలా పోయినవి పోగా మనకు దక్కినవి పన్నెండువేల పద కీర్తనలు మాత్రమే

 

తెలుగులో పదకవితకు ఏమాత్రం స్థానం లేని ఆ రోజుల్లో పదకవితకు ప్రత్యేకతనూ, విశిష్ఠతనూ ఏర్పరిచిన ఆద్యుడు అన్నమయ్య. తదనంతరం ఎందరో కవులు పదకవితను సుసంపన్నం చేసిన మాట వాస్తవమే అయినా అన్నమయ్య పదకవితా మార్గానికి వేసిన రాచబాటలు వారందరి సుఖప్రయాణానికి మార్గదర్శకములయ్యాయి.

 

పద కవులలో అన్నమయ్యకు ఒక ప్రత్యేక స్థానముంది. పద్యకవితతో సమాన గౌరవం పదకవితకు ఆపాదించాడు. సరసహృదయులను అలరించడానికి, రసజ్ఞుల మెప్పు పొందడానికి, భక్తి శ్రింగార, వైరాగ్య, ఆధ్యాత్మిక సంకీర్త్నలను ఎన్నో పద్యసాహిత్యంతోనే రచించి అందరినీ అలరించాడు. ఆయన పదకవిత్వం ఇతర కవుల పద్యకవిత్వానికి ఏమాత్రం తీసిపోవు.‘వాక్యం రసాత్మక కావ్యంఅన్న లోకోక్తికి చక్కటి నిదర్శనం అన్నమయ్య ప్రతి పదమూ.. ఏ సంకీర్తన పరిశీలించినా అన్నమయ్య భావనా మాథుర్యం, ప్రతిభా, సాహిత్య పరిజ్ఞానం గోచరిస్తాయి.  ఈ రచనావ్యాసాంగం కోసం ఆయన ఎక్కడా కష్టపడినట్లు కనిపించదు. అవి వాటికవే అన్నమయ్య పద కవితలలో అలవోకగా వచ్చి చేరినట్లు స్పష్టమౌతూంది.

 

అన్నమయ్య స్వామిని కమ్మరిగా, కుమ్మరిగా, సాలెవానిగా, జూదమాడేవానిగా ఇలా ఎన్నో వ్బిభిన్న రూపాలలొ దర్శించుకున్నాడు. ఒక కీర్తనలో భూతంగా కూడ అభివర్ణిస్తాడు. జానపదుల వాడుక భాషకు కూడా సాహిత్య గౌరవం కలిగించాడు. సామెతలు, జాతీయాలు, నానుడులు, నూతన పద బంధాలు మొదలయినవాటిని తన కీర్తనలలో

ప్రవేశపెట్టాడు. అన్నమయ్య భావనా సౌందర్యానికి, ప్రతిభా సంపన్నతకూ  ఆయన రచించిన పదాలన్నీ ఉదాహరణలే.. అన్నమయ్య ఆంధ్రసాహిత్యంలో అపూర్వమైన అనితరసాధ్యమైన కొత్తపోకడలు ప్రవేశపెట్టాడు.

 

పద్య సంప్దతో మాత్రమే పరిఢవిల్లే ఆంధ్ర సాహిత్యానికి పద సంపద కూడా సమకూర్చి తెలుగు భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేసాడు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకుందుకి అనువుగా మంగళహారతులు, లాలి పాటలు ,జోలపాటలు, దరువులు మొదలనవి ఎన్నో రచించిన ఆద్యుడు కూడా అన్నమయ్యే.. అన్నమయ్య గొప్ప సంఘ సంస్కర్త కూడా.. జాతి కుల,మత భేదాలుండ రాదని తన కీర్తనలద్వారా బోధించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. స్త్రీల వ్యక్తిత్వానికి, భావాలకీ ప్రాముఖ్యం ఇవ్వాలని ఉద్ఘాటించాడు.

 

మొత్తం మీద తన జీవితకాలంలో 32,000 సంకీర్తనలని, ద్విపద రామాయణం, శృంగార మంజరి, వేంకటాచల మహత్మ్యం, సంకీర్తనా లక్షణ గ్రంథం  ఇలా ఎన్నో రచనలు చేసిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు(1503) స్రీనివాసునిలో ఐక్యమయ్యాడు. తెలుగు వారికి  తరగని సాహితీ సంపదని అందించాడు.     ఓం నమో వేంకటేశాయ.

Saturday 9 July 2022

గరికపాటి వారి ఉపన్యాసం.

 

శ్రీయుతులు గరికపాటి నరసింహారావుగారి ఆధ్యాత్మిక వ్యాస సంపుటిలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

రామాయణంలో యుధ్ధకాండలో రావణవధ అయిపోయాక విభీషణుడు వచ్చి తన అన్నగారి పార్ధివ దేహాన్ని అప్పగిస్తే రాక్షసుల వంశాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించుకొంటామని చెప్పి శ్రీరాముని అనుమతి కోరాడు. అప్పుడు మర్యాదాపురుషోత్తముడైన రాముని సమాధానం చూడండి.

"మరణాంతాని వైరాణి, నిర్వుత్తం నః ప్రయోజనం

క్రియతమధ్య సంస్కారః మమాప్యేష యథా తవ"

"ఓ విభీషణా! ఎంతటి శత్రుత్వమైనా చావుతో ముగిసిపోవాలి. సీతాసంరక్షణం కోసం సంధి కుదరక ఈ యుధ్ధం చేయవలసి వచ్చింది కానీ ఈ జననష్టం నా కిష్టం లేదు. మీ అన్నగారి పార్ధివ దేహానికి మీ ఆచారం ప్రకారం దహనసంస్కారాలు నడిపించు. ఇకనుండి ఈ పెద్దమనిషి నీకే కాదు, నాకూ అన్నగారే"

భార్యను ఎత్తుకుపోయినవాడి మీద ఎవరికైనా ఎంత కక్ష ఉంటుంది? అటువంటి కోపతాపాలన్నీ మరిచిపోయి ధర్మబధ్ధంగా, బాధ్యతాయుతంగా మాట్లాడటం ఆ శ్రీరామునికే చెల్లింది. అందుకే ఆయన దేవుడయ్యాడు.

ఈ దేవుడే, ఈ రాముడే ఇన్ని వేల ఏళ్ళుగా ఈ జాతికి స్ఫూర్తిమూర్తిగా నిలిచాడు. నిన్న మొన్నటి కార్గిల్ యుధ్ధంలో కూడా రామాయణంలోని ఈ ఘట్టమే మార్గదర్శనం చేసి భారతీయుల జీవనాదర్శాలు అంత మహోన్నతంగా ఉంటాయని యావత్ప్రపంచానికీ చాటి చెప్పింది.

కార్గిల్ యుధ్ధంలో మన సైనికులు పాకిస్థాన్ వారికి చిక్కితే క్రూరాతిక్రూరంగా చిత్రహింసలు పెట్టి, నీచాతి నీచంగా కళ్ళు, చెవులు, మోకాళ్ళు చెక్కేసి శవాలను మన సరిహద్దు వైపు త్రోసేసారు. అదేసమయంలో వారి సైనికులు కొందరు మనవారి చేతుల్లో మరణించారు. ఆ శవాలను పెట్టెలో పెట్టి వారికి అప్పగిస్తే ఆశ్చర్యకరంగా తీసుకొందుకు నిరాకరించారు. చనిపోయిన సైనికుల గురించి ఆ దేశ నాయకులకు చింత ఉండదన్నమాట. అప్పటి ప్రధాని వాజ్పాయ్ ని ఏం చెయ్యాలని మన సైన్యాధిపతులు సంప్రదించారు. భారతీయ సంస్కారం మూర్తీభవించిన అటల్ బిహారి వెంటనే రామయణంలో యుధ్ధకాండలోని 'మరణాంతాని వైరాని' అనే (పైనుదహరించిన) శ్లోకాన్ని చదివి ఇలా అన్నారుట. ఏ దేశం తరపున పోరాడినా సైనికుడు సైనికుడే. రాజకీయ నాయకత్వంలో అహంకారాలవల్ల యుధ్ధాలు జరుగుతుంటాయి. దానికి సైనికులను నిందించకూడదు. వీరుడి భౌతిక దేహాన్ని కూడా వీరొచితంగానే గౌరవించాలి. వారి శవాలకి ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం వారి మౌల్వీల సమక్షంలో ఖనన సంస్కారాలు జరిపించండి. అని ఆదేశించారట. అప్పట్లో వార్తాపత్రికలు ఈ విషయాన్ని ప్రచురిస్తే ప్రతి భారతీయుని కళ్లు చెమర్చి భక్తిగా రామునికి, వాజ్పాయ్ కి నమస్కరించాయి. ఇదీ రామాయణ

పక్షపాతం.

పక్షపాతం

కొందరిపై అత్యంత దయమరికొందరిపై అంతులేని నిర్దయ.

అడక్కుండానే వరాలు గుప్పిస్తావు కొందరికి,

ఆర్తితోఆవేదనతో అర్ధించినా ఆదుకోవు కొందరిని.

అబలల ఆక్రందనలని అసలు వినిపించుకోవెందుచేత?

పాపపుణ్యమెరుగని పసికందులని కాలరాచే కామాంధులని దండించవు.

నువ్వూ పురుషుడివేగానీ జాతి మీద అంత మమకారమా!

 పాపచింతనలేని వారిని కష్టాల మడుగులో ముంచుతావు,

గతజన్మ పాపమని అనుభవించమంటావుఏంటయ్యా నీ లీల?

దుష్టశిక్షకుడవని బిరుదాంకితుడవుకరకు కసాయివారిని శిక్షించలేవా?

అందరూ నీ బిడ్డలేగా మరి ఇంత పక్షపాతమా?

పిడికెడు ఆనందం లభించే తరుణంలో కడివెడు విషాదాన్నికుమ్మరిస్తావు.

జగన్నాటకసూత్రధారివిబిడ్డల అగచాట్లు నీకు వినోద లీలలా?

జగద్రక్షకుడివి నీకే ఇంత పక్షపాతమైతే సామాన్య  మానవులం మేమెంత?

ఇన్ని బిరుదులను పొందిన నీవు మౌనం వహిస్తే ఏమనుకోవాలీ?

 

నాన్నగారి స్మృతులు పక్షపాతం

 పక్షపాతం

కొందరిపై అత్యంత దయమరికొందరిపై అంతులేని నిర్దయ.

అడక్కుండానే వరాలు గుప్పిస్తావు కొందరికి,

ఆర్తితోఆవేదనతో అర్ధించినా ఆదుకోవు కొందరిని.

అబలల ఆక్రందనలని అసలు వినిపించుకోవెందుచేత?

పాపపుణ్యమెరుగని పసికందులని కాలరాచే కామాంధులని దండించవు.

నువ్వూ పురుషుడివేగానీ జాతి మీద అంత మమకారమా!

 పాపచింతనలేని వారిని కష్టాల మడుగులో ముంచుతావు,

గతజన్మ పాపమని అనుభవించమంటావుఏంటయ్యా నీ లీల?

దుష్టశిక్షకుడవని బిరుదాంకితుడవుకరకు కసాయివారిని శిక్షించలేవా?

అందరూ నీ బిడ్డలేగా మరి ఇంత పక్షపాతమా?

పిడికెడు ఆనందం లభించే తరుణంలో కడివెడు విషాదాన్నికుమ్మరిస్తావు.

జగన్నాటకసూత్రధారివిబిడ్డల అగచాట్లు నీకు వినోద లీలలా?

జగద్రక్షకుడివి నీకే ఇంత పక్షపాతమైతే సామాన్య  మానవులం మేమెంత?

ఇన్ని బిరుదులను పొందిన నీవు మౌనం వహిస్తే ఏమనుకోవాలీ?

 

 

స్వల్పకాలం మాత్రమే నాన్నగారితొ గడిపిన బాల్యస్మృతులు.

 

నాన్నగారండి” అని నేను పిలిస్తే నా ఆలోచన కనిపెట్టి అదే పంథాలో

 “ఏం నాన్నగారండి ఏమి కావాలి” అని మందహాసంతో అడిగేవారు.

 

 “నాన్నగారూ మరెమో ఇవాళ ఆదివారం కదండీసాయంకాలం బీచ్ కి  తీసుకెల్తారా?. నా స్నేహితులంతా వస్తారుటఅని గారంగా అడిగేసరికిఅలాగేనమ్మా.. ఎండ తగ్గాకవెల్దాం నీ స్నేహితులకి కూడా చెప్పుఅని సంతోషంగా ఒప్పుకునేవారుసాయంత్రం మమ్మల్ని బీచ్ కి తీసుకివెళ్ళి కాసేపు కెరటాలతో ఆడుకోనిచ్చితరువాత మంచి మంచి విషయాలు చెప్పిపాటలు పాడించి ఇంటికి తీసుకొచ్చేవారు.

 

దసరాలకి బొమ్మలకొలువులు పెట్టుకునేవారంరకరకాల బొమ్మలు మాతో మెట్లమీద అలంకరింపచేసిచుట్టూ పార్క్ లు కొండలుగుడిసెలు అట్టలతోకాయితాలతో అన్నీ తాను అమర్చేవారుదీపావళికి మందుగుండు సామాను విడివిడిగా తెచ్చి అవన్నీ కలగలిపిమతాబాలు చిచ్చుబుడ్లు మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసేవారుఎంత సరదాగా ఉండేదో..

 

మావిడికాయల కాలంలో దగ్గర ఉన్న కొత్తవలసకి (అక్కడ సంతలో మంచి కాయలు చవకగా దొరుకుతాయి) నాన్నగారితో పాటు వెళ్ళి ఊరగాయలకి రెండుబుట్టల కాయలుపళ్ళకోసం రెండుబుట్టల కాయలు కొనుక్కుని రైలుబండి లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.

 

పాఠశాలలు తెరిచాక కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడంఅందంగా నా పేరు వాటి మీద రాయడం అన్నీ నాన్నగారేనాకు అన్నీ నేర్పిస్తూ మధ్య మధ్య మంచి కథలూ కబుర్లూ చెప్తూ పని పూర్తిచేసేవారు.

 

వీధి జాఫిరీ లో కూచొని కొత్త పాట పాడుకుంటూంటే విని “ ఈపాట ఎప్పుడు నేర్చుకున్నావమ్మాచాలా బాగుంది అని మెచ్చుకునే నాన్నగారుఎప్పుడూ ఆయన చేత దెబ్బలు కానీచివాట్లు కానీ తిని ఎరగనుఒక్క చదువు విషయంలో మాత్రం ఎప్పుడైన కోప్పడేవారునన్ను చెల్లినీ మా మామ్మ దగ్గిర  వదిలేసి సెకండ్ షో సినిమాకి అమ్మ నాన్నగారు వెళ్ళిపోతే మర్నాడు అలిగి కూర్చునే దాన్నిఅప్పుడు దగ్గిరకి తీసుకుని ఆ సినీమా ఏడుపు సినిమా అమ్మాఒక్క  మంచి పాట కూడా లేదునీకు పాటలంటే ఇష్టం కదా.. మంచి పాటల సినిమా మాయాబజార్ వచ్చిందిదాని నిండా పాటలే దానికి తప్పకుండా వెళ్దాము అని అనునయించేవారుమంచి సినిమాలు చాలా చూపించారు కూడా..

 

ఇంట్లోనే కాదు అటు ఆఫీస్ లోనూఇటు బంధువర్గంలో అందరిదగ్గరా మహనీయులే మా నాన్నగారుభీముడు బాబాయ్భీముడు మావయ్యభీముడన్నయ్య ఇలా అందరి నోళ్ళలోనూ ఆయన పేరే.. మా అమ్మయికి 1987 లో రైల్వే DRM ఆఫిస్ వైజాగ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకి ఒక పెద్దాయన దాని సీట్ దగ్గరికి వచ్చి, “నువ్వు భీమేశ్వరరావు మనవరాలివా అమ్మా అని అడిగారుమీ తాతగారిలాగే మంచి పేరు తెచ్చుకోమ్మా.. అంతటి నిజాయితీపరుడుశాంతమూర్తి మీ తాతగారవడం నీ భాగ్యం తల్లీ”  అని ఆశీర్వదించి వెళ్ళారుట. ఎవరి తండ్రి వారికి గొప్పే కావొచ్చు. పురుషులందు పుణ్య పురుషుడు మా నాన్నగారు మంచి మనిషి మా నాన్నగారిని చిన్నతనంలోనే   కోల్పోవడం మా దురదృష్టం.

 

ఉన్న కొద్ది రోజులూ అన్నీ మథురస్మృతులేఅల్పాయుష్యుతో బ్లెడ్ కాన్సెర్ మహమ్మరితో నా 13వ యేట మమ్మల్ని అంధకారం లో ముంచి వెళ్ళిపోయారు.