Wednesday 24 June 2015

మహాకవి పోతన



మహాకవి పోతన:

రాజుకాని మహారాజు, రాజ్యంలేని కవిరాజు, రాజభోగాలు ఆశించని రాజరాజు, ఆడంబరాలకూ, అహంకారాలకూ త్రోసిరాజు మన బమ్మెర పోతరాజు.

“ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరే! అదేమి చిత్రమో
 పోతన యన్నచో కరిగిపోవు నెడంద; జోహారు సేతకై
 చేతులు లేచు; ఈ జనవశీకారణాద్భుతశక్తి చూడగా
 నాతని పేరులో గలదో! ఆయన భాగవతాన నున్నదో!”

“విద్యావతాం భాగవతే పరీక్షా” అనే కొమ్ములు తిరిగిన పండితులకు కూడా “కొరకరాని కొయ్య”అయినా సంస్కృత భాగవతం సహజ పాండిత్యుని హస్త స్పర్శతో “బాలరసాలం” గా పరిణమించి, పల్లవించి, పుష్పించి, ఫలించి ఆబాలగోపాలానికీ రసానందాన్ని అందించింది.

కవిత్వమనే పాలల్లో భక్తి అనే పంచదార కలిపి భాగావత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృత హస్తం పోతనగారిది. ఆయన కావ్యకన్యక తెలుగువారి గుండెల్లో “మందార మకరందాలు” చిందించింది. తెలుగు జాతిని “నిర్మల మందాకినీ వీచికల్లో” ఓలలాడించింది.

పోతనగారు మనలో ఎంతగానో కలసిపోయారు. మనసులో, మాటలో, పాటలో, పద్యంలో నుడికారాలలో, ఆచారాలలో వెలుగులా  వెన్నెలలా మలయమారుతంలా కలిసిపోయారు. తెలుగువారి నిత్యజీవితాలలో, నిండుహృదయాలలో, ఉచ్చ్వాస నిశ్వాసాలలో ఆ మహాకవి నిండి ఉన్నారు.

ఉదయభానుని కిరణాలలో, యదుకిశోరుని మృదుచరణాలలో చల్లలమ్మే గొల్లభామల్లో, విలుపట్టిన సత్యభామలో, వల్ల వాంగనల వలపుల్లో, పిల్లనగ్రోవి పిలుపుల్లో ఆ మహాకవి కనిపిస్తాడు, వినిపిస్తాడు.. ”ఆహా” అనిపిస్తాడు.

సేకరణ “ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన పోతన భాగవతం (ప్రవేశిక)”
- పొన్నాడ లక్ష్మి

Friday 19 June 2015

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే - అన్నమయ్య కీర్తన





ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
..
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన .. చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార .. వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
..
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి .. తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార .. వొచ్చెలి వాపోవువాని నూరడించరే
..
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని .. చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన .. తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే

భావం:
శ్రీ కృష్ణుని అల్లరి పనులు, ఆగడాలు మనకు తెలియనివి కావు. ఏమీ ఎరగనట్లు చేసేవన్నీ చేసి అమ్మ దగ్గిర గారాలు పోవడం కూడా వింత ఏమీకాదు. అదే ఈకీర్తనలో అన్నమయ్య మనకు చెప్తున్నాడు.
          ముద్దులు కురిపించే ఇటువంటి బాలుడు ఎక్కడ ఉన్నాడో ? వానిని పట్టి తీసుకువచ్చి కడుపునిండా పాలు పొయ్యమని యశోదమ్మ చెప్తూంది.
          అల్లరిచేసి కట్లు తెంచుకుని వచ్చి కాగుతున్న వెన్నలలో చేమంతిపూల కడియాల చెయ్యిపెట్టి, చిర చిరలాడుతున్న చెయ్యిని చూపించి “చీమలు కుట్టేసాయమ్మా!” అని చెక్కిళ్ళ నిండా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న ఆ చిన్ని బాలుని కాస్త ఓదార్చమని చెప్తూంది ఆ పిచ్చితల్లి.
          దొంగలాగా వచ్చి తన బంగారుమురువులు తొడిగిన చేయిని కవ్వంతో చిలుకుతున్న పెరుగులో పెట్టి ఆ కవ్వముతాకిడికి  “అబ్బా! నొప్పెడుతున్నాదమ్మా!”  అని చెయ్యి బయటికి తీసి నోరంతా చొల్లు కార్చుకుంటూ వాపోవు వానిని ఊరడించమని అంటున్నది.
          ఎప్పుడు వచ్చేడో, మాఇంట్లో జొరబడి పెట్టిలోన ఉన్న వాటికోసం తన ఉంగరాల చేయి పెట్టాడు. మనందరికీ తండ్రి అయిన  వేంకటేశ్వరుడు శక్తిమంతుడు కావున ఆ పెట్టి అతని తలమీదకి ఎత్తమని చెప్తూంది.
          శ్రీ వేంకటేశ్వరుడు అన్ని విధములయిన శక్తియుక్తులు కలవాడు కావున మన బరువు బాధ్యతలున్న పెట్టిని అతని తలపై పెట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చని అన్నమయ్య అభిప్రాయమేమో.        
(పొన్నాడ లక్ష్మి)

Friday 12 June 2015

దైవము దూరనేల ఎవ్వరూ నేమి సేతురు – మతి వారూ దమవంటి మనుజులే గాక.



13.6.15: ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. దైవము దూరనేల  ఎవ్వరూ నేమి సేతురు – మతి వారూ దమవంటి మనుజులే గాక.
చ. చేరి మేలు సేయగీడు సేయ నెవ్వరు గర్తలు – ధారుణిలో నరులకు దైవమే గాక
    సారె దన వెంటవెంట జనుదెంచె వారెవ్వరు బోరున జేసిన పాపపుణ్యాలే కాక!
2.  తొడగి పొడిగించను దూషించ ముఖ్యులెవ్వరు – గుడిగొన్న తనలోని గుణాలే గాక,
     కడుగీర్తి నపకీర్తి గట్టెడి వారెవ్వరు – నడచేటి తన వర్తనములే కాక!
3.  ఘనబంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు – ననిచిన జ్ఞానాజ్ఞానములే గాక,
     తనకు శ్రీ వేంకటేశు దలపించే వారెవ్వరు – కోన మొదలెరిగిన గురుడే గాక.
భావం:   తమకు చిక్కులెదురైనప్పుడు ఊరక ఇతరులను నిందించుట వలన ప్రయోజనమేమి? తమ విషయములలో ఎవ్వరైన నేమి చేయగలరు? ఆలోచించి చూస్తే వారు కూడా తమవంటి సాధారణ మనుజులే కదా!
          ఇలలో మనుజులకు మేలు చేయుటకైన, కీడు చేయుటకైన దైవమె కర్తగాని ఇతరులెవ్వరును గాదు. తన్ను వదలక వెంటపడి వచ్చునవి తాను వడిగా జేసిన పాపపుణ్యములే గాని పరులేవ్వరు కారు.
          తన్ను చుట్టుముట్టిన గుణదోషములే తన దూషణ భూషణములకు ముఖ్యహేతువు లగుచున్నవి గాని వేరెవ్వరు కారు. తనకు కలిగే కీర్తి అపకీర్తులకు తాను నడుచు నడతలే కారణములు గాని అన్యులు కారు.
          తనకు బంధమైనను. మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానాజ్ఞానములే హేతువులగుచున్నవి గాని తదితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించువాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొక్కడు లేడు.