Tuesday 26 June 2018

అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు -- అన్నమయ్య కీర్తన.



ఈ వారం అన్నమయ్య కీర్తన..
అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పొంగీ సారెకు నా మనసు. !!
పొలసి నిన్నొకమారు పూఁచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీ రూపు దలఁచుకొంటే
వులిపచ్చి చెమటల నోలలాడకుందురా? !!
సముకాన నీతోను సంగతాలు సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోఁక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరుగక ఉండుదురా.. !!
ఈడుజోడై నిన్నుఁ గూడి యెడవాయ కుండితే
వేడుకఁ జొక్కకుందురా వెలఁదులు
ఈడనె శ్రీ వేంకటేశ! యేలితివి నన్ను నిట్టె
ఏడవారూ నీ పొందుల కేఁకరకవుందురా! !!
ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని వశీకరణ శక్తిని కొనియాడుతున్నాడు. ఆ దివ్యమంగళరూపము దర్శనమవగానే మనం కూడా ఒళ్ళు తెలియని పరిస్థితికి లోనౌతాము. స్వామి ఆకర్షణ శక్తి అంతటిది.
స్వామీ! నీవేమో అంత చక్కని వాడవు. దానికితోడు సరసత్వం గల జాణవు. నిన్ను చూసిన ప్రతీసారీ నా మనసు ఉప్పొంగిపోతుంది.
నిన్నొక్కమారు తరచి చూసినవారు వలపు చెందక ఉండగలరా? ఎప్పుడైనా నీ రూపమును నిలువెల్లా ప్రేమతో చూచిన చిరు చెమటలతో మేను చెమర్చక నుండునా?
నీ సముఖానికి వచ్చి నీతో చేరికగా ఉంటే తరుణులకు తన్మయత్వం కలుగదా? ఇరువురి మేనులు తాకుతూ సరసములాడితే వారిలో మమత కలిగి నీ పొందుకోసం తహతహలాడరా?
ఈడుజోడుగా నుండి ఎడబాటు లేక నిన్ను కూడి ఉంటే వెలదులు మైమరచిపోకుందురా? ఓ వేంకటేశ్వరా! నన్నూ నిట్టె ఏలితివి. ఎక్కడివారూ నీ పొందు కోసం ఉవ్విళ్ళూరక ఉండగలరా?

Tuesday 12 June 2018

అన్నమయ్య కీర్తన -- ఊరకే ఉన్నాఁ డితఁడు వోరుపుతోడ

అన్నమయ్య కీర్తన

ఊరకే ఉన్నాఁ డితఁడు వోరుపుతోడ
ఈ రీతి మాటలాడ అరుహమా ఇపుడు? !!

మంతనము లాడెనంటా మగువతో నీవతని
నెంకెంత సేసేవే ఇపుడు నీవు.
వంతులు తప్పక వుండవచ్చీఁ గాక రమణుఁడు
అంతేసి మాటలకు నరహమా ఇతఁడు. !!

అంగనచేతి విడెమాకు నందుకొనే నంటా
యెంగిలి మాటాడకువే యెగసెక్కేన
జంగిలిలో నీ తోడ సరసము నాడీఁగాక
అంగమంటి ఇంత సేయ నరుహమా ఇతఁడు !!

మేడమీదనున్నచెలి మేలమాడి కూడెనంటా
ఆడుకొనేవింతలోన అందరితోడ
వోడక శ్రీ వేంకటేశుఁ డొడివట్టి నిన్నుఁగూడె
ఆడనీడా గేలిసేయ నరుహమా ఇతఁడు. !!

భావం...అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార కీర్తనలో  తాను దేవి చెలికత్తె అయి స్వామి తరుపున ఇలా మాట్లాడుతున్నాడు.
నీ రమణుడు నిన్నేమీ అనటం లేదని ఊరకనే ఉన్నాడని ఇన్ని యెగ్గుల నెంచుతున్నావు. అతను ఓర్మితో ఉన్నాడని నీ చేత ఇన్ని మాటలు పడుటకు అర్హుడా ఇతడు? ఇది నీకు తగిన పనియేనా?
దేవీ! నీ విప్పుడు ఎంతెంత వింత పనులు సేసేవే. ఆ మగువతో మంతనాలాడుతున్నాడని ఇతనిపై నెపము వేస్తున్నావు. ఆమె నీ రమణుడికి వరుస కాకపోవచ్చు. మాట తప్పకుండా నీ దరికి వస్తున్నాడే కదా! కానీ అతనిని అన్ని మాటలు అనవచ్చునా?  దానికతడు అర్హుడేనా?
దేవీ నీ రమణుడు ఆమె చేతి తాంబూలము అందుకొన్నాడని దెప్పిపొడిచి అపభ్రంశపు మాటలనకమ్మా!.అవేమీ పట్టించుకోకుండా నీతో సరసమాడేడని అతని చేయిబట్టి  నిలబెట్టి ఇంత సేయ తగునా? దీనికతడు అర్హుడా?
దేవీ! ఆ మేడలోనున్న చెలి నీ రమణునితో పరాచికములాడి, ఆపై కూడినదని ఇంతలోనే అందరితో చెవినిల్లు కట్టుకొని  మరీ చెబుతున్నావు కానీ ఏమాత్రం నీ మాటలు లెక్కచేయక నిన్ను ఒడిసిపట్టి నిన్ను కూడినాడు. అక్కడా ఇక్కడా నీ రమణుని గేలిసేయ తగునా? ఈ అపనిందలన్నిటికీ స్వామి అర్హుడా?
ఈ కీర్తనలో భర్తపట్ల అనురాగం కల భార్య మనస్సు ఎలా ఉంటుందో చక్కగా వివరించాడు అన్నమయ్య.

అన్నమయ్య కీర్తన. -- అహో సాధు తవాగమనం

అన్నమయ్య కీర్తన.

అహో సాధు తవాగమనం
బహుళ వైభవైః ప్రతివచబైః కిమ్. !!
తతోపసర మిథ్యశఠవచనై
రితస్తవైమన్మ హితం కిమ్
బత మమ దేహాత్ప్రాణ స్తథాపి
గత ఏవై తత్ కారణమిహ కిమ్. !!
సవృతి చేలం జహి చపలత్వం
సంవాదేమే సతతం కిమ్
త్వం వా మమ చిత్తం సాంత్వయసి
కిం వా కురు మమ ఖేలనమిహ కిమ్ !!
అతి భిబేమి భవదాచరణాదిహ
చతుర వేంకటాచలరమణ
సతీం మా మనుసరసి కిమధన్
రతిరాజ విభవ రచనమిదంకిమ్. !!

అన్నమయ్య వినిపిస్తున్న గీర్వాణి సంకీర్తన ఇది. దేవి స్వామితో ఈ విధంగా అంటున్నది.
అహో! నీ రాకయే విశేషము. గొప్ప గొప్ప వైభవములు, ప్రతివచనములతో ఏమి ఫలము?
మిథ్యతో కూడిన మూర్ఖపు వచనములతో నింక తొలగిపొమ్ము. ఇంకా నాకు హితము చేయాలనుకోవడమేమిటి? నా దేహమునుండి ప్రాణము పోతున్నది. దీనికి కారణం ఏమిటో చెప్పు.
చపలమనే వస్త్రం కప్పి ఉంది. దానిని తొలగించు. నాతో ఎల్లప్పుడు సంవాదము చేయుటవల్ల ప్రయోజనమేమి? నీవు నా చిత్తాన్ని ఊరడింపచేయుచున్నావు. నన్ను ఆటపట్టించుట ఏమిటికి?
నీ అచరణము వల్ల ఇక్కడ చాలా భయము చెందుచున్నాను. చతురుడవైన ఓ వేంకటాచలనాథా! భార్యనైన నన్ను అనుసరిస్తున్నదెందులకు?  ఓ రతిరాజ విభుడా! ఈ రచనా నాటకములన్నీ ఎందులకు?

భావమాథుర్యం.  అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.