Saturday 25 May 2019

తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన

ఈ త్రిభువనాలలో శ్రీహరిని మ్రొక్కని వారెవరు? మునులు, ఋషులు నీకై ఎన్నో సంవత్సరములు కఠోర దీక్షతో తపమాచరించారు. కొందరు సప్త ఋషులలో స్థానం సంపాదించారు. కొందరిని రకరకాల పరీక్షలకు గురి చేస్తావు. కొందరిని వెంటనే అక్కున చేర్చుకుని కైవల్యం ప్రసాదిస్తావు. ఏదైనా వారి జన్మ కర్మలు పరిపక్వం కానిదే మోక్షం రాదు గదా స్వామీ! మానవులనే కాదు జగత్తులో ఉన్న అన్ని జంతువుల ఎడ ప్రేమ చూపిస్తావు. నీవు జగత్పాలకుడవు శ్రీనివాసా! అంటూ ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.

కీర్తన:

పల్లవి: తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా ॥పల్లవి॥

చ.1 ధరణీధర మందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁగాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా ॥తగు॥

చ.2 భవహర మురహర భక్తపాపహర
భువన భారహర పురహరా
కవిసిన వురుతను గద్దను మెచ్చితి-
వివల నీదయకు నివియా గురుతు ॥తగు॥

చ.3 శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా ॥తగు॥
(రాగం: ధన్న్యాసి, సం.2. సంకీ.315)


మునులు, ఋషులు ఎన్నో సంవత్సరాలనుండి తపమాచరించగా మోక్షం ప్రసాదించావు. ఆకాశాన్ని ఎత్తగలిగిన, అంటగలిగిన సామర్ధ్యం ఉన్నవారైనా వారి వారి జన్మ కర్మ బంధం పరిపక్వం కానిచో వారికి కైవల్యం ప్రసాదించవు.

ఈ భూమండలాన్ని పాలించే నాధా! మందరపర్వతం ఎత్తినవాడా! అత్యంత అరుదైన కౌస్తుభమనే ఆభరణమును ధరించిన శ్రీధరా! ఏనుగును రక్షించావు. కాకినీ రక్షించావు. నీ కరుణకు పాత్త్రము గాని జీవి ఈ సృష్టిలో ఉన్నదా!

ఓ శ్రీనివాసా! జనన మరణాలు లేనివారిగా చేయగల శక్తియుతుడా! మురాసురుని చంపిన ధీరుడా! ఈ భూమండలంపై ఉన్న జీవుల భారం వహించే వాడా! త్రిపురాసురుని జయించిన వాడా! నీకొరకు తపించిన ఉడుతను, గ్రద్దను మెచ్చి కైవల్యం ఇచ్చావు. నీదయకు గుర్తులు ఇవేనా స్వామీ!

శ్రీవేంకటేశ్వరా! శేషవాహనం పైన శయనిస్తూ, గరుడవాహనం పైనా పయనిస్తూ, ఈ భూమండలానికి అధిపతిగా ఉన్నావు. సకల చరాచర భూతములను రక్షిస్తున్నావు. గోవులను కాచావు. కోతులతో తిరిగావు. నీ పావనమైన కృపకు అన్నీ నోచుకున్నాయి స్వామీ!

విశ్లేషణ: శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య

Saturday 18 May 2019

అంగనకు విరహమే సింగారమాయ - అన్నమయ్య కీర్తన



అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా ॥పల్లవి॥

కలికి నిన్నుఁ దలఁచి గక్కున లోలోఁ గరఁగి
జలజలఁ జెమరించి జలకమాడె
బలుతమకాన నీకుఁ బక్కన నెదురువచ్చి
నిలువునఁ గొప్పువీడి నీలిచీర గప్పెను ॥అంగ॥

సుదతి నిన్నుఁ జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాఁకాఁ బూసె గంధము
మదనమంత్రములైనమాటల మర్మము సోఁకి
ముదురుఁబులకలను ముత్యాలు గట్టెను ॥అంగ॥

గక్కన గాఁగిట నిన్నుఁ గలసి యీమానిని
చొక్కి చంద్రాభరణపుసొమ్ములు వెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలఁబాలు వోసెను ॥అంగ॥

భావం..
ఈ కీర్తనలో అన్నమయ్య అలమేలుమంగమ్మ విరహాన్ని స్వామికి విన్నవిస్తున్నాడు. అలమేలుమంగ కు విరహమే సింగారమయ్యింది.ఇక నీవే చిత్తగించవలనయ్యా..!

నీ అందమైన భార్య నిన్ను మనసులో తలచుకోగానే ఆ వెచ్చని తలపులకు సున్నితమైన శరీరం లోలోపలే కరిగిపోయి, చెమటలు పట్టి ఆ చెమటల్లో స్నానం చేసినట్టుంది. నీపై తమకంతో నీ ఎదురుగా వచ్చేటప్పటికి నిటారుగా పెట్టుకున్న కొప్పును విడదీసి నల్లని పొడవాటి జుట్టుతో తన శరీరమంతా చీరలా కప్పేసింది. (ఆయనంటే సిగ్గు మరి .. మన్మధుని తండ్రి కదా ! ఎలాగూ ఆ కొప్పు కాసేపు పోతే ఉండదని ఆమెకు తెలుసు).

నీ ఆలోచనల్లో ఉండి సుదతి అయిన ఆమె సిగ్గులతో ఎరుపెక్కిన చెక్కిళ్ళపై ఎక్కువగా గంధాన్ని పూసింది. నీ శృంగారపు మాటలలో ఉన్న లోతైన అర్ధాన్ని పసిగట్టి, ఆమె మేను పులకరించి చెమట బిందువులన్నీ ఆమె శరీరమంతా ముత్యాలు పేర్చినట్టుగా ఉంది.

అభిమానం కలిగిన ఆ పడతి వెంటనే నీ కౌగిట్లో కలిసిపోయి, పరవశంతో నీ మెడలో చంద్రాభరణంలా ప్రకాశించింది. ఆపై అలమేలుమంగ నీ ఉరముపైకి చేరి నీపై మురిపంపు సరసాలు అనే తలంబ్రాలు పోసింది

అందుకే పో నీ పై నాశపుట్టి కొలిచేది - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన
అందుకే పో నీ పై నాశపుట్టి కొలిచేది
మందిలిచితి నిక మరి నీ చిత్తం ॥
ఇందరు జెప్పగా వింటి ఎవ్వరికైనా విష్ణుడే
కందువ మోక్ష నియ్య గర్త యనగా,
ముందే వింటి నారదుడు ముంచి నిన్ను బాడగా
పొందుగ లోకములోన బూజ్యుడాయ ననుచు ॥
అప్పటి వింటి లోకము లన్నిటికీ హరియే
కప్పి రక్షకత్వానకు గర్త యనగా,
ఇప్పుడె వింటి ధృవుడు ఇటు నిన్ను నుతించే
ఉప్పతిల్లి పట్టమేలు చున్నాడనుచును ॥
ఇదె వింటి శ్రీ వేంకటేశ బ్రహ్మపు దండ్రివై
కదిసి పుట్టించ దెంచ గర్త ననుచు,
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలో బ్రసిధ్ధుడాయెననుచు ॥
భావం :
దేవా ! నిన్ను భజించిన వారికెందరికో నీవు పూర్వము మేలుచేసితివని విన్నాను. అందువలన నీ సేవ వ్యర్ధము కాదని నమ్మినాను. అందుకే నీపై ఆశపుట్టి నిన్ను సేవించుచున్నాను. నీతో నా నమ్మకమును సవినయముగా మనవి చేసుకునుచున్నాను.
ఇక నీ చిత్తము.
ఎవరికైనను మోక్షమిచ్చుటకు విష్ణుడొక్కడే ముఖ్యకర్త అని ఎందరో చెప్పుచుండగా వింటిని. నారదుడు భక్తితో నీ నామములు కీర్తించి లోకములో పూజ్యుడైనాడని ముందే వింటిని.
లోకముల్లనిటికీ శ్రీ హరియే రక్షణ చేకూర్చు కర్త. గాని ఇతరులు కారని అప్పుడే వింటిని. ధృవుడు నిన్ను స్తుతించియే మహోన్నతుడై శాశ్వతమైన పట్టమును ఏలుచున్నాడని ఇప్పుడే వింటిని.
శ్రీవేంకటేశ్వరా ! నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రివై లోకములను పుట్టించుటకును పోషించుటకును ముఖ్య కర్తవుగా
ఉన్నావని ఇదిగో ఇప్పుడే వింటిని. అంతేకాదు, వాల్మీకి మహర్షి నీ మీద కావ్యము చెప్పి ఆదిమునీంద్రులలో అగ్రేసురుడైనాడని కూడా వింటిని

వ్యాఖ్యాత : సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మనయ్య

Sunday 5 May 2019

వెరపించబోయి తానే వెరె దల్లియశోద - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన.

వెరపించబోయి తానే వెరె దల్లియశోద
వరచి బాలునెట్టు మాని సెంటా నుండెనో..                     !!

వెంటరాకుమని కృష్ణు వెరపించి యసోద
వొంటి మందలో గొంగ ఉన్నాడనె
అంటి గొంగ ఎందున్నాడని నోరు దెరిచితే
వెంటలై బ్రహ్మాండాలు పెక్కుగానవచ్చెను.                          !!

చందమామ బాడి తల్లి సరి బొత్తుకు రమ్మంటే
చందురు జూచి కృష్ణుడు సన్నసేసెను.
ముందర జంద్రుడు వచ్చి మొక్కితే యశోద చూచి
ముందేలా యంటినోయని ముంచి విరగంగెను.        !!

పాలార్చి తొట్టెలలో బండబెట్టి యశోద
నీలవర్ణు దొంగిచూసె నిద్దురోయని
ఓయి శంకచక్రాలతో నురము శ్రీసతితోడ
ఈలీల శ్రీ వేంకటేశుడై విన్నాడు.                        !!

ఈ కీర్తనలో బాలకృష్ణుని అద్భుతచర్యలు, ఆగడాలు అన్నమయ్య వర్ణిస్తున్నాడు. బాలకృష్ణుని చేష్టలు ఆశ్చర్య జనకాలు, ఆనందదాయకాలు. ఇవి ఎప్పటికప్పుడు క్రొత్తగా కనిపిస్తాయి.
పిచ్చి యశోద బాలకృష్ణుని మభ్యపెట్టబొయి తానే మాయలో పడి అయోమయ స్థితిలోకి చేరిపోతుంది. ఈ బాలుడు మనిషిలా ఎలా ఉన్నాడో అనుకుని ఆశ్చర్యపోయింది.
నావెంట ఆవులమందలోకి రాకు, మందలో దొంగ ఉన్నాడని కృష్ణుని భయపరచింది. అప్పుడు కృష్ణుడు దొంగ ఎక్కడున్నాడమ్మా అని నోరు తెరిచెతే బ్రహ్మాడాలు కానవచ్చెను.
యశోద బాలకృష్ణునికి గోరుముద్దలు తినిపిస్తూ “చందమామ రావే జాబిల్లి రావే” అని పాడుతూ సరిపొత్తుకు చందమామని పిలిచింది. అప్పుడు కృష్ణుడు చందమామని చూసి చిలిపిగా సైగ చేసాడు. చంద్రుడు దిగి వారి ముందు వ్రాలాడు. యశోద ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి.
పొట్టనిండా పాలుపట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి యశోద ఊయల ఊచి ఊచి నీలవర్ణుడు నిద్రపోయాడేమో అని తొంచి చూసింది. అప్పుడు శంకచక్రాలతో, ఉరముపై శ్రీ సతితో ఈ లీల శ్రీ వేంకటేశుడై దర్శనమిచ్చాడు. మళ్ళీ ఆశ్చర్యపోవడం యశోద వంతయ్యింది.