Sunday 19 April 2020

ఇందిర వడ్డించ అన్నమయ్య కీర్తన..

ఇందిర వడ్డించ యింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులను
సక్కెర రాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామీ
మీరిన కెళంగు మిరియపు తాళింపు
గూరలు కమ్మని కురలను
సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే
కూరిమితో చేకొనవే స్వామీ
పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాకాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరిదివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ

శ్రీ వేంకటాచలపతికి ఆరగింపు సేవ సంకీర్తన ఇది. ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి విస్తరిలో వడ్డిసుందిట. ప్రక్కనే నిలబడి అన్నమయ్య ఇలా అంటున్నాడు.
చూడముచ్చటగా మా ఇందిరా దేవి వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామీ!
అక్కళ అనే ధాన్యంతో చేసిన పాయసాలు, అప్పాలు, రుచికరపైన పేణులు, వడలు, చక్కెరతో చేసిన తీపి పదార్ధాలు, కరువుతీరా ఆరగించవయ్య!
మిరియాల తాళింపు వేసిన్ కమ్మని కూరలు, రుచికరమైన పచ్చళ్ళు, ఇష్టంతో ఆరగించవయ్యా!
పిండివంటలు, కమ్మటి పెరుగు, పాలు, రుచికరమైన పాకాలు, రకరకాల దివ్యాన్నాలు ఎంతైన మెచ్చుకుంటూ ఓ వేంకటేశ్వరా! కడుపునిండా ఆరగించవయ్యా!..
మూడు చరణాలలో స్వామి వారికి నివేదించిన వంటకాల పట్టికను అందించాడు అన్నమయ్య!
చారిత్రక దృష్టితో పరిశీలిస్తే 15వ శతాబ్ధంలో ఈ వంటకాలు స్వామికి నిత్యం నివేదించేవారేమో!