Friday 16 November 2018

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. - అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!

సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!

తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!

చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!

భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన  నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.



ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము, - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము,
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మా తరములా.. !!

సకలలోకవాసనాయక శౌరి మురహరి నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చవటంచును
వికటముగ నిన్నుఁ గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరుఁ దెరచిన యందు లోకములుండెను. !!

శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసికెక్కెను బండి రొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాతాలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు. !!

నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసు లిదె నీ విద్యలెల్లా జూచిరి
సుముఖులైకరిశబరిబలియును శుకధృవాదులు నిన్నుఁ గొలువ
సమత ఉన్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి. !!

భావము..
పెదతిరుమలాచార్య చెప్పిన శౌరీ విలాసము.
ఓ శ్రీహరీ! ఎంత చిత్రం? ఏమి  మహిమలు? ఏమి నీ మయావినోదములు? ఓ అచ్యితా! ఓ వామనా! నిన్ను తెలుసుకోగలగడం మా తరమా? నిన్ను గుర్తించలేని దౌర్భాగ్యులం మేము.
ఓ శౌరీ! ఓ మురహరీ! సకలలోకనాయకా! పాలదొంగవని నీ గుణములు ఎంచుతున్నాము. సరియే మేము అజ్ఞానులము. నీ మాతృమూర్తి నీ బుగ్గపై మీటి అడుగగా, అకటా! నీ నోరు తెరచి పదునాల్గు భువనాలను చూపించితివి.  ఆ తల్లి నిశ్చేష్టురాలైనది.
ఓ శ్రీసతీపతీ! దైత్యులను, దానవులను శిక్షించి అమరులను రక్షించినవాడివే. ఒక మూలనున్న బండిని విరిచిన నీ చేతలు సామాన్యులకు అర్ధం కానేకావు. ఆ అర్జునుడు మోసపోయి నిన్ను బావగా, రథసారథిగా, యాదవునిగా ఎంచి నీవు వాసవార్చితుడవని మరచితే విశ్వరూపం చూపి అతని కన్నులు తెరిపించినవాడవు.
ఓ వేంకటేశ్వరా! నారదప్రియా! భక్తవత్సలా! నమో నమో! నీ దాసులు మాత్రమే నీ మహిమలెల్లా చూచిరి. నీ శరణాగతులైన గజేంద్రుడు, శబరి, బలి, నిన్ను గొలిచెడి శుక ధ్రువాదులకు నీవు ఉన్నత పదములొసగుట సర్వమూ మేమీ పుడమిలోనే గంటిమి ప్రభూ!




తలచరొ జనులు ఈతని పుణ్యనామములు. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.. తలచరొ జనులు ఈతని పుణ్యనామములు.

తలచరొ జనులు ఈతని పుణ్యనామములు
సులభముననే సర్వసుభములు కలుగు !!

హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుడు
వనధి  లంఘన  శీల  వైభవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుడు
ఘనుడు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

లంకా సాధకుఁడు లక్ష్మణప్రభోధకుఁడు
శంకలేని  సుగ్రీవ  సచివుఁడు
పొంకపు రాముని బంటు భూమిజ సంతోష దూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు. !!

చటులార్జున సఖుఁడు జాతరూపవర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

భావం॥  ఈ కీర్తనలో అన్నమయ్య హనుమంతుని భజిస్తూ ఆతని గుణగణాలు వర్ణిస్తున్నాడు.
ఓ! జనులాల! ఈతని పుణ్యనామము తలుచుకోండి. అతి సులభముగానే సర్వశుభములు కలుగుతాయి. అతని దివ్యనామం ఉచ్ఛరిస్తే చాలు ఉన్నత గతులు కలుగుతాయి.
హనుమంతుడు వాయుదేవుని కుమారుడు, అంజనా తనయుడు, సముద్రాన్ని లంఘించిన వాడు, శీల సంపద కలిగినవాడు. రాక్షసులను సంహరించినవాడు, సంజీవని పర్వతమును కనుగొన్నవాడని కీర్తింపబడినవాడు, ఘనుడు, కలశాపుర ప్రాంతము వాడు ఈ హనుమంతుడు.
లంకను సాధించినవాడు, ఒకానొక సమయంలో లక్ష్మణునకే బోధ చేసినవాడు, ఎటువంటి సంశయమూ లేని సుగ్రీవుని సచివుడు, ఒద్దికగా శ్రీరాముని బంటుగా నున్నవాడు, సీతమ్మకు చింత పోగొట్టి సంతోషం కలిగించిన దివ్యదూత. ఆ మహానుభావునికి అన్నమయ్య నీరాజనాలిస్తున్నాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథముపైన జెండా మీద విరాజిల్లి, అతని విజయానికి తోడ్పడినవాడు, బంగారు వర్ణంతో శోభిల్లేవాడు, ఇకమీదట బ్రహ్మపదవిని చేపట్టవలసినవాడు, అలాంటి కపీశ్వరుడు శ్రీ వేంకటేశ్వరుని సేవకుడై ఏదుకొండలపై కొలువై ఉన్నాడు. శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకొంటే చాలు అన్ని భయాలు తొలగి విజయాలు సిధ్ధిస్తాయని అన్నమయ్య ప్రబోధం.


ఏడనుండి వచ్చినాడే.. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.  ఏడనుండి వచ్చినాడే..

ఏడనుండి వచ్చినాడే ఈడకుఁ దాను
వీడెమిచ్చీఁ జూడవే వేసాలవాఁడు. !!

వెలలేనివలపుల వేడుకకాఁడు
కలికితనాల మంచి గయ్యాళివాఁడు
చలమరిసరసాల జాజరకాఁడు
చెలువుఁడు వీఁడు కడె శ్రీవేంకటేశుఁడు !!

కొనబుతనాలతోడి కోడెకాఁడు
నినుపు నవ్వుల నవ్వే నీటులవాఁడు
వొనరినవరముల వుదారికాఁడు
చెనకులవాఁడుగదే శ్రీవేంకటేశుఁడు. !!

గొల్లెతల మానముల కొల్లకాఁడు
పిల్లదొరలూఁదేటి పిన్నవాఁడు
యెల్లగా నలమేల్మంగ నేలినవాఁడు
చెల్లుబడి వీఁడుగదె శ్రీవేంకటేశుఁడు. !!

భావం.. శ్రీవెంకటేశ్వరునిపై శృంగారగీతిక వినిపిస్తున్నాడు అన్నమయ్య, తనివిదీరా ఆస్వాదించండి.

చెలికత్తెలు ఒకరితో ఒకరు చెప్పుకొంటున్నారు. తాను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చినాడే?  తాంబూలమిచ్చి ఆహ్వానించండి ఆ వేషాలవానిని.
ఏ వెలకూ సరితూగని వలపులవేడుకలు కలవాడు. ఇతరులను ఆకాట్టుకొనే నేర్పరితనంలో బహు గడుసరి వాడు. చలముతో సరసాలు నెరపే  జాజరకాడు. చెలికాడు వీడె గదే శ్రీ వేంకటేశ్వరుడు.
కొంటెతనాలతో కోడెకాడు వీడు. చిలిపి నవ్వులునవ్వే నీటుగాడు. వరములు గుప్పించడంలో అతి ఉదారుడు. చెనకులతో నొక్కులు నొక్కే వాడు శ్రీవేంకటేశ్వరుడు.
కృష్ణావతారంలో గొల్లెతల  మానములు దోచుకొన్న కొల్లకాడు. వీడే కదా పిల్లనగ్రోవి ఊదుతూ అందరినీ పరవశింపజేసే పిల్లవాడు. దేవి అలమేల్మంగను పెండ్లియాడి ప్రేమతో ఏలుకునే గొప్ప చెల్లుబడివాడు శ్రీవేంకటేశ్వరుడు.