Wednesday 11 February 2015

రామాయణంలో రాజనీతి (౨)



శ్రీమద్రామాయణం. అయోధ్యకాండ.
శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాక తిరిగి అయోధ్యకు రాముడిని తీసుకురావాలని భరతుడు అరణ్యానికి వెళతాడు. అప్పుడు భరతుని యోగక్షేమాలు అడుగుతూనే రాజధర్మాన్ని రాజుకు ఉండవలసిన లక్షణాలనీ రాముడు భరతునికి చెప్తాడు.
          సేనలో అందరికీ జీతభత్యాలు సకాలంలో అందకపోతే చాలా ప్రమాదం సుమీ ... దూతల విషయంలో చాలా జాగ్రత్తలుండాలి. వాడు మన దేసీయుడే కావాలి. విద్వాంసుడూ, ప్రరిభావంతుడూ, భరతశాస్త్రవిదుడూ కావాలి. ధర్మాధ్యక్ష,నగరాధ్యక్ష  మొదలగు వారందరి ప్రవృత్తులనూ కనిపెట్టడానికి చారులను నియోగించావా?
          వేద వేదాంగజ్ఞానం లేక తర్కమే ప్రమాణంగా సాగేవారిని దరిచేరనీయకు. వ్యసాయం, పశుపోషణ, వాణిజ్యం ప్రధానంగా జీవయాత్ర సాగించే వైశ్య శిఖామణుల కష్టసుఖాలు స్వయంగా చూసుకుంటున్నావా ? రాజ్యంలో దుర్గాలన్నీ ధన,ధాన్య సమృద్ధి తో ఉంటున్నాయా? శిల్పకారులూ, యంత్రనిర్మాతలూ, ధనుర్దారులూ అసంతుష్టులు కాకుండా ఉంటున్నారా? ధనాగారం అపాత్రుల చేతిలో పదనివ్వకూడదు సుమీ.. ఆదాయాన్ని మించి వ్యయం పెరగకూడదు.
          నీ రాజ్యంలో పవిత్రులూ, పూజ్యులూ, నిర్దోషులూ నిష్కారణంగా దండితులు కాకూడదు. దోషం నిరూపితమైనాక సకాలంలో దోషిని దండిస్తున్నావా? ఏ ప్రలోభానికో లొంగి దండనీతికి దూరమవుతున్నావా? దోషిని సకాలంలో శిక్షించక పోయినా,  నిర్దోషిని కారాగారం పాలు చేసినా అది రాజునీ, రాజవంశాన్నీ నాశనం చేస్తుంది. (మనదేశంలో ప్రస్తుతం జరిగే అనర్ధాలన్నీ ఇవే కదా..)
          విభూషితగాత్రుడవై, ప్రసన్నవదనంతో ప్రజాసముదాయానికి అనుదినం ఉదయకాలం దర్సనమిస్తున్నావా?  సుఖాభిలాషతో రాత్రులు చేయవలసిన కామోపసేవనానికి దివావేళ ఉపక్రమించారాదని ఎరుగుదువుగా...   ఇంద్రియలోలుడవై చరించకూడదని గ్రహించావా?
          మనకున్న జ్ఞానాన్ని శీలంతో సఫలం చేసుకోవాలి. దండధరుడై ధర్మమార్గాన సాగే ప్రభువును ప్రజలు మన్నిస్తారు. వానికే ఇహపరాలు కరతలామలకాలు అని రాజధర్మాన్ని బోధించాడు.
ఎన్నో వేల సంవత్సరాలక్రితం ఇంత రాజనీతిని వాల్మికి గారు బోధించారంటే మన సంస్కృతి, మన పురాణాల గొప్పదనం అంచనాకి అందకుండా ఉంది. రాముడు చెప్పిన రాజనీతి, రాజధర్మం ప్రభువులు, ప్రభుత్వం పాటిస్తే రామరాజ్యం కాకపోతుందా?

రామాయణంలో రాజనీతి (౧)



రామాయణం ; అయోధ్యాకాండ.
          భరతుడు అయోధ్య వచ్చి జరిగిన అనర్ధం తెలుసుకుని, ఎంతో బాధపడి శ్రీరాముడిని వనవాసం నుంచి తీసుకురావాలని వశిష్టుడు,జాబాలి మొదలగు మునులతో, కౌసల్య, సుమిత్ర, కైకేయి, శత్రుఘ్నుడితో  కొంతసేనతో, మంత్రులతో అరణ్యానికి బయలుదేరుతాడు. శ్రీ రాముడు భరతుడిని ఆప్యాయంగా చేరదీసి యోగక్షేమాలు అడిగి  పరిపాలనా విధానం గురించి ప్రశ్నిస్తూనే రాజనీతి ఉద్భోధ చేస్తాడు.
          మనహితవు కోరే పురోహితులను మర్యాదగా చూసుకుంటున్నావా? సేవకులను, విద్యలను, వేదవిదులను అభిమానంతో గౌరవిస్తున్నావా? శూరులు జితేంద్రియులు, వేద వేదాంగవిదులు,ఇంగితజ్ఞానులు అయిన వారితోనే మంత్రాలోచన జరుపుతున్నావా? నిద్రనుంచి సకాలం లో మేలుకొని విధ్యుక్తాలు నెరవేర్చు కుంటున్నావా? రాజ్య విషయాలలో నీ ఒక్కడి ఆలోచన యెంత అనర్ధమో, అనేకులతో సంప్రదించడమూ అంతే ప్రమాదము. మూర్ఖులను చేరదీసి విద్వాంసులను దూరం చేసుకోవడం లేదు కదా? లక్షలాదిగా మూర్ఖులు, స్వార్ధపరులు మనచుట్టూ చేరతారు. వీరెవరూ విషమదశ లో మనవెంట ఉండరు. శాస్త్రవిదుడైన ధీరుడే నీ మంత్రాలోచనకు అవసరం.
          సేవకులలో ఉత్తమ, మధ్యమ, అధమవర్గాల వారుంటారు.  అది కనిపెట్టి వారిని ఆయా యోగ్యకర్మాలలో ఉంచుతున్నావా? విశ్వాసనీయులనూ, పిత్రుపితామః పరంపరగా మనసేనలో ఉండేవారిని ఉన్నత స్థానాలలో ఉంచాలి. ఆచారభ్రష్టుడైన యజమానిని రుత్విజుడూ, బలత్కరించిన పురుషుని స్త్రీ, ద్వేషభావం తోనే చూస్తారు. అలానే విపరీతంగా పన్నులు పిండే ప్రభువును ప్రజలు పరమ శత్రువుగా చూస్తారు.
          ఇంకా ఎన్నో ధర్మ సూక్ష్మాలు రాముడు చెప్పాడు. మిగతావి రేపు రాస్తాను. ఇవన్నీ ఏకాలంలో అయినా  ప్రభువులూ, ప్రభుత్వం పాటించ వలసిందే.