Friday 20 May 2016

అన్నమయ్య జయంతి



నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి.

ఆంధ్ర వాగ్గేయకారకుల్లో ప్రప్రధముడు, అగ్రగణ్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
          “సకలవేదములు – సంకీర్తనలు చేసి
           ప్రకటించి నిను బాడి – పావనుడైన
           అకళంకుడు తాళ్ళపా – కన్నమాచార్యుల
           వెకలియై ఏలిన శ్రీ – వేంకటనిలయ.
          ఇది అన్నమయ్య సంతతివారు శ్రీ  వేంకటేశ్వర స్వామినుద్దేశించి పాడిన కీర్తన. పదకవితాపితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు పాడిన పదాలన్నీ వేదాలకు మారు రూపాలే అని దీనివల్ల తేటతెల్లమవుతున్నది.
భగవదంశంలో జన్మించిన అన్నమయ్య చెప్పే మాటలు, చేసే పనులు దైవత్వాన్ని సంతరించుకున్నాయి. అన్నమయ్య అమరుడైనా ఆయన కీర్తి అజరామరం. ఆకృతి అశాస్వతమైనా కృతి శాస్వతమే కదా!
          ఈ సంకీర్తనాచార్యుడు 32,000 వేల కీర్తనలతో వేంకటనాధుని కీర్తించాడు. పరమపద ప్రాప్తికి భగవద్విశ్వాసాన్ని  మించిన ఉపాయం లేదని అన్నమయ్య సిద్ధాంతం.
          “నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నింపుకొని
           ఉన్నవాడ నిక వేరే – ఉపాయ మేమిటికి ?”
అని స్వామితో చెప్పుకున్నాడు. ఆ విశ్వాసమే అన్నమయ్యను ఆడించింది, పాడించింది, అద్భుతమైన పదకవితా సాహిత్యాన్ని సృష్టింప జేసింది. భక్తిభావంతో ఆయన పాడిన పదాలు అందరికీ తారకమంత్రాలయాయి.
          అన్నమయ్య పదాలలో చమత్కార వాగ్దోరణిలో ఎన్నో వింత పోకడలు కనిపిస్తాయి. పదాల మేళవింపులో, అర్దాల పోహళింపు లో అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు. వివరణ లేకున్నా సాధారణ పాఠకలోకానికి  తేలికగా అర్ధమయ్యే పాటలు ఎన్నో ఉన్నాయి. అలాగే విపుల వివరణ లేకుండా ఏమాత్రం అర్ధంకాని కీర్తనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాళ్ళపాక వారి పదసాహిత్యం అర్ధభావ ప్రధానమైనదనీ, త్యాగరాజాదుల కృతుల వలె నాదరచనా
ప్రధానం కాదనీ శ్రీ రాళ్ళపల్లివారు తెలిపియున్నారు.
          అమ్మ చేతి ప్రసాదం తిన్న మహాత్మ్యమేమో మరి, అలమేలు మంగమ్మ మీద అతి మధురమైన కీర్తనలను రచించాడు. అన్నమయ్యకు అయ్యవారి మీద కన్నా అమ్మవారి మీదే అభిమానమెక్కువ. ఆమెతో చనువూ ఎక్కువే. అమ్మగా భావించినా అన్నమయ్య అలమేలుమంగమ్మను చక్కని తల్లిగా, నవరసముల మూర్తిగా, పుష్పవల్లిగా, స్వామిని అలరించే శృంగార మూర్తిగా, కన్నతల్లిగా  ఇంకా ఎన్నోవిధాలుగా స్తుతించి పరమానంద భరితుడయ్యాడు. 
          అన్నమయ్య రచనల్లో ఆధ్యాత్మిక, వేదాంత, భక్తి, శృంగారాలతో బాటు ప్రత్యేకంగా స్త్రీలకోసం రాసిన కీర్తనలు ఉన్నాయి. పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, సువ్వి పాటలు, దంపుళ్ళ పాటలు , కోలాటం పాటలు, సోది చెప్పే పాటలు, జోల పాటలు ఇలా స్త్రీలు మాత్రమె పాడుకొనేలా ఎన్నో కీర్తనలను రచించాడు. ఈవిధంగా స్త్రీల మనోభావాలకు అనుగుణంగా రచనలు చేసిన మొదటి వ్యక్తీ అన్నమయ్యే.  స్త్రీ విద్యని ప్రోత్సహించి స్త్రీల చేత కూడా కవితలల్లించిన ఉత్తముడు అన్నమయ్య. ఈతని భార్య తిమ్మక్క “సుభద్రాకల్యాణం”  అనే కళ్యాణ కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవయిత్రి అయినది. ఈ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది. 
          అంతే కాక  ఎంతో ప్రాచుర్యం కలిగిన “చేత వెన్నముద్ద  చెంగలువ పూదండ”  పద్యం కూడా అన్నమయ్య సుదర్శన కృష్ణ శతకం లోనిదే. ఈ  శతకంలో కొన్ని పద్యాలు మాత్రమె లభించాయట.
          “చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ
                   బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
          కొండెప సిగముడి – కొలికి నెమలిపురి
                   ముంగురుల్ మూగిన – ముత్తియాలు
          కస్తూరికింబట్టు – కన్నులన్ కాటుక
                   చక్కట్ల దండలు ముక్కుపోగు
          సందిట తాయెతుల్ – సరిమువ్వ గజ్జెలు
          అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు
          కాళ్ళనందె – ఘల్లు ఘల్లు మనగ
          దోగి దోగి యాడ – తాళ్లపాకన్నన్న
          చిన్నికృష్ణ నిన్ను – చేరికొలుతు.
కాలానుగుణంగా ఈ పద్యం లో కొన్ని పాదాలు తగ్గి చిన్నపద్యం గా రూపుదిద్దుకుని తెలుగు తల్లుల నోళ్ళలో నాట్యం చేస్తూంది.
          స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో, శుభకార్యాలలో పాడుకునే అనేక విధాలయిన పాటలను రచించి, స్త్రీల పాటలకు ఉన్నత స్థితినీ, ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.  స్త్రీ జాతిని  ఇంతగా గౌరవించి,  స్త్రీల అభ్యు దయానికి  ఆరాటపడి,  ప్రత్యేకంగా స్త్రీల కోసం ఇంతమంచి సాహిత్యాన్ని కూర్చిన కవి, వాగ్గేయకారుడు, లక్షణకర్త అయిన అన్నమయ్యకు స్త్రీ జాతి ఎంతో ఋణపడి ఉంది.  ఆ మహా మహునకు ఇదే నా శతకోటి వందనాలు.
- పొన్నాడ లక్ష్మి 

Friday 13 May 2016

ఎన్ని వేదాలు చదివిన యెంత సోమయాజులైన - అన్నమయ్య కీర్తన.






ఈ వారం అన్నమయ్యకీర్తన.
ప. ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
     కన్నెలు వద్దనుండగా కాంక్షలేల తీరును.                   ||
౧.   కొరకుండేవా నీవు గొల్లెతలఁ గనుఁగొంటే
      పారదా మనసు వారి పాలిండ్లపై
      ఊరదా నీ నోరు తేనెలొలికే మోవి పండ్లకు
      పేరదా వలపు వారి బెల్లింపు మాటలకు                    ||
౨.   చిక్కవా వారికి నీవు చేతులు పైఁ జాఁచితేను
      చొక్కకుండేవా మేనులు సోఁకించితేను
      చక్కనుండేవా వారు సరసము లాడితేను
      పక్కన రేగఁడా తమి భావించి నవ్వితేను                   ||
౩.    పాయగాలవా సతులు భ్రమియించి కూడితేను
      అయినా తనివి నీకు నంతలోననే
      యేయడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
      మాయలకు లోను గాదా మంతనమాడితేను     || 

భావ మాధుర్యం :
          అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీకృష్ణుని శృంగారాన్ని సమర్ధిస్తున్నారు. ఎన్ని వేదాలు చదివినా, ఎంత సోమయాజివైనా కన్నెపిల్లల సాంగత్యం ఉంటె కోరికలు రేగక తగ్గుతాయా అంటున్నారు.
          గొల్లెతలు కావాలని నీ వద్దకు చేరితే వారి పాలిండ్లపై నీ దృష్టి పడి నీ మనసు చలించదా? తేనెలొలికే వారి పెదవులను చూస్తె నీ నోరు ఊరదా? మైమరపించు వారి మాటలకు వారిపై నీకు వలపు కలుగదా?
          వారు ప్రేమతో చేతులు చాచితే వారికౌగిట్లోకి చేరవా? వారు సరసములాడుతూ చక్కగా నవ్వితే నీకు మోహము కలుగదా?
          వాళ్ళు కలిగించే భ్రమలకి లొంగక వదలి ఉండగలవా? అయినా నీ తనివి తీరుతుందా? నేడు శ్రీ వేంకటేశ్వరా! నీవు నన్నుయేలితివి. నీ మాయలకు లోనై నేనూ నీతో మంతనాలాడేను.

Friday 6 May 2016

ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని -- అన్నమయ్య కీర్తన.

ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని -- అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన:

ప. ఎట్టు సింగారింత మమ్మ ఈ ఇంతిని
ముట్టని సింగారము ముందు ముందె యమరె ||

౧. పొలితి చంద్రవంకబొట్టు వెట్టఁ బోయి సంది
మలసే గోరొత్తు చూచి మాని(ని) నవ్వెను.
కలిమిఁ జంద్రగావి గట్టఁబోయి అద్దములో
సొలపుఁ గన్నులగావి చూచి నవ్వెను. ||

౨. అమరిన ముత్యాలహారములు వెట్టఁ బోయి
చెమటముత్యాలు చూచి చెలి నవ్వెను.
కొమరె యరవిరులు కొప్పున ముడువఁ బోయి
తమిఁ బులక విరులు తాఁ జూచి కొంకెను. ||

౩. వీఁగుచుఁ బరిమళము వెలఁది పూయఁగఁ బోయి
కాఁగిట వాసన జూచి కడు నవ్వెను.
సోగల శ్రీవెంకటేశు సురతసింగారము
వాగమై యమరెఁ గాన వన్నెలెల్ల నమరె. ||

భావం: అన్నమయ్య వినిపిస్తున్న ఈ శృంగార కీర్తనలో దేవి చెలికత్తెలు, శృంగార క్రీడా పరితప్తమైన తనకు చెలులు చేస్తున్న సింగారంలో తన విభుని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి తమకించి దేవి నవ్వుకుంటున్నదేలనో తెలియక ఈ విధముగా తలపోస్తున్నారు.

ఈ ఇంతిని మనమేతీరున సింగారింతమమ్మా! మనము చేయని సింగారములు కూడా ఈమెకు మునుముందుగానే అమరి యున్నవి.

ఈ పొలతి తన నుదిటిపై చంద్రవంక బొట్టు పెట్టబోతున్న చెలులను చూచి పక్కున నవ్వింది. తన మేనిపై నున్న గోరోత్తులు గురుతుకు వచ్చినవేమో మరి! సిరులోలికే సిందూరపు చీర గత్తబోతుంటే అద్దములో చూచి తన సోగకనులు నిద్రలేమిచే ఎరుపెక్కిన వైనం గుర్తుకు వచ్చినదేమో! ఆమె పక్కున నవ్వింది.
చక్కటి ముత్యాలహారం వెయ్యబోతే, తనకు ముత్యపుబిందువుల వంటి చెమటలు పట్టిన కథనం గుర్తుకు వచ్చి చెలి నవ్వుకొంటూంది. అరవిచ్చిన పూలను తన కొప్పున అమర్చబోతే తనమేనిపై అరవిరులవంటి పులకలు దేలిన సంగతి గుర్తుకు వచ్చి సిగ్గుతో కుంచించుకు పోయింది.

ఈ వెలది తన ఒంటిపై చెలులు పరిమళ ద్రవ్యములు పూయుచుండగా తన విభుని కౌగిట పరిమళము గుర్తుకు వచ్చి ఆమె నవ్వింది. శ్రీ వేంకటేశుని సురత శృంగారము లోని మధురిమలను నెమరు వేసికొనిన ఆమె పలు వన్నెలతో అలరారినది.

Wednesday 4 May 2016

మరల నిదేల రామాయణం బన్నచో - కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (క్రీ.శ.1895 – 1976)
ఇంతకుముందే ఎందరోమహాకవులచే విరచింప బడిన రామాయణాన్ని మరల తమరెందుకు రాస్తున్నారని అడిగిన వారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ఇది.
మరల నిదేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల వేళలయందు
తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే చేయుచున్నది
తనదైన యనుభూతి తనది కాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.

మరల రామయణమిదేల అన్నచో ఈ ప్రపంచములో అందరూ ఎల్లవేళలా తినుచున్న అన్నమే రోజూ తింటున్నారు విసుగులేకుండా ఎవరి రుచులు వారివి కనుక, చేసిన సంసారమే చేయుచున్నారు ఎవరి అనుభూతులు వారివి కనుక, అలాగే తలచిన రాముడినే మరల నేను తలచెదను. నా భక్తి రచనలు నావి కనుక. రామాయణ కథ ఎవరైనా చెప్పవచ్చు. కానీ ప్రతిభానుసారియైన రసపోషణలో వైలక్షణం ఉంటుంది.
సంకలనం: శ్రీ బాలాంత్రపు వెంకట రమణ.: తెలుగు పద్య మధురిమలు.