Monday, 17 August 2026

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు - అన్నమయ్య కీర్తన

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు చూడ-

నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక

కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు


యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-

మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥ఎవ్వరె॥


యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-

కెక్కడో తనజన్మ మీజీవుఁడు

యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యెప్పు-

డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎన్నఁడును జేటులే నీజీవుఁడు వెనక-

కెన్ని దనువులు మోవఁ డీజీవుఁడు

యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి

యెన్ని పదవులఁ బొందఁ డీజీవుడు.


భావం:


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ ఏ జన్మలలో ఎవరెవరికి ఏ ఏ వావిపరుసులతో సంబంధం పడి ఉన్నాడో నిర్ణయించుట ఎవరితరము? విచారించగా జీవులలో ఒకరితో నొకరికి ఎట్టి సంబంధము లేదు.


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించాడు. పూర్వం తానందరికోగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధాల పుత్రమిత్ర కళత్రాది సంబంధాలతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖాలపాలు చేసినాడు.


ఈ జీవుడు తిరగని చోటే లేదు. ముందటి జన్మలలో ఎన్నో చోట్ల పలు రూపులతో జన్మించి తిరిగి ఉన్నాడు. తానున్న జన్మంలో ఇతడు ఎక్కడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మలో మాత్రం తనకి జీవుడు ఏ విధంగా అనుగుచుట్టము కాగలడు? ఇతడు ఎప్పుడు ఎక్కడికి పోవునో తెలియదు కదా!


ఎండి జన్మలో దాలుస్తున్న ఎన్నిసార్లు మరణిస్తున్న నిజంగా ఈ జీవులకు మాత్రం ఎట్టి చేటును లేదు పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు తాను దాల్చిన శరీరములే చేటు వందుతున్నాయి గాని సనాతనుడైన జీవాత్ములకే మాత్రము చేటు లేదు శ్రీ వేంకటేశ్వరుని మహామాయ ప్రభావానికి లోబడి ఈ జీవుడెనో పదవులు పొందుతున్నాడు అని అన్నమయ్య జీవుల జన్మల గురించి వేదాంతపరంగా పై కీర్తనలో వర్ణించినాడు.


- కీ. శీ. సముద్రాల లక్ష్మనయ్య

ఇన్నిటికినీశ్వరేచ్ఛ- యింతే కాక - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన


ఇన్నిటికినీశ్వరేచ్ఛ- యింతే కాక

తన్నుదానే హరిగాచు- దాసుఁడైతే జాలు.

ప్రకృతిఁబుట్టిన దేహి- ప్రకృత (తి?) గుణమే కాని

వికృతి బోధించబోతే- విషమింతే కాదా!

ఒక విత్తు వెట్టితే వేరొకటేల మొలచును?

ప్రకటమైన వట్టి- ప్రయాసమే కాక.

పాపానఁ బుట్టిన మేను- పాపమే సేయుంచుగాక! 

ఏపునఁ బుణ్యముతోవ- యేల పట్టును,

వేపచేదు వండితేను- వెసనేల బెల్లమవును?

పై పై బలిమి సే సే- భ్రమ యింతేకాక.

ప్రపంచమైన పుట్టుగు- ప్రపంచమునకే కాక

ఉపమించ మోక్షమున- కొడఁబడునా?

ప్రపన్నుఁడైన వేళ- భాగ్యాన శ్రీవేంకటేశుఁ

డపుడు దయఁ జూడఁగ- నధికుఁడౌగాక !

(సంపుటం-3, సంకీర్తన-123)


"ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ" (ఇన్నిటికీ ఈశ్వరేచ్ఛ) అనేది సర్వం శ్రీహరి లేదా ఈశ్వరుని సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని తెలిపే తాళ్ళపాక అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తన. మనిషి ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యానికి దైవ సంకల్పమే మూలమనే తత్త్వాన్ని ఈ కీర్తన వివరిస్తుంది. 


కీర్తన సారాంశం


ఏది జరగవలెనున్నను భగవంతుని  ఇచ్ఛానుసారంగా జరగవలసినదే. ఆయనకు దాసుడు అగుట ఒక్కటే జీవుని కర్తవ్యము. అప్పుడు దయానిధి అయిన శ్రీహరి తానే వీనిని కాపాడగలడు. 


దేహధారిణి అయిన ఈ జీవుడు భగవంతుని మాయ ప్రభావంచే కలిగిన ప్రకృతి నుండి శరీరంతో జన్మించినాడు. వీనికి ప్రకృతి సహజములైన గుణములే ఉండును కానీ ఇతర గుణములు ఉండవు. ప్రకృతికి అతీతముగా ప్రవర్తించమని వానిని మనము బలవంతము చేసినచో ఆశించిన ప్రయోజనం సిద్ధించక పోవుటే కాక అది విషమమైన పరిణామమునకే దారితీయును. ఒక చెట్టు విత్తు నాటినచో ఆ చెట్టే మొలుచును కానీ మరొక చెట్టు ఎట్లు మొలుచును? ఒకవేళ అట్లు మొలిపించుటకు ప్రయత్నించినచో అది వట్టి ప్రయాసయే అగునుగాని ఫలం ఉండదు కదా! ఈ శరీరము పాప కర్మముచే పుట్టినది. ఇది మనచే తనకు సహజమైన పాపకర్మనే చేయించును కానీ పుణ్య మార్గమును ఎందుకు అనుసరించిను. వేప  చేదు వండినచో చేదుగానే ఉండును కానీ బెల్లంవలే తీయగా ఎట్లుండును? కాన ఈ తనువును పుణ్యపదమున నడిపింపగలవని పూనుకొనుట బ్రహ్మయే కానీ మరేమియు కాదు సుమా!


మన జన్మము ప్రపంచ ప్రవృత్తికి సంబంధించినది.  ఇది ప్రపంచ మాయాజాలమున మనలను తగిలించుటకే ప్రయత్నించును కానీ మోక్షమున కంగీకరించునా? కావున జీవుడు భగవంతుని ఎడల ప్రపన్నుడు కావలెను. అప్పుడు భాగ్యవశమున శ్రీ వేంకటేశ్వరుడు వానిని దయ చూచును. అంతటనతడు ముక్తుడై అధికుడగును.  ఇంతకంటే వేరొక సులభోపాయము జీవునకు లేదు. 


డా. సముద్రాల లక్ష్మణయ్య