Monday 29 August 2016

ఎంత సింగారించేవే ఏమే నీవు - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. ఎంత సింగారించేవే ఏమే నీవు
కాంతుఁడు వాకిట వచ్చి కాచుకున్నాఁడు. ||

౧. చెలులకు వెడవెడ సిగ్గులే సింగారము 
సెలవులకు నవ్వులే సింగారము
పలచని మోవికి పలుకులే సింగారము
కలికికన్నులకును సోలపే సింగారము. ||

౨. చక్కని బొమ్మలకును జంకెనలే సింగారము
చెక్కులకు మురిపెమే సింగారము
వెక్కసపు గోళ్ళకు విసరులే సింగారము
చొక్కపుజవ్వనాలకు సొంపులే సింగారము ||

౩. కరకుచన్నులకు కాఁగిలే సింగారము
చిరుఁ దొడలకు రతి సింగారము
మరి యలమేలుమంగ మగఁడు శ్రీ వేంకటేశు
డెరిఁగి నిన్నిట్టె కూడె నిదె సింగారము. ||

భావము: ఇది అన్నమయ్య శృంగార కీర్తన. ఈ కీర్తనలో చెలికత్తెలు దేవి అలమేలుమంగతో చనువుగా ఇలా అంటున్నారు. ఏమే యిది? ఎంత సింగారిస్తావు. అక్కడ నీ నాథుడు వచ్చి వాకిట నిలిచి ఉన్నాడమ్మా! అని మందలిస్తున్నారు.

అయినా నేనొకటి చెప్తున్నాను. గ్రహించు. చెలులకు నిజమైన సింగారము చిరు చిరు సిగ్గులే. ఇక ఆ పెదవులకు చిరునవ్వులే సింగారము. పలుచని అధరాలకు నీ తీపి పలుకులే ఆధారం. మరి చక్కని కనుదోయికి, నీ పారవశ్యమే సింగారము.

దేవీ! చక్కని నీ కనుబొమ్మలకు నీవు స్వామిని బెదిరించేటట్లు చూసే ఆ చూపులే సింగారము. అందమైన నీ చెక్కిళ్ళకు మురిపెమే సింగారము. నీ వాడి గోళ్ళకు విసురులే సింగారము. నీ యౌవ్వనమునకు నీ ఒంపుసొంపులె సింగారమమ్మా! 

బిగువైన నీ చనుగవకు స్వామి కౌగిలే సింగారము. స్వామి శృంగారమే నీ కన్నిటా సింగారము. మరి అలమేల్మంగ నాధుడైన శ్రీ వేంకటేశ్వరునికి నీ విరహము నెరిగి నిన్ను కూడుటయే అసలైన సింగారమమ్మా!

Sunday 21 August 2016

ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు - అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు
సంచితముగ నీతని శరణంబే సర్వఫలప్రద మిందరికి. ||
౧. హరి గొలువని కొలువులు మరి యడవిఁగాసిన వెన్నెలలు 
గరిమల నచ్యుతు వినని కథలు భువి గజస్నానములు,
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళమున నిదానంబులు
మరుగురునికిఁ గాని పూవులపూజలు మగడులేని సింగారంబులు ||
౨. వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁగురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరని కోరిక లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁజేయని భక్తులు చెంబుఁమీది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగనేటినడిమి పైరులు ||
౩. వావిరిఁగేశవు నొల్లని బతుకులు వరతఁగలవు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపై లేని తలపులు పలు మేఘముల వికారములు
శ్రీ వేంకటపతి కరుణ గలగితే జీవుల కివియే వినోదములు. ||
భావము: ఘనులార! కలువకన్నులవాడైన శ్రీహరియే ఎల్లరకు రక్షకుడు. ఈ సంగతి చక్కగా గ్రహించిన ఆ దేవుని శరణాగతియే అందరికీ సమస్తఫలములను సమకూర్చునది.

శ్రీహరి ని కొలువక ఇతరత్రా చేయు సేవలు అడవిగాచిన వెన్నెలవలె నిష్ప్రయోజనములు. ఘనుడైన అచ్యుతుని గురించి వినక ఇతరముల గురించి విను కథలెల్ల ఏనుగుచేయు స్నానము వలె వ్యర్థములు. పరమాత్ముడగు హరిని గూర్చి కాక ఇతరుల గురించి చేయు తపములు పాతాళముననున్న పాతరల వలె అక్కరకు రానివి. మన్మథుని తండ్రియైన మాధవునికి గాక అన్యులకొనర్చు పూజలెల్ల మగడు లేని మగువ సింగారము వలె నిష్ఫలములు. మరియు అనుచితములు.

వైకుంఠుని నుతించని వినుతులు సముద్రములో కురిసిన వాన వలె నిష్ప్రయోజనములు. ఆ పద్మనాభుని గాక అన్యులను గొరెడు కోరికలన్నియు అందని మానిఫలంబుల వలె అసాధ్యములు. అట్టి కోరికలు నెరవేరవు. శ్రీకాంతునిపై జేయక ఇతరులపై జేయు భక్తి చెంబుపై బంగారుపూత వలె విలువలేనిది. ప్రయత్నించి విష్ణుని గూర్చి తెలిసికొనక ఇతరులను గూర్చి తెలిసికొను విజ్ఞానము లన్నియు వరదపాలై పోవు ఏటి నడుమ పెంచిన పైరుల వలె నిష్ఫలములు.

భక్తితో కేశవుని అంగీకరింపక ఒరులపై మోహము పెంచుకొని బ్రతుకు బ్రతుకులు వరదలో గలిసిన చింతపండువలె వ్యర్ధమవును. గోవిందునికి గాక అన్యుల కొనర్చు మొక్కులు గోడలేని పెద్ద చిత్రములవలె ఉనికి లేనివే యగును. మరియు మాధవుని గాక ఇతరులను గూర్చి చేయు భావనలు నానావిధములైన మబ్బుల ఆక్రుతులవలె నిలకడ లేనివి యగును. పై జెప్పినవెల్ల అంతర్గతముగా విష్ణుపరములైనచో జీవులు వేంకటేశ్వరుని దయకు పాత్రులు కాగలరు. అప్పుడా సాధనలెల్ల వినోదకరములే యగుచున్నవి. కాన విష్ణుని శరణు జొచ్చుటయే ముఖ్య కర్తవ్యమని అన్నమయ్య భావము.

వ్యాక్యాత: సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, ఎం.ఏ. పొన్నాడ లక్ష్మి.

Saturday 13 August 2016

కలియుగమెటులైనా – గలడుగా నీ కరుణ - అన్నమయ్య కీర్తన.




ఈ వారం అన్నమయ్య  కీర్తన.

ప.         కలియుగమెటులైనా – గలడుగా  నీ  కరుణ
            జలజాక్ష ! హరి హరీ ! – సర్వేశ్వరా !                          ||

౧.         పాప మెంత గలిగిన – బరిహరించే యందుకు
            నా పాలగలదుగా నీ – నామము,
            కోపమెంత గలిగిన – కొచ్చి శాంతమిచ్చుటకు
            చేపట్టి కలవుగా నా – చిత్తములో నీవు                       ||

౨.         ధర నింద్రియాలెంత – తరముకాడిన  నన్ను
            సరిగావ గద్దుగా నీ – శరణాగతి ,
            గరిమ గర్మబంధాలు – గట్టిన తాళ్ళు పూడించ
            నిరతి గలదుగా – నీ భక్తి నాకు.                                ||

౩.          హితమైన యిహపరా – లిష్టమైన వెల్లా నియ్య
            సతమై కలదుగా నీ – సంకీర్తన
            తతి శ్రీవెంకటేశ నా – తపము ఫలియింపించ
            గతి గలదుగా నీ – కమలాదేవి.                                 ||

భావం: కమలములుబోలు కన్నులు గలవాడా! హరిహరీ!  సర్వేశ్వరా!  కలియుగమెట్లున్ననూ నన్ను కాపాడుటకు నీ కరుణ నాపై  ఉండగా ఇక నాకేమి భయము?

            నా యెడల నెన్ని పాపములు గల్గినను , వాటిని సమూలముగా తుద ముట్టించుటకు నీ  నామ మున్నది గదా! నాకెంత కోపము గలిగినను నశింపజేసి శాంతమును ప్రసాదించుటకు నా  మనస్సులో నీవు నెలకొని యున్నావుకదా!

            ఇంద్రియములు ఎంతగా తరుముకొనివచ్చినను  నన్ను వాటి బారినుంచి తప్పించుటకు నీ శరణాగతి గలదు గదా! ఘనమైన కర్మబంధము లనెడు కట్టిన త్రాళ్ళ నుండి నన్ను విడిపించుటకు నాకు  నీ యెడల నున్న భక్తి కలదు కదా!

            నా కిష్టము లైనవి, హితకారము లైనవియు అగు ఇహమునకు పరమునకు సంబంధించిన వాటినెల్ల ఇచ్చుటకు శాశ్వతమైన నీ సంకీర్తన కలదు కదా! తగిన కాలమున నా తపస్సు ఫలింప జేయుటకు నీ లక్ష్మీదేవియే నాకు గతియై యున్నది గదా!                                                                 


వ్యాఖ్యానం: సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య.                                        పొన్నాడ లక్ష్మి.

Monday 1 August 2016

ఆర్తి - సుధామ గారి కవిత.

ఆర్తి.                                                                             
అమ్మ  మీన్స్ వాట్ మమ్మీ
ఇది ఒక ప్రశ్నోదయ భయం.
పిజ్జాలు తెలుసు పిడతకింద పప్పు తెలీదు.
బర్గర్లు తెలుసు బొబ్బట్లు తెలీవు - వాడు పిల్లాడు.
మిడ్డీ మోజు,  పట్టు పరికిణీ మోటు
ఫేసు క్రీములు  నవ్యం పసుపు అసహ్యం – తను అమ్మాయి.
భారత భాగవతాలు చదవడం మానేసి
బెవాచ్ లు  చూస్తున్నారు టీవీలో బామ్మగారు తాతగారు
పిల్లలకు గోరుముద్దలు, చందమామ కథలు లేవు
జో అచ్యుతానంద జో జో ముకుందాలు లేవు
బారుల్లో డిస్కోదారుల్లో నాన్నగార్లు
బాబ్డ్ హెయిర్లలో స్లీవ్ లెస్సుల్లో  అమ్మగార్లు
టోటల్ గా స్లీప్ లెస్ గా నైటోయ్ – ఇదీ పలుకు కులుకు
అందుకే అమ్మ మీన్స్ వాట్ మమ్మీ.
ఇదీ రేపటి ప్రశ్నోదయ భయం.
ఆంధ్ర దేశమున బుట్టి ఆంధ్ర మాతాపితలకుద్భవించి
ఆంధ్ర సంప్రదాయములభ్యసించి ఆంధ్ర జాతీయ
                   తత్వసంపత్తిచే అభివృద్ది నొంది
ఆంధ్రభాషలో పండితులై ఆంధ్ర గ్రంధముల రచించి
ఆంధ్రభాషా దేవికి మూల్యాలంకారములుగా నర్పించి ఆంధ్రదేశ సేవనాచరించి
తమ యంగములు నసువులు నాత్మలు పవిత్రములుగ జేసుకుని
ప్రాణములనుబాసి పరమపదమును చేరిన ప్రాచీనాంధ్రులందరు కూడా
అదృష్టవంతులు కదా!
సాక్షీ పానుగంటీ ! వర్తమానం కనుగొంటివి స్వభాషలో నాడే నీవంటివి
భాషలోని కళ ప్రాణము తత్వము గతి  తప్పుతున్న దైన్యం ఏమిటి
కట్టు బొట్టు ఆచారాల్లో మానవ సంబంధాల్లో
మనతనాన్ని మనం కోల్పోయే ఈ  హైన్యం ఏమిటి
ఇంటికి తెలుగు దినపత్రిక తెప్పించుకోవడం ఎందుకు నామోషీ
తనగోత్రము, నక్షత్రము తెలియక పోవడమా అభ్యుదయ శేముషి.
రచన : సుధామ.                    నాకెంతో  నచ్చిన కవిత    పొన్నాడ  లక్ష్మి