Thursday 28 January 2016

బాలభాస్కరదేవు బంగారు కిరణాలు - త్యాగయ్య పై కరుణశ్రీ పద్యం


త్యాగరాజు ఆరాధనోత్సవాల సందర్భంగా కరుణశ్రీ పద్యం :

బాలభాస్కరదేవు బంగారు కిరణాలు
            కమలాకరాలలో కదలు లీల
శారద పూర్ణిమ చంద్ర చాంద్రీద్యుతుల్
            నెలరా కపోలాల నిమురు లీల
మధుర మోహన మంద మలయ మారుతములు
            వల్లి పదాగ్రాల వ్రాలు లీల
జలధరస్వామి శీతల వర్షధారలు
            సస్యకాంతల ముద్దుసలుపు లీల
తీయతీయని శ్రుతులు త్యాగయ్య కృతులు
శ్రోతృహృదయాల నానంద సుధలు చిందె;
ప్రాజ్యమైన సంగీతసామ్రాజ్యమునకు

రాగమయ రాజరాజు : మా త్యాగరాజు  ::

Monday 25 January 2016

శ్రీపతి ఈతడుండగా జిక్కినవారి నమ్ముట ...అన్నమయ్య కీర్తన.




 ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప.       శ్రీపతి ఈతడుండగా జిక్కినవారి నమ్ముట
          తీపని మీసాలమీది తేనే నాకుత సుండి.      !!

౧.       తలచినంతటి లోనె దైవమెదుట గలడు
          కొలువలేరని యట్టి కొరతే కాని
          ఇల నరులగొలుచు టెందో కోకలు వేసి
          బలుకొక్కెరలవెంట బారాడుట సుండి          !!

౨.       శరణన్న మాత్రమున సకలవరము లిచ్చు
          నిరతి మరచినట్టి నేరమే కాని
          పొరి నితరోపాయాన బొరలుట గాజుపూస
          గరిమ మాణికమంటా గట్టుకొంట సుండి.      !!

౩.       చేత మొక్కితే చాలు శ్రీ వేంకటేశుడు గాచు
          కాతరాన సేవించని కడమే కాని
          ఈతల నిది మాని మరిన్ని పుణ్యాలు సేసినా
          రీతి నడవి గాసిన రిత్త వెన్నెల సుండి.        !!

భావం:   శ్రీపతి నమ్మిన వారిని కాపాడుటకు సిద్ధముగా  నున్నాడు.  ఇతడుండగా  తక్కినవారెవరో తమను రక్షింతురని నమ్ముట, వలసినంత తేనె చెంతనుండగా దానిని ఆస్వాదింపక మీసాలపై తేనే తీపని నాకుటవంటిది సుమా!

          తలచినంతమాత్రమున ఆదుకొనుటకు ఆ దైవము ఎదుటనే ఉన్నాడు. కాని ఆయనని కోలువనేరని లోపము మనలోనే కలదు. నారాయణుని కొలువక నరులను గొలుచు టెట్లున్నదనగా – తెల్లని వస్త్రముల నెచ్చటనో వేసి అల్లంతదూరమున నున్న కొంగలను జూచి గుడ్డ లని భ్రమించి వాటివెంట పరుగిడినట్లున్నది. 

          శరణన్న మాత్రమున సకలవరములు ఇచ్చుటకు శ్రీహరి సిద్ధముగా నున్నాడు. ఆతని భక్తవాత్సల్యమును మరచిన నేరము మనయందే యున్నది. ఆ దేవుని శరణనక ఇతరములైన ఉపాయములతో కోరికలను తీర్చుకోవాలనుకోవడము గొప్ప మాణిక్యమని భ్రమించి మిలమిల మెరిసే గాజుపూసను ధరించినట్లే సుమా!

          చేయెత్తి మొక్కిన చాలును, శ్రీ వేంకటేశ్వరుడు అన్నివిధముల భక్తులను కాపాడును. చంచల చిత్తముతో ఆయన పట్ల నిర్లక్ష్యము వహించి, అతనిని సేవించని లోపము మనలోనే కలదు. శ్రీ వేంకటేశ్వరుని నమ్మి మ్రోక్కక ఇతరములైన పుణ్యము లెన్ని చేసినను అడవిగాచిన వెన్నెలవలె నిష్ప్రయోజనమే సుమా!   

నరహరి నీ దయ మీదట నా చేతలు గోన్నా? అన్నమయ్య కీర్తన.



.ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప.       నరహరి నీ దయ మీదట నా చేతలు గోన్నా?
          శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా?                   !!
౧.       మొరయుచు నరకపు వాకిలి మూసిరి హరి నీ దాసులు       
          తెరచిరి వైకుంఠపురము తెరువులు వాకిళ్ళు,
          మరిపిరి పాపములన్నియు నుగ్గుగా నిటు తూర్పెత్తిరి
          వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా?                 !!
౨.       పాపిరి నా యజ్ఞానము పరమాత్ముడ నీ దాసులు
          చూపిరి నిను నామతిలో సులభముగా నాకు,
          రేపిరి నీపై భక్తిని రేయిని బగలును నాలో
          వోపము వోపము తపములు ఊరకే ఇకనేలా?                  !!
౩.       దిద్దిరి నీ ధర్మమునకు దేవా! శ్రీ వేంకటేశ్వర !
          అద్దిరి నీ దాసులు నీ ఆనందములోన
          ఇద్దరి నీ నా పొందులు ఏర్పరి చిటువలె గూర్చిరి
          వొద్దిక నొద్దిక నాకిక నుద్యోగాములేలా ?                         !!

భావము:  నరహరీ! నీ దయ నాపై గల్గిన పిమ్మట  నాకై నేను చేసికొనవలసిన పనులు కొన్ని మిగిలియున్నవా? నిన్ను శరణు జొచ్చిన జీవునికి మరల స్వతంత్రత ఎక్కడిది?
          శ్రీహరీ! నీ దాసులు ఆనందముతో నరకపు వాకిలి మూసిరి. వైకుంఠపుర వాకిళ్ళు తెరిచిరి. మా పాపములన్నిటిని నుగ్గుగా చేసి తూర్పారబెట్టిరి. ఇక మేము భయపడవలసిన నిమిత్తము లేనేలేదు. మాకిక కర్మకాండకు సంబంధించిన విధులతో పని ఏమి ?
          పరమాత్మా! నీ దాసులు నా అజ్ఞానమును తొలగించి, నిన్ను నా మనస్సునందే నిన్ను నాకు సులభముగా జూపిరి. రేయి పవళ్ళు నీప భక్తిని కలిగించిరి. మేమిక తపములు చేయజాలము. నిష్ప్రయోజమైన తపస్సులతో నిక మాకేమి పని?
          దేవా! శ్రీ వెంకటేశ్వరా! నీ దాసులు నన్ను నీ శరణాగతునిగా నొనర్చి ధర్మమును నేర్పిరి.  నీ నామస్మరణచే కలుగు ఆనందములో ముంచిరి. నీకు, నాకు ఒద్దికగా పొందు నేర్పరిచిరి. ఇంకనాకు వేరే ప్రయత్నములేలా?
          హరిని  జేరుటకు హరిదాసులైన ఆచార్యులే మార్గదర్శకులు. వారు ఆశ్రితుల పాపములను తొలగింతురు. అజ్ఞానమును హతమార్చి భగవంతునియందు భక్తిని కలిగింతురు. ముక్తికి త్రోవ జూపుదురు. జీవునికి దేవునితోబంధము కలిగించెదరు. కాన ఈ కీర్తనలో జీవులకు ముక్తి గూర్చుటయందు హరిదాసుల సహాయముండవలెనని అన్నమయ్య చక్కగా వివరించాడు.  

Sunday 24 January 2016

శ్రీ పారుపల్లి సత్యనారాయణ - Sri Parupalli Satyanarayana



మా సంగీతం గురువుగారు శ్రీ పారుపల్లి సత్యన్నారాయణ గారు – నా అభ్యర్ధన మేరకు మా శ్రీవారు Pvr Murty (పొన్నాడ మూర్తి) వేసిన పెన్సిల్ చిత్రం.

శ్రీ సత్యన్నారాయణ గారి దగ్గర విశాఖలో రెండు సంవత్సరాలు అన్నమయ్య కీర్తనలు అభ్యసించాను. వారి బృందంతో కలసి తిరుమల కొండపై, ఒంగోలు లో వకుళమాత దేవాలయంలో అన్నమయ్య కీర్తనలు పాడే అదృష్టం కలిగింది.

వీరు మంచి గాయకులు, అంతకు మించి మంచి గురువుగారు. వారిది సంగీత కుటుంబం. వారి తాతగారు ప్రఖ్యాత సంగీత కళాకారులు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారు. వారి పినతండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రంగనాద్ గారు. .శ్రీ సత్యన్నారాయణ పాడిన కీర్తనలు కొన్ని youtube లో లభ్యం. youtube search లో Parupalli Satyanarayana అని టైప్ చేసి వారి కీర్తనలు వినవచ్చును.
 — with Pvr Murty.

Wednesday 20 January 2016

సీత క్షేమమను శుభవార్త నేడు - సుందరకాండ


“సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలపకుండిన
నేటితోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా 
మమ్మీ తీరుగ ఉద్ధరించిన
మారుతికి ఏమివ్వగల” నని
సర్వమిదేనని – కౌగిట జేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు.


కౌగిలింతల దినోత్సవం సందర్భంగా నాకు గుర్తుకొచ్చిన సుందరకాండ పద్యం 

శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం



మహా వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజును స్తుతిస్తూ  రచించిన  కీర్తన. ఈ కీర్తన మైసూర్ వాసుదేవాచారి రచించినదని అనుకుంటున్నాను.  మా గురువుగారు వీణమీద చెప్పారు.
రాగం : కల్యాణి,  తాళం: రూపకం.
పల్లవి.   శ్రీమదాది త్యాగరాజ గురువరం. . నమామ్యహం.

అ.ప.    భూమిజా.. రమణ చరణ
          కమల భజన దురం ధరం...         !!శ్రీ!!
చ.       సకలలోక సంసేవిత  సంగీత సాహిత్య
          సారభరిత సులలితపద  సమ్మెళన సంశోభిత
మ.కా.సాహిత్యం:
          సంకీర్తన సురజన సముపార్జిత సత్కీర్తిం
          సురమునివర కారుణ్య సంజాత సుజ్ఞానం
          సామగానలోల వాసుదేవ హృదయ సుస్థితం
          సుజన హృదయ జలధి చంద్ర మమల వంశ సంజాతం
చి.స్వరం:
          సరినిరిని పదనిదమ| పగమరి గమనిదదా..|
          మగరినిదా రిగమనిదా| నిదమగమద గరినిదనిరి|
          దగరినిరీ| దరినిమదా| మగరి మగరి నిరి దగారి|
          సనిదరీ, సనిద పదనిస |రిమపద నిసరిగమపదని ||శ్రీ||