Friday 19 July 2019

అదేనంటా వచ్చే నారగించలేదింకా - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన. 

అదేనంటా వచ్చే నారగించలేదింకా
వాడవార చేడలాల వనజాక్షు జూపరో.  !!

మందనున్న పసులాల మంచిగోపబాలులాల
కందర్పగురుడు వచ్చె గంటిరా మీరు
కెందమ్మివనములాల కృష్ణుడు యమునలోన
చింద్ల నీడాడునట చెప్పరో సుద్దులు.             !!

గొల్లవారిఇండ్లాల గొందిపాలువెన్నలాల
కొల్ల అదే హరి వచ్చె గొండించరో
చల్లలమ్మే సతులాల సరసపురచ్చలాల
ఇల్లీడ నేడనున్నాడో యెరిగించరో                 !!

గోవర్ధనముదండ గుంపులపూ బొదలాల
కోవిదుడేమిసేసీ గుట్టు చూపరో
శ్రీవేంకటాద్రి మీద జేరి కంటుమింతలోనె
పూవువలె నెత్తుకొంటి భోగించీ నింకను.         !!

భావమాథుర్యం..
          ఈ కీర్తనలో అన్నమయ్య యశోదమ్మ కన్నయ్య కోసం వెదుకుతూ గోపెమ్మలను అడుగుతూ ఆరాటపడడం వివరించాడు.

          గోవర్ధనగిరిపైనున్న పూపొదలను, గోపబాలురను, తామర సరస్సులను, గొల్లవారిండ్లలో నున్న పాలు వెన్నలను, చల్లలమ్మే సతులను, గోవర్ధనగిరిపై పూపొదలను, మా చిన్నారి కృష్ణయ్య ఆడుకుంటానని ఇటువేపు వచ్చాడు. ఇంతవరకూ అన్నం కూడా తినలేదు. ఎక్కడున్నాడో కాస్త చూడండమ్మా.. అని యశోదమ్మ బతిమాలుతోంది.

మందలోనున్న పశువుల్లారా! మంచి గోపబాలుల్లారా! మన్మథుని తండ్రి అయిన హరి ఇటు వచ్చాడా? మీ కంట బడ్డాడా? ఎర్రతామరపూలున్న సరస్సుల్లారా తామరపూలకోసం మీ దగ్గరికి వచ్చాడా? ఈత కొట్టడానికి బయలుదేరాడట. యమునా నదిలో లేడు. వాని సంగతి మీకు తెలుసా? వానికి కాస్త మంచిబుధ్ధులు చెప్పి ఇంటికి రమ్మనరో..

గొల్లవారిండ్లలో బానలందున్న పాలూ, వెన్నలూ కొల్లగొట్టడం కోసం కన్నయ్య వస్తే కాస్త నా దగ్గరికి తీసుకువచ్చి పట్టించవచ్చు కదా! చల్లలమ్మే సతులారా! రచ్చబండలమీదసంభషణలు జరిపే పెద్దలారా! ఇక్కడెక్కడో ఉన్నాడట! కాస్త ఎరిగించడమ్మా! గోవర్ధన సమీపముననున్న పూపొదరిళ్ళలారా! ఆ గ్రంథసాంగుడు కృష్ణయ్య ఇక్కడే ఎక్కడో రహస్యంగా దాగి ఉన్నా కాస్త నాకు చూపించమేలు చేయండి. శ్రీవేంకతాద్రినెకి చూస్తే ఇదిగో ఇక్కడే వానిని చూసాము. పూవుల అతని నెత్తుకున్నాను. ఇంక ఊరుకుంటాడా.. గారాలు మొదలుపెట్టాడు.



నీ సందిమోహము గానవచ్చెను - అన్నమయ్య కీర్తన



అన్నమయ్య కీర్తన..

 నీ సందిమోహము గానవచ్చెను
చింతతీర బుజ్జగించి చిత్తగించరాదా.               !!

మొగమున గళదేరె మోవిపైకి నవు వచ్చె
మగువ నీతోనేమని మాట చెప్పెనో
సగటున నటునిటు పరాకులేల సేసేవు
తగు విన్నపములవధరించరాదా                  !!

కన్నుల దేటలవారె కాయమెల్ల బులకించె
కన్నెనీతోనికనేమి సన్న సేసెనో
చిన్ని లేతసిగ్గులను శిరసేల వంచేవు
వన్నెల నేకతాన కవసరమీరాదా                  !!

నిలువెల్ల జమరించె  నిట్టూర్పులు రేగె
కలికి నిన్నుటువలె గాగలించెను
అలమి శ్రీవేంకటేశ అట్టే నీవు గూడితివి
మలసి ఇటువలెనే మన్నించరాదా                !!

భావమాధుర్యం

అన్నమయ్య ఈ కీర్తనలో తనను చెలికత్తెగా భావించుకుని స్వామితో ఇలా అంటున్నాడు.

స్వామీ ! ఈమధ్య ఒకరంటేఒకరికి ఎడతెగని మోహము కానవస్తూనే ఉంది. మరింకా తటపటాయిస్తావెందుకయ్యా ? ఆమె దిగులు పోగొట్టి అనునయించి ఆమెను స్వీకరించరాదా ?

నీవు మాట్లాడగానే నీకేమాట చెప్పిందోగాని ఆమె మొగమున కళలన్నీ తాండవించాయి. అదే నీవు కాస్త పరధ్యానంగా పెడమొగము పెట్టుకుంటే ఆమె తల్లడిల్లిపోతుంది. కాస్త మా మాట విని ఆమె చెప్పే విన్నపములు చెవిని పెట్టుకోరాదా ?

ఆ కన్యారత్నము నీకేమి సైగ చేసిందో మేము చూడలేదుగాని ఆమె తీరు చూచినావా ? తన కాయమెల్ల పులకించిపోయింది. కన్నులు మిలమిలా మెరుస్తున్నాయి. చిన్నగా సిగ్గులు చిందించే మోముతో తన శిరస్సును వంచింది. ఆమె నీతో ఏకాంత సేవ కోరుతోంది. దానికి తగిన అవకాశమీయరాదా ?
         
స్వామీ ఆమెను చూసినావా ? ఆమె నిలువెల్లా పులకరింతలతో చెమటలే. మాటిమాటికీ నిట్టూరుస్తున్నది. ఆమె నిన్నెంత తమకంతో బిగి కౌగిలించిందో చూసితివా? ఆమెను చూచి వేంకటేశ్వరా ! నీవు కరిగిపోయి ఆమెతో కూడినావు. ఎప్పుడూ ఇలాగే ఉండరాదుటయ్యా..?

Wednesday 17 July 2019

ఎవ్వరెట్టయినా ఉండనీ ఇదివో నేను - అన్నమయ్య కీర్తన


ఎవ్వరెట్టయినా ఉండనీ ఇదివో నేను
నవ్వుతా నీ సేవ సేతు నడుమ నేను.            !!

మనసున నొకమాట మరగున నొకమాట
యెనసి నేనయములు యెరుగ నేను
వనితనై నీ మీద వలపే గతియని
తనివోక బదికేటిదానను నేను.                     !!

వొలసితే నొకటియు నొల్లకుంటె నొకటియు
చలివేడివేసాలు  జరప  నేను
కలికితనాన నేతో కాపురమే గతి యని
తలచి పొందులు సేసే దానను నేను.              !!

నొక్కపరి ఇచ్చకము వొక్కపరి మచ్చరము
ఇక్కడా నక్కడ యెలయించను నేను,
గ్రక్కున శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
మక్కువ నిటు వలనే మరుగుడు నేను.         !!

భావమాథుర్యం..

అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీవేంకటేశుని వలచిన అమ్మ అలమేలుమంగ నిస్వార్ధమైన  వలపు ఎటువంటిదో స్వామికి వివరిస్తున్నారు.

ఎవ్వరెలా అనుకుంటే నాకేమిటయ్యా.. నేను మాత్రం మధ్యలో వచ్చి నువ్వు మనసారా కావాలనుకొన్న చిన్నదాన్నే. నవ్వుతూ నీ సేవలోనే తరిస్తాను.

మనసులో ఒక మాట చాటుమాటగా చెప్పి, పైకి మాత్రం నీతొ కల్లబొల్లి మాటలు చెప్పటం నాకు రాదు. నేను మామూలు వనితనే, నీపై తనివితీరని పొందు కావాలనుకొని బ్రతికేదానను నేను.

ప్రభూ! నేను కావాలనుకొంటే ఒకమాట, వద్దనుకొంటే వేరొకమాట చెప్పి ద్వంద్వ ప్రవృతిలో వేషాలు వేయను. అతివలందరిలాగే నా స్వామివైన నీవే నా పరమావధి  అని నీతో కాపురంచేస్తూ బ్రతుకుతాను.

ఒకసారి ఇష్టం, ఇంకొకసారి అయిష్టం చూపిస్తూ ఇక్కడా అక్కడా యెలయించను నేను. శ్రీ వేంకటేశ్వరా! నీపై నా మక్కువ మరుగున వుంటే ఉండనీ. నాకు మాత్రం సర్వస్వమూ నీవే స్వామీ!

ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయె - అన్నమయ్య కీర్తన


ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయె
వింతలేక ఎపుడూ వినోదించవయ్యా              !!

కన్నుల కొలుకులను కడగి మదరాగం
చన్నుల తుదల రేగి జవ్వనం
నున్నని చెక్కుల వెంట నూలు కొనీని కళలు
పిన్నది నీకే తగు బెండ్లాడవయ్యా                 !!

నెట్తుకొని మొగమున నిండెను చక్కదనము
అట్టే తేనియ లూరి నాకై మోవిని
తెట్టెలై వినయమెల్లా దేరి నిలువునను 
పెట్టెను సొమ్ములు నిండా బెండ్లాడవయ్యా        !!

పిరుదు బటువునను బెనగొని సింగారము
కరకమలమును గైకొనె సేస
ఇరవై శ్రీవేంకటేశ యెదబెట్టితి వీకెను
బెరసితివి నిచ్చలు పెండ్లాడవయ్యా                !!

భావ మాధుర్యం :

ఇది శీనివాసుని పెండ్లి పాట. ఆడపెండ్లివారి ముత్తైదవులు పాడుతున్నారు. వారిలో అన్నమయ్య ఒకరు.

ఓ వేంకటేశ్వరా ! నీవు ఎంత భాగ్యవంతుడివి ! అలమేలు మంగమ్మ నీకు దేవేరి అవుతోంది. ఎటువంటి సందేహాలు లేక ఎప్పుడూ వినోదించవయ్యా.

ఈ పెండ్లికూతురు ఎలా ఉందో చూడవయ్యా ! ఈమె కనుకొలుకులలో గర్వం తొణికిసలాడుతోంది. చనుకొనలు యవ్వన మదము రేపుతున్నాయి.  చెక్కిళ్ళు నవనవలాడుతూ కళలు నింపుకున్నాయి. ఈ చిన్నదాన్ని పెండ్లాడవయ్యా..!

ఈమె వదనములోంచి చక్కదనము తొంగి చూస్తోంది. అధరాలు మధురంగా తేనెలూరుతున్నాయి. వినయము నిలువునా రాసిపోసినట్లుంది. ఒంటినిండా ఆభరణాలు ధరించిన ఈమెను పెండ్లాడవయ్యా !

గుండ్రని నితంబములు ఈమె శృంగారాజ్ఞ్ని అని సూచిస్తున్నాయి. పద్మములవంటి చేతులలో అక్షతలు పట్టుకొన్నది. నీ హృదయనివాసినియై నిత్య పెళ్ళికూతురయినది. ఈమెను పెండ్లాడవయ్యా ..!