Monday 24 February 2014

ఆదూరి వేంకట సీతారామమూర్తి కధలు

ఆదూరి వేంకట సీతారామమూర్తి గారు  ప్రఖ్యాత రచయిత. వారి  కధల  గురించి నేనేమీ ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. సాహిత్యాభిమానులందరికీ చిరపరిచితమైన వ్యక్తి.  ఈమధ్య తన కధలను సి.డీ. లలో పొందుపరిచారు. అతను తన గళం లోనే కధ చెప్పినట్లు కధంతా సి.డీ.లోకి చేర్చారు. ఒక్కోసారి పుస్తకం పట్టుకొని చదువుకోవడానికి సదుపాయంగా ఉండదు. అటువంటప్పుడు ఈ సీడీని ని పెట్టుకుని హాయిగా పడుకొని కధలను వినవచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మో, బామ్మో కధ చెప్తూంటే హాయిగా వినేవాళ్ళం. ఆ అనుభూతిని మళ్ళీ పొందవచ్చు. కధ వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. లేదా కారులో ఎక్కడికైనా దూరప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కధలు వింటూ ప్రయాణ బడలిక మర్చి పొవచ్చు.


ఈ. సి.డీ.లో ఉన్న కధలన్నీ ఆణిముత్యాలే. అందులో ముఖ్యంగా  ‘ఆత్మధృతి’, ‘వాడి మధ్యాహ్నభోజనం’, ‘ఓ మహిషాత్మ కధ’, ‘పూలమనసు’ లాంటి కధలు మనసు తలుపు తట్టి కళ్ళు చెమర్చేలా చేస్తాయి.  ‘పాత బంగారం’, ‘అనంతలక్ష్మి అమెరికా ప్రయాణం’ వంటి కధలు సునిశితమైన హాస్యంతో మనసుని ఉత్తేజ పరుస్తాయి.  అన్ని కధలూ చాల బాగున్నాయి. మీరూ  విని ఆనందించండి.

Friday 14 February 2014

కానకుంటి మిందాకా కంటి మాడకు బోదము

సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు సీతను వెదుకుతున్నప్పుడు
రామలక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణా పూర్వకముగా అన్నమయ్య
చెప్పిన కీర్తన యిది. ఇటువంటి సంభాషణగా నడిచే వానిని "వాకో వాక్య"
రూపమైన కీర్తనలని కూడా అంటారు.ఇటువంటి "వాకో వాక్య"కీర్తనలు
చాలానే వున్నవి.

ఈ కీర్తనలో ఒక వాక్యము (లైను)రాముడు, తరువాతి వాక్యము లక్షణుడు
అంటున్నట్లుగా సాగుతుంది.
శ్రీరాగం

కానకుంటి మిందాకా కంటి మాడకుఁ బోదము
కానీలే అందుకేమి కళవళ మేలయ్యా IIపల్లవిII

తొంగి చూచెనదె సీత తూరుపునఁ దమ్ముఁడా
సంగతి చందురుఁడింతె సతి గాదయ్యా

చెంగట నే వెదకగాఁ జేరి నవ్వీఁ జూడరాదా
రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా IIకానII

పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత
అంచెలఁ దీగె ఇంతే అటు గాదయ్యా

యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా
పెంచపు నెమలి గాని పిలుపు గాదయ్యా IIకానII

నిలుచుండి చూచె నదె నిండుఁ గొలఁకులో సీత
కలువలింతే ఆపె గాదయ్యా

కలికి శ్రీ వెంకటాద్రిఁ గాగిలించె నిదె నన్ను
తలపులో నాకె నిన్నుఁ దగిలుండు నయ్యా IIకానII 26-105

ఇంత దాకా సీతను కనుక్కోలేక పోయాము.దూరంగా ఆ కనిపించే చోటికి వెళ్ళి వెదకుదాము-అన్నాడు రాముడు.
దానికి జవాబుగా లక్షణుడు-అలాగే కానీ! అందుకోసమై నీకు కళవళ మెందుకయ్యా అన్నాడు.
రాము డప్పుడు -అదిగో! తూర్పున సీత తొంగి చూస్తున్నది తమ్ముడా-అంటాడు.
జవాబుగా లక్షణుడు-కనిపించే అది చందురుడే ! కాని సీత గాదయ్యా-అంటాడు.

అప్పుడాయన-దగ్గరికెళ్ళి నే వెదగ్గా నను చేరి నా సీత నవ్వుతోంది చూడరాదా-అంటాడు.
లక్ష్మణుడు - నువ్వనుకొనే ఆ నవ్వులు రంగులలో మెరిసే వెన్నెలలే ! రామచంద్రా వేరు కాదు, సరిగా చూడ మంటాడు.

పొద చెంత నుండీ చేత్తో నన్ను సీత పిలుస్తోంది! చూడయ్యా-రాముడు
అది హంస తీగ ఇంతే కాని అటు పిలవడం కాదయ్యా-లక్ష్మణుడు.

రాముడు - ఆలోచించక్కరలేదు. దూరాన యెలుగెత్తి పిలుస్తోంది.వినబట్టంలేదా!?
లక్ష్మణుడు - అది పిలుపు గాదయ్యా పింఛాన్ని ధరించిన నెమలి క్రేంకారమది.

రాముడు - నిండు కొలనిలో నిలచి సీత నన్ను చూస్తోందయ్యా
లక్ష్మణుడు - అని కలువపువ్వులయ్యా !ఆమె గాదు.
రాముడు - సీత ఈ వేంకటాద్రి మీద ఇదో నన్ను కాగిలించినదయ్యా
లక్ష్మణుడు - నీ తలపులో ఆమె నిన్ను తగిలి(కౌగలించుకొని) ఉన్నదయ్యా

ఇలా రామచంద్రమూర్తి సీతా విరహార్తిలో పరిపరి విధములుగా దుఃఖిస్తుండగా లక్ష్మణుడు నిజ పరిస్ధితిని వివరిస్తున్న
కీర్తన యిది.
courtesy: భారతీయం మల్లిన నరసింహారావు at 1:08 PM
 — with Gomata Gomata.

Thursday 13 February 2014

విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ!

పోతన భాగవతం లో “కమలాక్షు నర్చించు కరములు...” పద్యానికి ఈ కింది పద్యానికి ఎంత సారూప్యత ఉందో గమనించండి. ఇది కూడా పోతన గారి పద్యమే!

విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ!
చక్రిపద్యంబుల జదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాధు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు కీర్తిదైత!
కమలాక్షు పూజకుగాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన! 
హరిపద తులసీ దళామోద రతి లేని, ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
గరుడగమను భజనగతి లేని పదములు, పాదపముల పాదపటల మనఘ!

భావం:

భూపతీ! విష్ణుదేవుని నామ సంకీర్తనలు వినని వీనులు కొండగుహలు. కురునాధా ! చక్రధరుని మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకలు. కీర్తిమంతుడా! శ్రీకాంతుని కనలేని కన్నులు నేమలిపించపు కన్నులే. సత్యవచనుడా! రాజీవాక్షుని పూజకు ఉపకరించని చేతులు శవము చేతులు. రాజర్షీ! శ్రీహరి చరణాల మీది తులసిదళ పరిమళం ఆఘ్రాణించని ముక్కు పందిముక్కు. పాపరహితుడా! గరుడధ్వజుని భజించడానికి కదలని కాళ్ళు చెట్ల వేళ్ళు .