Friday 12 April 2019

రామ మిందీవర శ్యామం, పరాత్పర ధామం సురసార్వ్వ్భౌమం భజే. - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన..

రామ మిందీవర శ్యామం, పరాత్పర
ధామం సురసార్వ్వ్భౌమం భజే.      !!

సీతావనితా సమేతం
పీత వాసర బల వ్రాతం
పూతకౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం             !!

వీరం రణరంగ ధీరం
సారధర్మ కులోధ్ధారం
క్రూర దానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం      !!

పావనం భక్త సేవనం
దైవిక విహగవధావనం
రావణానుజ సంజీవనం
శ్రీవేంకట పరిచిత భావనం            !!

ఈ కీర్తనలో పదకవితాపితామహుడు పరిపరి విధాలుగా ఆ పట్టాభిరాముడిని ప్రస్తుతించాడు. ఆ పరంపరలో రచించినదే ఈ సంస్కృత కీర్తన. అన్నమయ్య ఈ పదామృతంలో అయోధ్య రాముడి వైభవాన్ని అద్భుతంగా అక్షరీకరించాడు.

ఓ రామా! నీవు నల్లకలువల శ్యామవర్ణంతో కూడిన శరీరచాయను కలవాడవు. నీవే ముక్తి స్థానానివి. దేవతలకే సార్వభౌముడి వంటి వాడవు. అలాంటి నిన్ను భజిస్తున్నాను స్వామీ..

రామా నీవు సీతాదేవితో కూడి ఉన్నవాడవు. పసుపుపచ్చని దేహవర్ణం కల వానర సైన్యమంతా నిన్ను కొలుస్తూ ఉంటారు. కౌసల్యాదేవి గర్భాన జనియించి సూర్యవంశానికే దీప్తిమంతుడవయ్యావు. నీవు మునిజనుల భయాలని పారద్రోలి, తేజోవంతంగా ప్రకాశించావు.
ఆ లక్ష్మణాగ్రజుడు వీరాధివీరుడు రణరంగధీరుడు. ధర్మం అనే కులాన్ని ఉధ్ధరించడానికి ఈ భువిలో అవతరించినవాడు. క్రూరమయిన రాక్షసులను సంహరించినవాడు. శూరత్వానికి, సుగుణాలకు, సదాచారాలకు నెలవైనవాడు. ఆ అయోధ్యరాముడు అసురులపాలిట ఎంత అరివీర భయంకరుడో, ఆప్తులపాలిట అంత ఆశ్రితపాలకుడు.
నిరంతరం భక్తులచే సేవలందుకుని ఆ పావనమూర్తి మానవులకే కాదు మూగజీవాలకూ ముక్తినిస్తాడు. ఇందుకు నిదర్శనం జటాయువే. సీతాపహరణ వేళలో రావణుని చేతిలో హతమైన ఆ విహంగానికి శ్రీరాముడు అంత్యేష్టి సంస్కారాలు చేసి దేవతలకిచ్చే స్థానాన్ని ఇచ్చాడు. చివరకు తన ప్రత్యర్ధి అయిన రావణుడు సోదరుడు విభీషణుని సంజీవనిగా రక్షించాడు. ఇన్ని ప్రాభవాలతో కూడిన ఆ కల్యాణరాముడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిగా వెలిసాడు. ఆ ఘట్టాలన్నింటినీ గుర్తుచేస్తూ ఈ సంకీర్తనకు ముక్తాయింపు పలుకుతున్నాడు పదకవితా పితామహుడు.