Saturday 23 November 2019

అల్లరి.

Meeraj Fathima
అల్లరి
అలసిపోయి ఇంటికొస్తానా..
అలిగి ఏ మూలో నక్కి ఉంటావ్.
.
అన్నం తినననే నీ మంకుపట్టూ,
అందరూ తిట్టారనే నీ కంప్లైంటూ..,
.
హడావిడిగా ఉండే నా పని వేళలూ..,
నా గది ముందు తచ్చాడే నీ అడుగులూ..,
.
స్నానం చేయననీ, మంచం దిగననీ.. నీ మొరాయింపూ,
వీది, వీధంతా నీమాట వినలేదనే నీ దబాయింపూ,
.
జేబులోని చిల్లరంతా నీదేననే గద్దింపూ ..,
వీధి చివరి దుకాణం వరకూ తీసుకెళ్ళమనే అర్దింపూ..,
.
నిన్నుతప్ప ఇంకెవరినీ దగ్గర తీయరాదనే మొండితనం,
నన్ను ఒక్కఅంగుళం కూడా కదలనివ్వని నీ పంతం.
.
నీ చుట్టూ ఇందరున్నా..ఎవ్వరూ లేరనుకొనే ఒంటరితనం,
సంతానాన్ని మాత్రమే గుర్తించే అమ్మతనం.
.
( వయస్సు మీదపడి మతిలేని ఎందరో తల్లులు చేసే అల్లరే ఇది,
మన అల్లరిని ముద్దుగా భరించిన వారి అల్లరిని బాధ్యతగా భరిద్దాం

అమ్మేదోకటియు అసీమలోనిదొకటి


ఈ వారం అన్నమయ్య కీర్తన.

అమ్మేదొకటియు అసీమలోనిదొకటి
ఇమ్ములమా గుణములు యెంచ చోటేదయ్యా!        !!

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము
ఇప్పుడు నీ కింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకుదాస్యము నేము సేసేము
చెప్పి నీ దాసుల సిగ్గుగాదా మాకు                     !!

పడతులకెప్పుడును పరతంత్రులము నేము
పడి నీ పరతంత్ర భావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతియించే అందుకును           !!

తనువు లంపటాలకు తగ మీదెత్తితి మిదె
వొనరి నీ ఊడిగాన కొదిగే దెట్టు
ననచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి
వెనకముందెంచక నీవె కావవయ్యా!                    !!

భావం..

మనం కానిది మనమని చూపెట్టుకునేందుకు మనం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి దైన్యం నుంచి మనం బయటపడాలంటె ఆ దేవదేవుడిని శరణు వేడుకోవాలి. మనలోని కపటత్వాన్ని కడిగివేయమని ఆ పరమాత్మని వేడుకోవాలి. అలాంటి భావనతోనే ఈ భగవతోత్తముడు ఈ కీర్తనను రచించాడు.

ఓ వేంకటేశ్వరా! మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా! మేము మూటలోనున్నవి ఒకరకమైతే, ముందు మరోరకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారస్తుల్లాంటివాళ్ళం . ఇది నీకు తెలియనిది కాదు.

మేమెప్పుడూ ఇంద్రియాలకు బానిసలము. ఇంద్రియాలకు యజమానులుగా ఉండవలసిన మేము, వాటికి బానిసలుగా మారిపోతున్నాము. అవి మన అధీనంలో ఉండవలసినది పోయి  మేమే వాటి అధీనంలోకి వెళ్ళిపోతున్నాము. ధనానికే దాస్యం చేస్తూ, నీ దాస్యాన్ని విస్మరిస్తున్నాము. నీ దాసులమని చెప్పుకుందుకి సిగ్గుపడుతున్నామయ్యా!

స్త్రీవ్యామోహంతో చిత్తచాంచల్యము కల మాకు నీగురించి ఆలోచన ఏది? జిహ్వచాపల్యంతో తపించే నాలుకకు నిన్ను నుతీంచే అవకాశమేది? ఈ చాపల్యం నీ నామస్మరణకు దూరం చేస్తూంది.

ఈ తనువు లంపటాల్లో చిక్కుకున్న మేము నీకు ఊడిగం చేస్తూ ఎప్పటికి తరించగలము? శ్రీవేంకటేశా!  నిన్నే శరణన్న మమ్మల్ని ముందువెనుకలు ఆలోచించక కాచుకోమని ఆర్ద్రతో అన్నమయ్య వేడుకొంటున్నాడు.

Wednesday 20 November 2019

అన్నమయ్య అందరివాడు.

పదకవితామహుడైన అన్నమయ్యను మావాడంటారు సాహితీమూర్తులు.వాగ్గేయకారుడు కనుక మావాడంటుంది కర్ణాటక సంగీతలోకం.లలితమైన పదాలతో శృంగారాన్ని ఒలికించాడు కనుక మావాడంటారు సినీ,లలితసంగీత కళాకారులు.జనపదాలు పాడిన అన్నమయ్య మావాడంటారు జానపదులు.తత్వబోధ చేశాడు కనుక మావాడంటారు వేదాంతులు.రామానుజ సిద్ధాంత మతప్రచారకుడు కనుక మావాడంటారు శ్రీవైష్ణవులు.సర్వమానవ సమానత్వాన్ని చాటాడు కనుక మావాడంటారు సంఘసంస్కర్తలు.మధురభక్తిలో తనిసి,తరించినవాడు కనుక మావాడంటారు భక్తజనం...
అయితే,నాఉద్దేశ్యంలో అన్నమయ్య అందరివాడు.ఆయన రచనలలోని వైవిధ్యం,మరి యే కవిలోనూ కానరాదు.వేలకొలదీ సంకీర్తనలలో ప్రతి ఒక్కటీ ఒక ఆణిముత్యమే...ఆలోచనామృతమే.
నా అనుభవంలో అన్నమయ్య సంకీర్తనల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించటం,'కత్తిమీద సాము' వంటిది.'అలరులు కురియగ' కృతిని రాగ,స్వరసహితంగా శుద్ధ శాస్త్రీయపద్ధతిలో ఒకరు పాడతారు.'ఏమొకో చిగురుటధరమున' అంటూ భావబంధురంగా లలితంగా మరొకరు ఆలపిస్తారు.'తందనానా ఆహి' అంటూ జానపద ఫక్కీలో మరొకరు గానంచేస్తారు..వీరిలో అందరికీ సమానంగా హర్షధ్వానాలిస్తారు శ్రోతలు..అయితే గాయకులు ఎంచుకొన్న ఆ కీర్తనలు వారు పాడిన బాణీలో కాక,మరొకరకంగా పాడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించండి..దేనికదే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి.వీటిలో దేనికి ప్రథమ బహుమతి ఇవ్వాలి? అనేది సదా ప్రశ్నార్థకమే..
అది అన్నమయ్య పదంలో ఉన్న విలక్షణత!
అన్నమయ్య సాహిత్యమయితే రాగిరేకులలో నిక్షిప్తం చేయబడటంచేత లభ్యమైంది కానీ స్వరమెట్లు లేకపోవటం చేత,ఎవరికి నచ్చిన బాణీలో వారు స్వరపరచుకొని, పాడుకుంటున్నారు.అలాగని అన్నమయ్య కీర్తనలు స్వరపరచటానికి అందరికీ అర్హత ఉంది అనవచ్చా?కనీస రాగ,తాళ,భాషా పరిజ్ఞానం లేకుండా వాటిని స్వరపరచవచ్చా?లేదు...అయితే...ఆసాహిత్యాన్ని బాగా మనసుకు పట్టించుకొని,అందులోని అచ్చతెనుగుపదాల అర్థాలను ఆకళింపు చేసుకొని,సంగీత ఛందస్సును పాటిస్తూ,ఆనాటి కాల,మాన పరిస్థితులపై కూడా కొంత అవగాహనతో చేసిన బాణీలు నిలబడుతున్నాయి.లేనివి కాలగర్భంలో కలసిపోతున్నాయి.
ఉదాహరణకు 'అంతర్యామి!అలసితి,సొలసితి' అంటూ ఎంతో నిర్వేదంతో అన్నమయ్య పాడుకొన్న సంకీర్తనను, హుషారెక్కించే 'కుంతలవరాళి' రాగంలో కదంతొక్కించినా,'చక్కని తల్లికి చాంగుభళా' అనే జానపదాన్ని 'నీలాంబరి' వంటి నిద్రపుచ్చేరాగంలో స్వరపరచినా శ్రోతలు మెచ్చగలరా?
అన్నమయ్య సంకీర్తనలను,సంగీత విద్వాంసులే స్వరపరచాలని,వాటిని కచ్చేరీలలో ప్రథానాంశంగా పాడుకొనేట్లు చేయాలనే తలంపు సైతం సరికాదు.అన్నీ అందుకు వీలు పడవు.
అనేక ఘనమైన రాగాలను మాలికగాచేసి,క్లిష్టమైన తాళంలో కూర్చిన బాణీ కన్నా,సులువుగా అందరూ పాడుకొనే వీలుతో,అరటిపండు ఒలిచిపెట్టిన రీతిగా సాహిత్యం తెలిసేట్లు సరళంగా చేసిన ఒక అన్నమయ్య జోలపాట జనబాహుళ్యంలో ఎక్కువ ప్రచారంలో ఉంది.
రాగమాలికగా బహుళ ప్రసిద్ధమైన అన్నమయ్యకీర్తన 'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన'..బృందావనసారంగ, మాయామాళవగౌళ రాగాలలో స్వరపరచబడింది.నిజానికి అది రాగమాలిక కాదు.రెండు కన్నా ఎక్కువ రాగాలలో కూర్చితేనే అది మాలిక అవుతుంది.ఆకీర్తన నడక,చతురస్ర గతిలో నల్లేరుమీద నడకలా సాగుతుండగా,దానికి విరుద్ధమైన మిశ్రచాపు తాళంలో కూర్చవలసిన ఔచిత్యం ఏమిటి?పైగా.. ఖచ్చితమైన ఛందోనియమాలు పాటించబడిన అన్నమయ్య కీర్తనకు,ఆవిధంగా తాళభేదం చేయటంతో ఛందోభంగం కలగలేదా!
మహావిద్వాంసులైన మంగళంపల్లివారిని ఒక సందర్భంలో అన్నమయ్య గురించి మాట్లాడమంటే, 'అన్నంకోసం పాడుకొనేవాణ్ణి, అన్నమయ్య గురించి ఏమి మాట్లాడగలను?' అన్నారు.అటువంటిది..ఈనాడు అన్నమయ్య కీర్తనలను ధనసముపార్జనకు ఒక సాధనంగా భావించి,అరకొర సంగీత,సాహిత్య జ్ఞానంతో,అన్నమయ్య హృదయాన్ని కొంతైనా తెలుసుకోకుండా కొందరు స్వరపరచి పాడటం,పాడించటం ఆమహావాగ్గేయకార శిరోమణికి అందించే నిజమైన నివాళి అనిపించుకుంటుందా?
ఇక ప్రదర్శన విషయానికొస్తే,అన్నమయ్య కీర్తనాగాన కచేరీలో,స్వరకల్పనాది మనోధర్మ సంగీతాన్ని పాడవద్దని శాసించే నిర్వాహకుల్ని చూశాను నేను.నిజానికి అందుకు అనుకూలమైన కీర్తనలలో,సమర్థులైన గాయకులు,మితిమించని విధంగా ఆలాపన,స్వరకల్పన,నెరవులు వంటివి చేర్చటం వలన శ్రోతలకు కొంత విశ్రాంతి కలగటమేకాక,కళాకారుడి సృజనాత్మకత వెల్లడి అయే అవకాశం ఉంటుంది.రెండు గంటల కచేరీలో మూడు,నాలుగు అంశాలలో ఈవిధమైన మనోధర్మప్రదర్శన చేయటం ఆహ్వానింపపగినదే!
నాకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది.ఎన్నడైనా త్యాగరాజస్వామి,అన్నమయ్య కీర్తన విని ఉంటారా? అవకాశమే లేదు.అయితే ఇద్దరిదీ భక్తి మార్గమే కనుక, వారిరువురి రచనలలోనూ కొండొకచో భావసారూప్యత కనబడుతుంది.ఉదాహరణకు 'అలర చంచలమైన ఆత్మలందుండనీ అలవాటు సేసెనీ ఉయ్యాల!' అని అన్నమయ్య అంటే, 'ఏతావునరా!నిలకడనీకు? ఎంచిజూడగా నగబడవు!' అని త్యాగయ్యగారంటారు.'ఎవరని నిర్ణయించిరిరా?నిన్నెట్లారాధించిరిరా!నరవరులు!' అని త్యాగయ్యగారంటే,'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు' అంటారు అన్నమయ్య.
ఏది ఏమైనా,తెలుగువారిగా పుట్టటం మన అదృష్టం.అన్నమయ్య మొదలుకొని, మైసూరు వాసుదేవాచార్య వరకూ అందరూ తెలుగులోనే భగవంతుని కీర్తించారు.ఆ కీర్తనలను తనివితీరగా భావించి,పాడుకొనే వరం తెలుగువారి సొత్తు.
అన్నమయ్య సాహిత్యమే అంత గొప్పగా ఉంటే... ఇక ఆయన సంగీతమెంత గొప్పగా ఉండిఉంటుంది?ఆనాడు వాడుకలో ఉన్న రాగాలు పరిమిత సంఖ్యలోనే ఉండేవి కదా!..మరి రాగిరేకులమీద వ్రాసిన విధంగా చూస్తే,ఒకే రాగాన్ని కొన్ని వందల సంకీర్తనలకు ఆయన ఎలా స్వరపరచి పాడుకొని ఉంటారు? ఊహకు అందని విషయమది!..
అందుకే...అందరం 'అన్నమయ్యా!నీకు వందన మన్నామయ్యా!' అనవలసిందే!..
-Modumudi Sudhakar

Friday 15 November 2019

బంగారు తల్లి.


అమ్మొక దారి నాన్నొక దారి వెతుక్కుంటే,
అమ్మమ్మ పంచన చేరిన అమాయకపు బాలిక 
పది వసంతాలలోనే పరిపూర్ణమైన అనుభవం. 
దారి తెన్ను లేని జీవితం,
అంధకారబంధురమైన భవితవ్యం
ఆప్యాయత తప్ప కడుపునింపలేని అమ్మమ్మ పేదరికం
ఫలితం ఆసరా లేని మరొక అమ్మకు, అమ్మమ్మకు దత్తత..
కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో ఇమడలేని నిస్సహాయత.
కాలగమనంలో తొలగిన అరమరికలు, ఉప్పొంగిన ఆప్యాయతలు.
తను లేనిదే అమ్మమ్మకు ఊపిరి లేదు, అమ్మకు నిద్ర రాదు.
అమ్మమ్మకు, అమ్మకు, మావయ్యకు తలలో నాలుక.
అమ్మ బందువులందరూ తన్ను అభిమానించే వారే,
ఒకరు అన్న, ఒకరు వదిన, ఒకరు అక్క, ఇంకొకరు బావ.
ఒకరు చదువు చెప్తే, ఇంకొకరు పాటలు నేర్పితే
ఆడుతూ పాడుతూ సాగే జీవనం.
పాఠశాల వదలి, కళాశాలలో అడుగుపెట్టిన నాడు
రంగుల కలలా కనిపించే జీవితం, అంతలోనే వక్రించిన విధి.
బాధ్యత నెరిగి, చేదోడుగా మసలి విద్యాబుధ్ధులు నేర్చుతున్న చిట్టితల్లిని
కాన్సెర్ మహమ్మారి తన క్రూరమైన కోరలతో కబళించివేసింది.
బంగారుస్వప్నం చెదరిపోయింది.
అమ్మను, అమ్మమ్మనూ అనాథలను చేసి తరలిపోయింది.
అతిథిగావచ్చి అలరించి అందరి మన్ననలను పొంది,
అంతలోనే కనుమరుగయిపోయిన బంగారు తల్లిని మరచేది ఎలా?