Sunday 29 June 2014

సంగీతంతో చికిత్స

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ 'రుతుగానం'లో శరదృతువును వర్ణిస్తూ- 'తెల్లచీర గట్టి తెలివెల్గులన్‌గల్గి సితకుముదము దాల్చు రుతులతాంగి దైవతమును పాడె...' అన్నారు. రుతువనేది కాలానికి సంబంధించినది. తెలుపు- వర్ణాలకు చెందినది. దైవతం- సంగీతశాస్త్ర పారిభాషిక పదం. సప్తస్వరాల్లో దైవతాన్ని 'ద' అనే స్వరస్థానంగా సంకేతిస్తారు. మామూలు దృష్టికి ఇవి ఒకదానికొకటి పొంతన లేనివిగా, పరస్పర విరుద్ధాలుగా తోస్తాయి. అందుకే దీన్ని 'శాస్త్రదృష్టి'తో పరిశీలించాలని తమ పీఠికలో సూచించారు విశ్వనాథ. వేకువకీ భూపాలరాగానికీ ఉన్న సంబంధం ఏమిటో సంగీతజ్ఞుడికే తెలుస్తుంది. వేణువుకూ మోహనరాగానికీ ఒక తరహా స్వరమైత్రి. కదనకుతూహల రాగానికీ వీణకూ మరోబాపతు అన్యోన్యత. ఈ బాంధవ్యాల్లోని లోతులను అర్థం చేసుకోవడానికి ఒకానొక విశేష శాస్త్రదృష్టి మనిషికి చాలా అవసరం. మన సంగీత వైశిష్ట్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఇక్కడి సంగీతం గంధర్వ విద్యగా వాసికెక్కింది. 'గాంధర్వేచ భువిశ్రేష్ఠో... సంగీత గాంధర్వ విద్య నెరిగిన శ్రేష్ఠుల్లో రాముడు అగ్రశ్రేణికి చెందినవాడు' అన్నారు వాల్మీకి. రుషుల దృష్టిలో సంగీతమనగా సాక్షాత్తు వేదమే! సామసంహిత భారతీయ సంగీత శాస్త్రానికి ఆధార షడ్జమం. ముముక్షువులకు సంగీతం ఒక మోక్షసాధనం. 'సంగీత జ్ఞానము, భక్తివినా సన్మార్గము కలదే? ఓ మనసా!' అని త్యాగరాజస్వామి ప్రశ్నించారు. 'సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులైన వారెందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అంటూ చేతులు జోడించారు. సామగానం శరీరధాతువులపై చూపించే ప్రభావం మనిషిని ధన్యుణ్ని చేస్తుంది. అందుకే ఆ కైమోడ్పు.

నెమలి, ఎద్దు, మేక, సింహం, కోకిల, గుర్రం, ఏనుగు చేసే ధ్వనుల నుంచి వరసగా సరిగమపదని స్వరభేదాలు ఏర్పడ్డాయన్నది లోకంలో ప్రసిద్ధమైన సిద్ధాంతం. మహాదేవుడి ఏడుముఖాల నుంచి సప్తస్వరాలు ప్రభవించాయని సంగీత శాస్త్రాలు వర్ణించాయి. పరశివ, ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే ఏడుముఖాలు వరసగా సరిగమపదని స్వరాలకు జన్మస్థానాలు. సంగీతానికి ప్రకృతితోను పంచభూతాలతోనే కాకుండా గ్రహరాశుల చలనంతోనూ లోహాలతోసైతం సంబంధం ఉంది. ఈ విషయాన్ని దివ్యజీవన సమాజానికి చెందిన హెలీనా పెట్రోవా బ్లావెట్‌స్కీ తమ 'సీక్రెట్‌ డాక్ట్రిన్‌'లో సాధికారికంగా ప్రస్తావించారు. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదాలకు వరసగా ఇనుము, బంగారం, పాదరసం, సీసం, తగరం, రాగి, వెండి లోహాలతో సంబంధం ఉంది. మళ్ళీ అదే వరసలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శని, గురుడు, శుక్రుడు, చంద్రుడు అనే గ్రహాలతో సంబంధం ఉంది. అలాగే వివిధ రంగులతోనూ ఉందని మేడమ్‌ బ్లావెట్‌స్కీ నిరూపించారు. ఇదే విశ్వనాథ సూచించిన శాస్త్రదృష్టి. సంగీత విద్వాంసులు తథరిణోం అంటూ కచేరీ మొదలుపెడతారు. తత్‌హరిః ఓం అనేవి అందులోని అక్షరాలు. సంగీతం ద్వారా సృష్టి మొత్తాన్ని సంబోధించే సంప్రదాయమది. సంగీతానికి, ప్రకృతికి గల బాంధవ్యానికి జేజేలవి.

ప్రతీరాగానికి ఒకో ప్రత్యేక జీవస్వరం ఉంటుంది. శంకరాభరణంలోను కల్యాణిలోను స్వరాలు సమానమే గాని 'మ' పలకడంలో తేడా ఉంది. శుద్ధమధ్యమం అయితే అది శంకరాభరణం. ప్రతిమధ్యమం అయితే కల్యాణి. మధ్యమం ఎలా పలికాడన్నదాన్నిబట్టి గాయకుడు వాటిలో ఏ రాగం పాడుతున్నాడో రసజ్ఞులు గ్రహిస్తారు. బ్లావెట్‌స్కీ వివరణ ప్రకారం సప్తస్వరాల్లోని దైవతానికి, లోహాల్లో రాగికి సంబంధం. రాగి లోపంవల్ల మానవ దేహానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దైవతం జీవస్వరంగా కలిగిన రాగాన్ని వినడానికి మనిషి ఇష్టపడతాడు. సంగీత సారం మనిషికన్నా దేహానికి బాగా తెలుసు. ఒంట్లో నీరు శాతం తగ్గినప్పుడు దాహం అనే కోరిక పుడుతుంది. కాల్షియం లోపించిన పిల్లలు సున్నాన్ని గోక్కొని తింటారు. కడుపులోబిడ్డ పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) పీల్చేస్తున్నప్పుడు బియ్యం తినాలని గర్భిణికి అనిపిస్తుంది. అలాగే శరీరంలో లోహాల కొరత ఏర్పడినప్పుడు వాటిని భర్తీచేసే సంగీత స్వరాలను దేహం కోరుకుంటుంది. కొరవడిన లోహంతో సంబంధం కలిగిన జీవస్వరమున్న పాటవైపు మనసు పోతుంది. దేహంలోని జీవధాతువులకు సంగీతంపట్ల గల అవగాహనకు అది సాక్ష్యం. కూనిరాగాల్లోని రహస్యం ఇదేనంటారు పెద్దలు. ఒక్కోరోజు ఒకోపాట మనసును వెంటాడుతుంది. పొడిబారిన ఇసుక నీటిని పీల్చుకున్నట్లు- ఆ పాటలోని స్వర చైతన్యాన్ని జీవధాతువులు పీల్చుకుని లోహాలకు చెందిన కొరతను భర్తీ చేసుకుంటాయి. ఈ సిద్ధాంతం మీదే 'సంగీతంతో చికిత్సా విధానం'(మ్యూజిక్‌ థెరపీ) అభివృద్ధి చెందింది. రాగంతో రోగం కుదర్చడం దాని లక్ష్యం. ఏ రాగం ఈ రోగానికి చికిత్స చేయగలదనేది ఆ రోగ లక్షణాలను బట్టి, ఆ లోపాలను సరిదిద్దగల శక్తిని తమలో ఇముడ్చుకున్న రాగాలను బట్టీ ఉంటుంది. దాదాపుగా వినోదానికే పరిమితమవుతున్న భారతీయ సంగీతపు వివిధ కోణాలను, శక్తిసామర్థ్యాలను ఈ దిశగా పరిశోధించి, మానవాళికి మేలు చేకూర్చవలసిన బాధ్యత విద్వాంసులపై ఉంది.

( జాజి శర్మ గారికి ధన్యవాదాలతో)

Friday 27 June 2014

భక్తీ కొలది వాడే పరమాత్ముడు - భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు (అన్నమయ్య కీర్తన)



ఈ వారం అన్నమయ్య కీర్తన:
ప.       భక్తీ కొలది వాడే పరమాత్ముడు  -  భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు.
౧.       పట్టినవారి చేబిడ్డ పరమాత్ముడు  -  బట్ట బయటి ధనము పరమాత్ముడు,
          పట్ట పగటి వెలుగు పరమాత్ముడు  -  ఎట్ట ఎదుటనే వున్నాడిదే పరమాత్ముడు.  ||
౨.       పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు  -  బచ్చెన వాసిన రూపు పరమాత్ముడు,  
          బచ్చుచేతి వొరగల్లు పరమాత్ముడు  -  ఇచ్చకొలది వాడు పో ఈ పరమాత్ముడు   ||
౩.       పలుకులలోని తేట పరమాత్ముడు  -  ఫలియించు నిందరికి పరమాత్ముడు,
          బలిమి శ్రీ వేంకటాద్రి పరమాత్ముడు  -  ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు.  ||
బచ్చెన : పూత,  బచ్చు : వయస్యుడు, ఒరగల్లు : గీటురాయి, బలిమి : శక్తి, ఎలిమి: ప్రాణం
భావం:
          పరమాత్ముడు భక్తికొలది వాడు. అనగా పిండి కొలది రొట్టె యన్నట్లు. తన పట్ల జీవులు ఎంతగా భక్తి చూపుదురో అంతగా వారిపట్ల అనుగ్రహము చూపువాడని  భావము.
          చేరదీసిన వారి చేతి బిడ్డవంటి వాడు. బట్ట బయటి  ధనము వంటివాడు. పట్ట పగలు వెలుగువంటి వాడు. ఇదిగో అటువంటి పరమాత్ముడు మన ఎదుటనే ఉన్నాడు.
          పరమాత్ముడు పచ్చిపాలలో వెన్నవంటి వాడు. పైపూత వలన వస్తువులు తళతళ లాడుచు ఉండును. అట్టి పైపూతలేమీ లేని  ప్రకాశవంతుడు పరమాత్ముడు. స్వర్ణవ్యాపారి చేతిలోని గీటురాయి వంటివాడు పరమాత్ముడు. స్వర్ణవ్యాపారి గీటురాయితో బంగారము వన్నె తెలిసికొనును. అట్లే భక్తుని అంతరంగమును తెలిసికొని అనుగ్రహమును చూపును.
          పలుకులలోని తేట పరమాత్ముడు భక్తికి తగిన ఫలములనిచ్చువాడు. శ్రీ వేంకటాద్రిపై నెలకొన్న పరమాత్ముడు బలిమి, ఎలిమి తానె అయి జీవులకు ప్రాణమైనాడు.

ఒక్కడే మోక్షకర్త ఒక్కడే శరణాగతి – దిక్కని హరిగొల్చి బదికిరి తొంటివారు



ఒక్కడే మోక్షకర్త ఒక్కడే శరణాగతి – దిక్కని హరిగొల్చి బదికిరి తొంటివారు.   !!
నానా దేవతలున్నారు నానాలోకములున్నవి – నానా వ్రతాలున్నవి నడిచేటివి.
జ్ఞానికి గామ్యకర్మాలు జరిపి పొందేదేమి – ఆనుకొన్న వేదోక్తాలైనా నాయగాక!  !!
ఒక్కడు దప్పికి ద్రాపు వొక్కడు కడవ నించు – నొక్క డీదులాడు మడుగొక్కటి యందే,
చక్క జ్ఞానియైనవాడు సారార్ధము వేదమందు – తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా ?  !!
ఇది భగవద్గీతార్ధమిది యర్జునునితోను – యెదుటనే ఉపదేశమిచ్చె గృష్ణుడు,
వెదకి వినరో శ్రీ వేంకటేశు దాసులాల బ్రదుకుద్రోవ మనకు పాటించి చేకొనరో!   !!
భావం:
మోక్షమునకు కర్తయైనవాడు శ్రీహరి ఒక్కడే. అతనిపై భక్తీ ఒక్కటే శరణాగతి. ప్రాచీనులైన భక్తులెందరో హరి ఒక్కడే దిక్కని నమ్మి సేవించి ధన్యులైరి.
ఎందరో దేవతలున్నారు, ఎన్నో లోకములున్నవి, ఎన్నో వ్రతములున్నవి ఆయా దేవతలను తృప్తిపరచుటకు, స్వర్గాది ఫలములను ఆశించి చేయు కామ్యకర్మలు వేదములో చెప్పబడినవే. అయినను జ్ఞానికి అనిత్యములగు స్వర్గాది సుఖములపై ఆశ ఉండదు.
మడుగులో నీటిని ఒకడు దాహము దీర్చుకొనుటకు, ఒకడు కడవ నింపుకొనుటకు, ఒకడు ఈత కొట్టి విహరించుటకు ఉపయోగింతురు. ఇట్లు జనులు వారి కోరికలకనువుగా ప్రవర్తింతురు. అట్లే విశాలమైన వేదములలో ఎన్నో విషయములు చెప్పబడి యున్నవి. అందులోని జ్ఞానార్ధమును మాత్రమె జ్ఞానవంతుడు చేపట్టును, తక్కినవాటి జోలికి పొడనుట
ఇదియే భగవద్గీత లోని భావము. దీనినే అర్జునునకు శ్రీ కృష్ణుడు ఉపదేశించెను. శ్రీ వేంకటేశ్వరుని దాసులారా! ఈ విషయమును సావధానముగా వినుడు. మనకు జీవనమార్గమిదియే, దీనిని పాటించి ధన్యులు కండు.
గీతా సారమును అన్నమయ్య సంక్షిప్తంగా ఇందులో విశదీకరించినాడు.

Saturday 14 June 2014

నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని – ఉన్నవాడనిక వేరే ఉపాయమేమిటికి - అన్నమయ్య కీర్తన



నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని – ఉన్నవాడనిక వేరే ఉపాయమేమిటికి ?
గతియై రక్షింతువో కాక రక్షించవో అని మతిలోని సంశయము మరి విడిచి,
ఇతరులచే ముందర నిక నెట్టౌదునో యని వెతతోడ దలచేటి వేరపెల్లా విడిచి . !!
తిరమైన నీ మహిమ తెలిసేవాడ ననే గరువము తోడి ఉద్యోగము విడిచి,
వెరవున నీ రూపు వెదకి కానలే ననే గరిమ నలపు నాస్తి కత్వమును విడిచి.!!
ద్రువమైన నా చేతకు తోడు దెచ్చుకొనే ననే ఆవల నన్యుల మీది యాస విడిచి
వివరించలమేల్మంగ  విభుడ శ్రీవెంకటేశ తవిలితినా పుణ్యమంతయు  నీకు !!
భావం:
దేవా! నీవే గతి యని నమ్ముకొని నా విశ్వాసమంతయు నీ పైననే నిలుపుకొని యున్న నాకు వేరుపాయ మెందుకు?
నీవు నాకు దిక్కయి కాపాడుదువో  కాపాడవో అన్న నా మనసులో సందేహమును పూర్తిగా విడిచి పెట్టాను. ఇకమీదట ఇతరులవలన ఎట్టి అపకారమునకు గురి అగుదునో అన్న దిగులుతో మనసులోని భయమెల్ల విడనాడి నిర్భయముగా నున్నాను.
స్థిరమైన నీ ప్రభావము నంతయు నాకే తెలుసునన్న గర్వమును విడిచి నీ మహిమలు ఊహాతీతములని గుర్తించి గర్వరహితుడనైనాను. నీ రూపమును వెదకి కనుగొన లేకపోయాననే నాస్తిక భావమును వదలి, నిన్ను నమ్మకముతో సేవించి, నిన్ను కనుగొన గలననే ఆస్తిక భావముతో నున్నాను.
నేను చేసే నీ సేవా కార్యక్రమములకు పరుల సహాయము తెచ్చుకొందునన్న ఆశను విడిచిపెట్టాను. అలమేల్మంగకు విభుడవైన శ్రీ వేంకటేశ్వరా నిన్ను మనసార తలపోసి నేనార్జించిన పుణ్యమంతయు నీకు సమర్పించి నిన్నే ఆశ్రయించినాను. కావున నీవు నన్ను రక్షింపక తప్పదని అన్నమయ్య ఈ కీర్తనలో అత్యద్భుతంగా విశదీకరించాడు.

Monday 9 June 2014

కనువిప్పు (కధ)

కనువిప్పు  (కధ : పొన్నాడ లక్ష్మి)
“అత్తయ్యా! గబ గబా తెమలండి. ఆటో వాడు వచ్చేసాడు . శారదా! నువ్వు అలా కూర్చోకపోతే అత్తయ్యకి కొంచెం సాయం చెయ్యకూడదే” అంటూ అత్తగారిని, ఆడపడుచుని తొందర పెట్టింది లక్ష్మి. అందరికన్నా చిన్నది, ఆఖరిది అయిన శారద అంటే లక్ష్మికి చనువుతో  కూడిన అధికారం. మేనరికమేమో ఆడబడుచు, వదినగారు అన్న బేధం లేకుండా అభిమానంగా ఉంటారు. లక్ష్మి భర్త రమణ భువనేశ్వర్లో ఒక ప్రైవేటు సంస్థలో  ఉద్యోగం. మరిది ప్రకాష్ కి  కూడా అక్కడే బ్యాంకులో ఉద్యోగం. ఇద్దరు కొడుకులూ  అక్కడే ఉండడం వలన తండ్రి పోయిన తరువాత తల్లి కాంతమ్మ ఆ కొడుకు దగ్గర, ఈ కొడుకు దగ్గర ఉంటూ ఉంటుంది.
శారద హైదరబాదు లో ఉంది. తల్లిని చూడ్డానికి వచ్చి పెద్దన్నగారింట్లో రెండు రోజులుండి చిన్నన్నదగ్గరకి బయల్దేరింది. కూతురున్న రెండు రోజులూ  కలసి ఉండొచ్చని తాపత్రయంతో కాంతమ్మ కూడా చిన్న కొడుకింటికి బయల్దేరింది.
ఆటోవాడు హారన్ మోగిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు మరీ తొందర పెట్టేస్తారు. వాళ్ళడిగిన సొమ్ము ఇచ్చినా కూడా నిమిషం నిలబడరు. అని లక్ష్మి సణుక్కుంటూ అత్తగారి బ్యాగు పట్టుకుని కిందికి వచ్చి ఆటోలో బ్యాగు పెట్టింది. కాంతమ్మ, శారద నెమ్మదిగా వచ్చి ఆటో ఎక్కారు. ప్రకాష్ ఇంటికి రమణ ఇంటికి నాలుగైదు కిలోమీటర్లు దూరముంటుంది. అక్కడికి చేరాక  శారద కాంతమ్మని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లోనికి తీసుకెళ్ళింది. లక్ష్మి ఆటోవాడికి డబ్బులిచ్చి వెనకాలే తనూ వెళ్ళింది. తోటికోడలుతో, మరిది పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసి లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసింది.
“ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావా? తలబద్దలైపోతూంది, అంటూ రమణ ఆఫీసు నుండివచ్చి సోఫాలో కూలబడ్డాడు. గబ గబా కాఫీ కలిపి భర్తకిచ్చి పక్కన కూర్చొని కబుర్లు చెప్తూంది. “అవునూ ! మా అమ్మ, శారద మా తమ్ముడు  ఇంటికి వెళ్ళారా?” అని అడిగాడు రమణ.  “ఆ నేనే వెళ్లి ఆటోలో దిగబెట్టి వచ్చాను” అంది లక్ష్మి. కాసేపు పిచ్చాపాటి అయ్యాక లక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది. భోజనాలయ్యేక  ఓ గంట టి.వి. చూసి నిద్రకుపక్రమించేరు భార్యాభర్తలు.  
రాత్రి పది గంటలకి లక్ష్మి తోటికోడలు  భాను ఫోన్ చేసింది. “అత్తయ్యగారి బ్యాగు అక్కడ ఉందా? మందులు వేసుకుందామని చూస్తే లేదు”. అని అడిగింది. లక్ష్మికి గుండె గుభేల్మంది. “ఇక్కడ లేదమ్మా. శారద గాని లోపల పెట్టిందోమో చూడు”. అని చెప్పి ఫోను పెట్టేసింది. ఆ బ్యాగు తనే పట్టుకుని ఆటోలో పెట్టింది. అక్కడ దిగి
వాళ్ళింట్లోకి వెళ్ళినప్పుడు బ్యాగు ఆటోలో మర్చిపోయింది. “ఏమిటి సంగతి? ఎక్కడినుంచి ఫోను?” అని రమణ అడిగేడు. విషయం చెప్పగానే నిద్రంతా ఎగిరిపోయింది. “ఏమిటీ? ఆటోలో బ్యాగు మర్చిపోయావా? ఆటో దిగి సినిమాకి వెళ్ళినట్లు చేతులూపుకుంటూ లోపలి కి  వెళ్ళిపోయావా? అంత పెద్ద బ్యాగు ఎలా మర్చిపోయావు?” అని భార్యమీద విరుచుకుపడ్డాడు. నేను మర్చిపోయాను సరే; మీ  చేల్లెలికైనా గుర్తుండాలి కదా? అన్నింటికీ నా మీద అరుస్తారు” అంది లక్ష్మి కోపంగా. “చేసిన వెధవ పనికి ఇంకా సమర్ధింపు కూడాను”. అని  రమణ విసుక్కున్నాడు. “సరే పొద్దున్న ఏదో ఆలోచిద్దాంలే.  వచ్చిపడుకో” అన్నాడు రమణ పక్కమీద వాలుతూ.
ఆ బ్యాగులో కాంతమ్మ మంచి బట్టలు, అయిదారువేల దాకా డబ్బు, ముఖ్యంగా పెన్షన్ పుస్తకము ఉన్నాయిట. దాని కోసం ఎంతో తంటాలు పడాలి అని ప్రకాష్ కూడా విసుక్కున్నాడుట.
రెండు రోజులు గడిచాయి. ఆరోజు సాయంత్రం శారద తిరుగు ప్రయాణం. ఆదివారం అవడం మూలాన రమణ ఇంట్లోనే వున్నాడు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది.  భోజనానికి కూర్చోబోతుంటే కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ ఎండలో ఎవరా అని తలుపు తీసింది లక్ష్మి. గుమ్మంలో వున్న ఆటో వాడిని చూసి ఆశ్చర్యపోయింది. “అమ్మా. ఆ రోజు ఈ బ్యాగు నా ఆటోలో మర్చిపోయారు. మీ తర్వాత ఎందరో ఆటో ఎక్కి దిగారు. బ్యాగు ఎవరిదో తెలియలేదు. ఈ రెండు రోజులు ఆలోచించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ రోజు మీరు ఏదో చిరాకు పడుతూ ఈ బ్యాగు ఆటో వెనక సీట్లో పెట్టడం, ఆ వెనక మామ్మగారు, ఇంకో అమ్మగారు నెమ్మదిగా వచ్చి కూర్చోవడం, మిమ్మల్ని సత్యనగర్ లో  దించడం జ్ఞాపకం వచ్చాయి. ఈ బ్యాగు పోయిందని మీరెంత కంగారు పడుతున్నారో అని వెంటనే వచ్చాను.” అని బ్యాగు చేతిలో పెట్టాడు. లక్ష్మికి నోటమాట రాలేదు. “మరి నాకు సెలవు ఇప్పించండమ్మా. మా అబ్బాయికి రెండు రోజులుగా చాలా జ్వరంగా వుంది. డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి.” అన్నాడు. శారద బ్యాగు లోపలి తీసుకువెళ్ళి జిప్పు తెరచి చూసింది. అన్నీ ఎలా పెట్టినవి  అలాగే వున్నాయి. అందరం ఎంతో సంతోషించారు. రమణ సంతోషం కొద్దీ అయిదువందల రూపాయలు ఇస్తే అతను తీసుకోలేదు. ‘మీ బ్యాగు మీకు అప్పగించగలిగాను. అది నా బాధ్యత’ అని నిరాకరించాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి పిల్లలకి ఏమైనా కొనిపెట్టు. ఆ బ్యాగులో విలువైనవి చాలా వున్నాయి. పోతే చాలా ఇబ్బంది పడివుందుము. అని బలవంతంగా సొమ్ము అతని చేతిలో పెట్టారు. ‘వస్తానమ్మా’ అని అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఆటో వాళ్ళమీద చిన్న చూపుతో ఎన్నోసార్లు  విసుక్కున్న లక్ష్మి అతని ఉన్నతమయిన వ్యక్తిత్వం ముందు సిగ్గుతో తలదించుకుంది. తను ఆటవాళ్ళ గురించి ఎంత తప్పుగా ఆలోచించింది. కనువిప్పు కలిగిన లక్ష్మి  మౌనంగా లోపలికి  దారితీసింది.
(యదార్ధ సంఘటనకి ఆధారంగా రాసిన కధ).

నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన – ఈనెపాన రక్షించీ నీశ్వరుడే కాక - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన :

నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన – ఈనెపాన రక్షించీ నీశ్వరుడే కాక.

ఎవ్వరు బుద్ధి జెప్పిరి ఇలపై జీమలకెల్లా – నెవ్వగ బుట్టలుగొల్చు నించుకొమ్మని,
అవ్వల సంసార భ్రాంతి అనాదినుండియు లోలో దవ్వించి తలకెత్తే యంతర్యామే కాక !

చెట్టులకెవ్వరు బుద్ధి చెప్పేరు తతికాలాన – బుట్టి కాచి బూచి నిండా బొదలుమని,
గుట్టుతో జైతన్యమై గుణము లన్నిటికిని తిట్ట పెట్టి రచించిన దేవుడింతే కాక!

బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు – తిద్ది చన్నుదాగి పూరి దినుమని,
పొద్దు పొద్దు లోననుండి భోగములు మఱపిన – నిద్దపు శ్రీవేంకటాద్రి నిలయుడే కాక!

భావం:

సృష్టిలో స్నేహము గల జీవులనేకములున్నవి. నేననగా ఎంతవాడిని. అందరినీ కాపాడినట్లు నన్నీనెపమున ఆ పరమేశ్వరుడు కాపాడుచున్నాడు.

ఇలలో చీమలు అతి ప్రయత్నముతో తమ పుట్టలను ధాన్యముతో నింపుకొనుచున్నవి. అట్లు చేయవలెనని వాటికి ఎవరు నేర్పారు? అనాదిగా జీవుల అంతరంగములో సంసార భ్రాంతి కలిగించి సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడే వాటికాబుద్హి నేర్పి బ్రతుకు తెరువు చూపించాడు.

అదను తప్పక మొలకెత్తి, పూచి కాచి సంపూర్ణముగా వృద్ధి పొందమని చెట్లకు ఎవరు నేర్పారు? సృష్టిలో నిగూఢముగా నున్న చైతన్యమే వాటి కాయాగుణములను కలిగించి దేవుడే చెట్టు చేమలకట్టి స్థితిని కల్పించాడు.

పుట్టిన జంతువుల కన్నిటికి వెంటనే చనుబాలు గ్రోలి, కసవు మేసి బ్రతుకమని నేర్పిన వారెవరు? ప్రతినిత్యము అంతరంగములో నుండి ప్రేరకుడై ఆయా ప్రాణులకు ఆయా భోగములు అమర్చిన దయామయుడైన శ్రీ వేంకటేశ్వరుడే ఆపని చేయుచున్నాడు.

నారుపోసిన దేవుడే నీరు పోయునన్నట్లు జీవులను సృష్టించిన భగవంతుడే వారి పోషణాది ప్రవృత్తులకు హేతువగుచున్నాడు. అన్నమయ్య తాను సంకీర్తనాచార్యుడై, అనుదినము దేవుని మహిమను కీర్తించుచూ జీవించుటకు కారణము ఆ నెపమున తన్ను రక్షింపబూనిన పరమేశ్వరుడే అని ఈ కీర్తనలో వ్యక్తపరిచెను.