Monday 28 August 2023

అసమాన నటి సూర్యకాంతం

 


   అసమాన నటి  సూర్యకాంతం. 

 

సూర్యకాంతం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాలని ఉంది. జగమెరిగిన  బ్రాహ్మణునకు జంధ్యమేల అని అంటారు అలాగ సూర్యకాంంతం గారి గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.  


నా చిన్నప్పటి నుంచి ఆమె పోషించిన పాత్రలను అనేక చిత్రాలలో చూసాను. కేవలం గయ్యాళి అత్తగా మాత్రమే కాక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆమె పోషించారు.  కన్యాశుల్కం లో బాలవితంతువుగా ఎంతో బాగా నటించారు. చక్రపాణి లో మనోరమ అక్కయ్యగా హాస్యం పండిస్తూ దేనికైన “అంతొద్దు సగం చాలు” అంటూ, భానుమతికి మంచి సలహాలిస్తూ చాలా సహజంగా ఆ పాత్రను పోషించారు.  తోడికోడళ్ళు చిత్రంలో అనసూయగా అసూయను అద్భుతంగా నటించారు. అలాగే వాగ్దానం చిత్రంలో బాలామణి పాత్రలో తంపులమారిగా ఉన్నా తన భర్త రేలంగి గారు హరికథ చెప్తున్నపుడు పక్కవాయిద్యం వయొలిన్ వాయిస్తూ నిజంగా వైయొలిన్ కళాకారిణిలాగే హావభావాలు అద్భుతంగా ప్రదర్శించారు.

 

ఇంక చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో వర్ధనం పాత్రలో తనభర్తకి ఎవరో అమ్మాయిపై మనసున్నదని అనుమానం పడుతూ భర్తని(రేలంగి) అలరించడానికి వయసులో ఉన్న పిల్లలా తయరయ్యి దగ్గరకు వస్తుంది. అక్కడ ఆమె ప్రదర్శించిన సిగ్గు, బిడియం, వయ్యారం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. ఎప్పుడూ నోరు పెట్టి రాక్షసిలా పడిపొయే సూర్యకాంతం గారు ఇద్దరుమిత్రుల చిత్రంలో అతి కోపిష్టి   భర్త(రేలంగి) కి అడుగులకి మడుగు లొత్తుతూ నోరు మెదపకుండా అతని ధాటికి హడిలిపోతూ అణిగిమణిగి ఉండే ఇల్లాలిలా అతి సహజంగా నటించారు. బాటసారి చిత్రంలో నాగేశ్వరరావు గారికి సవతి తల్లి పాత్ర పోషించారు. సవతి తల్లి అయినా వల్లమాలిన ప్రేమ, అనురాగం కొడుకుపై కలిగి చదువుకుందుకి విదేశాలు వెళ్తానంటే అమాయకుడైన తనకొడుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని తను కూడా వెళ్తానంటుంది."అక్కడ ఏమైనా అవాంచనీయ సంఘటను జరిగితే సవితి తల్లిని నిన్ను సరిగా చూడలేదు అంటారు నాయనా"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని మధన పడుతుంది. అద్భుతమైన నటన అక్కడ చూపించారు. 


అలాగే మూగమనసులలో కూడా సావిత్రి గారికి సవతితల్లి పాత్ర పోషించినా మాట కరుకుగా ఉన్నా  కూతురి మీద అభిమానం, ఆమె భవిష్యత్తు  గురించి ఆరాటం  చాలా చక్కగా అభినయించారు.  'అంతా మనమంచికే'  చిత్రంలో  సంఘసంస్కర్త లీలారావు పాత్రలో తనకేమీ తెలియకపోయినా తెలిసినట్లు ఆర్భాటం చేస్తూ రామయణంలో ద్రౌపది గురించి సభలో మాట్లాడి అపహాస్యం పాలయి మనందరినీ నవ్విస్తుంది. ఆమె గయ్యాళి పాత్రలో నటిస్తున్నా ఎడం చెయ్యి తిప్పుతూ   తన సహజ శైలిలో ఆంగిక ప్రదర్శన చేస్తూ సునుశితమైన హావభావాలను ప్రకటిస్తారు. అది ఆమె గొప్పదనం.  

ఆమె నటన అతి సహజం. ఆమె వాచికం అత్యద్భుతం. ఆమె మన తెలుగువారికి భగవంతుడు ప్రసాదించిన వరం. 

ఆమెకు ఆమే సాటి. అటువంటి సహజనటిని ఇంతకుముందు చూడలేదు. ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారని ఆశలేదు.

-- పొన్నాడ లక్ష్మి