Saturday, 9 July 2022

నిరీక్షణ భావుక చిత్రకతావల్లరి.

ఒక చిన్న కథ. భావుక చిత్ర కథావల్లరి.

నిర్ణయం.

 

గోదావరి ఎక్ష్ప్రెస్స్ శరవేగంతో ముందుకి సాగుతూంది. కిటికీ దగ్గిర విషణ్ణ వదనంతో కూర్చున్న విశ్వనాథం దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. మాటి మాటికి నిట్టూరుస్తూ  పరసరాలని గమనించలేని స్థితిలో ఉన్నాడు.  పాసిన పాయవు బంధములూ.. ఆశ దేహమునన్నాళ్ళు,   కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగనన్నాళ్ళుఅని ఎంత చక్కగా జీవిత సత్యాన్ని తెలియజేసాడు  ఆనాడే అన్నమయ్య.  అన్నీ తెలిసినా ఏదీ ఒదులుకోలేని దుర్బలులం. ఏ బంధాలనీ తెంచుకోలేక, ఏ మమకారాలనీ మర్చిపోలేక మథనపడే మామూలు మనుష్యులం అనుకుంటూ  తనలో తానే  గొణుక్కుంటున్నాడు.

ఉదయం కొడుకూ, కోడలి సంభాషణ చెవిలో మారుమ్రోగుతూంది.

ఎల్లకాలం ఈ ముసిలాయన్ని మనమే చూడాలా? ఇంకో కొడుకున్నాడుగా.. మీ తమ్ముడికి కూడా బాధ్యత ఉందిగా.. అక్కడికి కొన్నాళ్ళు వెళ్ళమనండి అని కోడలు ఉష తీవ్రంగా అంటూంది.

నీకు తెలుసుగా మా మరదలు ఉద్యోగస్తురాలు. వాళ్ళిద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు. కాలక్షేపం కూడా అవదు. అయినా నాన్నగారికి ముందునుంచీ మన దగ్గరే అలవాటు. మన పిల్లలంటే వల్లమాలిన అభిమానం.  సొంత ఇంటినీ మనవలనీ వదలి ఎక్కడికీ వెళ్ళడము ఆయనికి ఇష్టం ఉండదు”. అన్నాడు కొడుకు భాస్కర్.

అభిమానమా.. పాడా..జరుగుబాటు సంకటం. ఇక్కడ జరిగినట్లు అక్కడ జరగదని భయం.. అందుకని శనిలా మనల్ని వదలడం లేదుఅన్న ఉష మాటలకి భాస్కర్ చాలా ఆవేదన గా చూస్తూఅంత కఠినంగా మాట్లాడకు ఉషా! ఆయన మనస్సు కొంచెం అర్ధం చేసుకో.. అయినా ఆయనకి ప్రత్యేకంగా చేసేదేముంది? మనకి చేసుకున్నదే ఆయనకీను. తన పనులన్నీ తనే చేసుకుంటున్నారు. వేళకింత అన్నం పెట్టడమేగా..” అన్న భర్త మాటలకి  మీకేం మీరలాగే చెప్తారు. మీ అబ్బాయికి కాలేజీకి వెళ్ళే ఏర్పాట్లు, ఇంకా చిన్నది అయిన మీ అమ్మాయి గారాలు, మీ ఆఫీసు వేళకి అన్నీ అమర్చలేక చస్తున్నాను. మధ్యలో మీ నాన్నగారు కాస్త టీ ఇయ్యమ్మా అనో,  పేపర్ ఎక్కడుందమ్మా అనో ఒకటే నస. అందరికీ నేనొక్కదాన్నే అన్నీ అమర్చాలి. నాకేం పది చేతులు లేవుగాఅని విసుక్కుంది ఉష.

విశ్వనాథం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ అయి కొడుకుతో కలి సి ఉంటున్నాడు. భార్య అన్నపూర్ణ అన్నివిధాలా అతనికి అనుకూలంగా ఉంటూ సంసారాన్ని గుట్టుగా నడిపించింది. ముందునించీ పెద్ద కొడుకు దగ్గిరే అలవాటు. ఉద్యోగంలో ఉండగానే ఒక ఇల్లు తమ అభిరుచులకు తగినట్లుగా చిన్నదయినా సదుపాయంగా ఉండేటట్లు  కట్టుకున్నారు. తమకోసం ఒక గది ఏర్పాటు చేసుకుని పొందిగ్గా అమర్చుకున్నారు. ఇంచుమించు ఇంటిపని అంతా అన్నపూర్ణే చూసుకునేది. కొడుకు పెళ్ళయిన కొత్తలో కొత్త కాపురం అనీ, ఆ తరువాత మనవలు చంటివాళ్ళనీ తనే చాల మటుకు చేసుకుపోయేది. కోడలు ఉష కూడా సర్దుకు పోయేది. బదిలీల మీద విశ్వనాథం మరో ఊరు వెళ్ళినా అన్నపూర్ణ మూడొంతులు కొడుకు దగ్గరే ఉండేది.

కాలం ఎప్పుడూ ఒక్కలా సాగదుగా.. రెండేళ్ళ క్రితం అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో ఒక నెల్లాళ్ళు బాధపడి పరమపదించింది.  ఒక ఏడాది ఏదోలా గడిచింది.  తరువాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించింది, ఇంటిపనంతా తనమీదే పడిపోయింది.  వయసు పైబడి మునుపటిలా అంత పని చెయ్యలేకపోయినా చాలా మటుకు కోడలికి సహకారంగా ఉండేది. ముఖ్యంగా విశ్వనాథం కి కావలసినవ్ఝన్నీ తనే చూసుకొనేది.  ఇప్పుడు పరిస్థితి మారింది.  తన భర్తకీ పిల్లలకీ అంటే తప్పదు.  మావగారు విశ్వనాథంకి చెయ్యడం కష్టంగా మారింది. . ఇప్పుడు మావగారి ఉనికి భరించలేకపోతూంది.

విశ్వనాథం చిన్న కొడుకు ప్రకాశ్, అతని భార్య ఆరతి హైదరాబాద్ లో ఏదో మంచి కంపెనీలో  ఉద్యోగం చేసుకుంటున్నారు.  అక్కడే అధునాతనమైన ఒక మంచి ఫ్లాట్ కొన్నుక్కుని, ఉన్న ఒక్క కొడుకునీ హాస్తల్ లో పెట్టి చదివించుకుంటున్నారు.  ఆరతికి ఆధునికమైన జీవనం, క్లబ్ లూ పార్టీలు, స్నేహితులూ ఇష్టం. ఉద్యోగం తరువాత వీటికే ప్రాధాన్యత ఇచ్చేది. బంధువులూ, బంధాలు, భాధ్యతలు అంటే ఆమడ దూరంలో ఉండేది.  అందువల్ల విశ్వనాథం, అన్నపూర్ణ కొడుకు మీద మమకారంతో అక్కడికి వెళ్ళినా అట్టే రోజులు ఉండలేక తిరిగి వచ్చేసేవారు.

అక్కడ తోటికోడలు స్వతంత్రంగా  హాయిగా ఉందని కూడా ఉషకి దుగ్ధగా ఉంది.  అన్నీ కలిసి మావగారి బాధ్యత తనొక్కర్తే  భరిస్తున్నందుకు తను బాధపడుతూ భర్తని సాధిస్తూంది.  ఈమధ్య ఈ ధోరణి చాలా ఎక్కువయిపోయింది.  ఇవన్నీ చూస్తున్న విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు. రోజూ సాయంత్రం వాకింగ్ కి వెళ్తున్నప్పుడు స్నేహితులతో తన గోడు వెళ్ళబోసుకునేవాడు.  చాలా రోజులు మథనపడి, స్నేహితుల సలహాతో  ఒక మంచి వృద్ధాశ్రమంలో చేరిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు.  తనకి ఫించను బాగానే వస్తుంది. ఆశ్రమానికి కొంత కట్టేసినా  మిగతాది తన మందులకీ, మిగతా ఖర్చులకీ సరిపోకపోదు. పిల్లలమీద మనసైతే అప్పుడప్పుడు వెళ్ళిరావొచ్చు.  అప్పుడు వాళ్ళకీ శ్రమ ఉండదు.  నాకూ ఇబ్బంది ఉండదు. నాతోటి వాళ్ళే అక్కడ అందరూ,  కాలక్షేపం బాగానే ఉండొచ్చు అనుకున్నాడు.  కొడుకుతో చెప్తే ఒప్పుకోడని,  ఉత్తరం రాసి పెట్టేసి ఇలా బయటపడి ప్రయాణం చేస్తున్నాడు.

 నీ నిర్ణయం సరైనదేఅన్నట్టుగా ఇంజన్ ఓ పెద్ద కూత కూసింది.

ఎవరి ఆలోచనలతోనూ ప్రమేయం లేకుండా అందరి బరువుబాధ్యతలను మోస్తూ ఉత్సాహంగా ముందుకి సాగిపోతూంది రైలుబండి.

 

 



No comments:

Post a Comment