Monday, 17 August 2026

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు - అన్నమయ్య కీర్తన

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు చూడ-

నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక

కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు


యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-

మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥ఎవ్వరె॥


యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-

కెక్కడో తనజన్మ మీజీవుఁడు

యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యెప్పు-

డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎన్నఁడును జేటులే నీజీవుఁడు వెనక-

కెన్ని దనువులు మోవఁ డీజీవుఁడు

యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి

యెన్ని పదవులఁ బొందఁ డీజీవుడు.


భావం:


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ ఏ జన్మలలో ఎవరెవరికి ఏ ఏ వావిపరుసులతో సంబంధం పడి ఉన్నాడో నిర్ణయించుట ఎవరితరము? విచారించగా జీవులలో ఒకరితో నొకరికి ఎట్టి సంబంధము లేదు.


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించాడు. పూర్వం తానందరికోగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధాల పుత్రమిత్ర కళత్రాది సంబంధాలతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖాలపాలు చేసినాడు.


ఈ జీవుడు తిరగని చోటే లేదు. ముందటి జన్మలలో ఎన్నో చోట్ల పలు రూపులతో జన్మించి తిరిగి ఉన్నాడు. తానున్న జన్మంలో ఇతడు ఎక్కడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మలో మాత్రం తనకి జీవుడు ఏ విధంగా అనుగుచుట్టము కాగలడు? ఇతడు ఎప్పుడు ఎక్కడికి పోవునో తెలియదు కదా!


ఎండి జన్మలో దాలుస్తున్న ఎన్నిసార్లు మరణిస్తున్న నిజంగా ఈ జీవులకు మాత్రం ఎట్టి చేటును లేదు పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు తాను దాల్చిన శరీరములే చేటు వందుతున్నాయి గాని సనాతనుడైన జీవాత్ములకే మాత్రము చేటు లేదు శ్రీ వేంకటేశ్వరుని మహామాయ ప్రభావానికి లోబడి ఈ జీవుడెనో పదవులు పొందుతున్నాడు అని అన్నమయ్య జీవుల జన్మల గురించి వేదాంతపరంగా పై కీర్తనలో వర్ణించినాడు.


- కీ. శీ. సముద్రాల లక్ష్మనయ్య

No comments:

Post a Comment