Thursday 7 August 2014

జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ)

జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ

పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ

చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ
(బాలకృష్ణప్రసాద్  గారు పాడిన ఈ కీర్తన విని ఆనందించండి)


అమ్మా! నువ్వు జయములొసంగే జయలక్ష్మివి, వరములిచ్చే వరలక్ష్మివి, సంగ్రామంలో విజయం 

సమకూరేలా ధైర్యాన్నిచ్చే వీరలక్ష్మివి. శ్రీహరికి ప్రియురాలివై అతనిని కలసితివి.

పాల సమద్రములోని పసనైన (సారవంతమైన) మీగడవు. మేలిమి తామెరపువ్వులోని మంచి సువాసన 

గల దానవు. నీలవర్ణుని వక్షస్థలంపై సిరులతోనిండిన దానవై, లోకములను ఏలే తల్లివి, మమ్మల్ని దయతో 

ఏలవమ్మా!
చంద్రుని తోబుట్టువువై  సంపదలు నిండిన దానివై, సమర్ధవంతమైన బ్రహ్మలను  గాచే కల్పవల్లివి. 

గోవిందుని చేపట్టి తోడునీడగా ఉన్నదానివి. మా ఇంట్లో ఉండవమ్మా!

పదహారు వన్నెలతో గూడిన బంగారు బొమ్మవు నీవు. చెదరని వేదముల చివరనుండే చిగురుబోడివి. 
ఎదురుగా శ్రీ వేంకటేశ్వరుని ఇల్లాలివై ఉన్నావు. నిధులయందుండే తల్లీ! 

నీవారమమ్మా! మమ్మల్ని కటాక్షించు.   


Friday 1 August 2014

ఇట్టి నా వెర్రితనము - అన్నమాచర్య కీర్తన

ఇట్టి నా వెర్రితనము లేమని చెప్పుకొందును ; నెట్టన నిందుకు నగి నీవే దయజూడవే,
పాటించి  నాలో నుండి పలికింతువు నీవు – మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును,
నీటున లోకములెల్లా నీవే యేలుచుండగాను – గాటాన దొరనంటా గర్వింతు నేను. !!
నెమ్మది బ్రజల నెల్లా నేవే పుట్టించ గాను – కమ్మి నేనే బిడ్డల గంటినంటా సంతసింతును,
సమ్మతి నీవే సర్వ సంపదలు నొసగ గాను – యిమ్ముల గడించుకొంటి నివి నే నంటా నెంతు !!
మన్నించి ఇహపరాలు మరి నీవే ఇయ్యగాను ఎన్నుకొని నా తపో మహిమ ఇది యనుచును,
ఉన్నతి శ్రీ వేంకటేశ నన్ను నేమి చూసేవు అన్నిటా నా యాచార్యు విన్నపమే వినవే !!
భావం:
దేవా! నన్ను నిమిత్తమాత్రుడుగా నుంచి నీవే నాచే పనులెల్ల చేయించుచున్నావు, కానీ అది నేను తెలిసికోనలేక వెర్రివాడనై అంతా నా స్వశక్తితో చేయుచున్నానని గర్వించుచున్నాను. ఇట్టి నా వెర్రితనమునకు నవ్వుకొని నీవే నన్ను దయజూడుమా!
నీవే నాలో నుండి పలు పలుకులు పలికించుచున్నావు. నేనది గుర్తింపక నేనెంత చక్కగా మాటలాడ నేర్చితినో చూడండని అహంకరించుచున్నాను. ఈ లోకములనన్ని సమర్దవంతముగా నీవే పరిపాలించుచున్నావు.  కానీ నేనే ఈ లోకముల కెల్లా దొరనని గర్వించుచున్నాను.
జీవులందరినీ పుట్టించు వాడవు నీవే. కానీ ఈ బిడ్డలను కన్నతండ్రినని మిక్కిలి సంతసించుచున్నాను. నాకున్న సంపదలన్నీ నీవిచ్చినవే. కానీ వివిధ ఉపాయములతో నేనే ఈ సిరుల నార్జిన్చుకొంటి నని తలంచుచున్నాను.

నన్ను మన్నించి ఇహపరములు నీవే ఇచ్చినావు. కానీ నా తపో మహిమ వల్ల వీటిని స్వాధీనము జేసికొంటినని భావించుచున్నాను. ఓ మహోన్నతుడైన శ్రీ వేంకటేశ్వరా !ఇంత  అజ్ఞానముతో విర్రవీగుతున్న నన్నేమి చూసేవు? కరుణామయుడవైన నీవిది చిత్తములో నుంచుకొనక ఈ దీనుని కాపాడుమని  నీతో నా గురుడు చేసిన విన్నపము విని నాపై దయ చూపుము. 

విజాతులన్నియు వృధా వృధా - అన్నమాచర్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన: విజాతులన్నియు వృధా వృధా..
          విజాతులన్నియు వృధా వృధా.- అజామిళాదుల కదియే జాతి.
౧.       జాతి భేదములు శరీర గుణములు
జాతి శరీరము సరి తోడనే చెడు,
          ఆతుమ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషంబనాది
           ఈతల హరివిజ్ఞానపు దాస్యం - బిది యొక్కటే పొ సుజాతి.  // విజా //
౨.       హరి ఇందరిలో నంతరాత్ముడిదే
          ధరణి జాతి బేధము లెంచ
          పరమయోగు లీభావ మష్టమదము భవనికారమని మానిరి
          ధరణిలోన బరతత్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి  //  విజాతి //
౩.       లౌకిక వైదిక లంపటులకు నివి
          కైకొను నవశ్య కర్తవ్యంబులు,
          శ్రీకాంతుడు శ్రీవేంకటపతి సేసిన సంపాదనమిందరికి
          మేకొని ఇన్నియు మీరినవారికి నీ నామమే సుజాతి  // విజాతి //
భావం:
          విభిన్నములైన జాతులన్నీ వ్యర్ధములే. అజమిళుడు మొదలగు కులభ్రష్టులైన వారిదే జాతి?
          జాతులలో కల భేదములన్నియు అశాస్వతమైన శరీరమునకు మాత్రమే! శరీరము నసించినంతనే అవియు నశించును. కానీ ఆత్మ ఎప్పుడూ పవిత్రమైనది. ఆత్మకు ఏ దోషములూ ఉండవు. అట్టి ఆత్మజ్ఞానముతో హరినెరిగి చేయు దాస్యమొక్కటే ఉత్తమజాతి లక్షణము.
          అదిగో! శ్రీహరి అన్ని జీవులలో అంతరాత్ముడై ఉన్నాడు ఆ పరమాత్ముని ధ్యానించు పరమ యోగులు లోకములో జాతి భేదములను ప్రధానముగా పాటించు అష్టమదములతో గూడి, మాయామయమైన సంసారమునకు సంభందించిన తిరస్కారభావమనియు తెలిసి జాతిభేదద్రుష్టిని విడనాడిరి. కావున పరతత్వమునేరిగి ధర్మములను పాటించుటే ఉత్తమజాతి లక్షణమగును.

          లౌకిక కార్యములలోనూ, వైదికాచారములలోనూ తలమునుకలై తపించువారికి మాత్రమే జాతిభేదములు పాటింప దగినవై ఉన్నవి. లక్ష్మీకాంతుడైన శ్రీ వేంకటేశ్వరుడు తనమాయచే జీవులకొసగిన సంపదలు. దేవా! ఈమాయను దాటి సదా మిమ్ము ధ్యానించు వారికి నీ నామ సంకీర్తనమొక్కటే సుజాతి లక్షణము.