Sunday 25 December 2016

పితృదేవోభవ

పితృదేవోభవ

మా ‘అమ్మ’ మళ్ళీ నా ఇంట్లో పుట్టిందని మురిసిపోయిన నాన్నగారు
వాళ్ళమ్మ పేరు పెట్టుకుని ‘అమ్మా’ అని పిలుస్తూ ఆప్యాయతనందించిన నాన్నగారు
అమ్మ ఎప్పుడయినా కసిరితే ‘మా అమ్మని కోప్పడకు’ అని మందలించిన నాన్నగారు
అర్ధరాత్రి లేచి మందులువేసి భుజంమీద వేసుకుని తిప్పి నిద్రపుచ్చిన నాన్నగారు
తనతోపాటు నన్ను వెంటతిప్పుకుని విజ్ఞానాన్ని పంచి పెంచిన నాన్నగారు
బంగారు పాపాయి బహుమతులు పొందాలి అని నన్ను చూసి పాడుకునే నాన్నగారు
చిన్న వయస్సులోనే పుట్టెడు బాధతో తీరని బాధ్యతలతో మందులేని
కర్కటరోగంతో వైకుంఠ ఏకాదశినాడు కన్నుమూసిన నాన్నగారు

(మా నాన్నగారి జ్ఞాపకాలతో – పొన్నాడ లక్ష్మి)

(చిత్రలేఖనం : మా శ్రీవారు Pvr Murty )

అబల కాదు సబల

No automatic alt text available.

అబల కాదు సబల

నన్ను ప్రేమిస్తే నా హృదయం పూలపాన్పు
కాదని నిరసించితివా నా ఎద కఠిన శిల

నన్ను అనురాగంతో చేరదీస్తే నీ పాదదాసిని
కాదన్నచో నీపాలి నిరంతర అశాంతిని

నన్ను దయగా చూచితివా వరాలిచ్చే దేవతను
నిర్దయగా హింసిస్తే నీపాలి మృత్యుదేవతను

నన్నాదరించి ఆప్యాయతను పంచితివా
నిన్ను శిరసున నుంచి పూజింతును

నన్ను విడనాడినా నే బ్రతుకలేను
నిన్నే నమ్మిన నన్ను కాధన్నా నిన్ను బ్రతకనివ్వను

రచన : పొన్నాడ లక్ష్మి
(చిత్రం : Pvr Murty గారు)

జీవితం



జీవితం
అలలా పడుతూ లేస్తూ సాగేదేరా జీవితం
ఏటికి ఎదురీదుతూ చేసే పడవ ప్రయాణం జీవితం
కష్టాలనూ కన్నీళ్ళనూ దిగమింగుతూ నడిపేదిరా జీవితం
ఒడుదుడుకులను దాటుకుంటూ ఒడ్డుకు చేరేది జీవితం
వడ్డించిన విస్తరి కాదురా జీవితం
మనకై మనం సాధించుకునేదే జీవితం.
పరచిన పూలపాన్పు అసలేకాదురా జీవితం
ముళ్ళబాట నధిగమిస్తూ ముందుకు సాగేది జీవితం.
నిరంతర కృషి చేస్తూ ఎదిగేదేరా జీవితం
ఎదురొచ్చిన సమస్యలను పరిష్కరించు కోవడమే జీవితం.
బాధ్యతలను విస్మరించి పారిపోవడం కాదురా జీవితం
అయినవారిని ఆదుకుని అక్కున చేర్చుకునేదే జీవితం
అందమయిన ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభూతి పొందడమేరా జీవితం
ఆనందాన్ని మాత్రమే అందరికీ పంచుతూ మనిషిగా మసలడం జీవితం
నీకు తెలిసినది నలుగురికీ పంచడమేరా జీవితం
నిన్ను నమ్ముకున్నవారికి న్యాయం చేయడం జీవితం
పొన్నాడ లక్ష్మి (11.12.2016)

ఆశాజీవులు


Image may contain: drawing

ఆశాజీవులు
పై వంతెన క్రింద ప్లాస్టిక్ గుడారాల్లో
ప్రకృతి ప్రకోపాలకి బలైపోతున్న బడుగుజీవులు
చింపిరి జుత్తులతో జీర్ణవస్త్రాలతో
అలనాపాలనా లేని అనాధ బాలలు
వార్తాపత్రికలకే పరిమితమయిన
పధకాలను అందుకోలేని నిర్భాగ్యులు
సంఘసంస్కరణల ముసుగులో జరిగే అవినీతిని
నిర్మూలించలేని నిస్సహాయులు
జీవిత చరమాంకంలో చేయూతకోసం
పరితపించే విధివంచితులు
కళాత్మక చిత్రాల వెండితెర దర్శకులకు
కధాంశాలు వీరి బతుకులు
ఉందిలే మంచికాలం ముందుముందునా
అనుకుంటూ ఎదురుచూసే ఆశాజీవులు
ఎందరో ఎందరెందరో …. … !!
- పొన్నాడ లక్ష్మి
చిత్రం : శ్రీ Pvr Murty గారు

వేరొక్కరూ లేరు విశ్వమంతా నీ మహిమే - అన్నమయ్య కీర్తన

అర్జునుడు ద్వారకనుండి వచ్చి ధర్మజునితో శ్రీకృష్ణ నిర్యాణం వార్తా తెలియబరుస్తూ చెప్పిన పద్యం.
 చెలికాడ! రమ్మని చీరు నన్నొకవేళ మన్నించు నొకవేళ మరది యనుచు
బంధుభావంబున బాటించు నొకవేళ దాతవై యొకవేళ ధనము లిచ్చు ,
మంత్రియై యొకవేళ మంత్ర మాదేసించు, బోధి యై యొకవేళ బుద్ధిసెప్పు,
సారధ్య మొనరించు జన విచ్చి యొకవేళ గ్రీడించు నొకవేళ , గెలిసేయు,
నొక్క సయ్యాసనంబున నుండు గన్న తండ్రి కైవడి జేసిన తప్పు గాచు,
హస్తములు వట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ! మాధవు మరవ రాదు.
శ్రీకృష్ణునికి తనపై గల అభిమానం, వాత్సల్యం, చనువు తలచుకుని అర్జునుడు దుఖిస్తాడు. ఒకమాటు చెలికాడా అని ఆత్మీయంగా పిలిచి, ఒకమాటు గురువై కర్తవ్యాన్ని బోధించి, ఇంకొకమాటు మంత్రియై హితోపదేశం చేసి, మరొకమాటు ఒక శయ్యపై కూర్చోబెట్టుకుని కన్నతండ్రి వలె తప్పులు సరిదిద్ది ఆదరించేవాడు. అటువంటి మాధవుని మరచిపోవడం ఎలా అని విచారిస్తాడు.
ఇంచుమించు ఇదే భావం అన్నమయ్య ఈ కీర్తనలో వ్యక్తీకిరించాడు:
వేరొక్కరూ లేరు విశ్వమంతా నీ మహిమే
ఏ రీతి నీవే కలవు ఇతరము లేదు !!
తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు
ఇల్లాలివై మోహం ఇత్తువు నాకు
వొళ్లయిపెరుగుదువు ఒగి పొర వ్రతమవుదువు
ఇల్లుమున్గిలై ఉందువు ఇంతా నీ మహిమే !!
గురుడవై బోధింతువు కొడుకువై ఈడేర్తువు
అరుదై నిదానమౌ అవుదువు నీవే
దొరవై నన్నేలుదువు దూతవై పనిచేయుదువు
ఇరవై సిరులిత్తువు ఇంతా నీ మహిమే !!
దేవుడవై పూజగొందువు దిక్కు ప్రాణమవుదువు
కావలసినట్లవుదువు కామిన్చినట్లు
శ్రీ వెంకటేశ నీవే చిత్తము లోపలినుండి
ఈవల వైకుంఠమిత్తువు ఇంతా నీ మహిమే !!

Friday 2 December 2016

ఎదురీత


ఎదురీత
బాల్యం లో చిలిపిచేష్టలు, అల్లర్లు, అలకలు లేవు.
కుమారిదశ లో చెప్పుకోదగిన ముద్దుముచ్చట్లు లేవు.
యౌవన దశ లో త్రుళ్ళిపడుతూ , కాలేజి లో చేసే హంగామాలు అసలే లేవు
తీపి కలలతో, ఎన్నో ఆశలతో అడుగిడిన సంసారంలో ఆనందానుభూతులు లేవు.
అడుగడుగునా ఆంక్షలు, అనుమానాలు, అవరోధాలతో అడుగంటిన అభిరుచులు.
ఎన్నో నిద్రలేని రాత్రులు, నాలో నేనే పడే మానసిక ఆవేదన.
అయినా అదేమి విడ్డూరమో నా కంటిలో నీరు రాదు.
నా మనసు ఓటమిని అంగీకరించదు.
ఏటికి ఎదురీది నా వ్యక్తిత్వం నిలుపుకుంటాను.
స్వయంకృషి తో నేర్చుకున్న విద్యలని గంగపాలు కానివ్వను.
నేనంటే ‘నేనే’ అని ఏనాటికయినా నిరూపించుకుంటాను.
రచన: పొన్నాడ లక్ష్మి.
చిత్రం : Pvr Murty గారు

ప్రియతమా - కవిత

ఒక అత్మీయురాలి ఆవేదనకు స్పందించి రాసిన నా మొదటి కవిత.
ప్రియతమా!
ఒక్కోసారి వెల్లువలా వచ్చి నన్నల్లుకుని అంతులేని అనురాగంలో ముంచెత్తుతావు.
ఒక్కోసారి అంతులేని దూరానికి నన్ను నెట్టేసి నిర్లిప్తంగా మారిపోతావు.
అప్పుడే నాకు కలుగుతుందో చిన్న సందేహం!
నీమదిలో ‘నేను’ నేను మాత్రమె ఉన్నానుకొంటే అదొక మదురమైన మరపురాని అనుభూతి
వేరొకరు నీ ఆలోచనల్లోనైనా చోటుచేసుకున్నారనిపిస్తే అంతులేని ఆవేదన నాకు.
నిన్ను నిలదీస్తే నాదంతా ఒట్టిభ్రమ అంటావు.
భ్రమే అనుకో! దరిచేర్చుకుని నీ ప్రేమపాశంతో బంధించి లాలించ వచ్చుగా!
కానీ నీలో కనిపించే నిర్లక్ష్యబావన నన్ను నిలువునా దహించివేస్తూంది.
నా సేవలు నిన్ను తృప్తి పరచటం లేదా? నా అనురాగంలో వెలితి కనిపిస్తూందా?
ఏమిటి నా నేరం? ఎందుకు నాకీ శిక్ష!
- ponnada lakshmi