అన్నమయ్య కీర్తన
ఇన్నిటికినీశ్వరేచ్ఛ- యింతే కాక
తన్నుదానే హరిగాచు- దాసుఁడైతే జాలు.
ప్రకృతిఁబుట్టిన దేహి- ప్రకృత (తి?) గుణమే కాని
వికృతి బోధించబోతే- విషమింతే కాదా!
ఒక విత్తు వెట్టితే వేరొకటేల మొలచును?
ప్రకటమైన వట్టి- ప్రయాసమే కాక.
పాపానఁ బుట్టిన మేను- పాపమే సేయుంచుగాక!
ఏపునఁ బుణ్యముతోవ- యేల పట్టును,
వేపచేదు వండితేను- వెసనేల బెల్లమవును?
పై పై బలిమి సే సే- భ్రమ యింతేకాక.
ప్రపంచమైన పుట్టుగు- ప్రపంచమునకే కాక
ఉపమించ మోక్షమున- కొడఁబడునా?
ప్రపన్నుఁడైన వేళ- భాగ్యాన శ్రీవేంకటేశుఁ
డపుడు దయఁ జూడఁగ- నధికుఁడౌగాక !
(సంపుటం-3, సంకీర్తన-123)
"ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ" (ఇన్నిటికీ ఈశ్వరేచ్ఛ) అనేది సర్వం శ్రీహరి లేదా ఈశ్వరుని సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని తెలిపే తాళ్ళపాక అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తన. మనిషి ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యానికి దైవ సంకల్పమే మూలమనే తత్త్వాన్ని ఈ కీర్తన వివరిస్తుంది.
కీర్తన సారాంశం
ఏది జరగవలెనున్నను భగవంతుని ఇచ్ఛానుసారంగా జరగవలసినదే. ఆయనకు దాసుడు అగుట ఒక్కటే జీవుని కర్తవ్యము. అప్పుడు దయానిధి అయిన శ్రీహరి తానే వీనిని కాపాడగలడు.
దేహధారిణి అయిన ఈ జీవుడు భగవంతుని మాయ ప్రభావంచే కలిగిన ప్రకృతి నుండి శరీరంతో జన్మించినాడు. వీనికి ప్రకృతి సహజములైన గుణములే ఉండును కానీ ఇతర గుణములు ఉండవు. ప్రకృతికి అతీతముగా ప్రవర్తించమని వానిని మనము బలవంతము చేసినచో ఆశించిన ప్రయోజనం సిద్ధించక పోవుటే కాక అది విషమమైన పరిణామమునకే దారితీయును. ఒక చెట్టు విత్తు నాటినచో ఆ చెట్టే మొలుచును కానీ మరొక చెట్టు ఎట్లు మొలుచును? ఒకవేళ అట్లు మొలిపించుటకు ప్రయత్నించినచో అది వట్టి ప్రయాసయే అగునుగాని ఫలం ఉండదు కదా! ఈ శరీరము పాప కర్మముచే పుట్టినది. ఇది మనచే తనకు సహజమైన పాపకర్మనే చేయించును కానీ పుణ్య మార్గమును ఎందుకు అనుసరించిను. వేప చేదు వండినచో చేదుగానే ఉండును కానీ బెల్లంవలే తీయగా ఎట్లుండును? కాన ఈ తనువును పుణ్యపదమున నడిపింపగలవని పూనుకొనుట బ్రహ్మయే కానీ మరేమియు కాదు సుమా!
మన జన్మము ప్రపంచ ప్రవృత్తికి సంబంధించినది. ఇది ప్రపంచ మాయాజాలమున మనలను తగిలించుటకే ప్రయత్నించును కానీ మోక్షమున కంగీకరించునా? కావున జీవుడు భగవంతుని ఎడల ప్రపన్నుడు కావలెను. అప్పుడు భాగ్యవశమున శ్రీ వేంకటేశ్వరుడు వానిని దయ చూచును. అంతటనతడు ముక్తుడై అధికుడగును. ఇంతకంటే వేరొక సులభోపాయము జీవునకు లేదు.
డా. సముద్రాల లక్ష్మణయ్య
No comments:
Post a Comment