Thursday 15 September 2016

గృహిణీ గృహ ముచ్యతే.. గజల్.

।।గృహిణీ గృహముచ్యతే।। ఉమాదేవి జంధ్యాల
--------------------------------------------
చీకటినే తొలగించే ఉదయానివి నువ్వేగా
మేలుకొలుపు సుప్రభాత గీతానివి నువ్వేగా!
కనుతెరువగ కమ్మనినీ నగుమోమే చాలునులే
కనుపాపగ మముకాచే దైవానివి నువ్వేగా!
గడియారంతోపోటీ పడుతుంటావేరోజూ
అలుపెరుగక తిరుగాడే కాలానివి నువ్వేగా!
ఏదెక్కడ పెట్టామో తెలియదుమా కెవ్వరికీ
చేతిలోకి వస్తుందను ధైర్యానివి నువ్వేగా!
కరిగిఅరిగి పోతున్నా కనిపించదు మాకళ్ళకు
అద్దంలా యిల్లుంచే పనిమనిషివి నువ్వేగా!
ఎనిమిదికాకుండానే అందరికీ తొందరలే
పదిచేతుల పనిచేసే యంత్రానివి నువ్వేగా!
నీచల్లని చేయితాక మాయమౌను రుగ్మతలే
ఒడినిజేర్చి ఓదార్చే దయామయివి నువ్వేగా!
సర్దిచెప్పలేకనీవుసతమతమౌతుంటావు
అందరి నిందలు మోసే సహనానివి నువ్వేగా!
నీపనులకు సెలవులేదు నీసేవకు విలువలేదు
ఎదుగుటకై వాడుకునే నిశ్శ్రేణివి నువ్వేగా!
ఒక్కపూట గడవదమ్మ పడకేస్తే నువ్వింట్లో
నిన్నునీవు చూసుకోని త్యాగానివి నువ్వేగా!
చేయేతలగడకాగా కటికనేల పడకాయే
నిద్రించుటకేతీరని మహరాణివి నువ్వేగా !
నాల్గుపదుల వయసులోనె వడిలినపూవైనావే
అయినా పోడిమితగ్గని అందానివి నువ్వేగా!
ఆడదిలేనట్టియిల్లు అడవికన్న అధ్వానం
పైకిమేము అనకున్నా ప్రాణానివి నువ్వేగా !
-----------------------------
** పొన్నాడ మూర్తిగారి చిత్రానికి గజల్
( నిశ్శ్రేణివి = నిచ్చెనవి)

Friday 9 September 2016

అనరాదు వినరాదు ఆతని మాయలునేడు - అన్నమయ్య కీర్తన.


ప. అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు.
౧. ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు జల్లి
యీడ మాతోఁ జెప్పఁగాను ఇందరముఁ గూడిపోయి
చూడఁ బోతే పంచదారై చోద్యమాయనమ్మా..
౨. తీఁట తీగెలు సొమ్మంటా దేహము నిండాఁగట్టె
తీటఁకుఁగాక బాలులు తెగి వాపోఁగా
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను
కోటి కోటి సొమ్ములాయ కొత్తలో యామ్మా..
౩. కాకిజున్ను జున్ను లంటా గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవఁగ
ఆకడ శ్రీ వెంకటేశుఁడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలు పేవెఁ జూడఁగానే నేము.
భావము: గోకులంలో గోపస్త్రీలు తమ పిల్లలను శ్రీకృష్ణుడు అల్లరి చేసి ఏడిపించి ఎలాంటి మాయలు చేసాడో వివరిస్తున్నారు.
అనడానికి లేదు, వినడానికి లేదు ఇతని మాయలు. రోజు రోజుకీ కొత్త కొత్త దృశ్యములే మాకు.
బాలురందరూ ఆడుకుంటుంటే నోరు చూపమని, వారు నోరు తెరిచిన వెంటనే నోటిలో దుమ్ము జల్లేడట. ఆ బాలురందరూ మాతో చెప్పి గోల చేయగా అందరమూ కలిసి చూడబోతే ఆ బాలుల నోటినిండా పంచాదారేనమ్మా..
ఇదేమి చోద్యమమ్మా..
దురదవేసే తీగలు బాలులకు సొమ్ములని చెప్పి వారి దేహమునిండా గట్టేడట. ఆ దురదకు బాలులు వాపోవగా, ఈ మాట విని ఆదుర్దాతో పరిగెత్తి చూడగా, వారి దేహముల నిండా కోటి కాంతులతో మెరుస్తున్న సొమ్ములు (ఆభరణాలు) కనిపించాయమ్మా..
కాకిజున్ను (జున్నులాంటి పదార్ధమె కానీ తినడానికి బాగుండదేమో)) మంచి జున్ను అని చెప్పి గంపెడేసి బాలులకు తినిపించాడట. నోరు బాధపెట్టగా గోపబాలులు బాధపడి కన్నీరు కార్చుతుంటే, చూడబోతే ఓ వెంకటేశుడా! ఆ బాలల కంటినీరు ముత్యాల వరుసలుగా కనిపించాయమ్మా. ఇదేమి వింత ?
సాధారణంగా బాల్యంలో పిల్లలు రక రకాలుగా అల్లరి చేసి తోటి పిల్లలను ఏడిపించడం పెద్ద వింతేమీ కాదు. కానీ శ్రీకృష్ణుడు పరమాత్ముడు, మాయాలోలుడు కనుక తనుచేసే అల్లరిపనులను మాయతో కప్పిపుచ్చి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసాడని అన్నమయ్య ఎంతో అందంగా ఈ కీర్తనలో విశదీకరించాడు.

Friday 2 September 2016

ఎవ్వరెట్టయినా నుండనీ - అన్నమయ్య కీర్తన.


ప.  ఎవ్వ రెట్టయినా  నుండనీ  ఇదివో  నేను
     నవ్వుతా  నీ సేవ సేతు నడుమ నేను.                   ||
౧.  మనసున నొకమాట  మరఁగున  నొకమాఁట
     యెనసి నే(న?) నయములు యెరఁగ నేను (?)     
     వనితనై నీమీఁది వలపే గతియని
     తనివోక బతికే దానను నేను.                              ||
౨.  వోలిసితే నొకటియు నోల్లకుంటే నొకటియు
     చలివేడి వేసాలు జరప నేను
     కలికితనాన నీతో కాఁపురమే గతియని
     తలఁచి పొందులు సేసే దానను నేను                      ||
౩.  ఒక్కపరి ఇచ్చకము వొక్కపరి  మచ్చరము
    ఇక్కడా నక్కడ యెలయించను నేను
    గక్కన శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
    మక్కువ నిటువలెనే మరుగుదు నేను.                   ||                                                                           

భావము:  ఇదిగో! స్వామీ! ఎవరెట్లాగయనా ఉండనీ నేను మాత్రం నీవు  కావాలనుకున్న చిన్నదాన్నే. నవ్వుతూ  నీ సేవ చేసుకుని తరిస్తాను.
మనసులోనొకమాట,  చాటుగా నొకమాట చెప్పి నయగారాలు పోయేదాన్ని  కాను. నీ మీద వలపుతో వచ్చిన దాననే, కాని  తనివితీరని పొందు కావాలనుకునేదాన్ని కాను.
ప్రభూ! నేను కావాలనుకుంటే ఒకమాట, వద్దనుకుంటే మరొకమాట చెప్పేదాన్ని కాదు. రెండురకాల ద్వంద్వ పద్ధతిలో వేషాలు వేయను. అందరి స్త్రీల వలెనె నీతో  కాపురమే గతియని తలచి నీ పొందు కోరే దానను.
ఒకసారి ఇష్టం చూపించడం, ఇంకొకసారి మచ్చరముతో తిరస్కరించడం చేసి, ఇక్కడా  అక్కడా అని నిన్ను కూడటం నాకు నచ్చదు. శ్రీ వేంకటేశ్వరా! నన్ను కరుణించి చేరదియ్యి. లేకుంటే నీ పై  నా  మక్కువ  ఇలాగే  మరుగున ఉండిపోనీ..

 శ్రీ వేంకటేశుని వలచిన వనితయొక్క నిస్వార్ధమైన  అనురాగం ఎటువంటిదో అన్నమయ్య  ఈ  కీర్తనలో వివరించాడు.

Thursday 1 September 2016

అన్నమయ్య నవరసాలు

అన్నమయ్య – నవరసాలు.

ఆంధ్ర  వాగ్గేయకారులలో  అన్నమయ్య  ఆద్యుడు, అగ్రగణ్యుడు,  సుప్రసిద్ధుడు.  అన్నమయ్య  రచించిన  వేదాంత, ఆధ్యాత్మిక, భక్తి,  శృంగార - మొత్తం  ముప్ఫై రెండువేల  కీర్తనలలో సుమారు  పన్నెండు వేల  కీర్తనలలో నవరసాలు  నర్తిస్తూనే  ఉన్నాయి. 
ప్రాచీనాలంకారికుల అభిప్రాయానుసారము  రసాలు  తొమ్మిది. క్రమంగా  వీటి  స్థాయీ, భావాలు  కూడా  తొమ్మిది.
           “శృంగార హాస్య కరుణాః రౌద్రవీర భయానకాః
            భీభాత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాః స్మృతాః”
           “రతిరాసహశ్చ శోకశ్చ క్రోథోత్సాహౌ భయం  తథాః
            జుగుప్సా విస్మయశమా, స్థాయిభావాః ప్రకీర్తితాః” 
లాక్షణికులు నిర్దేశించిన రసస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య  కీర్తనలు రాయలేదు. అయినా  ఆయా రసాలు సముచితంగా, సందర్భోచితంగా అమరి పాటల సౌందర్యాన్ని ద్విగుణీకృతం  చేసాయి. ప్రతీ రసము బహుసంఖ్యాక కీర్తనల్లో కనిపిస్తూ ఉంటుంది.
పైన పేర్కొన్న నవరసాలూ కూడా ఒకే కీర్తనలో వచ్చేట్టు అన్నమయ్య అనుసంధించాడు. నాయిక  హావభావాలలో, అంగాల ఉనికిలో నవరసాలనూ నర్తింప చేసాడు. అవేగాక మోహాన్ని కూడా పదోరసంగా చేర్చి నాయికను  రసాధిదేవతగా చిత్రించాడు.
           ప. నవరసములదీ నలినాక్షి – జవకట్టి నీకు జవిసేసీని
            ౧. శృంగార రసము చెలియ మొకంబున – సంగతి  వీరరసము గోళ్ళ 
                రంగగు కరుణారసము పెదవులను – అంగపు కుచముల నద్భుత రసము.
            ౨. చెలి హాస్య రసము సెలవుల నిండీ – పలుచని నడుమున భయరసము 
                కలికి వాడి కన్నుల భీభత్సము – అలబొమ జంకెన(ల) నదే రౌద్రంబు
             ౩. సమరతి మరపుల శాంత రసంబదే – అతిమోహము పదియవరసము
                ఇతవుగ శ్రీ వేంకటేశ కూడితివి – సతమై ఈపెకు సంతోష రసము.

ఒక ఇతివృత్తం ఎన్నుకొని రసపోషణ చేయడం  సులభం. కాని ముక్తక లక్షణాత్మకాలైన కీర్తనల్లో కూడా  నవరసాలను నర్తింప జేయడం అనితరసాధ్యం. ఆ ఘనత అన్నమయ్యదే.


సేకరణ: డా. జె. మునిరత్నం గారి  వ్యాసం నుండి.                         పొన్నాడ లక్ష్మి.