పక్షపాతం
కొందరిపై అత్యంత దయ, మరికొందరిపై అంతులేని నిర్దయ.
అడక్కుండానే వరాలు గుప్పిస్తావు కొందరికి,
ఆర్తితో, ఆవేదనతో అర్ధించినా ఆదుకోవు కొందరిని.
అబలల ఆక్రందనలని అసలు వినిపించుకోవెందుచేత?
పాపపుణ్యమెరుగని పసికందులని కాలరాచే కామాంధులని దండించవు.
నువ్వూ పురుషుడివేగా! నీ జాతి మీద అంత మమకారమా!
ఏ పాపచింతనలేని వారిని కష్టాల మడుగులో ముంచుతావు,
గతజన్మ పాపమని అనుభవించమంటావు. ఏంటయ్యా నీ లీల?
దుష్టశిక్షకుడవని బిరుదాంకితుడవు, కరకు కసాయివారిని శిక్షించలేవా?
అందరూ నీ బిడ్డలేగా మరి ఇంత పక్షపాతమా?
పిడికెడు ఆనందం లభించే తరుణంలో కడివెడు విషాదాన్నికుమ్మరిస్తావు.
జగన్నాటకసూత్రధారివి, బిడ్డల అగచాట్లు నీకు వినోద లీలలా?
జగద్రక్షకుడివి నీకే ఇంత పక్షపాతమైతే సామాన్య మానవులం మేమెంత?
ఇన్ని బిరుదులను పొందిన నీవు మౌనం వహిస్తే ఏమనుకోవాలీ?
No comments:
Post a Comment