Tuesday 29 December 2015

పురందర దాసు


హంపీ పర్యటనలో శ్రీ పురందరదాసుగారి భజన మంటపము దర్సించాము. విశాలమైన మంటపము తుంగభద్రా నదీ తీరములో ఉంది. అక్కడ కూర్చుని పురందరదాసుగారు విఠలుని మీద కీర్తనలు రచించి పాడుకొనే వారుట. అక్కడ వారి చిత్రము రాతిమీద చెక్కబడి ఉంది. అది చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ మహావాగ్గేయకారుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు పొందుపరిచాను.
శ్రీ పురందర విఠల దాసు (కర్నాటక సంగీత పితామహ).
వీరు పదహారవ శతాబ్ధమువారు. పాండురంగ విఠలుని భక్తులు. సంగీత సాహిత్యములలో ప్రావీణ్యము గలవారై ఒక్కొక్క సమయమునందు వీరు రచించిన కీర్తనలచే శ్రీ పాండురంగ విఠలుని కటాక్షమును పొందిన వారై ఉండిరి. సంగీతములో మాయామాళవగౌళ రాగములో ప్రారంభకులకు అనువుగా ఒక క్రమములో స్వరావళి, జంటస్వరములు, అలంకారములు, గీతములు, సూళాదులు, ప్రబంధములు రచించిరి. కర్నాటక సంగీతమును క్రమబద్ధీకరణ చేసి, సంగీత విద్యార్ధులకు అందజేసినందువలన వీరికి కర్నాటక సంగీత పితామహుడు అన్న బిరుదు లభించినది. వేదోపనిషత్తులు జనులకు బోధించిరి. వీరి కీర్తనలు ఎక్కువగా వేదాంతపరముగా నుండును.
- పొన్నాడ లక్ష్మి

Wednesday 23 December 2015

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి


నా అభిమాన నటి గాయని భానుమతి గారి వర్ధంతి నేడు. ఆమెకు నా స్మృత్యంజలి.
        నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, స్టూడియో యజమాని,
చిత్రకారిణి, ఇన్ని ప్రతిభా పాటవాలు కలిగిన వారు తెలుగు చిత్రసీమలోనే
కాదు, భారతదేశం లో మరెక్కడా లేరనడంలో అతశయోక్తి లేదేమో! సంగీత సాహిత్యాలు
ఆమెకి రెండు కళ్ళు. ఆమె గళంలో జాలువారిన మధురగీతాలు, ఆ సహజ గమకాలూ ఆమెకి
మాత్రమె సొంతం.
        పద్మ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డ్ (అత్తగారి కథలు),
ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, తమిళనాడు
ప్రభుత్వం ఇచ్చిన కలైమామణి వంటి బిరుదులు ఎన్నో, ఎన్నెన్నొ!
M.G. రామచంద్రన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెను ప్రభుత్వ
సంగీత కళాశాలకు డైరెక్టర్ గా, ప్రిన్సిపాల్ గా నియమించారు. అంతకుముందు
ఉన్న ప్రిన్సిపాల్ తెలుగులో ఉన్న త్యాగరాజు కీర్తనలు ఒక్కొక్కటిగా
తగ్గించేసి, తమిళ వాగ్గేయకారులైన పాపనాశం శివం మొదలైన వారి కీర్తనలను
బోధించేవారుట అదితెలిసి భానుమతి cylabus సమూలంగా మార్చి త్యాగరాజ కృతులను
తప్పనిసరిగా  బోధించేటట్లు చేసారుట. అదీ భానుమతి అంటే! ఆ పదవిని చాలా
సమర్ధవంతంగా నిర్వహించారని M.G.R గారు ఒక సభలో అభినందించారట. అది తనకి
లభించిన ప్రత్యేక గౌరవంగా తలచి మురిసిపోయేవారట. ఆమెకి ఆంద్ర దేశంలో ఎంత
పేరుప్రఖ్యాతులున్నాయో, తమిళనాడులో కూడా అంత గౌరవం, పేరుప్రఖ్యాతులు
ఉన్నాయి.
        భానుమతి ముక్కుసూటి మనిషి, నిర్మొహమాటి. ఆడంబరాలకు ఆమె వ్యతిరేకి.
రామకృష్ణగారి నిరాడంబరత, సీదా సాదా మనస్తత్వం, ఉన్నత సంస్కారం,
విధినిర్వహణ పట్ల చూపే శ్రద్ధ, పట్టుదల, దీక్ష ఆయన్ను ప్రేమిచేతట్లు
చేసాయి. ఆమె వివాహం ఓ గొప్ప సాహసకృత్యం. సినిమా నటి అయినా ఆ గ్లామర్ కి
ఆమె లొంగి పోలేదు.  ప్రేక్షకులు ఆమె పాత్రలని కాదు, ఆమెని చూడటానికి
వచ్చేవారు. చురకత్తిలాంటి  చూపు,  కంఠంలో అధికారం, మాట విరుపులో వెటకారం,
పాత్ర ఏదయినా ఫార్ములా ఇదే.  గిట్టని వాళ్ళు దీన్ని పొగరంటారు. నిజానికి
అది ఆమె వ్యక్తిత్వంలో పవరు. అందుకే ఆ రోజుల్లోనే స్టార్ అట్రాక్షన్ ఆమె
సొంతం. ఈ మాటలు ఆమెకు అత్యంత ఆత్మీయులైన డి.వి. నరసరాజు గారు ఒక వ్యాసంలో
రాసారు.  సినీరంగంలో అష్టావధానం చేస్తూనే వ్యక్తిగత ఆనందాన్ని సంపూర్ణంగా
పొంది, గృహనిర్వాహణ కూడా బాధ్యతాయుతంగా నిర్వహించిన ఉత్తమ వ్యక్తి ఆమె.
సినీరంగంలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె సూపెర్ స్టారే! ఆ మహా
కళాకారిణికి ఇదే నా ఘన నివాళి.

Sunday 20 December 2015

గీతాజయంతి - 'అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా' (అన్నమయ్య కీర్తన)


గీతా జయంతి సందర్భంగా ఓ చక్కని అన్నమయ్య కీర్తన 

ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో
      విని ఆతని భజించు వివేకమా

భూమిలోను చొచ్చిసర్వ భూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడనేను ||

దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తేపుల నఱగించేటి దేవుడనేను
ఏపున ఇందరిలోని హ్రుదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను ||

వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను ||

Friday 18 December 2015

గోనేలే కొత్తలు - కొడెలేప్పటివి - అన్నమయ్య కీర్తన

19.12.15.ఈ వారం అన్నమయ్య కీర్తన:

ప. గోనేలే కొత్తలు - కొడెలేప్పటివి
    నానిన లోహము – నయమయ్యీనా ? !!


1. మున్నిటి జగమే – మున్నీటి లోకమే
    ఎన్నగ బుట్టుగు – లివె వేరు,
    నన్ను నెవ్వరు – న్నతి బోధించిన
    నిన్న నేటనే – నే నెరిఁగేనా . !!

2.  చిత్తము నాఁటిదె – చింతలు నాఁటివె
     యిత్తల భోగము – లివె వేరు,
     సత్తగు శాస్త్రము – ఛాయ చూపినా
     కొట్టగా నేనిఁక – గుణి నయ్యేనా. !!

3. జీవంతరాత్ముఁడు – శ్రీ వేంకటేశుఁడే
    యీవల భావన – లివె వేరు,
    దావతి కర్మము – తప్పఁదీసినా
    దైవము గావక – తలఁగీనా. !!

భావము:
పైన కప్పిన గోనెలే (శరీరములే) కొత్తవి, గాని కోడెలు (ఆత్మలు) పాతవే .
ఇనుము నెంతగా నీట నానబెట్టినను దాని సహజస్వభావమైన గట్టిదనము వీడి మెత్తబడదు కదా!
ముందునుంచీ ఉన్నది ఈ జగమే. ఈ లోకమూ నిన్న మొన్నటిదికాదు. ఎప్పటికప్పుడు మరణించి మరల జన్మించుచున్న ఈ పుట్టుకలు మాత్రమె కొత్తవై వేరుగా ఉన్నాయి. ఇట్టి నాకు ఎంత పెద్ద గురువులెన్ని రీతుల తత్త్వము బోధించినను ఆదినుంచి అజ్ఞుడనై యున్న నేను నిన్న నేటిలో అనగా ఒకటి రెండు దినములలో పరమార్ధస్వరూపము తెలుసుకోగలనా?
చపలమైన నా చిత్తము నాటిదే. చింతలూ ఆ నాటివే. ఎప్పటికప్పుడు మారుతున్న భోగములు మాత్రం వేరు. సత్యస్వరూపమైన శాస్త్రము ఎంతగా త్రోవ చూపిననూ అజ్ఞానుడనయిన నేను ఇప్పుడు కొత్తగా గుణవంతుడిని కాగలనా?
జీవాంతరాత్ముడై ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు గూడ పురాతనుడే కానీ నవీనుడు కాడు. ఈ జీవుల భావనలె పలు విధములుగా నున్నవి. జీవులను ముప్పుతిప్పలు పెట్టు కర్మము ఎంతగా వారిని తప్పుద్రోవల నడిపించినను దైవము దయతలచి వారిని కాపాడునే గానీ వదిలిపెట్టునా?
ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. పైన కప్పుగొను వస్త్రముల వంటి శరీరములు మాత్రమె ఎప్పటికప్పుడు మారుచున్నవి గానీ ఆత్మలో ఎట్టి మార్పు లేదు. ఈ విషయమునే అన్నమయ్య తన సహజ ధోరణిలో ‘గోనెలె కొత్తలు కోడెలెప్పటివి’ అని చెప్పినాడు .

పెంచంగఁ పెరిగినవా పృథివిపైఁ కొండలు - పెద తిరుమలయ్య నీతి శతకం



పెంచంగఁ పెరిగినవా పృథివిపైఁ కొండలు
          విత్తిరా యడవులు వివిధగతులఁ
గాలువల్ వెట్టిరా ఘన సముద్రములకు
          నేతంబు లెత్తిరా యేరులకును
మేతలు వెట్టిరా మృగములకెందైన
          మరియీఁత నేర్పిరా మత్స్యములకు
పెండిండ్లు సేసిరా బెరయబక్షులకును
          బూసిరా వాసన పుష్పములకు
నెవ్వ రెవ్వరిఁ బోషించి రించి చూడఁ
దలఁప నీదైన రక్షకత్వమునఁగాక
కలిత లక్ష్మీశ! సర్వజగన్నివేశ!
విమల రవికోటి సంకాశ ! వేంకటేశ!

భావం: శ్రీ వేంకటేశ్వరా! ఎవరో పెంచితే పెరిగినవా భూమి మీద కొండలన్నీ? రకరకాలుగా ఎవరైనా విత్తనాలు వేస్తె పెరిగినవా ఈ అడవులన్ని? కాలువలు పెట్టారా ఎవరైనా గొప్ప సముద్రాలకు? ఏతములెత్తి నీరు పారించారా నదులకు? తిండి పెట్టారా మృగాలకు? ఈత నేర్పారా చేపలకు? పెండ్లిండ్లు చేసేరా అసంఖ్యాకమైన పక్షులకు? పూశారా సుగంధాలు పుష్పాలకు? ఆలోచిస్తే ఎవరు ఎవరిని పోషించారని? లేదు. స్వామీ! శ్రీ వేంకటేశ్వరా! బాగుగా విచారిస్తే ఇవన్నీ నీ రక్షకత్వంలో జరిగినవే.
          చాలా మనోజ్ఞమైన పద్యం ఇది. చెప్పిన రీతి ఎంతో రమణీయంగా ఉన్నది. ఈ ప్రకృతికీ, ఈ జీవులకూ భగవంతుడైన శ్రీ వేంకటేశ్వరుడే ఆత్మ. సర్వాధారుడూ, సర్వపోషకుడూ, సర్వరక్షకుడు ఆ పరమాత్ముడే. లెస్సగా విచారిస్తే అన్నీ సృష్టి స్థితి లయ కారకుడైన ఆ దేవుని లీలావిభూతియే. ఆ స్వామి సంరక్షణలోనే ప్రకృతి సర్వం ప్రఫుల్లమై శోభిస్తున్నది. సర్వప్రాణుల జీవనాదులకు హేతువులైన ధారక పోషక భోగ్యపదార్ధాలను ఇచ్చి పాలించి, పోషించేవాడు శ్రీ మహావిష్ణువు.  

సీతా పరిత్యాగ ఘట్టంలోని పద్యాలు.



సీతా పరిత్యాగ ఘట్టంలోని పద్యాలు.
ఆ భద్రుండు వినమ్రుడై పలికె, దేవా! నీవు పల్మారు న
న్నీ భంగిన్ నిజమేమిదేల్పు మనినన్, హీనాత్మకుల్ పల్కుప
ల్కే భావ్యంబని విన్నవింతు ? అది మీ కేలా వినన్? మూర్ఖులై
ఏ భూపాలుర మేచ్చిరీ నరులు! వీరేపాటి పాటింపగన్.

తన పరిపాలన గురించి శ్రీరాముడు భద్రున్ని అడుగుతాడు. అప్పుడు భద్రుడు వినమ్రుడై పలికాడు. దేవా! నువ్వు మాటిమాటికీ ఇలా నిజం చెప్పు అని నన్ను ఇలా నిలదీస్తుంటే నేనేమి చెప్పను? హీనాత్మకులు ఏవో కూస్తుంటారు. ఆ పలుకులు ఏమంత భావ్యమని నీకు విన్నవించను? అసలు అవివినడం ఎందుకు? ఆ ప్రజలు మూర్ఖులు. ఏ భూపాలురనైనా ఎనాడైన వీళ్ళు మెచ్చుకున్నారా?వీళ్ళు ఏపాటి మనుషులు కనక వీళ్ళ మాట పట్టించుకోవడానికి!

కరుణ గల్గిన రాజకంఠీరవుని గన్న
          మెత్తనివా డంచు మెచ్చ రతని
దురుసు దండనలతో ధరనేలు దొర గన్న
          హింసాపరుండని యెంచ రతని
ధైర్య సంపన్నుడౌ ధరణీశ్వరుని గన్న  
          కలన చిత్తుండని కదియ రతని
సుజనుల బ్రోచు భూభుజుని గన్నను పక్ష
          పాతియం  చలతిగా జూచురతని
నీ వివేకవంతు లే మెరుంగుదు రట్టి
యెరుక లేని జనులా సరుకు చేసి
మొరకు పలుకు  వినెడికొరకు మేకొనగ దే
వరకు దగునె? యాజివరకుమార !!

          అశ్వమేథ పుత్రకామేష్టి యాగాలు చేసిన (యాజి) ఓ దశరథకుమారా! ప్రజల మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. వారు ఎటువంటి రాజునైనా మెచ్చుకోరు .

          దయగలిగిన రాజసింహాన్ని మెత్తని వాడు పొమ్మంటారు. దురుసుగా ఉంటే హింసాత్మకుడంటారు. ధైర్యంగా  రాజ్యాన్ని విస్తరిస్తే  కఠినహృదయుడంటారు. సజ్జనుల్ని కాపాడుతున్న రాజుని పక్షపాతి అని లోకువగా (అలతిగా) చూస్తారు. ఈ మహా వివేకవంతులికి ఏం తెలుసు?  అటువంటి అజ్ఞానుల మాటల్ని లేక్కజేసి, వాళ్ళ మూర్ఖపు మాటలు వినిపించు వింటాను అని దేవరవారు పూనుకోవడం (మేకొనుట) సమంజసమా చెప్పండి!
సేకరణ:  కంకంటి పాపరాజుగారి చే విరచితమైన ఉత్తర రామాయణం లోని పద్యాలు.

పాలకుల్ని మూర్ఖంగా విమర్శించే ఇప్పటి ప్రజలకూ కనువుప్పు కలిగించే ఆణిముత్యాలు.

Thursday 17 December 2015

ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల - అన్నమయ్య కీర్తన



ప.       ఎత్తరె ఆరతులీమెకు ఇంతులాల
          హత్తెను శ్రీవెంకటేసు కలమేల్మంగ.

౧.       హరి ఉరముపై సొమ్ము అరతగట్టిన తాళి
          సరిలేని దేవుని సంసారఫలము
          సిరులకు బుట్టినిల్లు సింగారములవిత్తు
          మెరుగుబోడి యలమేలుమంగ .              !!
౨.       పరమార్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
          కెరలుచునితని భోగించే మేడ
          సరసపు సముద్రము సతమైన కొంగుపైడి
          అరిది సంపదలది యలమేలుమంగ.                   !!
౩.       శ్రీ వేంకటేశుని దేవి చిత్తజుని గన్నతల్లి
          ఈవిభుని కాగిటిలో యేచిన కళ
          బూవపు పెండ్లి మేలు పొందిన విధానము
          ఆవల నీవల నీపె యలమేలుమంగ.                   !!.

భావము: (అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు).
                ఇది మంగళగీతము. శ్రీ వేంకటేశ్వరుడు అలమేలుమంగా, పరమాత్మ, ఆత్మలు. వారి సంగమమే జగన్మంగళము. ఓ ఇంతులారా ఆ దంపతులకి హారతులు ఇయ్యండి. స్వామి అలమేలుమంగను హత్తుకొనినాడు. ఈ దేవి ఎవరు? శ్రీహరి ఉరముపైన సొమ్ము, దేవి కంఠసీమనలంకరించిన మంగళసూత్రము. సిరులకు కాణాచి. సింగారములకు బీజము. శ్రీహరి సంసారఫలము పైడిఛాయతో విలసిల్లే అలమేలుమంగ.
          పరమాత్ముడైన హరి ఆత్మభావములో కీలుబొమ్మవలె నడుచునది. అతిశయించి ఆయన భోగాలనుభవించే దివ్యసౌధము. సరసాల సాగరము. శాశ్వతమైన శ్రీహరి కొంగుబంగారము. అరుదయిన సంపదలందించే శ్రీమహాలక్ష్మి ఈ అలమేలుమంగ.
          ఈ దేవియే శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణి. మన్మధుని కన్నతల్లి. శ్రీ వేంకటేశ్వరుని కౌగిలిలో ఒదిగిపోయిన కళ. మేలైన హరి పెండ్లి భోజనము. ఆయన పొందిన నిధానము. అటు తిరుమలలోను, ఇటు వైకుంఠం లోనూ ఆమె అలమేలుమంగ.