Saturday, 9 July 2022

నిరీక్షణ భావుక చిత్రకతావల్లరి.

ఒక చిన్న కథ. భావుక చిత్ర కథావల్లరి.

నిర్ణయం.

 

గోదావరి ఎక్ష్ప్రెస్స్ శరవేగంతో ముందుకి సాగుతూంది. కిటికీ దగ్గిర విషణ్ణ వదనంతో కూర్చున్న విశ్వనాథం దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. మాటి మాటికి నిట్టూరుస్తూ  పరసరాలని గమనించలేని స్థితిలో ఉన్నాడు.  పాసిన పాయవు బంధములూ.. ఆశ దేహమునన్నాళ్ళు,   కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగనన్నాళ్ళుఅని ఎంత చక్కగా జీవిత సత్యాన్ని తెలియజేసాడు  ఆనాడే అన్నమయ్య.  అన్నీ తెలిసినా ఏదీ ఒదులుకోలేని దుర్బలులం. ఏ బంధాలనీ తెంచుకోలేక, ఏ మమకారాలనీ మర్చిపోలేక మథనపడే మామూలు మనుష్యులం అనుకుంటూ  తనలో తానే  గొణుక్కుంటున్నాడు.

ఉదయం కొడుకూ, కోడలి సంభాషణ చెవిలో మారుమ్రోగుతూంది.

ఎల్లకాలం ఈ ముసిలాయన్ని మనమే చూడాలా? ఇంకో కొడుకున్నాడుగా.. మీ తమ్ముడికి కూడా బాధ్యత ఉందిగా.. అక్కడికి కొన్నాళ్ళు వెళ్ళమనండి అని కోడలు ఉష తీవ్రంగా అంటూంది.

నీకు తెలుసుగా మా మరదలు ఉద్యోగస్తురాలు. వాళ్ళిద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు. కాలక్షేపం కూడా అవదు. అయినా నాన్నగారికి ముందునుంచీ మన దగ్గరే అలవాటు. మన పిల్లలంటే వల్లమాలిన అభిమానం.  సొంత ఇంటినీ మనవలనీ వదలి ఎక్కడికీ వెళ్ళడము ఆయనికి ఇష్టం ఉండదు”. అన్నాడు కొడుకు భాస్కర్.

అభిమానమా.. పాడా..జరుగుబాటు సంకటం. ఇక్కడ జరిగినట్లు అక్కడ జరగదని భయం.. అందుకని శనిలా మనల్ని వదలడం లేదుఅన్న ఉష మాటలకి భాస్కర్ చాలా ఆవేదన గా చూస్తూఅంత కఠినంగా మాట్లాడకు ఉషా! ఆయన మనస్సు కొంచెం అర్ధం చేసుకో.. అయినా ఆయనకి ప్రత్యేకంగా చేసేదేముంది? మనకి చేసుకున్నదే ఆయనకీను. తన పనులన్నీ తనే చేసుకుంటున్నారు. వేళకింత అన్నం పెట్టడమేగా..” అన్న భర్త మాటలకి  మీకేం మీరలాగే చెప్తారు. మీ అబ్బాయికి కాలేజీకి వెళ్ళే ఏర్పాట్లు, ఇంకా చిన్నది అయిన మీ అమ్మాయి గారాలు, మీ ఆఫీసు వేళకి అన్నీ అమర్చలేక చస్తున్నాను. మధ్యలో మీ నాన్నగారు కాస్త టీ ఇయ్యమ్మా అనో,  పేపర్ ఎక్కడుందమ్మా అనో ఒకటే నస. అందరికీ నేనొక్కదాన్నే అన్నీ అమర్చాలి. నాకేం పది చేతులు లేవుగాఅని విసుక్కుంది ఉష.

విశ్వనాథం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ అయి కొడుకుతో కలి సి ఉంటున్నాడు. భార్య అన్నపూర్ణ అన్నివిధాలా అతనికి అనుకూలంగా ఉంటూ సంసారాన్ని గుట్టుగా నడిపించింది. ముందునించీ పెద్ద కొడుకు దగ్గిరే అలవాటు. ఉద్యోగంలో ఉండగానే ఒక ఇల్లు తమ అభిరుచులకు తగినట్లుగా చిన్నదయినా సదుపాయంగా ఉండేటట్లు  కట్టుకున్నారు. తమకోసం ఒక గది ఏర్పాటు చేసుకుని పొందిగ్గా అమర్చుకున్నారు. ఇంచుమించు ఇంటిపని అంతా అన్నపూర్ణే చూసుకునేది. కొడుకు పెళ్ళయిన కొత్తలో కొత్త కాపురం అనీ, ఆ తరువాత మనవలు చంటివాళ్ళనీ తనే చాల మటుకు చేసుకుపోయేది. కోడలు ఉష కూడా సర్దుకు పోయేది. బదిలీల మీద విశ్వనాథం మరో ఊరు వెళ్ళినా అన్నపూర్ణ మూడొంతులు కొడుకు దగ్గరే ఉండేది.

కాలం ఎప్పుడూ ఒక్కలా సాగదుగా.. రెండేళ్ళ క్రితం అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో ఒక నెల్లాళ్ళు బాధపడి పరమపదించింది.  ఒక ఏడాది ఏదోలా గడిచింది.  తరువాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించింది, ఇంటిపనంతా తనమీదే పడిపోయింది.  వయసు పైబడి మునుపటిలా అంత పని చెయ్యలేకపోయినా చాలా మటుకు కోడలికి సహకారంగా ఉండేది. ముఖ్యంగా విశ్వనాథం కి కావలసినవ్ఝన్నీ తనే చూసుకొనేది.  ఇప్పుడు పరిస్థితి మారింది.  తన భర్తకీ పిల్లలకీ అంటే తప్పదు.  మావగారు విశ్వనాథంకి చెయ్యడం కష్టంగా మారింది. . ఇప్పుడు మావగారి ఉనికి భరించలేకపోతూంది.

విశ్వనాథం చిన్న కొడుకు ప్రకాశ్, అతని భార్య ఆరతి హైదరాబాద్ లో ఏదో మంచి కంపెనీలో  ఉద్యోగం చేసుకుంటున్నారు.  అక్కడే అధునాతనమైన ఒక మంచి ఫ్లాట్ కొన్నుక్కుని, ఉన్న ఒక్క కొడుకునీ హాస్తల్ లో పెట్టి చదివించుకుంటున్నారు.  ఆరతికి ఆధునికమైన జీవనం, క్లబ్ లూ పార్టీలు, స్నేహితులూ ఇష్టం. ఉద్యోగం తరువాత వీటికే ప్రాధాన్యత ఇచ్చేది. బంధువులూ, బంధాలు, భాధ్యతలు అంటే ఆమడ దూరంలో ఉండేది.  అందువల్ల విశ్వనాథం, అన్నపూర్ణ కొడుకు మీద మమకారంతో అక్కడికి వెళ్ళినా అట్టే రోజులు ఉండలేక తిరిగి వచ్చేసేవారు.

అక్కడ తోటికోడలు స్వతంత్రంగా  హాయిగా ఉందని కూడా ఉషకి దుగ్ధగా ఉంది.  అన్నీ కలిసి మావగారి బాధ్యత తనొక్కర్తే  భరిస్తున్నందుకు తను బాధపడుతూ భర్తని సాధిస్తూంది.  ఈమధ్య ఈ ధోరణి చాలా ఎక్కువయిపోయింది.  ఇవన్నీ చూస్తున్న విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు. రోజూ సాయంత్రం వాకింగ్ కి వెళ్తున్నప్పుడు స్నేహితులతో తన గోడు వెళ్ళబోసుకునేవాడు.  చాలా రోజులు మథనపడి, స్నేహితుల సలహాతో  ఒక మంచి వృద్ధాశ్రమంలో చేరిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు.  తనకి ఫించను బాగానే వస్తుంది. ఆశ్రమానికి కొంత కట్టేసినా  మిగతాది తన మందులకీ, మిగతా ఖర్చులకీ సరిపోకపోదు. పిల్లలమీద మనసైతే అప్పుడప్పుడు వెళ్ళిరావొచ్చు.  అప్పుడు వాళ్ళకీ శ్రమ ఉండదు.  నాకూ ఇబ్బంది ఉండదు. నాతోటి వాళ్ళే అక్కడ అందరూ,  కాలక్షేపం బాగానే ఉండొచ్చు అనుకున్నాడు.  కొడుకుతో చెప్తే ఒప్పుకోడని,  ఉత్తరం రాసి పెట్టేసి ఇలా బయటపడి ప్రయాణం చేస్తున్నాడు.

 నీ నిర్ణయం సరైనదేఅన్నట్టుగా ఇంజన్ ఓ పెద్ద కూత కూసింది.

ఎవరి ఆలోచనలతోనూ ప్రమేయం లేకుండా అందరి బరువుబాధ్యతలను మోస్తూ ఉత్సాహంగా ముందుకి సాగిపోతూంది రైలుబండి.

 

 



Saturday, 25 June 2022

తిరిగిరాని బాల్యస్మృతులు

 

తిరిగిరాని బాల్య స్మృతులు.

 

దుంపలబడిగా వ్యహరించబడే ప్రభుత్వ పాఠశాల

1 తరగతిలో భయం భయంగా అడుగు పెట్టిన రోజులు.

నేలపై గోనెపట్టా పరుచుకుని పలకమీద  బలపంతో

అక్షరాలు దిద్దుకున్నరోజులు.

పుస్తకాలలో నెమలి ఈక ఉంచి, దానికి మేత పెట్టి,

అవి పెరుగుతాయని, దానితో పాటు మన జ్ఞానం

పెరుగుతుందని నమ్మి దాచుకున్న రోజులు

పుట్టినరోజున నాన్నగారు కుట్టింఛిన కొత్తగౌను తొడుక్కుని,

అమ్మ చేసిన మిఠాయిలు తిని సంబరపడే రోజులు

పంతులమ్మకి ఒక పువ్వో, ఒక పండో ఇస్తే, ఆమె ప్రేమగ స్వీకరిస్తే

ఎంతో గొప్పగా అనుభూతి చెందిన రోజులు.

ఒక గడుసుపిల్ల పక్కన చేరి ఏవేవో కబుర్లు చెప్పి, నీకు ఈమాత్రం

తెలియదా అని ఎద్దేవా చేస్తే చిన్నబుచ్చుకున్న రోజులు

లెక్కలు తప్పుచేస్తే మా నాన్నగారు వీపు మీద ఒక్కటి వేసి

జాగ్రత్తగా చెయ్యమని మందలించిన రోజులు.

సొంత ఊరు వెళ్ళి టూరింగ్ టాకిస్ లో నేల టికెట్ కొనుక్కుని,

సినిమా చూసి మురిసిపోయిన రోజులు.

అర్ధం తెలియకపోయినా, నోటికి వచ్చిన సినిమా పాటలు పాడుకుంటూ

హాయిగా ఆనందంగా గడిపిన బాల్యం మథురాతి మథురం.

బరువూ బాధ్యతా లేకుండా అమ్మా నాన్నల నీడలో హాయిగా గడిచిపోయిన 

మథురమైన బాల్యం..

 

భయం భయం..

ఇద్దరు వ్యక్తులు దేనికీ భయపడరు. ఒకరు అన్నీ తెలిసిన జ్ఞాని. ఇంకొకరు పరమమూర్ఖుదు - దేని పర్యవసానం ఏమిటో, ఎలా ఉంటుందో ఆలోచించలేని అవివేకి. మనందరమూ జ్ఞానులమూకాదు, పరమమూర్ఖులమూ కాదు. అందుకే మనలో చాలామందికి భయం అనేది సహవాసి అయి కూర్చుంది. కొందరికి మృత్యు భయం. మరికొందరికి జీవితంలో ఓటమి పాలవుతామేమో అని భయం. ఇంకొందరికి రోగ భయం. తల్లితండ్రులకి పిల్లల భవిష్యత్తు గురించి భయం. ఉద్యోగ భద్రత గురించి భయం. మరికొందరికి ఇప్పుడుసవ్యంగా నడుస్తున్నా, అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉంటుందా? భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం. కొందరికి ఉన్న ఆస్తిని ఎవరైనా కాజేస్తారేమోనని భయం. చేసిన తప్పులకి దేవుడు శ్క్షిస్తాడేమోనని భయం, నాయకులకి అధికారం పోతుందేమోనని భయం. ఇలా రకరకాల భయాలు మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి.ప్రపంచమే భయమయమా అనిపిస్తూ ఉంటుంది.

శ్రీరామకృష్ణప్రభ ఆద్యాత్మిక సంచికనుంచి సేకరణ.. పొన్నాడ ల

 

 

 

 

నాన్నాగారి జ్ఞాపకాలు

 

ఉన్న స్వల్పకాలం మాత్రమే నాన్నగారితొ గడిపిన బాల్యస్మృతులు.

 నాన్నగారండిఅని నేను పిలిస్తే నా ఆలోచన కనిపెట్టి అదే పంథాలో

 ఏం నాన్నగారండి ఏమి కావాలిఅని మందహాసంతో అడిగేవారు.

 నాన్నగారూ మరెమో ఇవాళ ఆదివారం కదండీ. సాయంకాలం బీచ్ కి  తీసుకెల్తారా?. నా స్నేహితులంతా వస్తారుట. అని గారంగా అడిగేసరికి, అలాగేనమ్మా.. ఎండ తగ్గాకవెల్దాం నీ స్నేహితులకి కూడా చెప్పు. అని సంతోషంగా ఒప్పుకునేవారు. సాయంత్రం మమ్మల్ని బీచ్ కి తీసుకివెళ్ళి కాసేపు కెరటాలతో ఆడుకోనిచ్చి, తరువాత మంచి మంచి విషయాలు చెప్పి, పాటలు పాడించి ఇంటికి తీసుకొచ్చేవారు.

 దసరాలకి బొమ్మలకొలువులు పెట్టుకునేవారం. రకరకాల బొమ్మలు మాతో మెట్లమీద అలంకరింపచేసి, చుట్టూ పార్క్ లు కొండలు, గుడిసెలు అట్టలతో, కాయితాలతో అన్నీ తాను అమర్చేవారు. దీపావళికి మందుగుండు సామాను విడివిడిగా తెచ్చి అవన్నీ కలగలిపి, మతాబాలు చిచ్చుబుడ్లు మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసేవారు. ఎంత సరదాగా ఉండేదో..

 మావిడికాయల కాలంలో దగ్గర ఉన్న కొత్తవలసకి (అక్కడ సంతలో మంచి కాయలు చవకగా దొరుకుతాయి) నాన్నగారితో పాటు వెళ్ళి ఊరగాయలకి రెండుబుట్టల కాయలు, పళ్ళకోసం రెండుబుట్టల కాయలు కొనుక్కుని రైలుబండి లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.

 పాఠశాలలు తెరిచాక కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడం, అందంగా నా పేరు వాటి మీద రాయడం అన్నీ నాన్నగారే. నాకు అన్నీ నేర్పిస్తూ మధ్య మధ్య మంచి కథలూ కబుర్లూ చెప్తూ పని పూర్తిచేసేవారు.

 వీధి జాఫిరీ లో కూచొని కొత్త పాట పాడుకుంటూంటే విని ఈపాట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? చాలా బాగుంది అని మెచ్చుకునే నాన్నగారు. ఎప్పుడూ ఆయన చేత దెబ్బలు కానీ, చివాట్లు కానీ తిని ఎరగను. ఒక్క చదువు విషయంలో మాత్రం ఎప్పుడైన కోప్పడేవారు. నన్ను చెల్లినీ మా మామ్మ దగ్గిర  వదిలేసి సెకండ్ షో సినిమాకి అమ్మ నాన్నగారు వెళ్ళిపోతే మర్నాడు అలిగి కూర్చునే దాన్ని. అప్పుడు దగ్గిరకి తీసుకుని ఆ సినీమా ఏడుపు సినిమా అమ్మా! ఒకా మంచి పాట కూడా లేదు. నీకు పాటలంటే ఇష్టం కదా.. మంచి పాటల సినిమా మాయాబజార్ వచ్చింది. దాని నిండా పాటలే దానికి తప్పకుండా వెళ్దాము అని అనునయించేవారు. మంచి సినిమాలు చాలా చూపించారు కూడా..

 ఇంట్లోనే కాదు అటు ఆఫీస్ లోనూ, ఇటు బంధువర్గంలో అందరిదగ్గరా మహనీయులే మా నాన్నగారు. భీముడు బాబాయ్, భీముడు మావయ్య, భీముడన్నయ్య ఇలా అందరి నోళ్ళలోనూ ఆయన పేరే.. మా అమ్మయికి 1987 లో రైల్వే DRM ఆఫిస్ వైజాగ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకి ఒక పెద్దాయన దాని సీట్ దగ్గరికి వచ్చి, “నువ్వు భీమేశ్వరరావు మనవరాలివా అమ్మా అని అడిగారు. మీ తాతగారిలాగే మంచి పేరు తెచ్చుకోమ్మా.. అంతటి నిజాయితీపరుడు, శాంతమూర్తి మీ తాతగారవడం నీ భాగ్యం తల్లీ”  అని ఆశీర్వదించి వెళ్ళారుట. ఎవరి తండ్రి వారికి గొప్పే కావొచ్చు. పురుషులందు పుణ్య పురుషుడు మా నాన్నగారు. ఆస్పత్రిలో ఉన్న నాన్నగారిని చూడడానికి వెళితే మృత్యుముఖంలో ఆయన నాతొ మాట్లాడిన చివరి మాట “బాగా చదువుకోమ్మా”..అని. అంతే...

 

 

Saturday, 8 January 2022

ఎన్నడు విజ్ఞానమిక నాకు - అన్నమయ్య కీర్తన - చిత్రం


 


ఎన్నడు విజ్ఞాన మిక నాకు

విన్నపమిదె శ్రీ వేంకటనాథా బాసిన బాయవు (భవ) బంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు | కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు | తచ్చిన తగలవు తహతహలు
రచ్చలు విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా | సకలము నీవే శరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు ||

Sunday, 7 November 2021

ప్రయసఖి

 ప్రియసఖి.

ఆమె  ఊసులు కలిగించును మానసోల్లాసం.

ఆమె నవ్వులు ఎదలో విరిసిన సిరిమల్లెలు

ఆమె లోని ప్రత్యేకత మొగలిరేకు పరిమళం

ఆమె ఉనికి సంపెంగల సువాసన మిళితం.

ఆమె ప్రతి పలుకులో తేనెలొలుకు తియ్యదనం.

ఆమె కళల కాణాచి,  సాటిలేని విదుషీమణి.

ఆమె ప్రతి చర్యా ప్రత్యేకం, అసమానం

ఆమె స్నేహం అద్వితీయం, అపురూపం.

ఆమె సన్నిధిలో అత్యంత ప్రశాంతత.

ఆమె తలపులు మాసిపోని మరువపు సువాసనలు.

ఆమె ఆప్యాయత వెల కట్టలెని పెన్నిధి.

ఆమె అనురాగం తొణికిస్లాడే నవజీవన సారం,

            కలిగించును  నూతనోత్సాహం.

ఆమె సాహచర్యం అత్యంత మాథురీయం.

ఆమె పలకరింపులు హృదయవీణ తంత్రులను

            పలికించే సరిగమలు.

ఆమె నా ప్రియ సఖి, నా నెచ్చెలి.

Thursday, 4 November 2021

భానుమతి పాటల గీతమాలిక - 2





నా అభిమాన    కీ. శే. భానుమతి గారు పాడిన కొన్ని పాటలు ఓ గీతమాలికలా ప్రయత్నించాను.గాయ దయచేసి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


https://www.youtube.com/watch?v=-IKgNEGwItI