Saturday, 25 June 2022

నాన్నాగారి జ్ఞాపకాలు

 

ఉన్న స్వల్పకాలం మాత్రమే నాన్నగారితొ గడిపిన బాల్యస్మృతులు.

 నాన్నగారండిఅని నేను పిలిస్తే నా ఆలోచన కనిపెట్టి అదే పంథాలో

 ఏం నాన్నగారండి ఏమి కావాలిఅని మందహాసంతో అడిగేవారు.

 నాన్నగారూ మరెమో ఇవాళ ఆదివారం కదండీ. సాయంకాలం బీచ్ కి  తీసుకెల్తారా?. నా స్నేహితులంతా వస్తారుట. అని గారంగా అడిగేసరికి, అలాగేనమ్మా.. ఎండ తగ్గాకవెల్దాం నీ స్నేహితులకి కూడా చెప్పు. అని సంతోషంగా ఒప్పుకునేవారు. సాయంత్రం మమ్మల్ని బీచ్ కి తీసుకివెళ్ళి కాసేపు కెరటాలతో ఆడుకోనిచ్చి, తరువాత మంచి మంచి విషయాలు చెప్పి, పాటలు పాడించి ఇంటికి తీసుకొచ్చేవారు.

 దసరాలకి బొమ్మలకొలువులు పెట్టుకునేవారం. రకరకాల బొమ్మలు మాతో మెట్లమీద అలంకరింపచేసి, చుట్టూ పార్క్ లు కొండలు, గుడిసెలు అట్టలతో, కాయితాలతో అన్నీ తాను అమర్చేవారు. దీపావళికి మందుగుండు సామాను విడివిడిగా తెచ్చి అవన్నీ కలగలిపి, మతాబాలు చిచ్చుబుడ్లు మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసేవారు. ఎంత సరదాగా ఉండేదో..

 మావిడికాయల కాలంలో దగ్గర ఉన్న కొత్తవలసకి (అక్కడ సంతలో మంచి కాయలు చవకగా దొరుకుతాయి) నాన్నగారితో పాటు వెళ్ళి ఊరగాయలకి రెండుబుట్టల కాయలు, పళ్ళకోసం రెండుబుట్టల కాయలు కొనుక్కుని రైలుబండి లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.

 పాఠశాలలు తెరిచాక కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడం, అందంగా నా పేరు వాటి మీద రాయడం అన్నీ నాన్నగారే. నాకు అన్నీ నేర్పిస్తూ మధ్య మధ్య మంచి కథలూ కబుర్లూ చెప్తూ పని పూర్తిచేసేవారు.

 వీధి జాఫిరీ లో కూచొని కొత్త పాట పాడుకుంటూంటే విని ఈపాట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? చాలా బాగుంది అని మెచ్చుకునే నాన్నగారు. ఎప్పుడూ ఆయన చేత దెబ్బలు కానీ, చివాట్లు కానీ తిని ఎరగను. ఒక్క చదువు విషయంలో మాత్రం ఎప్పుడైన కోప్పడేవారు. నన్ను చెల్లినీ మా మామ్మ దగ్గిర  వదిలేసి సెకండ్ షో సినిమాకి అమ్మ నాన్నగారు వెళ్ళిపోతే మర్నాడు అలిగి కూర్చునే దాన్ని. అప్పుడు దగ్గిరకి తీసుకుని ఆ సినీమా ఏడుపు సినిమా అమ్మా! ఒకా మంచి పాట కూడా లేదు. నీకు పాటలంటే ఇష్టం కదా.. మంచి పాటల సినిమా మాయాబజార్ వచ్చింది. దాని నిండా పాటలే దానికి తప్పకుండా వెళ్దాము అని అనునయించేవారు. మంచి సినిమాలు చాలా చూపించారు కూడా..

 ఇంట్లోనే కాదు అటు ఆఫీస్ లోనూ, ఇటు బంధువర్గంలో అందరిదగ్గరా మహనీయులే మా నాన్నగారు. భీముడు బాబాయ్, భీముడు మావయ్య, భీముడన్నయ్య ఇలా అందరి నోళ్ళలోనూ ఆయన పేరే.. మా అమ్మయికి 1987 లో రైల్వే DRM ఆఫిస్ వైజాగ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకి ఒక పెద్దాయన దాని సీట్ దగ్గరికి వచ్చి, “నువ్వు భీమేశ్వరరావు మనవరాలివా అమ్మా అని అడిగారు. మీ తాతగారిలాగే మంచి పేరు తెచ్చుకోమ్మా.. అంతటి నిజాయితీపరుడు, శాంతమూర్తి మీ తాతగారవడం నీ భాగ్యం తల్లీ”  అని ఆశీర్వదించి వెళ్ళారుట. ఎవరి తండ్రి వారికి గొప్పే కావొచ్చు. పురుషులందు పుణ్య పురుషుడు మా నాన్నగారు. ఆస్పత్రిలో ఉన్న నాన్నగారిని చూడడానికి వెళితే మృత్యుముఖంలో ఆయన నాతొ మాట్లాడిన చివరి మాట “బాగా చదువుకోమ్మా”..అని. అంతే...

 

 

No comments:

Post a Comment