ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఎంతమాయల వాఁడెంచి చూడఁగ వీఁడు
ఇంతి యీతనిరూప మెవ్వరెరుఁగుదురు !!
౧. తెలుపు జలములలోన తెప్పవలెఁదేలీనే
తలకి పాతాళమున దాఁగి యుండీనే
కెలసి తనకన్నులను కెంపువుగాఁ జేసీనే
నెలఁత భీకరముగా నేఁడు నవ్వీనే !!
౨. ఒరపుగా భూదాన మోకరిఁదా నడిగీనే
తరుణి భూమోక్కరికి ధారవోసీనే
మరలి పద్మజుని మనుమనినైనఁ జంపీనే
పడుచుందనమున వృథా పాలుమాలీనే. !!
౩. పలుమారు తన సిగ్గు బయటఁ బడవేసీనే
కలికితనమునఁ తాను గడవఁబాసీనే
వెలఁది వేంకటగిరివిభుఁడు నా కౌఁగిట
తొలఁగక చెమటలఁ దొప్పఁదోఁచీనే. !!
అన్నమయ్య చెప్పిన దశావతార కీర్తనలలో ఇదొక మధురకీర్తన. ఎంచి చూడగా వీడెంత మాయలవాడే!! ఓ ఇంతీ సాకారుడూ, నిరాకారుడూ అయిన యీతని రూపమెవ్వరెరుగుదురమ్మా?
పాలజలధిలో తెప్పవలె తెలియాడేనే వీడు (మత్స్యావతారము) , పాతాళమున తలముడిచి దాగియుండేనే (కూర్మావతారము), కన్నులు కెంపులు జేసి దనుజుని చంపాడే(వరాహావతారము), ఓ నెలతా! నేడు భీకరముగా నవ్వినా మొనగాడు వీడేనే(నరసింహావతారము), ఉపాయముతో ఒకరిని భూదానమడిగేనే (వామనావతారం) భూమినంత గెలిచి మరొకరికి దానం చేసేసినాడే(పరశురామావతారము), బ్రహ్మ మనుమడైన రావణాసురుని చంపినవాడు(రామావతారం), యౌవనమంతా వృధాగా వనితలకు (గోపికలకు)లోన్గిపోయాడే(కృష్ణావతారం), త్రిపురాసురల స్త్రీల వద్ద సిగ్గువిడిచి ప్రవర్తించాడే(బుద్ధావతారము) కలికితనమంతా కడవ బాసీనే, వ్యర్ధమైనదే(కల్కి అవతారము). ఓ వెలదీ! వేంకటగిరి విభుడు కౌగిట విడువక చెమట లో మిక్కిలి తడిసీనే..
వ్యాఖ్యానం: అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు. M.Tech.
No comments:
Post a Comment