ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. కని గుడ్డును నదె విని చెవుడును నిదె
ననిచి జగత్తు నడచీ నదివో..
౧. ఉదయాస్తమయము లొక దినముననే
యెదుటనే ఉన్నవి యెంచినను
ఇదివో జీవులు యెంచక తమతమ
బ్రతుకులు సతమని భ్రమసెదరు.
౨. వెలుగును జీకటి వెసగను గొనలనే
నిలిచీ నూరక నిమిషములో,
కలవలే నుండిన గతి సంసారము
బలువుగ సతమని భ్రమసెదరు.
౩. కాంతలు బురుషులు కాయ మోక్కటనే
పొంతనే పుట్టుచు బొదలెదరు,
ఇంతయు శ్రీ వేంకటేశ్వరు మహిమల
పంతము ఎలియక భ్రమసెదరు.
భావము: ఔరా! అదిగో !లోకము కన్నులార కనియు గ్రుడ్డితనము. చెవులార వినియు చెవిటితనము కలిగి ప్రవర్తించు చున్నది.
పరికించి చూడగా ప్రొద్దు పొడుచుట, ప్రొద్దు గ్రుంకుట అనునవి ఒక్క దినములోనే కన్నుల యెదుటనే జరుగుచున్నవి. అయినను జీవులు సదా పరివర్తనశీలమైన ఈ జగత్తు యొక్క నిజస్వరూపమును గుర్తింపక తమ తమ బ్రతుకులు శాశ్వతమని తలచి భ్రమకు లోనగుచున్నారు. ఒక నిమిషములోనే కనుగొనలలో వెలుగు, చీకటి వెంటవెంటనే నిలిచి యున్నవి. అట్లే చంచలమైన ఈ సంసారము కలవలె బూటకమై యున్నది. లోకులు దీనిని శాశ్వతమని నమ్మి భ్రాంతి నొందుచున్నారు.
స్త్రీలు, పురుషులు ఒకే శరీరమందునే పుట్టుచు వృద్ధి చెందుతున్నారు. ఇదంతయు శ్రీ వేంకటేశ్వరుని మహిమ వలెనే కలుగుచున్నవి. దాని ప్రభావ విధానము తెలియక జీవులు ఊరకే భ్రమపడుచున్నారు.
జగత్తు సదా పరిణామశీలమైనది జెవుల బ్రదుకులు శాశ్వతములు కావు. ఒకే దినమున ఉదయము, అస్తమయము జరిగినట్లే అల్పకాలమునందే ప్రాణులు పుట్టుట, గిట్టుట జరిగిపోవుచున్నావి. తామరాకు మీద నీటిబొట్టు వంటి జీవితమును శాస్వతమని భ్రమించి తాపత్రయమునకు లోనగుచున్నారని ఈ కీర్తనలో అన్నమయ్య చక్కగా వివరించాడు.
No comments:
Post a Comment