Sunday 21 March 2021

అలమేలుమంగవు నీవౌనే అన్నమయ్య కీర్తన.

 ఈ వారం అన్నమయ్య కీర్తన.

అలమేలుమంగవు నీవౌనే పతిఁ జేకొంటివి
నెలకొని ఈ చేతలు నీవే నేరుతువే !!
మొగము చూడఁగానే ముంచుకొను నగవులు
నగఁగానే పెనగొని నాఁటుఁ దగులు
తగులఁగా తగులఁగాఁ దమకము చిగిరించు
చిగిరంపు నాసలు చిమ్మిరేఁచు వలపు !!
వలవఁగా వలవఁగా వడిఁబెట్టు వలపులు
తలఁచఁగా నోరికబ్బు తానే పిలుపు
పిలువఁగాఁ బిలువఁగా బెనలుఁగొనుఁజెలిమి
చెలిమిఁ గడుఁ జేయఁగా చెలరేగు మనసు !!
మనసె పెట్టఁ బెట్టెఁ గా మల్లడిగొను ననుపు
ననుచఁగా ననచఁగా నంటు లెనయు
యెనయఁగా శ్రీవేంకటేశుఁ డేలే గుట్టుగను
కనుఁగొనఁగానే చెంగలించు మొగము. !!
భావముః అలమేలుమంగ చక్కదనమును, గుణగణములను ఈ కీర్తనలొ మనకు తెలియపరుస్తున్నాడు అన్నమయ్య.
అమ్మా! అలమేలుమంగా! నీవు నీ పేరుకు తగినట్లు (అలమేలుమంగ అంటే పుష్పం పై భాగంలో జన్మించిన లక్స్మీదేవి అని అర్ధం} ఉన్నావు. శ్రీవేంకటేశ్వరుని పతిగా చేకొన్నావు. ఈ చేతలన్ని నీవు నేర్పినవే.
నీ ముఖారవిందము చూడగానే చిరునవ్వులు ముంచుకొస్తాయి. నీవు నవ్వగానే అనుబంధము పాతుకొనిపోతుంది. నిన్ను తగులగానే తమకము చిగురిస్తుంది. ఆ చిగురింపువలన ఆశలు పెరిగి వలపు పెరిగిపోతుంది.
వలపు పెరిగి పెరిగి తలపులు మెలిబెట్టినట్లవుతాయి. ఆ తలపులవల్ల శ్రీవారి నోరు పదే పదే నీ పేరు పిలుస్తుంది. పిలవగా పిలవగా చెలిమి అతిశయిస్తుంది. ఆ చెలిమి ఎక్కువై చెలరేగిపోతుంది మనసు.
మనసు నీపై పెట్టగా పెట్టగా అధికమయ్యేది అనురాగం. ఆ అనురాగమే అధికమై అలరారుతుంది. ఎనయగా తల్లీ! శ్రీవేంకటేశ్వరుడు ప్రేమతో నిన్నేలుకొనును. ఆ తలపులు కనుగొనగా నీ ముఖము చిరునవ్వుతొ వికసించును.
Anuradha Vankineni, భాస్కర శాస్త్రి and 4 others

No comments:

Post a Comment