ఈ వారం అన్నమయ్య కీర్తన.
అనుచు నిద్దరునాడే రమడవలెనే
మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు // పల్లవి //
రాముడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందరా కృష్ణుడా // అనుచు //
యెక్కిన పుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కున బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి
అక్కతో జెప్పేగాని అందుకొనే రారా // అనుచు //
యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీ వింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయితే
యివ్వల నీకంటే బెద్ద యిది నీ వెఱగవా // అనుచు
భావ నథుర్యం
ఈ కీర్తనలో అన్నమయ్య బలరామకృష్ణుల ఆటలు వారి మధ్య అనుబంధం చాలా చక్కాగా వివరించాడు, ఇది ఆ ఇద్దరి అన్నదమ్ముల సంవాదం.
ఇద్దరు అన్నదమ్ములూ(బలరామకృష్ణులు) కవలపిల్లల వలేనే ఆడుకుంటూ సంభాషించుకుంటూ ఉంటారు. మురిపెంగా అడుకుంటున్న వారిద్దరినీ చూచి బ్రహ్మాది దేవతలు మురిసిపోతూ మ్రొక్కుతూ ఉంటారుట!
రాముడా! నాకు రెండు పండ్లని ఇవ్వరా.. అని కృష్ణుడు అడుగగా, నేనిస్తా సరే గానీ నువ్వూ నాకు ఇలాగే ఇస్తావా? అని బలరాముడంటాడు. ప్రేమపు నీ తమ్ముడినే ఆనీ నీ కన్న చిన్నవాడిని కదా.. అంటాడు కృష్ణుడు. ఈ మాట మరువకు మరి ఇందరా కృష్ణా! ఈ పళ్ళు తీసుకో అంటాడు బలరాముడు.
నువ్వు ఎక్కిన ఉట్టిపై నన్నూ ఎక్కించరా! అని కృష్ణుడంటే. వద్దురా! నువ్వురాకు పడిపోతావు అని రాముడంటాడు. నీ పసిడి పాదాలకు మొక్కుతాను నన్ను ఎక్కించు అని కృష్ణుడనగా అక్కతో చెప్పే గాని అందుకొని రారా! అని బలరాముడు అంటాడు.
ఎవరు ఓడిపోతారో చూతము ఇలా వచ్చి నిలబడరా! అని కృష్ణుడు బలరాముడిని కంగిస్తే, అంత నిక్కు నీకు వొద్దురా అని బలరాముడంటాడు. అవ్వల శ్రీవేంకటాద్రి రాయుడ నేనేరా అని కృష్ణుడు అనగా, ఏమైనా ఇవ్వల నీ కంటే పెద్ద నేను ఎరుగవా అని బలరాముడంటాడు.
పరమాత్మ స్వరూపాలైనా చిన్నపిల్లలైన అన్నదమ్ముల మధ్య అల్లరి సంభాషణలను ఎలా ఉంటాయో అన్నమయ్య ఎంత బాగా ఈ కీర్తనలో పొందుపరిచాడో కదా..