Friday, 16 November 2018

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. - అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!

సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!

తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!

చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!

భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన  నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.



ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము, - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము,
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మా తరములా.. !!

సకలలోకవాసనాయక శౌరి మురహరి నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చవటంచును
వికటముగ నిన్నుఁ గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరుఁ దెరచిన యందు లోకములుండెను. !!

శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసికెక్కెను బండి రొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాతాలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు. !!

నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసు లిదె నీ విద్యలెల్లా జూచిరి
సుముఖులైకరిశబరిబలియును శుకధృవాదులు నిన్నుఁ గొలువ
సమత ఉన్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి. !!

భావము..
పెదతిరుమలాచార్య చెప్పిన శౌరీ విలాసము.
ఓ శ్రీహరీ! ఎంత చిత్రం? ఏమి  మహిమలు? ఏమి నీ మయావినోదములు? ఓ అచ్యితా! ఓ వామనా! నిన్ను తెలుసుకోగలగడం మా తరమా? నిన్ను గుర్తించలేని దౌర్భాగ్యులం మేము.
ఓ శౌరీ! ఓ మురహరీ! సకలలోకనాయకా! పాలదొంగవని నీ గుణములు ఎంచుతున్నాము. సరియే మేము అజ్ఞానులము. నీ మాతృమూర్తి నీ బుగ్గపై మీటి అడుగగా, అకటా! నీ నోరు తెరచి పదునాల్గు భువనాలను చూపించితివి.  ఆ తల్లి నిశ్చేష్టురాలైనది.
ఓ శ్రీసతీపతీ! దైత్యులను, దానవులను శిక్షించి అమరులను రక్షించినవాడివే. ఒక మూలనున్న బండిని విరిచిన నీ చేతలు సామాన్యులకు అర్ధం కానేకావు. ఆ అర్జునుడు మోసపోయి నిన్ను బావగా, రథసారథిగా, యాదవునిగా ఎంచి నీవు వాసవార్చితుడవని మరచితే విశ్వరూపం చూపి అతని కన్నులు తెరిపించినవాడవు.
ఓ వేంకటేశ్వరా! నారదప్రియా! భక్తవత్సలా! నమో నమో! నీ దాసులు మాత్రమే నీ మహిమలెల్లా చూచిరి. నీ శరణాగతులైన గజేంద్రుడు, శబరి, బలి, నిన్ను గొలిచెడి శుక ధ్రువాదులకు నీవు ఉన్నత పదములొసగుట సర్వమూ మేమీ పుడమిలోనే గంటిమి ప్రభూ!




తలచరొ జనులు ఈతని పుణ్యనామములు. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.. తలచరొ జనులు ఈతని పుణ్యనామములు.

తలచరొ జనులు ఈతని పుణ్యనామములు
సులభముననే సర్వసుభములు కలుగు !!

హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుడు
వనధి  లంఘన  శీల  వైభవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుడు
ఘనుడు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

లంకా సాధకుఁడు లక్ష్మణప్రభోధకుఁడు
శంకలేని  సుగ్రీవ  సచివుఁడు
పొంకపు రాముని బంటు భూమిజ సంతోష దూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు. !!

చటులార్జున సఖుఁడు జాతరూపవర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

భావం॥  ఈ కీర్తనలో అన్నమయ్య హనుమంతుని భజిస్తూ ఆతని గుణగణాలు వర్ణిస్తున్నాడు.
ఓ! జనులాల! ఈతని పుణ్యనామము తలుచుకోండి. అతి సులభముగానే సర్వశుభములు కలుగుతాయి. అతని దివ్యనామం ఉచ్ఛరిస్తే చాలు ఉన్నత గతులు కలుగుతాయి.
హనుమంతుడు వాయుదేవుని కుమారుడు, అంజనా తనయుడు, సముద్రాన్ని లంఘించిన వాడు, శీల సంపద కలిగినవాడు. రాక్షసులను సంహరించినవాడు, సంజీవని పర్వతమును కనుగొన్నవాడని కీర్తింపబడినవాడు, ఘనుడు, కలశాపుర ప్రాంతము వాడు ఈ హనుమంతుడు.
లంకను సాధించినవాడు, ఒకానొక సమయంలో లక్ష్మణునకే బోధ చేసినవాడు, ఎటువంటి సంశయమూ లేని సుగ్రీవుని సచివుడు, ఒద్దికగా శ్రీరాముని బంటుగా నున్నవాడు, సీతమ్మకు చింత పోగొట్టి సంతోషం కలిగించిన దివ్యదూత. ఆ మహానుభావునికి అన్నమయ్య నీరాజనాలిస్తున్నాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథముపైన జెండా మీద విరాజిల్లి, అతని విజయానికి తోడ్పడినవాడు, బంగారు వర్ణంతో శోభిల్లేవాడు, ఇకమీదట బ్రహ్మపదవిని చేపట్టవలసినవాడు, అలాంటి కపీశ్వరుడు శ్రీ వేంకటేశ్వరుని సేవకుడై ఏదుకొండలపై కొలువై ఉన్నాడు. శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకొంటే చాలు అన్ని భయాలు తొలగి విజయాలు సిధ్ధిస్తాయని అన్నమయ్య ప్రబోధం.


ఏడనుండి వచ్చినాడే.. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.  ఏడనుండి వచ్చినాడే..

ఏడనుండి వచ్చినాడే ఈడకుఁ దాను
వీడెమిచ్చీఁ జూడవే వేసాలవాఁడు. !!

వెలలేనివలపుల వేడుకకాఁడు
కలికితనాల మంచి గయ్యాళివాఁడు
చలమరిసరసాల జాజరకాఁడు
చెలువుఁడు వీఁడు కడె శ్రీవేంకటేశుఁడు !!

కొనబుతనాలతోడి కోడెకాఁడు
నినుపు నవ్వుల నవ్వే నీటులవాఁడు
వొనరినవరముల వుదారికాఁడు
చెనకులవాఁడుగదే శ్రీవేంకటేశుఁడు. !!

గొల్లెతల మానముల కొల్లకాఁడు
పిల్లదొరలూఁదేటి పిన్నవాఁడు
యెల్లగా నలమేల్మంగ నేలినవాఁడు
చెల్లుబడి వీఁడుగదె శ్రీవేంకటేశుఁడు. !!

భావం.. శ్రీవెంకటేశ్వరునిపై శృంగారగీతిక వినిపిస్తున్నాడు అన్నమయ్య, తనివిదీరా ఆస్వాదించండి.

చెలికత్తెలు ఒకరితో ఒకరు చెప్పుకొంటున్నారు. తాను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చినాడే?  తాంబూలమిచ్చి ఆహ్వానించండి ఆ వేషాలవానిని.
ఏ వెలకూ సరితూగని వలపులవేడుకలు కలవాడు. ఇతరులను ఆకాట్టుకొనే నేర్పరితనంలో బహు గడుసరి వాడు. చలముతో సరసాలు నెరపే  జాజరకాడు. చెలికాడు వీడె గదే శ్రీ వేంకటేశ్వరుడు.
కొంటెతనాలతో కోడెకాడు వీడు. చిలిపి నవ్వులునవ్వే నీటుగాడు. వరములు గుప్పించడంలో అతి ఉదారుడు. చెనకులతో నొక్కులు నొక్కే వాడు శ్రీవేంకటేశ్వరుడు.
కృష్ణావతారంలో గొల్లెతల  మానములు దోచుకొన్న కొల్లకాడు. వీడే కదా పిల్లనగ్రోవి ఊదుతూ అందరినీ పరవశింపజేసే పిల్లవాడు. దేవి అలమేల్మంగను పెండ్లియాడి ప్రేమతో ఏలుకునే గొప్ప చెల్లుబడివాడు శ్రీవేంకటేశ్వరుడు.

Saturday, 18 August 2018

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు - కవిత

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు
మూల్యం చెల్లించి సొంతం చేసుకోవడానికి,
ఆదరాభిమానాలు తాతముత్తాతల ఆస్తులు కావు
అధికారంతో కబళించి అనుభవించి తృప్తి చెందడానికి,
హృదయాంతరాళలో నుంచి పొంగి పొరలేదే నిజమైన అనురాగం,
అవరోధాలు లేని ప్రేమ విశ్వమంతా వ్యాపించి
తర తమ భేధం లేక అందరికీ పంచబడుతుంది.
ఈ సత్యం తెలుసుకోలేక ఈర్ష్యా అసూయలతో కలసి
అగ్నిగుండంలా మారిన మానసం.
ఒక్కరికే సొంతమవ్వాలనే కుంచిత భావం.
అంతర్మథనంలో అంతరాత్మ ఘోషిస్తూంది.
అధీనంలో లేని మనసు అపరాధమని తెలిసీ
 అంగీకరించడానికి మొరాయిస్తోంది.
సుగుణాలతో బాటు బలహీనతలని కూడా స్వీకరించి
చేరదియ్యాలని ఆత్యాశ!
అత్యాశతో కొట్టుమిట్టాడే మనసుకు
మిగిలేవి  కన్నీళ్ళు,  కలతలే!
-- పొన్నాడ లక్ష్మి

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బునీటిపై ఒక హంసా! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అన్నమాచార్యులు ఆ ఆపదమొక్కుల వాడిని హంసగా అభివర్ణిస్తూ రచించిన ఈ పదావళి ఆయన కవితాత్మక దృష్టికి, భావుకతకు ప్రతిబింబం. క్షీరసాగరలో శయనించే ఆ శ్రీమహావిష్ణువు ఆ భాగవతోత్తముడికి, ఎగిసే అలలపై తేలే తెల్లని కలహంసలా కనిపిస్తున్నాడట! ఆ అనుభూతికే అక్షరరూపమిస్తూ  ఈ భక్తకవి ఇలా చెప్తున్నాడు.

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో
ఉబ్బునీటిపై ఒక హంసా!

అనువున కమలవిహారమె నెలవై
ఒనరి యున్న దిదె ఒక హంసా!
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్న దిదె ఒక హంసా!

పాలు నీలు వేర్పరచి, పాలలో
ఓలలాడెనిదె ఒక హంసా!
పాలుపడిన ఈ పరమహంసముల
ఓలినున్న దిదె నొక హంసా!

తడవి రోమరంధ్రముల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంసా!
కడు వేడుక వేంకటగిరిమీదట
నొడలు పెంచె నిదె నొక హంసా!

భావం..  శ్రీమతి బి. కృష్ణకుమారి.
దిబ్బలు వెట్టుచు అంటే సమంగా ఉండే నీటిపై  ఎత్తులు కల్పిస్తూ అని, ఉబ్బునీరు అంటే పొంగుతున్న నీరు అని అర్ధం. పరిశుధ్ధతకు ప్రతిరూపమైన ఆ పరమాత్మను పరమహంసతో పోల్చి పరవశించెను ఆ పదకవితాపితామహుడు.
ఆ శంఖచక్రధారి  శేషసాయిగా శ్రీమహాలక్ష్మితో కలిసే ఉంటాడు. ప్రకృతి పురుషులకు ప్రతీకగా ఇరువురి మధ్య అనుబంధం అంత గాఢమైనది. అలాంటి స్వామిని నిరంతరం సరస్సుని నెలవుగా చేసుకొని జీవించే మరాలంతో సరిపోల్చుతున్నాడు అన్నమయ్య. అంతే కాకుండా లోకంలోని సమస్తజీవులనే మనస్సులనే సరస్సులో భగవంతుడు కొలువై ఉంటాడని ప్రస్ఫుటం చేస్తున్నాడు, హంసకు హిమాలయాల్లోని  మానససరోవరం ఎలాగో, ఆ పరంధాముడికి పరమభక్తుల హృదయాలు కూడా అంతే అంటున్నాడు అన్నమయ్య.
హంస అనగానే నీళ్ళు కలిపిన పాలను ముందు పెడితే నీళ్ళను వదిలి పాలను మాత్రమే తాగుతుందని అనాదిగా వింటున్న ఐతిహాసిక భావన. దీనిని సజ్జనుల విచక్షణ లక్షణానికి ప్రతీకాత్మకంగా సాహుతీవేత్తలు సరిపోల్చుతారు. భగవంతుడు కూడా అలాగే పాపపుణ్యాలనే నీరక్షీరములను వేరు చేసి, పావనచరితుల, పరమహంసల పక్షమే వహిస్తాడు. ఆ పన్నగశయనుడు పాలకడలిలో పవళిస్తుండడం వెనుక పరమార్ధమిదే అని అంటున్నాడు అన్నమయ్య.
హంస తన రెక్కలమాటున పెట్టుకొని గుడ్లను పొదిగినట్లు, భగవంతుడు కూడా అండపిండ బ్రహ్మాండాలను  అంతర్బహిర్యామినిగా ఆక్రమించి సృష్టిని నడుపుతున్నాడట! అలా లోకాలన్నీ ఆయన రక్షణలో మనుగడ సాగిస్తున్నాయట. అంతటి విశిష్టత కలిగిన ఆ పరమాత్ముడు వేడుకగా వేంకటగిరిపై వేంచేసి ఉన్నాడని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. 'తడవి' అంటే ప్రేమతో తాకి, 'ఉడుగక' అంటే తగ్గక. 'ఒడలు' అంటే శరీరం అని అర్ధాలు. ఆ కారణజన్ముడు కమనీయంగా రచించిన ఆ కీర్తనను శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పరిశోధించి ఆ పదాలకు అర్థాలను తేటపరిచారు. ఇలా అన్నమాచార్యుల ఎన్నో కీర్తనలు మనం సులువుగా పాడుకొని పరవశించడానికి రాళ్ళపల్లి వారు పరోక్షకారకులు., వందనీయులు.
సేకరణ. పొన్నాడ లక్ష్మి.

Sunday, 29 July 2018

అదె ఎవ్వతె, తాను అలమేల్మంగను నేను పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని.- అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

అదె ఎవ్వతె,  తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని. !!

పొలఁతి నీకెవ్వతె బుధ్ధులు చెప్పినది
నలువున నా పతితో నవ్వుమంటాను
తెలుపఁగదవె  దాని దీమసమెంతో
చలములు నీతో మరి సాధించేఁగాని !!

నీ కెవ్వతె ఈ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సొలయుమని
నాకుఁ జూపవే దాని విన్నాణమెంతో
మైకొని నీతో మరి మాటలాఁడేఁగాని !!

వోడక యెవ్వతె నీకీ ఉపదేశమిచ్చినది?
యీడనా శ్రీ వేంకటేశు నెనయుమని
వాడలోనెంచవే దాని వాసి యెంతో ఈతడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని. !!

భావమాథుర్యం..
అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార సంకీర్తనలో రోషావేశపరవశురాలైన అలమేలుమంగా దేవి తన చెలికత్తెతో యెంత దురుసుగా, పరుషమైన మాటలను ప్రయోగిస్తున్నదో చూడండి. ఎంత అమ్మవారు అయినా  తనపతి మదిని మరో స్త్రీ దోచుకున్నదనితెలిసినా, లేక ఇంకో స్త్రీ తనపతిపై మనసుపడిందని తెలిసినా కట్టుకున్న ఇల్లాలి మనసు ఎలా కుతకుతలాడుతుందో అతి సహజంగా అన్నమయ్య వివరించాడు. ఎవరెన్ని వేషాలు వేసినా ఎంతగా మనసుపడినా భార్య విలువ భార్యదే అని స్పష్టంగా తెలియజేసాడు.
అది ఎవ్వరే, నేను అలమేల్మంగను. కోరిన నా స్వామి అర్ధాంగిని, హృదయవాసినిని. నీవు నా స్వామి రహస్యాలను దాచుకున్నావని నాకు ముందే తెలుసు. నీ గడుసుదనాన్ని మెచ్చుకున్నా కానీ తాను ఎవ్వరో దాచకుండా చెప్పమనవే!
ఓ పొలతీ! నీ కెవ్వతె ఈ బుధ్ధులు నూరిపోస్తున్నదే? నా పతితో నవ్వుతూ ఊసులాడమని దాని కెవరు చెప్పారే? దాని ధీమసమేమిటో అంతు చిక్కడం లేదే? నా పట్టుదలలు నీకు తెలుసుగా.. నేను అదెవ్వరో సాధించి తీరుతాను.
ఏమే! ఈ చేష్టలన్నీ నీకెవతె నేర్పుతున్నాదే? నా రమణుని బాగుగా పరవశింపజేయుమని దానికెవరు బోధిస్తున్నారే? దానిని నాకు చూపవే. దాని జాణతనమేంటో చూస్తాను. నా చెలికత్తెవైన నిన్ను లొంగదీసుకుని మాట్లాడుతున్నదే? దాని సంగతేమిటి?
ఓ చెలీ! వెనుదీయక యెవతె నీకివన్నీ ఉపదేశిస్తోంది? ఇక్కడ తిరుమలలో నా వెంకటేశ్వరుని సంగమించమని ఎవరు నూరిపోస్తున్నారు దానికి? వాడలో దానికేమి పేరు, ప్రతిష్ఠ ఉంటాయే? నీవీ గుట్లు చెప్తున్నావే గాని స్వామి అర్ధాంగినైన నన్ను కూడి పరవశింపచేసినాడే.