అదె ఎవ్వతె, తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని. !!
పొలఁతి నీకెవ్వతె బుధ్ధులు చెప్పినది
నలువున నా పతితో నవ్వుమంటాను
తెలుపఁగదవె దాని దీమసమెంతో
చలములు నీతో మరి సాధించేఁగాని !!
నీ కెవ్వతె ఈ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సొలయుమని
నాకుఁ జూపవే దాని విన్నాణమెంతో
మైకొని నీతో మరి మాటలాఁడేఁగాని !!
వోడక యెవ్వతె నీకీ ఉపదేశమిచ్చినది?
యీడనా శ్రీ వేంకటేశు నెనయుమని
వాడలోనెంచవే దాని వాసి యెంతో ఈతడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని. !!
భావమాథుర్యం..
అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార సంకీర్తనలో రోషావేశపరవశురాలైన అలమేలుమంగా దేవి తన చెలికత్తెతో యెంత దురుసుగా, పరుషమైన మాటలను ప్రయోగిస్తున్నదో చూడండి. ఎంత అమ్మవారు అయినా తనపతి మదిని మరో స్త్రీ దోచుకున్నదనితెలిసినా, లేక ఇంకో స్త్రీ తనపతిపై మనసుపడిందని తెలిసినా కట్టుకున్న ఇల్లాలి మనసు ఎలా కుతకుతలాడుతుందో అతి సహజంగా అన్నమయ్య వివరించాడు. ఎవరెన్ని వేషాలు వేసినా ఎంతగా మనసుపడినా భార్య విలువ భార్యదే అని స్పష్టంగా తెలియజేసాడు.
అది ఎవ్వరే, నేను అలమేల్మంగను. కోరిన నా స్వామి అర్ధాంగిని, హృదయవాసినిని. నీవు నా స్వామి రహస్యాలను దాచుకున్నావని నాకు ముందే తెలుసు. నీ గడుసుదనాన్ని మెచ్చుకున్నా కానీ తాను ఎవ్వరో దాచకుండా చెప్పమనవే!
ఓ పొలతీ! నీ కెవ్వతె ఈ బుధ్ధులు నూరిపోస్తున్నదే? నా పతితో నవ్వుతూ ఊసులాడమని దాని కెవరు చెప్పారే? దాని ధీమసమేమిటో అంతు చిక్కడం లేదే? నా పట్టుదలలు నీకు తెలుసుగా.. నేను అదెవ్వరో సాధించి తీరుతాను.
ఏమే! ఈ చేష్టలన్నీ నీకెవతె నేర్పుతున్నాదే? నా రమణుని బాగుగా పరవశింపజేయుమని దానికెవరు బోధిస్తున్నారే? దానిని నాకు చూపవే. దాని జాణతనమేంటో చూస్తాను. నా చెలికత్తెవైన నిన్ను లొంగదీసుకుని మాట్లాడుతున్నదే? దాని సంగతేమిటి?
ఓ చెలీ! వెనుదీయక యెవతె నీకివన్నీ ఉపదేశిస్తోంది? ఇక్కడ తిరుమలలో నా వెంకటేశ్వరుని సంగమించమని ఎవరు నూరిపోస్తున్నారు దానికి? వాడలో దానికేమి పేరు, ప్రతిష్ఠ ఉంటాయే? నీవీ గుట్లు చెప్తున్నావే గాని స్వామి అర్ధాంగినైన నన్ను కూడి పరవశింపచేసినాడే.
No comments:
Post a Comment