Friday, 16 November 2018

ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము, - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము,
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మా తరములా.. !!

సకలలోకవాసనాయక శౌరి మురహరి నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చవటంచును
వికటముగ నిన్నుఁ గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరుఁ దెరచిన యందు లోకములుండెను. !!

శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసికెక్కెను బండి రొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాతాలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు. !!

నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసు లిదె నీ విద్యలెల్లా జూచిరి
సుముఖులైకరిశబరిబలియును శుకధృవాదులు నిన్నుఁ గొలువ
సమత ఉన్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి. !!

భావము..
పెదతిరుమలాచార్య చెప్పిన శౌరీ విలాసము.
ఓ శ్రీహరీ! ఎంత చిత్రం? ఏమి  మహిమలు? ఏమి నీ మయావినోదములు? ఓ అచ్యితా! ఓ వామనా! నిన్ను తెలుసుకోగలగడం మా తరమా? నిన్ను గుర్తించలేని దౌర్భాగ్యులం మేము.
ఓ శౌరీ! ఓ మురహరీ! సకలలోకనాయకా! పాలదొంగవని నీ గుణములు ఎంచుతున్నాము. సరియే మేము అజ్ఞానులము. నీ మాతృమూర్తి నీ బుగ్గపై మీటి అడుగగా, అకటా! నీ నోరు తెరచి పదునాల్గు భువనాలను చూపించితివి.  ఆ తల్లి నిశ్చేష్టురాలైనది.
ఓ శ్రీసతీపతీ! దైత్యులను, దానవులను శిక్షించి అమరులను రక్షించినవాడివే. ఒక మూలనున్న బండిని విరిచిన నీ చేతలు సామాన్యులకు అర్ధం కానేకావు. ఆ అర్జునుడు మోసపోయి నిన్ను బావగా, రథసారథిగా, యాదవునిగా ఎంచి నీవు వాసవార్చితుడవని మరచితే విశ్వరూపం చూపి అతని కన్నులు తెరిపించినవాడవు.
ఓ వేంకటేశ్వరా! నారదప్రియా! భక్తవత్సలా! నమో నమో! నీ దాసులు మాత్రమే నీ మహిమలెల్లా చూచిరి. నీ శరణాగతులైన గజేంద్రుడు, శబరి, బలి, నిన్ను గొలిచెడి శుక ధ్రువాదులకు నీవు ఉన్నత పదములొసగుట సర్వమూ మేమీ పుడమిలోనే గంటిమి ప్రభూ!




No comments:

Post a Comment