Saturday, 18 August 2018

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బునీటిపై ఒక హంసా! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అన్నమాచార్యులు ఆ ఆపదమొక్కుల వాడిని హంసగా అభివర్ణిస్తూ రచించిన ఈ పదావళి ఆయన కవితాత్మక దృష్టికి, భావుకతకు ప్రతిబింబం. క్షీరసాగరలో శయనించే ఆ శ్రీమహావిష్ణువు ఆ భాగవతోత్తముడికి, ఎగిసే అలలపై తేలే తెల్లని కలహంసలా కనిపిస్తున్నాడట! ఆ అనుభూతికే అక్షరరూపమిస్తూ  ఈ భక్తకవి ఇలా చెప్తున్నాడు.

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో
ఉబ్బునీటిపై ఒక హంసా!

అనువున కమలవిహారమె నెలవై
ఒనరి యున్న దిదె ఒక హంసా!
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్న దిదె ఒక హంసా!

పాలు నీలు వేర్పరచి, పాలలో
ఓలలాడెనిదె ఒక హంసా!
పాలుపడిన ఈ పరమహంసముల
ఓలినున్న దిదె నొక హంసా!

తడవి రోమరంధ్రముల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంసా!
కడు వేడుక వేంకటగిరిమీదట
నొడలు పెంచె నిదె నొక హంసా!

భావం..  శ్రీమతి బి. కృష్ణకుమారి.
దిబ్బలు వెట్టుచు అంటే సమంగా ఉండే నీటిపై  ఎత్తులు కల్పిస్తూ అని, ఉబ్బునీరు అంటే పొంగుతున్న నీరు అని అర్ధం. పరిశుధ్ధతకు ప్రతిరూపమైన ఆ పరమాత్మను పరమహంసతో పోల్చి పరవశించెను ఆ పదకవితాపితామహుడు.
ఆ శంఖచక్రధారి  శేషసాయిగా శ్రీమహాలక్ష్మితో కలిసే ఉంటాడు. ప్రకృతి పురుషులకు ప్రతీకగా ఇరువురి మధ్య అనుబంధం అంత గాఢమైనది. అలాంటి స్వామిని నిరంతరం సరస్సుని నెలవుగా చేసుకొని జీవించే మరాలంతో సరిపోల్చుతున్నాడు అన్నమయ్య. అంతే కాకుండా లోకంలోని సమస్తజీవులనే మనస్సులనే సరస్సులో భగవంతుడు కొలువై ఉంటాడని ప్రస్ఫుటం చేస్తున్నాడు, హంసకు హిమాలయాల్లోని  మానససరోవరం ఎలాగో, ఆ పరంధాముడికి పరమభక్తుల హృదయాలు కూడా అంతే అంటున్నాడు అన్నమయ్య.
హంస అనగానే నీళ్ళు కలిపిన పాలను ముందు పెడితే నీళ్ళను వదిలి పాలను మాత్రమే తాగుతుందని అనాదిగా వింటున్న ఐతిహాసిక భావన. దీనిని సజ్జనుల విచక్షణ లక్షణానికి ప్రతీకాత్మకంగా సాహుతీవేత్తలు సరిపోల్చుతారు. భగవంతుడు కూడా అలాగే పాపపుణ్యాలనే నీరక్షీరములను వేరు చేసి, పావనచరితుల, పరమహంసల పక్షమే వహిస్తాడు. ఆ పన్నగశయనుడు పాలకడలిలో పవళిస్తుండడం వెనుక పరమార్ధమిదే అని అంటున్నాడు అన్నమయ్య.
హంస తన రెక్కలమాటున పెట్టుకొని గుడ్లను పొదిగినట్లు, భగవంతుడు కూడా అండపిండ బ్రహ్మాండాలను  అంతర్బహిర్యామినిగా ఆక్రమించి సృష్టిని నడుపుతున్నాడట! అలా లోకాలన్నీ ఆయన రక్షణలో మనుగడ సాగిస్తున్నాయట. అంతటి విశిష్టత కలిగిన ఆ పరమాత్ముడు వేడుకగా వేంకటగిరిపై వేంచేసి ఉన్నాడని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. 'తడవి' అంటే ప్రేమతో తాకి, 'ఉడుగక' అంటే తగ్గక. 'ఒడలు' అంటే శరీరం అని అర్ధాలు. ఆ కారణజన్ముడు కమనీయంగా రచించిన ఆ కీర్తనను శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పరిశోధించి ఆ పదాలకు అర్థాలను తేటపరిచారు. ఇలా అన్నమాచార్యుల ఎన్నో కీర్తనలు మనం సులువుగా పాడుకొని పరవశించడానికి రాళ్ళపల్లి వారు పరోక్షకారకులు., వందనీయులు.
సేకరణ. పొన్నాడ లక్ష్మి.

No comments:

Post a Comment