ఈ వారం అన్నమయ్య కీర్తన.
రాముడిదె లోకాభిరాముడితడు
గోమున పరశురాముకోప మార్చెనటరే
యీతడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమారుడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త కదవె
మనకౌసల్యకొడుకా మాయామృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తునుమాడె నేడుదాళ్ళు తోడనే వాలి నడచె
యినకులుఁ డితడా యెంతకొత్త చూడరే
యీవయసునుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుడితడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే
భావమాథుర్యం..
ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీరాముని వీర
గాథలు ఉద్ఘాటించెను. అయోధ్యావాసులు తమలో తము శ్రీరాముని శౌర్యమును తలచుకొని
ఆశ్చర్యచకితులౌతున్నారు.
శ్రీరాముడితడు. లోకాభిరాముడు. పరశురాముని
కోపమును అణగద్రొక్కిన మహాపురుషుడు.
ఈతడా బ్రహ్మరాక్షసి తాటకిని
సంహరించెను. ఈ చిన్నవాడా సుబాహుని కొట్టి విశ్వామిత్రుని యజ్ఞమును కొనసాగేలా
చేసెను. ఈ కుమారుడా శివుని విల్లు విరిచి సీతమ్మను పెండ్లాడెను.. ఈ విషయాలన్నీ
వింటుంటే కొత్తగా ఉంటుంది కదే..
మన కౌసల్య కొడుకా.. మాయామృగమును చంపి రాక్షసులను
మట్టుబెట్టెను. ఏడు తాళవృక్షములను ఒక్క తాటితో బంధించి వాలిని సంహరించెను.
ఇనకులుడు ఇతడా? ఎంత వింత చూడరే..
ఈ వయసులో తానే జలధిని బంధించి లంకకు
పోయి, రావణుని సంహరించి సీతను క్షేమముగా తిరిగితెచ్చుకొనెను. శ్రీవేంకటేశ్వరుడితడా
సిరిసంపదలతో అయోధ్యను పరిపాలించిన అయోధ్యరాముడు. కనుకనే నాటికి నేటికి మనందరికీ
కన్నులలో కనిపించే పరదైవము.
జై శ్రీరామ్.. జై హనుమాన్!
No comments:
Post a Comment