అన్నమయ్య జయంతి వ్యాసం.
అన్నమయ్య.
వైశాఖ పూర్నిమ.. అన్నమయ్య జయంతి.
‘హరి అవతారమీతడు అన్నమయ్యా
అరయ మా గురుడీతడు అన్నమయ్యా..’
శ్రీ వేంకటేశ్వరానుగ్రహం వల్ల నందవరీక బ్రాహ్మణులు, భారధ్వాజస గోత్రులు
అయిన లక్కమాంబ, నారాయణ సూరి దంపతుల పుణ్యఫలంగా క్రీ.శ.1408 సర్వధారి నామ సంవత్సరం
విశాఖ నక్షత్రంలో వైశాఖపూర్ణిమ నాడు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో
అన్నమయ్య జన్మించాడు.
అన్నమయ్య తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కృపతో జీవిత పర్యంతమూ
32,000 సంకీర్తనలను రచించి పాడిన ధన్యుడు. ప్రాస యతులతో కూడిన అన్నమయ్య
కీర్తనలు రెండు పాదాలు గల పల్లవి. నాలుగు పాదాలు గల మూడు చరణాలు కలిగి
ఉంటాయి. కొన్ని కీర్తనలలో చరణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సంగీత సాహిత్యాలు
రెండూ సమపాళ్ళలో మేళవింపబడి, పండిత పామరులను ఒకేలా అలరిస్తాయి.
పద కవిత్వం, కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి
పదకవితకు ఒక నిర్ధిష్టతనీ, గౌరవాన్నీ కల్పించాడు. పైగా పండితుల కంటే
పామరులను రంజింపజేసి, వారిలో భక్తి భావం కలిగించేందుకు జానపదుల భాషలో
మేలుకొలుపు, ఉగ్గు, గూగూగు, ఏల, జోల, లాలి, ఉయ్యాల, కోలాట. సువ్వి, జాజర
మొదలగు పదాలు చొప్పించి కీర్తనలను రచించాడు. సామెతలు, జాతీయాలను
పొందుపరుస్తూ తేలిక భాషలో సామాన్యులను రంజింపజేస్తూ పండితులను సంతుష్టి
పరచే విధంగా గ్రాంధిక, సంస్కృత భాషల్లో కూడా రచించాడు.
అంతే కాక వైరాగ్య మనస్తత్వాలకు ఇష్టమయ్యే రీతిలో అధ్యాత్మిక కీర్తనలు,
శృంగారప్రియులకు శృంగార కీర్తనలనీ. పిల్లలకనువైన ఆట పాట కీర్తనలనీ,
నిత్యమూ శారీరకంగా అలసిపోయే శ్రమజీవుల కోసం జానపద గేయాలనీ రచించి తరించిన
మహనీయుడు. అందుకే సమాజం లో అన్ని వర్గాల వారికీ నాటికీ నేటికీ ఈ కీర్తనలు
ఆనందదాయకాలే..
అన్నమయ్య సంకీర్తనలు వృత్తిపరమైన భాషలో, వారి యాసలో కమ్మరి, కుమ్మరి,
జాలరి మొదలైన అన్ని వృత్తుల వారితో ఆత్మీయంగా మసులుతూ వారి భావంతో
సంకీర్తనలను రచించడం వల్ల వారితో అన్నమయ్యకు గొప్ప అనుబంధం ఏర్పడి వారికి
ఆత్మీయుడయ్యాడు. పల్లెల్లో శ్రమజీవులు పాడుకొనే దంపుళ్ళ పాటలు, అల్లో
నేరెళ్ళు, గొబ్బిళ్ళ పాటలు, తుమ్మెద పదాలు, చిలక పాటలు తందాన పాటలు, హంస
పదాలు. చాంగుభళాలు మొదలైన పదజాలం కూర్చడం వలన అన్నమయ్య కీర్తనలు
ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నమయ్య స్పృశించని
అంశం లేదంటే అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment