Monday, 5 April 2021

పుస్తకమా నీకు జోహార్లు. -





పుస్తకమా నీకు జోహారులు ! (రచన : సౌజన్యం : శ్రీ పొన్నాడ ఉమామహేశ్వరరావు)

"తల్లీ నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్ బట్టితిన్ " అని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న పద్యం. పుస్తకం చేత పట్టడమే చదువుల తల్లికి పూజా పుష్పం సమర్పించడంతో సమానం.

విషయ వస్తువు ఏదైనా సరే, పుస్తకం పట్టుకుంటే చాలు, మస్తకం పరుగులు తీస్తుంది. పుస్తకాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఓదారుస్తాయి. ఒకప్పుడు, అంటే. టీవీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో, పుస్తకాలే ప్రజలకి మిత్రులు. కాలక్షేప సాధనాలు. స్వంతంగా పుస్తకాలు కొనుక్కోలేని వారికి పుస్తకాలు అద్దెకి తెచ్చుకొని చదువుకొనే సౌలభ్యం ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో విరివిరిగా వచ్చిన కొమ్మూరి సాంబశివ రావు, టెంపోరావు, భగవాన్ మొదలైన వారి అపరాధ పరిశొధన నవలలు అద్దెకు తెచ్చుకొని కాలేజీ కుర్ర కారు విపరీతంగా చదివే వారు.

పుస్తక పఠనం పట్ల ప్రజలకి ఆసక్తి తగ్గిపోయింది అనడం నిజం కాదు. మాధ్యమం మారిందేమో గాని, పఠనాసక్తి గల చదువరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కంప్యూటర్ తెరలు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఈ మ్యాగజైన్లు, ఈ బుక్స్, .. ఇలా ఈ నాటి తరం ఎదో రకంగా చదువుతూనే ఉన్నారు.

ఎన్నిప్రత్యామ్నాయాలు వచ్చినా పుస్తకం పుస్తకమే. హాయిగా వాలుకుర్చీలో కాళ్ళు జాపుకొని కూర్చునో, మంచంమీద వ్రాలో, పుస్తకం చదువుకోవడం ఎంత ఆనందదాయకం? చదువుతూ, చదువుతూ, పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకొని ఓ చిన్న కునుకు కూడా తీయవచ్చు. ల్యాప్ టాప్లు, ట్యాబ్లెట్లతో ఈ సౌకర్యం చచ్చినా రాదు కదా?

ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే, చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి, వచ్చిన వాళ్ళు వెళ్ళి పోయాక తిరిగి చదువుకునే సౌకర్యం ఒక్క పుస్తకానికే ఉంది. అదే ఏ టీవీ చూస్తున్నప్పుడో అతిధులు వస్తే, చూస్తున్న టవీని కట్టెయ్యలేక, వచ్చిన వారిని పొమ్మనలేక ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చోవడం ఎంత ఇబ్బంది?

కొన్నిపుస్తకాలు తట్టి లేపుతాయి. కొన్ని జోకొట్టి నిద్రపుచ్చుతాయి! కొంతమందికి పుస్తకాలు అత్యంత విలువైన ఆస్తి. కొత్తగా కొన్న పుస్తకానికి అట్టవేసి, దాని మీద పేరు వ్రాసి, కొత్త పేళ్ళికూతురిలా ముస్తాబు చేసి మురిసి పోతారు కొందరు. పుస్తకం విలువ తెలియని వాళ్ళు పాత దిన పత్రికలు, చిత్తుకాగితాలతో పాటు పుస్తకాలని అమ్ముకుంటారు.

"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో " అని వీరేశ లింగం గారి ఉవాచ. "పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకులు" ఉంటారని సి.నా.రె గారు ఒక సినిమా పాటలో ప్రస్తావించారు.

ఎక్కువగా చదివే వారిని "పుస్తకాల పురుగు" అనడం నిందా స్తుతి!.
కొంత మంది అదే పనిగా పుస్తకాలు కొంటూనే ఉంటారు. చదివినా, చదవకా పోయినా, పుస్తకాలు కొని ఇంట్లో పెట్టుకోక పోతే వీరికి నిద్ర పట్టదు. కొంత మంది అదే పనిగా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. రోజు ఏదో ఒక పుస్తకం చదవక పోతే ఉండలేరు. రోజూ రాత్రి పడుకొనే ముందు నాలుగైదు పేజీలు చదివితే గాని నిద్ర పోలేని వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు.
మాటలు రాని పుస్తకాలకి భాష ఉంటుంది.. ఎన్ని కబురులో, ఎన్ని ఊసులో ఎంత విఙ్నానమో, ఎంత ఉల్లాసమో వాటి ద్వారా మనకి అందుతూనే ఉంటాయి. అందుకే దాశరధి గారు "మూగ పుస్తకాలలోని రాగాలని పాడుకో" అన్నారు ఒక పాటలో!

స్వర్గీయ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు లాంటి మహాను భావులు మొదలు పెట్టిన గ్రంధాలయ ఉద్యమం ద్వారా తెలుగు నాట జిల్లా, తాలూకా స్థాయిలో అనేక గ్రంధాలయాలు వెలసి, తెలుగు వారిని పుస్తకాల ప్రియులను చేసాయి.. స్వంతంగా పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ గ్రంధాలయాలు చాలా ఉపయోగ పడేవి.

కొందరికి పుస్తకాలు చదవడం సత్కాలక్షేపం. మరి కొందరికి అది వ్యసనం. పుస్తకం పట్టుకుంటే ప్రపంచాన్ని మరచిపోయే వ్యక్తులు ఉంటారు. మా అమ్మమ్మ గారు ఒక సారి చారు కాచాలని తగరపు గిన్నెలో నీళ్ళు పోసి కుంపటి మీద పెట్టి ఓ పుస్తకం పట్టుకొని ప్రపంచాన్ని మరచి పోతే, గిన్నెలోని నీళ్ళన్నీ మరిగి ఇగిరిపోయి, చివరికి తగరపుగిన్నె కరిగి కుంపట్లో కలసిపోయినా ఆవిడకి తెలియలేదుట. పుస్తకం ఇచ్చే మత్తు అలాంటిది మరి!

మా చిన్నప్పుడు, జాషువా గారి ఖండ కావ్యాలు, కరుణశ్రీ, విశ్వనాధ వంటి మహనీయుల పుస్తకాలు రైల్వే స్టేషన్లలో హిగ్గిన్ బాదమ్స్ , ఏ.హెచ్ వీలర్ లాంటి బుక్ స్టాల్సులో దొరికేవి అంటే ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. అప్పటి ప్రజల అభిరుచి అలాంటిది.

ఈ రోజుల్లో ప్రతి వాడి చేతిలోనూ సెల్ ఫోనులు వచ్చాయి గాని, ఒకప్పుడు "పుస్తకమే హస్త భూషణం" గా ఉండేది. పుస్తకాలు యువతీ యువకులకి ప్రేమలేఖలని మోసుకెళ్ళే పల్లకీలుగా ఉపయోగ పడేవి. కొండొకచో ఆ ప్రయత్నాలు ఫలించి పెళ్ళీదాకా దారితీస్తే మరి కొన్ని సందర్భాలలో వికటించి విపరీత పరిణామాలకి దారి తీసేవి.

పుస్తకాలు సంబంధ బాంధవ్యాలని పెంచడమే కాదు, చెడగొడతాయి కూడా! అపురూపంగా కొనుక్కున పుస్తకం ఎవరైనా అడిగితే ఇచ్చారనుకోండి. దానిని తీసుకున్న వాళ్ళు , కావాలనో, మరిచిపోయో, తిరిగి ఇవ్వక పోతే, ఒక వేళ ఇచ్చినా, ఆ పుస్తకం నలిగిపోయో, చిరిగిపోయో వస్తే ఇక చూసుకోండి! బంధువులైనా, మిత్రులైనా వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకొని, చెడా మడా తిట్టేసుకొని, మాట్లాడుకోవడం మానేసిన సందర్భాలు ఉంటాయి.

మహాకవి శ్రీశ్రీ కవితల సంపుటి "మూడు యాభైలు " మొదటి పేజీలో ఒకే ఒక వ్యాక్యం ఉంటుంది " "ఎవరు బ్రతికేరు మూడు యాభైలు" అని. పుస్తకం మూడు యాభైలు బ్రతుకుతుందని నర్మ గర్భంగా ఆ వాక్యం ద్వారా చెప్పేరు శ్రిశ్రి గారు. భాష, లిపి పుట్టిన ఎన్ని ఏళ్ళకి పుస్తకం పుట్టిందో తెలియదు గాని, తాళపత్రాల నుంచి అత్యంత ఆధునిక ముద్రణా రీతుల దాకా ఈ పుస్తకం ఎంత దూరం ప్రయాణించిందో! ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో!

కొస మెరుపు: ఇది నిజమో, కల్పితమో తెలియదు గాని, ఈ సంగతి ఎక్కడో చదివాను. ప్రముఖ రచయిత చలం గారి ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారుట. ఆ కబురు తెలిసిన మరో ప్రముఖ రచయిత, కవి, సంజీవ్ దేవ్ గారు చలం గారికి ఓ పోస్టు కార్డు మీద రెండు వాక్యాలు ఇలా వ్రాసారుట. "మీ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసి చాలా విచారించాను. ఇంతకీ పుస్తకాలేమీ పోలేదు కద?"
పుస్తకాలని సంపదగా భావించే మహానుభావులు ఎందరో? ఆందరికీ వందనాలు!

-పొన్నాడ ఉమామహేశ్వర రావు

No comments:

Post a Comment