ఈ వారం అన్నమయ్య కీర్తన.
ఇంత చాలదా నాకు ఇందరిలో రమణుఁడ
సంతసాన నీకు మొక్కే సరసుడ విందుకు ॥
చింతలన్నియు బాసె సిగ్గులన్నియును దేరె
ఇంతలోనే విభుఁడ నీవీడకు రాగ
మంతనాలు సరివచ్చె మర్మములన్నియు గొచ్చె
దొంతులయిన మాటలు నాతో నాడగాను ॥
కపటమింతయు బాసె కాకలెల్ల చల్లనారె
ఇపుడు నా చెక్కు నొక్కి ఎనయగాను
తపమెల్ల ఫలియించె తలపులు సరిగూడె
అపురూపముగ నాతో నంది నవ్వగాను ॥
వలపులు దైవారె వాడికెలు తుదమీరె
వెలయు నాపై చేయి వేయగాను
కలికి శ్రీవేంకటేశ కాయము లొక్కటి యాయ
సొలపు రతుల నన్ను జొక్కించగాను ॥
భావమాధుర్యం :
అన్నమయ్య విరచితమైన ఈ సరస శృంగార కీర్తనలో అలిమేలుమంగమ్మ తన రమణునితో ఆరాధనగా ఏమంటున్నదో వినండి.
ఇందరిలో నాకిట్లా చేసేవుకదయ్యా ! ఇది చాలదా? ఓ సరసుడా ! ఇందుకు నాకు పరమానందముగా ఉన్నది. నీకు మొక్కుతానయ్యా.
నేడు నా చింతలన్నియూ తీరినవి. నా సిగ్గులన్నియు సిరివంతములైనవి. ఓ విభుడా! నువ్వు ఇక్కడకు రాగానే నిన్ను చూడగానే నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి. నా రహస్యాలన్నీ కూర్చబడ్డాయి. నీవు అదేపనిగా నాతో మాట్లాడుతుంటే నా ఆనందమేమని చెప్పను?
నీవు చెక్కిలి నొక్కి లాలించగానే నాలోని కపటాలన్నీ నశించినవి. నా కోపమంతా చల్లారింది. నీవు నాకు అధీనుడవై అపురూపముగా నవ్వితే నా తపము ఫలించినది.
నా ఆలోచనలన్నీ సక్రమమైనాయి. నీవు నాపై చేయి వేయగానే నా వలపులన్నీ అతిశయించినవి. నీకోసమే దాచిన నా యవ్వనం సార్ధకమైనది. శ్రీ వేంకటేశ్వరా ! నీవు నన్ను నీ రతి లీలలో చొక్కించగానే మన తనువులు ఏకమై తన్మయత్వము చెందితిని.
(వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుభ్రహ్మణ్య దీక్షితులు)
సేకరణ : పొన్నాడ లక్ష్మి.
No comments:
Post a Comment