Sunday 14 January 2018

అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తనః

అలమేలుమంగపతి యన్నిటా జాణఁ డితఁడు
ఇల మీ చుట్టరిక మిరవాయ సుండీ..

పులకించి కృష్ణుడు వుట్లు గొట్టీ - వేంకటాద్రిపుర వీధులను
మంకు గొల్లెతల మరి మీరు పెనఁగితే -  సుంకించి మానాలు సోకి సుండీ..

పాలు పెరుగు వారవెట్టీ గోవిందుడు - సోలిఁ గోనేటియీచుట్టులను
ఆలించి గొల్లెత లటు మీరు సొలసితే - చేలకొంగు లంటితే సిగ్గాయ సుండీ..

చేకొని వెన్నలు జుర్రీ శ్రీవేంకటేశుడు - వాకైననిధిమీఁది వాడలను
కాకరి గొల్లెతల కాఁగలించి పట్టేరు - యేకమైతిరి మీ గుట్టు లెరిఁగిసుండీ..

భావమాథుర్యం..
శ్రీవేంకటేశ్వరునిపై అన్నమయ్య వినిపిస్తున్న చక్కటి కీర్తననాశ్వాదిద్దాం..  ఇదొక భక్తి శృంగార గీతం
ఈ అలమేలుమంగ విభుడు అన్నిటా జాణ. మాబోటి వారికి మీ చుట్టరికము కన్నులపండుగ వంటిది సుమా.. దుమికి దుమికి శ్రీకృష్ణుడై వుట్లను గొట్టినాడు. నేడు తిరుమల వీధులలో ఊరేగుతున్నాడు కానీ .. వలపుకాడై గొల్లెతలు ఎంత పెనిగినా వారి మేనులను ఎగిరి ఎగిరి తాకి చిలిపిగా నవ్వుతున్నాడు సుమా!  ఈ గోవిందుడే పాలు పెరుగులను ధారలుగా పారేటట్లు చేశాడు. కోనేటి ఒడ్డున సోలిపోయియున్న గొలెతల చీరచెంగులను పట్టుకొని సిగ్గులతో ముంచెత్తాడు సుమా! నేడు శ్రీవేంకటేశుడైనా ఇంకా వెన్నలు జుర్రుతూనే ఉన్నాడు. వాటమైన నిధివలె వాడలలో తిరుగుతున్నాడు. మాయకత్తెలైన గొల్లెతలు కౌగలించి పట్టుకొంటే ఏమయ్యారు. మీ గుట్టులన్నీ వీనికి ఎరుకే సుమా..



No comments:

Post a Comment