అపు డేమనె నేమను మనెను - తపమే విరహపుఁదాపమనె ॥
పవనజ ఏమనె పడఁతి మరేమనె - అవనిజ నిను నేమను మనేను.
రవికులేంద్ర భారము ప్రాణంబనై - జవల నెట్ల దరియించెననె. ॥
ఇంకా ఏమనె ఇంతి మరేమనె - కొంకక ఏమని కొసరుమనె
బొంకుల దేహము పోదిది వేగనె - చింకవేఁట యిటు చేసె ననె ॥
నను నేమనె ప్రాణము మన కొకటనె - తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి - ఘన వెంకటగిరిఁ గంటె ననె. ॥
అన్నమయ్య చెప్పిన ఈ విలక్షణమైన మధుర కీర్తన రామాంజనేయుల సంవాదము. సీతాదేవిని దర్శించిన హనుమను ఆత్రుతతో ప్రశ్నలేస్తున్న రామచంద్రునికి మాటలు వేగంగా వస్తున్నాయి. దానికి హనుమంతుడు ఇచ్చిన సమాధానాలు, అదే ఈ కీర్తనలో భావం.
ఓ హనుమా! ఆమె అప్పుడేమన్నది? ఏమనుమన్నది నాతో? ప్రభూ! తాను మీకోసం పడే విరహమే తన తపము అన్నది.
పావనీ! పడతి సీత ఏమన్నది? మరొకమారు ఏమన్నదో చెప్పు. నిన్ను నా గురించి ప్రత్యేకించి ఏమన్నా అన్నదా? ప్రభూ! రవికులేంద్రా తనకు ప్రాణమే భారమైనదని రోదించినది. ఇకపై ఈ తనువును ఎట్లు దాల్చెదనని అడిగిందయ్యా..
ఓ కేసరీనందనా! ఇంతి ఇంకా ఏమన్నది?మరేమన్నది? జంకక ఇంకా ఏమన్నదో వివరించవయ్యా! ప్రభూ! నిరుపయోగమైన తన దేహము, వేగమె ఎందుకు పోదని విలపించింది. మూగజీవియైన లేడికి అపకారం తలపెట్టిన తనకి తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!
కపిశ్రేష్టా! నన్నేమన్నా అన్నదా? స్వామీ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటే ! అని చెప్పమన్నది. తనకూ నీ వలెనే ఈ విరహము తాపమన్నదయ్యా! ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమాస్పదమైన మన కూటమి ఘనమైన వేంకట గిరిపై కంటినయ్యా! అని అన్నది ప్రభూ!.
No comments:
Post a Comment