పాలతో వండిన అన్నాన్ని క్షీరాన్నమని, పాయసమని, పరమాన్నమని - ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్నమయ్య ఈ క్షీరాన్నానికి పాలకూడు అని పేరు పెట్టాడు. 'కూడు అన్న తెలుగు పదం ఇప్పుడు మోటయిందేమో కాని, అన్నమయ్య దృష్టిలో అతి పవిత్రం. ఈ కీర్తనలో ఆయన మనకు పంచిపెట్టిన పాలకూడు తిని పరవశిద్దాం.
ఏమిటికిఁ జింత ఇదె నీకు
ప్రేమపు బెండ్లి బెరసెగా నీకు. !!
కలికి నీ చూపుల కలువదండలు తెచ్చి
తలకకాతనిమెడ దగులవేసి
మొలక నగవుల నీ ముత్యపు సేసలు చల్లి
తొలగని పెండ్లి దొరకెగా నీకు ॥
చనవు గూరిముల కొసరులను గరమిడి
ఘనమైన కాకల గాలుదొక్కి
పనివడి వెన్నెల పాలకూడు గుడిచి
తనివోని పెండ్లి దగిలెగా నీకు ॥
తరుణి నీ హృదయపుదమ్మిపరపుతోడ
నిరవైన సిరులతో నిల్లు నించి
తిరువేంకటగిరి దేవునితోగూడి
సరసపు బెండ్లి జరగెగా నీకు ॥
భావార్ధం ..
అలిమేలుమంగమ్మ ఎందుకో బాధపడుతోంది. అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి ఆమెను పరామర్శిస్తున్నాడు.
ఎందుకే అలా బాధపడుతున్నావు. మీ ఇద్దరూ చేసుకున్నది ప్రేమపెండ్లే కదా! (ప్రేమతో పెండ్లి చేసుకున్నప్పుడు విచారాలు రాకూడదని కవి హృదయం).
ఓ అమ్మడూ ! నీ చూపులనే కలువపూల దండలు తీసుకువచ్చి ఏమాత్రం చలించకుండా, భయపడకుండా (తలకక) అతగాడి మెడలో ప్రేమతో వేసావు. లేత నవ్వులనే నీ ముత్యాల తలంబ్రాలు పోసిన ఏమాత్రం పక్కకు జారని పెండ్లి నీకు దొరికింది కదా..! (పెండ్లి చేసుకున్నప్పటికీ వధూవరులు ఇంకో పక్కకి చూపులు ప్రసరించకుండా పరస్పరం ఆనందంతో ఉన్నారని భావం)
అసలుకంటే కొసరు ముద్దు కదా..! నీ ప్రియుడికి చనవులతో కూడిన ప్రేమలు కొసరులుగా బాగా పెట్టావు. ఈ రోజు పెండ్లిలో కాకతో (తాపం) అతగాడి కాలు తొక్కావు. ఏమి కాక తల్లీ, నే చూస్తూనే ఉన్నాగా ! కావాలని ప్రయత్నపూర్వకంగా (పనివడి) పని కల్పించుకుని వెన్నెలలో పాలకూడు అతనితో పాటు తిన్నావుగా ! ఎంత సుఖపడ్డా తృప్తి ఏమాత్రం తగ్గని పెండ్లి చేసుకున్నావు కదా ! ఇంకా ఈ విచారం దేనికి?
ఏమే .. ఎవరైనా పెండ్లి జరిగిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. నువ్వు మా వేంకటేశునితో పెళ్ళీ జరిగిన తర్వాత తామరపూల పరుపులతో కూడిన సిరులకు నిలయమైన నీ హృదయమనే ఇంట్లోకి తీసుకెళ్ళావు. (నువ్వు మా స్వామిని హృదయంలోనే పెట్టుకున్నావని భావం). శుభప్రదుడయిన మా వెంకటేశునితో కలిసి నీకు సరసాలపెండ్లి జరిగింది కదా .. ! ఇంకా నీకు ఈ దిగులేమిటే ?
పాలకూడు పదం రెండో చరణంలో వచ్చినా దాని రుచి మాత్రం మొత్తం కీర్తనలో ఉంది. అన్నమయ్యకు ఈ పాలకూడు చాలా ఇష్టమేమో. ఇలా పాలకూడులో జీడిపప్పు వంటి భావనలు అన్నమయ్య సాహిత్యంలో ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యం ఘుమఘుమలాడే వేడి వేది పరమాణ్ణం.
(సంకలనం, వ్యాఖ్య డా. తాడేపల్లి పతంజలి గారు) - సేకరణ - పొన్నాడ లక్ష్మి
No comments:
Post a Comment